మెయిన్ ఫీచర్

గుర్తుకొస్తున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మారింది. మారుతోన్న కాలానుగుణంగా సినిమా విషయంలో సౌకర్యం పెరిగింది కానీ, సంతోషం కలగడం లేదు. ఎల్లలు దాటిన టెక్నాలజీతో ఆధునికత పెరిగింది కానీ, ఆనందానుభూతులు మిగలడం లేదు. మా చిన్నప్పుడు... అంటూ చెప్పుకునే సినిమా కబుర్లలో వినిపించే ఆప్యాయత.. ఇప్పటి స్క్రీన్ ముందు కూర్చున్నపుడు కనిపించటం లేదు. నిజమే.. కాలం మారింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సినిమా వేగంగా మారిపోతోంది. కానీ, మాలాంటి తరం మాత్రం అప్పటి సినిమా తెర వద్దే ఆగిపోయంది. ఆ ముచ్చట్లలోనే ఆనందం పొందుతోంది. టూరింగ్ టాకీస్ నుంచి మల్టీప్లెక్స్‌కు సినిమా వచ్చేసినా -మేం మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయామన్న ఫీలింగే చాలా చాలా బావుంది. ఆ జ్ఞాపకాలు కొంచెం కొంచెంగా అప్పుడప్పుడూ ఇలా గుర్తుకొస్తున్నాయ.

60వ దశాబ్దంలో రేడియో పెద్ద వినోద సాధనం. దాన్ని ఓవర్‌టేక్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ అవతారం ఎత్తింది సినిమా. చివరకు రేడియో సినిమా గీతాలను వినిపించటం మొదలెట్టింది. ఆ రోజుల్లో సినిమా విడుదలకు ముందు, తరువాత ప్రతీ వీధి మలుపు చివరి గోడలమీద చిన్నా, పెద్ద సైజు వాల్‌పోస్టర్లు తెల్లారేసరికి సాక్షాత్కరించేవి. ఎందుకంటే, రాత్రికి రాత్రే పోస్టర్లు అంటించేవారు.
కిల్‌పై ఇద్దరు వ్యక్తులు కొన్ని వాల్‌పోస్టర్లు, బకెట్‌లో అట్టకట్టేసిన గంజి జిగురు, చిన్న సైజు నిచ్చెనతో ప్రతి వీధి మలుపులో పోస్టర్లు అంటించేవారు. తెల్లారగానే వీధుల్లోకొచ్చే పిల్లల (అందులో నేను కూడా) కళ్లు ముందు వాల్‌పోస్టర్లపైనే పడేవి. ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతోంది.. ఎప్పుడు విడుదలవుతోంది.. విడుదలై ఎన్నో వారమైంది.. ఇత్యాది సమాచారం చెప్పేది వాల్‌పోస్టరే. ఇప్పుడైతే న్యూస్ పేపర్ల నుంచి చానెల్స్ వరకూ, అంతర్జాలం నుంచి ఆకాశం వరకూ ఎక్కడ ఏ సినిమా ఆడుతోంది, దాని స్టేటస్ ఏంటి? అనేది క్షణాల్లో తెలుసుకునే సౌలభ్యం ఉంది. అప్పుడా పరిస్థితి ఉండేది కాదు. ఎవ్వరికైనా -వాల్‌పోస్టర్లే దిక్కు. ఇక సినిమా పబ్లిసిటీ కోసం తరువాతి కాలంలో త్రిభుజాకారంలో వున్న తోపుడు బళ్ళపై పెద్ద వాల్‌పోస్టర్లు అంటించి, డప్పులు వాయించుకుంటూ వీధుల్లో వెళ్ళేవారు. తరువాత జట్కా బళ్ళపై గ్రామ్‌ఫోన్ రికార్డులు వేసుకుంటూ, సినిమా కరపత్రాలు విసురుకుంటూ వెళ్ళేవారు. క్రమేపీ వాటి స్థానంలో రిక్షా (గూడు) బళ్ళు వచ్చాయి. అందులో గ్రామఫోన్ రికార్డులో పాట వినిపిస్తూ, మధ్యలో ‘నేడే చూడండి. మీ అభిమాన థియేటర్లో రోజుకి 3 ఆటలు’ అనో.. ‘ఇంకా చివరి 3 రోజులు మాత్రమే’ అంటూనో మైకు ప్రకటనలు వినిపించేవారు. అంతేకాదు, సినిమా కథలోని ఆయువు పట్టును ముద్రించి, దానికింద కొన్ని ప్రశ్నలు సంధించి.. వివరాలు వెండితెరపై చూసి ఆనందించండి అని రాసేవారు. ఈ విధానం చాలాకాలం కొనసాగింది.
