మెయిన్ ఫీచర్

కొత్తగా... కాపీ ర్యాట్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమాను డైరెక్ట్‌గా ఎత్తేస్తే
-కాపీ క్యాట్స్. మరి సన్నివేశాలను
ఎడాపెడా ఏరేస్తే -కాపీ ర్యాట్స్
అనాలేమో. ఈ పదానికి ఫిక్సయితే -్భషా బేధాలు,
ప్రాంతీయ తారతమ్యాలు
లేకుండా ‘సినిమా’ను
లెక్కలేనన్ని కాపీ ర్యాట్స్
కొరికేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో
సరికొత్త సన్నివేశాలుగా
వండి వడ్డిస్తున్నాయి.

ది కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో హాలీవుడ్ సినిమాను 1986లో చిరంజీవి ‘వేట’గా మలిచినపుడు, ఫిజిటివ్ చిత్రాన్ని నాగార్జున ‘క్రిమినల్’గా చూపించినపుడే -కాపీ క్యాట్స్‌పై పెద్ద చర్చ నడిచింది. ‘అంతకుముందు కొద్దిగా.. ఆ తరువాత ఉధృతంగా హాలీవుడ్ ‘కాపీ’లు తెలుగు స్క్రీన్‌కు రావడం మొదలైంది. గడచిన మూడు దశాబ్దాల్లో లెక్కలేనన్ని హాలీవుడ్ సినిమాలు వందలాది తెలుగు సినిమాలుగా వచ్చినపుడు -క్రమంగా కాపీ క్యాట్స్‌ను రిసీవ్ చేసుకోవడం ప్రేక్షకుడికీ అలవాటైపోయింది. గుడ్ బై లెనిన్‌తో దర్శకుడు శీను వైట్ల ‘దూకుడు’ చూపించినపుడు, అవర్ హాస్పిటాలిటీని దర్శకుడు రాజవౌళి అంతటివాడే ‘మర్యాద రామన్న’గా తీర్పు చెప్పినపుడు -ప్రేక్షకుడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. కారణం -అప్పటికే అలవాటుపడిపోయాడు కనుక. అప్పుడప్పుడు వస్తున్న అలాంటి సినిమాలను చూస్తూ -విషయం అర్థమయ్యాక ఇది మామూలేనని అనుకున్నాడు. స్టోరీకి ఇన్‌స్పైర్ అయి సొంత వంటకం వండుకున్నాడులే అని సరిపెట్టుకున్నాడు. దీంతో -సినిమాలే కాపీ కొట్టగా లేనిది నచ్చిన సన్నివేశాలను పలు భాషా చిత్రాలనుంచో, ఏకంగా స్వభాషా చిత్రాలనుంచో ఏరుకుంటే తప్పేముందిలే అన్న ధోరణి బలపడింది. అది మొదలుకొని -తెలుగు సినిమాల్లోని సన్నివేశాలను తెలుగు సినిమాలే కాపీ కొట్టే సంస్కృతి మొదలైంది. నచ్చిన సన్నివేశాన్ని కథానుగుణంగా మలిచేసుకుని -మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చిన కొత్త సన్నివేశంగా వదలడం అలవాటైంది. ఇప్పుడది పరాకాష్టకు చేరుకుని -ఏ సినిమా చూసినా ఏముంది గర్వకారణం... సమస్త సినిమాల్లోనూ అదే సన్నివేశం అనుకుంటూ నవ్వుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.
