రివ్యూ

ఎలుక మజా.. (ఎలుకా మజాకా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
వెనె్నల కిషోర్, పావని, బ్రహ్మానందం, రఘుబాబు, అన్నపూర్ణ, పింగ్‌పాంగ్ తదితరులు.
సంగీతం: బల్లేపల్లి మోహన్
నిర్మాతలు:
మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు
దర్శకత్వం:
రేలంగి నరసింహారావు

అందర్నీ అలరిస్తేనే -హాస్యరసం పండినట్టు. ఒక వర్గానికే పరిమితమైతే అపహాస్యమైనట్టే. హాస్యరస సినిమాలు కరువవుతున్న రోజుల్లో చాలాకాలానికి నవ్వుల దర్శకుడు రేలంగి నరసింహారావు -ఎలుక వచ్చె ఇల్లుభద్రం సీరియల్‌ను నేపథ్యంగా తీసుకొని ‘ఎలుకా మజాకా’ చూపించాడు. మానవేతర జీవులతో హాస్యాన్ని సృష్టించడం గత చిత్రాల్లోనూ ఉంది. అదేకోవలో -ఇప్పుడూ ఎలుకను ప్రధానపాత్ర చేసి చిత్రాన్ని రూపొందించారు. కాకపోతే, అన్ని వర్గాలకు నచ్చే అంశాలపాలు తక్కువై ఒక వర్గానికి మాత్రమైనట్టు అనిపించిందీ చిత్రం. అందులో హాస్యమంటే పది పదిహేనుసార్లు చూసిన ముఖాలు చేస్తే మరింతగా పండుతుందనేది ఈ సినిమా చెబుతుంది. కొత్తవాళ్లు చేసిన హాస్యం వంద శాతం పండదు. ఈ రూలు ఈ చిత్రానికీ వర్తించింది.
కథేంటి?
చక్రవర్తి (రఘుబాబు) అనే ముక్కుసూటి వ్యాపారస్థుడి కూతురు స్వప్న (పావని). టైమ్‌సెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే చక్రవర్తి దగ్గర ఒక్క సెకను ఆలస్యమైనా ఇబ్బందిపడేవాళ్లు ఎందరో ఉన్నారు. చివరికి భార్యను ఫామ్‌హౌస్‌లో కూలీగా చేశాడు. అంత టైమ్‌సెన్స్. ఏదైనాసరే కుండబద్దలుకొట్టి మరీ చెబుతాడు. అందుకోసం ఓ కుండ పట్టుకొని ఓ బంట్రోతు వెంబడిస్తూనే ఉంటాడు. అలాంటి చక్రవర్తి కూతురిని బాలు (వెనె్నలకిషోర్) ప్రేమిస్తాడు. మొదటినుండి టైమ్ సెన్స్‌వున్న బాలు అంటే చక్రవర్తి కూడా ఒప్పుకుంటాడు. కాబోయే అల్లుడి గురించి అన్ని విషయాలు చెబుతాడు. నిశ్చితార్ధానికి చెప్పిన సమయానికి రమ్మనడంతో, మధ్యలో గుడికెళ్లి అక్కడ ఆలస్యవౌతుందన్న ఆలోచనతో, చెప్పిన టైమ్‌కి వెళ్లలేనేమో అన్న భయంతో గుడిలో దేవుడ్ని ఉదాసీనంగా చూసి, వెళ్లిపోతాడు బాలు. దానికితోడు దేవుడికన్నా నాకు మామే గొప్ప అని గొప్పలుపోతాడు. అది విన్న వినాయకుని వాహనం ఎలుకకు కోపమొస్తుంది. తన పురోహితుడైన ఓ ఎలుకను (బ్రహ్మానందం) బాలుపై ప్రయోగిస్తుంది. అక్కడినుండి బాలు పెళ్లిలో ఎలుక ఎనె్నన్ని ఇబ్బందులు పెట్టింది, తర్వాత శోభనానికి ఎన్ని అవాంతరాలు సృష్టించింది, చివరికి భార్యాభర్తలను ఎలా విడగొట్టింది? అన్న సన్నివేశాలు తర్వాతి కథని చెబుతాయి. బాలు తన తప్పు తెలుసుకొని మూషికవాహనుణ్ణి శరణువేడి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనేది ముగింపు.
ఎలా ఉంది?