అప్పటి రోజుల్లో ఏ థియేటర్‌లోనైనా రోజూ మూడు ఆటలే పడేవి. పిల్లలను సెలవు రోజు మాత్రమే సినిమాకి అనుమతించే పరిస్థితి ఉండేది. సాధారణంగా మ్యాటనీ షోకి పంపేవారు. త్వరగా భోజనాలు ముగించుకుని ఒక బృందంగా ఏర్పడి థియేటర్‌కి ముందుగా వెళ్లి లైనులో నిలబడేవాళ్ళం. సరిగ్గా టికెట్లు ఇచ్చే సమయానికి బ్లాక్‌లో టికెట్లు అమ్మేవాళ్ళు ఏదో గలాటా చేసి క్యూను చిందరవందర చేసి వాళ్ళ ముందు దూరిపోయేవారు. కొన్నిసార్లు టికెట్ కౌంటర్ దగ్గరకు రాగానే బుకింగ్ క్లోజ్ అయితే చాలా బాధగా ఉండేది.
టికెట్ దొరకగానే ఏదో సాధించామన్న గర్వంతో థియేటర్‌లోకి వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో క్రింది తరగతిని నేల టికెట్ అనేవారు. ముందులో నిజంగానే ప్రేక్షకులు నేలపై కూర్చుని సినిమాలు చూసేవారు. త్వరలోనే ఆ క్లాసులో బెంచీలొచ్చాయి. తరువాత శ్రేణిలో చేరబడే బెంచీలు, తర్వాత శ్రేణిలో కుర్చీలు, తదుపరి బాల్కనీ శ్రేణి ఉండేవి. టైమ్‌కాగానే ‘అలారం’ లాంటి శబ్దం రాగానే థియేటర్‌లో లైట్లు ఆరిపోవడం, తెరలోంచి ‘స్వాగతం’ అనే స్లైడ్ ప్రత్యక్షం అవడంతో ప్రేక్షకులు ఆనందంతో ఈలలు వేసేవారు. మ్యూజిక్ వస్తుండగా తెరమీదకుగాని, చెరోవైపుగాని నెమ్మదిగా జరిగిపోయేది. ‘పొగ త్రాగరాదు’, ‘ఎదుటి బెంచ్‌పై కాళ్ళు పెట్టరాదు’ వంటి కొన్ని సూచనలు, వాణిజ్య ప్రకటనల స్లైడ్లు వేసి ‘నిశ్శబ్దం’ అని చూపి వెంటనే ‘న్యూస్ రీల్స్’ చూపేవారు. దేశంలోని, రాష్ట్రంలోని వార్తాంశాలు, ముఖ్యంగా క్రీడలు, దేశ నేతలను చూసే అవకాశం దక్కేది. ప్రముఖుల అంత్యక్రియలూ చూపేవారు. నెహ్రూగారి అంత్యక్రియలను ‘రాముడు-్భముడు’ సినిమాలో చూపించారు.
సినిమా మొదలవగానే ముందు సీట్లో పొడవైన వాళ్లు కూర్చుంటే చాలా ఇబ్బంది ఉండేది. తలకాయ అటూ ఇటూ తిప్పితే వెనకనున్నవాళ్లు వార్నింగ్ ఇచ్చేవారు. కాని సినిమా చూస్తున్న ఆనందంలో అవన్నీ మరచిపోయేవాళ్ళం. ‘విశ్రాంతి’ అని చూపగానే ‘పాస్’లను తీసుకుని బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పటిలా గేట్లు మూసేవారు కాదు. టికెట్ ధరపోగా మిగిలిన వాటితో తినుబండారాలు కొనుక్కుని థియేటర్‌లోకి తీసుకెళ్ళి సిన్మా చూస్తూ తన్మయంగా తినేవాళ్ళం. సిన్మా పూర్తయ్యేసరికి చెమటతో ఒళ్ళు తడిసిపోయేది. నాన్ ఏసి థియేటర్లు కావడంతో సిగరెట్, బీడీ, చుట్ట తాగినా థియేటర్ వారు పట్టించుకునేవారు కాదు. అందుకే ఒళ్లంతా ‘పొగ’ కంపు పట్టేసేది.