నితిన్ సమంతల ‘అఆ’ -ఒకప్పటి కృష్ణ విజయనిర్మల ‘మీనా’ కథేనన్న వదంతులు సినిమా ఆరంభంలోనే వినిపించాయి. చాలాయేళ్ల క్రితమే యద్దనపూడి సులోచనారాణి కలం నుంచి జాలువారిన ‘మీనా’ను మూవీగా మలిస్తే ఆహా అనుకున్నాం. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కథను మార్చి, పాత్రల స్వభావానికి పాలిష్ పెట్టి ప్రేక్షకుడి చేత త్రివిక్రమ్ అఆలు దిద్దిస్తే ఓహో అనుకోవాల్సి వస్తుంది. కథల కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కే వెళ్లాల్సిన పని లేదని, మన మూలాలు మునివేళ్లతో తడిమిచూస్తే సరిపోతుందని గుర్తు చేశాడు త్రివిక్రమ్. పంచ్ తెలిసిన పెన్ను కనుక -పాత కథకు, ఆపాత మధురానికి మెరుగులద్ది వదిలాడు. కొత్త సొబగులతో వినోదాత్మకంగా మలిచాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ -అనుసరణీయ దర్శకులో, రచయితలో -ఆపాత మధురాలను అందుకుని కొత్త పాత్రలో పోయాలని చూస్తేనే ప్రమాదం. సన్నివేశాలను ఎత్తేస్తున్న సంస్కృతి బలపడిపోతేనే మరీ ప్రమాదం.
***
ఒక సన్నివేశం థియేటర్లో సాగుతోంది. ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తున్నాడు. గతంలో ఏదో సినిమాలో ఇలాంటి సీనే చూసినట్టేందే.. అంటూ ఆలోచనలో పడ్డాడు. తరువాత వచ్చే సీన్లు సైతం కాపీ ర్యాట్స్ అని అర్థమవుడంతో ప్రేక్షకుడి ఉత్సాహం కాస్తా ఊటకారిపోయింది. సినిమా మొత్తం ఇంతేనా? అన్న డౌటు బలంగా దూసుకొచ్చినా.. కాదులే, క్లైమాక్స్ వేరై ఉంటుందని సరిపెట్టుకుని కుర్చీలో కుదురుగా కూర్చున్నాడు. పాపం.. అక్కడా ప్రేక్షకుడికి ఓటమే ఎదురైంది. గత సినిమాల్లోని క్లైమాక్స్ సన్నివేశాలే పొల్లుపోకుండా కనిపించాయి. ‘హమ్మయ్య..! వారం క్రితం చూసిన సినిమా మళ్లీ చూశానన్నమాట అనుకుంటూ ఇంటిదారి పట్టాడు ప్రేక్షకుడు. ఇదీ చాలా తెలుగు సినిమాల పరిస్థితి. కొత్తగా వచ్చిన ఒక సినిమా చూస్తుంటే, గతంలో థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమాలు కళ్లముందుకొస్తున్నాయి. ఆదిలో ఇది వెరైటీ అనిపించినా, ఇప్పుడిది ఫార్సుగా మారింది. పరిశ్రమ వాతావరణాన్ని బట్టి కొత్త కథలో.. ప్రయోగాత్మక కథలో వండటానికి రచయితలు సిద్ధం కావడం లేదు. వండుతామని ముందుకొచ్చినా -వడ్డించేందుకు నిర్మాతలో, తెరకక్కెంచే దర్శకులు లేరన్నట్టుంది పరిశ్రమ పరిస్థితి. స్టార్ హీరోల స్టామినాకు సరిపోయే కొత్త కథలు లేవు. పోనీ కథనమన్నా కొత్తగా ఉంటుందా అంటే అదీ లేదు. యాక్షన్ దగ్గర్నుంచి ఎమోషన్ వరకూ మార్పులేని సన్నివేశాలే. మళ్లీ మళ్లీ చూపిస్తున్నారు కనుక -చూడక తప్పని స్థితిలో ప్రేక్షకుడు. ‘మన సినిమాకు ఏమైంది. ఒకవైపు చూసిన సన్నివేశాలు. మరోవైపు వినేసిన కథలు. ఎవ్వరూ కళ్లు తిప్పరేం’ అని మనసులో అనుకుంటూ తాను మాత్రం వౌనంగా సినిమా చూసేస్తున్నాడు, బయటికొచ్చి బాధ పడుతున్నాడు. దిగజారుతున్న సినిమా కథలకు సరైన మందునివ్వగల రచయితలు పరిశ్రమలో ఉన్నా, వారికి అవకాశాలు రావు. అది వేరే సంగతి.