సినిమా మొత్తం వెనె్నలకిషోర్, బ్రహ్మానందంలపైనే సాగింది. వీరిద్దరికీ దీటుగా నటించారు రఘుబాబు. ఓరకంగా చక్రవర్తి పాత్రే డామినెట్ చేసింది. బ్రహ్మానందం కనిపించిన సన్నివేశాలన్నీ సోలో సన్నివేశాలే. అక్కడక్కడ మాత్రం కాంబినేషన్ సీన్లున్నాయి. మొదటినుండి సినిమాలో కామెడీ డైలాగులతోపాటుగా పంచ్‌లు వేసుకుంటూ నవ్వించే ప్రయత్నం చేశారు. పెళ్లిలో మంగళసూత్రం కనబడకపోవడం, రాజకీయ వ్యాఖ్యానాలు వినబడటం, ఇటీవల జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలకు సెటైర్లుగా సాగి నవ్వించాయి. శాసనసభలో అవాకులు, చవాకులు మాట్లాడిన మహిళా శాసన సభ్యురాలుగా శ్రీలక్ష్మి చాలాకాలం తర్వాత కనిపించినా ఒకే ఒక్క సన్నివేశంతో చివుక్కుమనిపించారు. రాళ్లుకరిగి రాగిముద్దయితే చింతచిగురుతో తిన్నాను, వేలువిడిచిన మామగారికి చొక్కావిప్పిన బాబాయిగారికి, సిగ్గువిడిచిన తమ్ముణ్ణి అని డైలాగులతోనే గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్ పనిమనిషిని పిలిచి ఓ ఐటెమ్ సాంగ్‌ను వేయించారు. అనుమానించడం మొదలైతే ఆలోచించడం మానేశావన్నమాట, సముద్రంలో కురిసిన వానలా నా జీవితం మారిపోయింది అన్న డైలాగులు ఆలోచింపచేస్తాయి. ఎంత అందంగా ఉన్నావో తెలుసా.. తెలుసు. ఇప్పుడే అద్దంలో చూసుకుని వచ్చా, ఫస్ట్‌నైట్‌కు హెల్ప్ అడిగితే బాగుండదేమో?, పుత్రభిక్ష పెట్టమని తల్లి, తాళిభిక్ష పెట్టమని భార్య, కుండబద్దలుకొట్టే కూతుర్ని అడగడంలాంటి సన్నివేశాలు బాగా రాసుకున్నారు. ఎటొచ్చీ ఇబ్బంది ఎక్కడంటే ఎలుకతో రాసుకున్న సన్నివేశాలే. మరికాస్త ట్రీట్‌మెంట్ చేసుకుంటే బాగుండేది. ఈగను చూసిన కంటితో ఎలుకను చూస్తే మరీ చీమలా కనిపించింది. సాంకేతికంగా కెమెరా పనితనం కళ్లకు విందుచేసింది. బంగారు.. నా బంగారు పాట బాణీ ఆకట్టుకుంది. మస్తుగున్నది యమ కిక్కున్నది పాటకు మరికాస్త కిక్కు ఇస్తే బాగుండేది. నేపథ్యం సంగీతం సన్నివేశానికి తగినట్టుగా సాగింది. గ్రాఫిక్స్‌పరంగా ఇండోర్ సీన్లు బాగున్నాయి. వెనె్నలకిషోర్ వినాయకుడి గుళ్లోకి వచ్చినప్పుడు భక్తులపై ఎండ పడటంలాంటి ఔట్‌డోర్ సీన్లను మరికాస్త బాగా చేయాల్సింది. గర్భ గుళ్లో ఎండ పడదుగదా?! ఎలక్కొట్టిన కాపురం అంటూ సరికొత్త టైటిల్‌ను ఇచ్చినా ఎలక సన్నివేశాలే హాస్యాన్ని పుట్టించలేకపోవడం వింత. దర్శకుడిగా నరసింహారావు తనవంతు కృషిని చేసినా, సబ్జెక్ట్ హాస్యాన్ని పండించేదైనా మనిషి జీవితానికి, ఎలక గ్రాఫిక్స్‌కి ముడిపెట్టడంలో ఇబ్బంది బాగా కనిపించింది. టైటిల్స్ వేసిన పద్ధతి బావుంది. నిర్మాణ విలువలు ఫరవాలేదు. నటనాపరంగా బ్రహ్మానందం ఉన్నంతలో చాలాకాలం తర్వాత ఫరవాలేదనిపించాడు. వెనె్నల కిషోర్ తనకు వచ్చిన పద్ధతిలోనే చేసుకుంటూ పోయాడు. పావని మంచి సెలక్షనే. బానే చేసింది. ముఖ్యంగా ఏ కాస్ట్యూమ్‌లోనైనా అందంగా కనిపించే ప్రయత్నం చేసింది. అన్నపూర్ణ, రఘుబాబు, పింగ్‌పాంగ్‌లు తమ పద్ధతిలోనే చేసుకుంటూ వెళ్లారు. మొత్తానికి ఎలుక సగం తెరనే కొట్టేసింది. -సరయు