సినిమాలో జానపద చిత్రాలు, అందులో కత్తియుద్ధాలు, మాయలు, మంత్రాలు ఆసక్తికలిగించేవి. అందుకు తేలికపాటి కర్రలతో, ప్యాకింగ్ కోసం ఉపయోగించే తేలికపాటి ఇనప బద్దలను కత్తులుగా తయారుచేసి యుద్ధాలు చేయడం, తగిలిన గాయాలకు ఇంట్లో వాళ్ళతో చికిత్సలు, చీవాట్లు లభించేవి. జానపద సినిమాలలో హాస్యనటులు వేగంగా పరుగెత్తి చేసే విన్యాసాలు చాలామంది ఆ రోజుల్లో ‘వైర్ వర్క్’ వల్ల అలా జరిగేవని చెప్పేవారు.
ఆ రోజుల్లో సినిమాకు పంపడానికి సవాలక్ష ఆంక్షలుండేవి. థియేటర్లో కొనుక్కోడానికి డబ్బులే వుండేవి కాదు. ఇంట్లో వాళ్లు ఎగువ తరగతికి వెళ్లమని డబ్బులిస్తే నేల టికెట్ కొనుక్కుని, మిగిలిన డబ్బులతో ఏదోకటి కొనుక్కొని తినేవాళ్లం. బాగున్న సినిమాలు మళ్లీ చూడాలి అనిపించినపుడు ఇంటికి వచ్చిన చుట్టాలు ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. సెలవు రోజుల్లో ఆడుకోవడానికి వెళ్తామని చెప్పి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక్కోసారి డబ్బులు చాలకపోతే విశ్రాంతి తరువాత ‘పావలా’ ఇస్తే గేట్ దగ్గర ఉన్న వాళ్ళు లోపలకి వదిలేవారు. అలా సగం సినిమా చూసి సంతోషపడేవాళ్ళం. ఆ రోజుల్లో థియేటర్లో పాటల పుస్తకాలు అమ్మేవారు. వాటిని కొనుక్కుని బయట వీధిలో వేసే గ్రామ్‌ఫోన్ రికార్డులు వింటూ ప్రాక్టీసు చేసేవాళ్లం. సెలవులకు మా తాతగారి ఊరు వెళ్తే అక్కడ టూరింగ్ టాకీసులు ఉండేవి. వాటిలో సింగిల్ ప్రొజెక్టర్‌తో సినిమాలు వేసేవారు. అందుకే కనీసం నాలుగుసార్లు ఇంటర్వెల్ ఇచ్చేవారు. మధ్యలో సినిమా రీలు తెగిపోతే అతికించి వేసేవారు. అలాంటి థియేటర్లలో నేల క్లాసులు అంటే ఇసుకతో ఉండేవి. క్రమేపీ సిమెంట్ గచ్చులు వచ్చాయి. నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధునాతనమైన థియేటర్లు రావడంతో మొదటి రిలీజు సిన్మాలు వస్తున్నాయి. అపుడు గ్రామీణ ప్రాంతాలకు సిన్మాలు విడుదల ఆలస్యంగా ఉండేవి. అందుకని చాలామంది పండగలకు ఎడ్లబండ్లపైన, సైకిళ్ళపైన దగ్గరగా వున్న పట్టణాలకు వెళ్లి కొత్త సినిమాలు చూసేవారు. ఆ రోజుల్లో ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపేవారు. అపుడు డిస్ట్రిబ్యూషన్ ప ద్ధతి ఉండేది. వారు తమ సినిమాలో రెంటిని కలిపి ఒకే టికెట్‌పై చూపించి డబ్బు రాబట్టేవారు. పండగలకు, శివరాత్రికి తెల్లవారు జామువరకు ప్రత్యేకంగా షోలు వేసేవారు. సాధారణంగా ఆ థియేటర్లో ఆడుతున్న సినిమా లేక వేరొక సినిమాగాని వేసేవారు. క్రమేపీ థియేటర్లలో సీటింగ్ విధానం మారింది. మొదట్లో క్రింది రెండు తరగతులలో పురుషులకు స్ర్తిలకు మధ్య అడ్డు ఉండేది. కాని ప్రేక్షకులను ఆకర్షించడానికి థియేటర్లు అధునాతన మార్గాలను అనే్వషించాయి. ముందుగా థియేటర్లను అందంగా తీర్చిదిద్దారు. అంతకుముందు