**
హిట్ సినిమానో, సిగ్నేచర్ సన్నివేశాన్నో కాపీ కొట్టడం ఎప్పటినుంచో అలవాటైన విద్యే. కానీ దౌర్భాగ్యమేమిటంటే, ఫ్లాప్ సినిమాలూ, సన్నివేశాలూ కాపీకి గురవుతున్నాయి. అదేంటని అడిగితే, ‘అందులో దమ్ముంది. సరిగ్గా తీస్తే ఆడుతుంది’ అంటూ ఎదురు సమర్థింపు. పోనీ వాళ్ళు తీసిన విధంగా కాకపోయినా ప్రతిభను జోడించి సినిమానో, సన్నివేశాన్నో అర్థవంతంగా రూపొందిస్తున్నారా? అంటే అదీ లేదు. తెలుగు సినిమా ఫార్మాట్ కూడా సీజన్‌వైజ్ కాపీ అవుతూనే ఉంది. ఫస్ట్ఫా అంతా కామెడీ. ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. అప్పుడు సెకెండాఫ్‌లో కథ చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఉక్కిరి బిక్కిరి చేయాలి. ఇదీ ప్రస్తుత హిట్టు ఫార్మాట్ అన్నది కొందమంది దర్శకుల ఉవాఛ. అలా కాదూ, ఫస్ట్ఫాలో సెంటిమెంట్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటే, సెకండాఫ్‌లో క్రైమ్ హారర్ థ్రిల్లర్ ఏదోక జానర్‌తో ఆకట్టుకోవాలని ఆశ. అంటే, ఒక సినిమాలో ఒక జానర్ అంటూ ఉండే రోజులు పోయాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ అంటూ మొదటి సగం ఒకలా, రెండోసగం మరోలా తీయడం లేటెస్ట్ స్టయిల్ అనుకోవచ్చు.
అసలు సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న సన్నివేశాలను బట్టి రాబోయే సన్నివేశాలేమిటో ఊహించి పక్కవాళ్ళకి చెప్పగలిగే శక్తి ప్రేక్షకుడికి వచ్చేసింది. కాపీ సన్నివేశాలు పలు సినిమాల్లో కనిపిస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నాడు. గతంలో చూసిన సినిమాలన్నీ చిప్‌లు చిప్‌లుగా గుర్తుకొస్తున్నాయంటూ గగ్గోలు పెడుతున్నాడు. హీరోయిన్‌ను ప్రేమలో పడేయడానికి హీరో పడేపాట్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు. కాకపోతే నటులు మారుతున్నారంతే. ఒక్కొక్క హీరో ఒక్కొక్క తరహా చచ్చు ఐడియాలతో హీరోయిన్‌ను ప్రేమలో పడేసేందుకు పడే తంటాలు చూస్తే ప్రేక్షకులకు నవ్వురాకపోగా కంపరమొస్తుంది. హిట్టయిన సినిమాల్లోని వర్కవుటైన సన్నివేశాలను గంపగుత్తగా ఏరి తెచ్చుకుని -తరువాతి సినిమాల్లో ప్రెష్ సన్నివేశాలుగా పేర్చేస్తున్నారన్నది ప్రేక్షకుడి నుంచి వినిపిస్తోన్న ఫిర్యాదు. సినిమాను ట్రిమ్ చేస్తున్నామంటూ కాపీ ర్యాట్స్‌ను కోసేసినా -అప్పటికే జరగాల్సిన అన్యాయం వౌత్ టాక్ ద్వారా జరిగిపోతుంది. ఇది పెద్ద మైనస్‌గా ఇప్పటి సినిమాకు మారింది. కథలో ప్రధానమైన మైనస్ ఏంటంటే, రచయితకుగాని, దర్శకుడికిగాని కథపై సరైన క్లారిటీ లేకపోవడమే. ఈ అంశాన్ని ఇలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అన్నది ప్రీ ప్రణాళిక వేసుకోకపోవడమే. తనకు నచ్చింది, వచ్చిందే బెస్టన్న ఒంటెత్తు పోకడతో సినిమాలను చుట్టేస్తున్నారు. పాత్రల వ్యక్తిత్వాలను సరైన విధంగా డిజైన్ చేయలేకపోతున్నారు. పస్ట్‌హాఫ్‌లో హీరో పాత్ర ఓవిధంగా వుంటే, సెకెండాఫ్‌లో మరోవిధంగా రాసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకుడికి హీరో పాత్రపై సరైన క్లారిటీ రావడంలేదు.
