Others

శభాష్‌రాముడు ( ఫ్లాష్‌బ్యాక్ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు:
సదాశివబహ్మం (తీర్చిదిద్దారు)
దర్శకత్వం: సియస్ రావు
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: శంకర్, సి హరిరావు
కళ: అన్నామలై
ఛాయాగ్రహణం: కె సత్యనారాయణ
ఛాయాగ్రహణ దర్శకత్వం:
కమల్‌ఘోష్
సంగీతం: ఘంటసాల

దేశ విభజన కారణంగా సరిహద్దులు దాటి వచ్చిన ఓ కుటుంబం హైద్రాబాద్
చేరుతుంది. అన్నగారు రిక్షాలాగటం ద్వారా తన భార్య, కూతురు, తమ్ముడులతో
ఏవిధంగా జీవనం సాగించారో అన్న కథాంశంతో 1957లో అజిత్, కామినికౌశల్ కాంబినేషన్‌లో కె అమర్‌నాథ్ దర్శకత్వంలో రూపొందించబడిన హిందీ చిత్రం
బడాభాయి. ఈ చిత్రం సక్సెస్ సాధించింది. ఆ చిత్రం హక్కులు పొందిన రాజశ్రీ
ప్రొడక్షన్స్ అధినేతలు సుందర్‌లాల్ నహతా, టి అశ్వర్దనారాయణ కొద్దిపాటి మార్పులు చేర్పులతో తెలుగులో నిర్మించిన చిత్రం శభాష్‌రాముడు.
1959 సెప్టెంబర్ 4న విడుదలైంది.

గోదావరి వరదల వల్ల ఆస్తిపాస్తులు పోగొట్టుకున్న రాముడు (ఎన్టీఆర్).. భార్య లక్ష్మి (దేవిక), కుమార్తె రాధ (బేబి శశికళ), తమ్ముడు మోహన్ (రమణమూర్తి)లతో కలిసి హైద్రాబాద్ వస్తాడు. స్వతంత్రంగా బ్రతకాలన్న ఆలోచనతో రిక్షా అద్దెకు తీసుకుంటాడు. తమ్ముడిని కాలేజీలో జాయిన్ చేస్తాడు. తమ ఊరివాడైన మారీసు (రేలంగి) జేబు దొంగతనాలు చేస్తున్నాడని తెలిసి, అతన్ని మార్చాలనుకుంటాడు. రేలంగి, ఓ చిల్లర దుకాణం నడుపుతున్న మల్లిక (గిరిజ)ను ప్రేమించి, ప్రేమింప చేసుకుంటాడు. ఆ ఊరిలోని పోలీసు కమిషనర్ నారాయణరావు (గుమ్మడి). కుమారుడు కుమార్ (కాంతారావు). పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె రాణి (కుచలకుమారి) మోహన్‌తోపాటు బిఏ చదువుతుంటుంది. అదే ఊరిలో దొంగల నాయకుడు భూపతి (ఆర్ నాగేశ్వరరావు) ఓ నగల వర్తకుడిని రైలులో హత్యచేసి పారిపోతుండగా కుమార్ అడ్డగిస్తాడు. లక్మీ కార్నవాల్‌లో డాన్సర్ అయిన జయశ్రీ (యంయన్ రాజ్యం) భూపతిని తప్పించి, కుమార్‌ను తన ప్రేమలోకి దింపి అతని పరిశోధనకు అడ్డుపడుతుంది. చివరకు కుమార్, భూపతికి అనుకూలుడుగా మారతాడు. ఒకనాడు రాము రిక్షా ఎక్కుతాడు భూపతి. దాంతో అతని స్థావరం రాముకు తెలుస్తుంది. స్థావరం తెలిసిన రామును అంతమొందించేందుకు భూపతి అనుచరుడు కెవియస్ శర్మ కాలుస్తాడు. ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు రాము. అయితే, పోలీసులకు నిజం చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని రామును భూపతి బెదిరిస్తాడు. రాము కష్టం వలన బిఏ పూర్తిచేసిన మోహన్ యూనివర్సిటీ ఫస్ట్ రావటం, కమిషనర్ సాయంతో పోలీసు ఆఫీసర్ కావటం జరుగుతుంది. మోహన్‌ను అంతం చేయాలని పథకం వేసిన భూపతి బారినుంచి తన చిన్ననాటి స్నేహితుడు మోహన్‌ను జయశ్రీ కాపాడుతుంది. దాంతో భూపతి గ్యాంగ్ జయశ్రీని హత్యచేసి, ఆ నేరం రాము మీదకు వచ్చేలా చేస్తారు. మోహన్‌కు, రాణికి నిశ్చితార్థం రోజునే పోలీసులు రామును అరెస్ట్ చేస్తారు. మోహన్, కుమార్, రాణి, భూపతి డెన్‌లో బంధించబడిన సంగతి తెలిసిన రాము, జైలునుంచి తప్పించుకుని వారిని కాపాడటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
దర్శకులు సియస్ రావు ఈ చిత్రంలో ధనవంతులు, నేరగాళ్ళు ఈ సమాజంలో పేదవారి స్థితిగతులను ఎక్స్‌ప్లాయిట్ చేయటం, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదన్న సందేశాన్ని, సెంటిమెంటు, యాక్షన్‌తో కూడిన సన్నివేశాలను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ హీరోయిజమ్ ఎలివేట్ అయ్యేందుకు చిత్రం క్లయిమాక్స్‌లో పోలీసు ఆఫీసర్ మోహన్, డెన్ అడుగున పడటం వలన ఫైట్‌లో పాల్గొనక పోవటం, ఎన్టీఆర్ తోటి రిక్షావారితో కలిసి విలన్‌ల పని పట్టడం చిత్రీకరించటం వెరైటీ.