కొన్ని థియేటర్లలో స్తంభాలు అడ్డుగా ఉండేవి. పైకప్పులు ఆస్‌బెస్టాస్ రేకులతో ఉండటంతో విపరీతమైన ఉక్కబోత ఉండేది. కాని అధునాతన పద్ధతులలో థియేటర్ల నిర్మాణం సాగడంతో అలాంటి అడ్డంకులు తొలగిపోయాయి. ఏసి థియేటర్ల సంఖ్య పెరిగింది. అన్ని తరగతులలోనూ కుర్చీలు ఏర్పాటు జరిగింది. కాకపోతే సౌకర్యంలో తేడా ఉండేది. ఒకప్పుడు క్రింది తరగతుల సీట్లు ఎక్కువగా ఉండి ధర తక్కువగా ఉండేది. కాని నేడు క్రింది తరగతుల సీట్లు నామమాత్రమే. అన్నీ ఒకే ఖరీదు టికెట్లు వసూలు చేస్తున్నారు. తరగతుల రేఖ కుచించుకుపోయింది. న్యూస్ రివ్యూ, తెరమీదకు లేవడం వంటివి కనుమరుగయ్యాయి. ఆ రోజుల్లో పరీక్షలు పూర్తవగానే సినిమాకు వెళ్ళడం ఎంతో ఆనందం. అప్పటిలో అందరూ సినిమాకి వెళ్ళేవారు. అన్ని వయసులవారికి సినిమాయే వినోదసాధనం. కానీ నేడు సినిమా థియేటర్లలో యువతరం హవా కనపడుతోంది. పెద్దవారు బుల్లితెరపై పాత సిన్మాలు చూడడానికి ఇష్టపడుతూ థియేటర్ వైపు వెళ్ళడం మానేశారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులందరినీ అలరించే చిత్రాలు నిర్మిస్తే నేడు యువతను థియేటర్‌కి రప్పించే సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు సినిమాలు ఎక్కువరోజులు ఆడి నిర్మాతలకు లాభాలు అందిస్తే, ఏవరేజ్‌గా ఆడిన సినిమాలు రిపీట్ ప్రదర్శనలతో నిర్మాతలకు ఆదాయం ఉండేది. నేడు మూడు వారాలు తిరగగానే బుల్లితెరపై ప్రసారమవుతోంది అనే భావనతో ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్ళడానికి బద్ధకిస్తున్నారు. బాగా వౌత్ పబ్లిసిటీ వస్తేనే సినిమాలు 4 వారాలు ఆడుతున్నాయి. ఏడాదికి ఒక్క సినిమా కూడా ఎక్కువ రోజులు థియేటర్లో ప్రదర్శించబడడం లేదు. ఒకప్పుడు శతదినోత్సవ వేడుకలు జరిపి అందులో పనిచేసిన వారికి జ్ఞాపికలు ఇచ్చేవారు. కాని నేడు వాటికి అవకాశం లేకపోవడంతో పాటల విడుదల కార్యక్రమం భారీఎత్తున చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామఫోన్ రికార్డులుగా విడుదలైన పాటలు నేటికీ జనాదరణ పొందుతుంటే నేడు సిన్మాతోపాటే పాటలు అదృశ్యమైపోతున్నాయి. తెల్లవారే సరికి సెల్‌ఫోన్‌లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా థియేటర్‌కు నడుచుకుని వెళ్లి లైనులో నుంచుని, టికెట్ సంపాదించి సినిమా ప్రారంభం నుండి చివరివరకూ చూసి ఆస్వాదించి, హీరోలోని మంచి గుణాలు హర్షిస్తూ, అందులోని సన్నివేశాల చిత్రీకరణకు మెస్మరైజ్ అవుతూ సినిమా ‘ఒక ప్రత్యేక అనుభూతి’గా ఆస్వాదిస్తే, నేడు యాంత్రికంగా ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకుని ఎంత ఎక్కువ ఖరీదైన టికెట్ కొన్నా తెరముందు సీటు దగ్గర కూర్చుని చెవులు చిల్లులు పడే శబ్దాలతో సినిమా చూస్తూ అసంతృప్తికి లోనవుతున్నారు.