సరైన కథనం లేకపోవడంతో అక్కడక్కడా కామెడీపై ఆధారపడుతున్నారు. పోనీ, అవైనా సరిగ్గా రాసుకుంటున్నారా అంటే అదీ లేదు. లచ్చిందేవికి ఓ లక్కున్నట్టే, కామెడీకి కూడా ఓ సెట్టుంది. అది సరైన టైమింగ్‌లో పండించకపోతే అపహాస్యవౌతుంది. ప్రస్తుతం రూపొందిస్తున్న చిత్రాలన్నీ ఇదే తరహాలో సాగుతున్నాయి. ఒక్కొక్క కామెడీ నటుడికి ఒక్కొక్క బ్రాండ్ పడిపోవడంతో ఆ నటుడు అలాంటి పాత్రే వేయాలన్నది రూఢీ చేసేశారు మన దర్శక నిర్మాతలు. ఉదాహరణకి తాగుబోతు రమేష్. ఏ సినిమాలో అయినా అదే పాత్రలో ఉంటేనే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు. అందువల్ల వైవిధ్యం అనేది మచ్చుకైనా కనపడటం లేదు. సినిమా పేరు ఒకటివుంటే, సినిమాలో కథనం మరొకటుంటుంది. దీంతో కథకు, సినిమా పేరుకు పొంతన లేకపోవడంతో ప్రేక్షకుడు ఆ సినిమాను చూసి ఆనందించలేకపోతున్నాడు. నచ్చిన సన్నివేశాలను అక్కడక్కడా అతికించి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా చుట్టేసి వదిలేస్తున్నారు. ఓ చిన్న కథ కోసం ఓ సినిమా తీస్తున్నారు. రెండు గంటలపాటు ప్రేక్షకుణ్ణి మరో లోకంలోకి తీసుకెళ్లి ఆనందింపజేయాలంటే కథలో వైవిధ్యంతోపాటు దాన్ని రెండు గంటలపాటు తెరపై చెప్పగలగాలి. అలాంటి కథలను ఎంపిక చేసుకోవడంలోనూ మనవాళ్ళు వెనకబడుతున్నారు. ఓ చిన్న దారంలాంటి కథను తీసుకొని, దానికి చిలువలు పలువలు చేర్చి క్లైమాక్స్ మాత్రం చక్కగా ఉండేలా రూపొందిస్తున్నారు. అంటే, ఆ దర్శకుడికి మంచి ఆలోచన క్లైమాక్స్ విషయంలోనే వచ్చింది. సినిమా ప్రారంభంనుంచే క్లైమాక్స్ చూపిస్తే బాగోదు కనుక, క్లైమాక్స్ కోసం ప్రేక్షకుడు ఎదురుచూడాల్సి రావడంతో సగం బోరు కొట్టేస్తుంది సినిమా. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా అనవసరమైన చెత్తంతా పేర్చి సినిమాను చెత్తకుప్పలా తయారు చేస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకుడికి నచ్చిన విధంగా తీస్తేనే బాగుంటుంది. 16 సినిమాల నుంచి పదిహేను సన్నివేశాలు ఏరుకుని సినిమాగా చుట్టేస్తే, ఇవన్నీ గతంలో చూసినవే కదా అని పెదవి విరిచేసి సినిమాను ప్రేక్షకుడు బాక్సుల్లో సర్దేస్తాడు, జాగ్రత్త!

-జి. రాజేశ్వర రావు