హీరో రాముగా ఎన్టీఆర్ -ప్రేమించి పెళ్ళాడిన భార్యను, కన్నకూతురిని సుఖపెట్టలేక పోతున్నందుకు బాధ, తాను చదువుకోనందున తమ్ముడు బాగా చదివి పోలీస్ అధికారి కావాలన్న ఆకాంక్ష, హంతకుల చేతుల్లో తమ్ముడు, తనవారు ఇబ్బంది పడతున్నారన్న ఆత్రుత, పౌరుషం, బాధ, ఆనందంగల సన్నివేశాలను ఎంతో నిండుతనంతో ప్రతిభావంతంగా ప్రదర్శించారు. భర్త, బిడ్డ, మరిది క్షేమం కోసం తపించే సాధారణ ఇల్లాలిగా దేవిక మెప్పించగా, తప్పుచేస్తే కన్నకొడుకునైనా శిక్షింటానికి వెనుదీయిని పోలీస్ ఆఫీసర్‌గా గుమ్మడి, ఓ నర్తకి వ్యామోహంలోపడి చట్ట వ్యతిరేక కార్యాలకు సాయపడి పతనమైన పోలీస్ అధికారిగా కాంతారావు, విలన్ వేషాలకు గుర్తింపు తెచ్చిన ఆర్ నాగేశ్వరరావు ఈ చిత్రంలో పాలిష్డ్ విలన్‌గా రాణించారు. అన్నగారికి ఆర్థికంగా సాయపడలేక విచారం, కర్తవ్యంపట్ల, బాధ్యతగల పోలీస్ అధికారిగా అన్ననే అరెస్టు చేసిన మోహన్‌గా రమణమూర్తి ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. రాణిగా కుచలకుమారి ప్రాతోచితంగా నటించింది, ఆమె స్నేహితురాలిగా శ్రీదేవి తల్లి రాజేశ్వరి కొద్దిసేపు కనిపించటం, గుమ్మడి ఇంట వంటమనిషిగా సురభి కమలాబాయి, దేవిక పక్క ఇంటి ఇల్లాలుగా గంగారత్నం నటించారు.
చిత్రగీతాలు
రేలంగి, గిరిజను వెంబడిస్తూ ఆమె ఎక్కిన గుర్రంబండిపై నుంచి పాడే గీతం -హల్లో డార్లింగ్ మాటాడవా మురిపిస్తావ్ మరిపిస్తావ్ (సదాశివబ్రహ్మ- పిఠాపురం, జమునారాణి). హిందీ సిఐడి చిత్రంలోని ట్యూన్‌తో చేసిన హిట్ సాంగ్ -జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అన్న పాట. సురభి కమలాబాయి రిక్షాలో ఉండగా తోటివాళ్లతో ఎన్టీఆర్ రిక్షా తొక్కుతూ ఈ పాట పాడినట్టు చిత్రీకరించారు. దేవుని ముందు దేవిక చరణం -గృహాన్ని స్వర్గీసీమలా చేయుము దేవా. మరోసారి రిక్షా పందాలు జరుగుతుండగా పందెంలో ఎన్టీఆర్, తోటి రిక్షావాళ్లు, పక్కనుంచి సైకిలుపై రమణమూర్తి అన్నగారికి ఉత్తేజాన్నిస్తూ పాడగా (రచన -కొసరాజు, గానం -ఘంటసాల, పి.సుశీల, సరోజిని) చిత్రీకరించారు. బడాభాయి చిత్రంలోని కదమ్ బడాయేజా అని (తలత మెహమూద్ ఆలాపన ఆధారం) వినిపిస్తుంది.