అలనాడు కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ తీపి జ్ఞాపకం సినిమా చూడడం. నేడు కూడా సినిమా పట్ల మోజు ఉంది కాని ప్రత్యామ్నాయాలు కూడా ఎక్కువ స్థాయిలో వుండటం సినిమాకి ఇబ్బందిగా పరిణమించింది. ఒకప్పుడు వివిధ సంస్థలు ఎన్నో సినిమాలను తీసి సినిమాను పరిశ్రమగా మలిచి వేలాదిమందికి ఉపాధి కల్పించారు. హీరోలు తమకు వీలైనన్ని సిన్మాలలో నటించి ధనము, కీర్తి గడించి వినోదంతో ప్రేక్షకులను, ఆదాయంతో సినీ ఉద్యోగులను ఆదుకున్నారు. నేడు సినిమా నిర్మాణం గాలిలో దీపంగా మారి పూర్తిగా జూదమైంది. అందుకే తెలుగు సినిమా భిన్న రీతుల్లో నడిచి తిరిగి అలనాటిలాగా కుటుంబ సభ్యులందరినీ థియేటర్‌వైపు రప్పించగలిగితే చిత్ర పరిశ్రమకు వెలుగుబాటు. అందుకే అలనాడు సినిమా చూడడం ఒక చిత్రమైన అనుభూతి.
1973 ప్రత్యేక ఆంధ్రోద్యమం వరకూ థియేటర్లలో జనరేటర్లు ఉండేవి కావు. ఏ కారణం చేతనైనా థియేటర్లో కరెంటు పోతే అది వచ్చేవరకు ప్రేక్షకులు ఓపికతో ఎదురుచూడవలసి వచ్చేది. కరెంట్ రావడం బాగా ఆలస్యం అయితే ఆటను రద్దుచేసి ప్రేక్షకులకు ‘పాస్’లు ఇచ్చి తరువాత రోజుకు రమ్మని చెప్పేవారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెవల్ల విద్యుత్ సరఫరాలో నిరవధిక అంతరాయం ఉండటంతో అన్ని థియేటర్లు జనరేటర్లు సమకూర్చుకోవడంతో ఆ సమస్యను అధిగమించారు. ఒకప్పుడు సినిమా విడుదలకు ఎ, బి, సి సెంటర్లుగా చిత్రాన్ని విడుదల చేసేవారు. కాని నేడు అన్ని ప్రాంతాలలోనూ ఒకేసారి సినిమా విడుదల చేసేస్తూ మారుమూల ప్రాంత వాసులు కూడా కొత్తగా విడుదలైన సినిమాను చూడగలుగుతున్నారు. ఒకప్పుడు వివిధ తరహా చిత్రాలు తయారై అన్ని వర్గాలను అలరించేవి. నేడు సాంకేతికంగా అభివృద్ధి చెంది సినిమా నిర్మాణంలో పెనుమార్పులు తీసుకొచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఏ సాంకేతిక ప్రతిభ ‘సినిమా’ చిత్రీకరణను భారీ స్థాయికి తెచ్చి సాంకేతిక నిపుణులకు పేరు తెచ్చింది. కాని అదే సాంకేతిక పరిజ్ఞానం సినిమా పైరసీ సీడీలను అరికట్టలేకపోతోంది. థియేటర్లోకన్నా బుల్లితెరపైనే ప్రేక్షకులు సినిమా చూడాలనుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా పాటలు సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ అయిపోతున్నాయి. సినిమా కలెక్షన్స్ మొదటి మూడు వారాలలోనే తెచ్చుకుని తరువాత శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు థియేటర్లలో సినిమా ఎక్కువసార్లు విడుదలై నిర్మాతకు ఆదాయం తెచ్చిపెడితే, ఇపుడు బుల్లితెరపై మాత్రమే సినిమా చాలాసార్లు ప్రసారం చేయబడుతూ విసుగుపుట్టిస్తోంది. నేటికీ అలనాటి తెలుపు-నలుపు చిత్రాలు నాణ్యత కోల్పోకుండా బుల్లితెరపై ఆదరణ పొందుతుండగా, రంగులలో వచ్చిన సిన్మాలు రంగులు కోల్పోయి వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించి మెప్పించిన సినిమా నేడు ప్రేక్షకుడిని ఎలా రప్పించాలో తెలియక తికమకపడుతోంది. ఇదీ సినిమా నాటి నుండి నేటివరకూ ఎదిగిన పరిణామక్రమం, ఒక తీపి మధుర జ్ఞాపకం.

ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడమే తప్ప, ఆనందంగా ఇలా లైన్‌లో నిలబడి సినిమా టికెట్ సంపాదించే హీరోయజం ఇప్పుడెక్కడ...?

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