వాహినీ స్టూడియోలో చక్కని ప్రకృతి చిత్రణగా కుచలకుమారి, రమణమూర్తిలపై తీసిన యుగళగీతం -కలకల విరిసి జగాలే పులకించెనే (రచన- శ్రీశ్రీ, గానం -ఘంటసాల, పి సుశీల). లతామంగేష్కర్, తలత మెహమూద్ పాడిన -చోరీ చోరీ కా దిల్‌కా లగాన్ బూరీ బూరీ బాత్ ఆధారం.
హాస్పిటల్‌లో దేవిక, రామారావులపై చిత్రీకరించిన గీతం -రేయి మించెనోయి/ రాజా హాయిగా నిదురించరా (రచన -సదాశివబ్రహ్మం, గానం -పి సుశీల). కర్న్‌వారంగ స్టేజిపై ఎంఎన్ రాజ్యం నృత్యగీతం -జాబిల్లి వెలుంగుల కాళింది చెంత (సదాశివబ్రహ్మం -కె రాణి). మరో నృత్యగీతం ఆకాసంలో చంద్రుడు, స్టేజిపైన బృందంతో ఎంఎన్ రాజ్యం నృత్యం, మధ్యలో ఓ వైపు కాంతారావు, ఓవైపు ఆర్ నాగేశ్వరరావు, అక్కడకు వచ్చిన ఆఫీసర్ రమణమూర్తిని వెళ్ళిపొమ్మని సూచిస్తూ, అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునేలా సాగే గీతం -ఓ చందామా ఇటు చూడరా, మాటాడరా. కారు మబ్బు నిను కబలించుటకై అన్న చరణంలో.. తెరల చాటునుంచి కెవియస్ శర్మ, రౌడీలు సిద్ధకావటం, వారిని తప్పుకుంటూ రమణమూర్తి వెళ్ళటం థ్రిల్లింగ్‌గా చిత్రీకరించారు. (రచన -సదాశివబ్రహ్మం, గానం -కె రాణి బృందం). రేలంగి, గిరిజలపై ఓ పడవలో నదిపై చిత్రీకరించిన గీతం -ఆశలే అలలాగ ఊగెనే సరదాగా (రచన కొసరాజు- గానం ఘంటసాల). ఎన్టీఆర్‌ను పోలీసులు అరెస్టు చేశాక దేవిక దేవుని ముందు పాడేపాట, పోలీసు జీపులో అన్నతమ్ములను చూడటం -ఓ దేవా మొరవినవా (శ్రీశ్రీ- పి.లీల). దొంగల డెన్‌లో గిరిజ నృత్యం చేస్తూ పాడే గీతం -వనె్నలు చిలికే చిన్నదిరా ఇది నినే్న వలచెనురా (రచన కొసరాజు- గానం జమునారాణి). ఈ చిత్రంలోని గీతాలన్నీ అలరించేలా సాగాయి. నిర్మాతల అభిరుచి మేరకు ఘంటసాల వారు కొన్ని హిందీ ట్యూన్లు ఉపయోగించాల్సి వచ్చింది. దీనివల్ల వారి ఖ్యాతికే మాత్రం భంగం వాటిల్లకపోవటం విశేషం.
శభాష్‌రాముడు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్‌చేసి తెలుగుతోపాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల చేశారు (శభాష్‌రాము). ఈ చిత్ర గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తుండటం, జయమ్ము నిశ్చయంబురా చిరస్మరణీయమైన స్ఫూర్తి గీతంగా మిగలటం అభినందించదగ్గ అంశం.
ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ఆర్ నాగేశ్వరరావు ఈ చిత్రం విడుదలకు ఒక నెల ముందు ఆగస్టులో క్షయవ్యాధి కారణంగా స్వర్గస్తులవటం విచారకరం. ఈ చిత్రం తరువాత కుచలకుమారి.. ఎంజి రామచంద్రన్, శివాజి గణేషన్ వంటి నటులతో జంటగా నటించటం విశేషం.

- సివిఆర్ మాణిక్యేశ్వరి