రివ్యూ

దండగపాళ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* దండుపాళ్యం-3
*
తారాగణం:
రవిశంకర్, పూజా గాంధీ,
రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే,
పెట్రోల్ ప్రసన్న, కారి సుబ్బు,
ఆది లోకేష్, డేనీ, జయదేవ్,
ముని, నవీన్‌కృష్ణ,
తబలా నాని, శృతి,
సంజన తదితరులు
సంగీతం: అర్జున్ జన్య
నిర్మాత: శ్రీనివాస్ మీసాల
రచన, దర్శకత్వం: శ్రీనివాసరాజు
*
సాధారణంగా సినిమా సీక్వెల్స్ అనేవి ఓ పెద్ద ఉదాత్తమైన కథతో కూడుకున్నవాటికైనా లేదా మరో స్థాయి పాజిటివ్ అసాధారణ ఇతివృత్తంతో కూడుకున్నవాటికే వుంటుంటాయి. కానీ 80 హత్యలు, లెక్కలేనన్ని మానభంగాలు, మూడు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన పదకొండుమంది దొంగల గ్యాంగ్‌ల సంగతుల ఆధారంగా ఉన్న ఉదంతాల ఆధారంగా ఉండడం అరుదు. అయితే దండుపాళ్యం-3 మాత్రం ఈ ఒరవడిలోనే వచ్చింది. 2012లో ‘దండుపాళ్యం’ రాగా, దానికి కొనసాగింపుగా ‘దండుపాళ్యం-2’ 2017లో వచ్చింది. ఇపుడు 2018లో ‘దండుపాళ్యం-3’ అంటూ థియేటర్లకొచ్చింది. తొలిభాగంలో ఆ గ్యాంగ్ దొంగతనాలు చేసే తీరు వగైరా చూపితే, ‘అసలా దొంగలు ఏ నేరం చేయలేదు, అందులో వాళ్లని పోలీసులు ఇరికించేశారు’ అంటూ దండుపాళ్యం-2 చెప్పింది. ప్రస్తుతం వచ్చిన మూడవ భాగంలో ‘అదికాదు.. వాళ్లెలా చేశారో, అలా చేసినవాళ్లు అమాయకులెలా అవుతారు’ అంటూ పోలీసులు చెప్పిన విషయాలు వివరించారు. మరి ఏది నిజం? ఏది అబద్ధం అన్న గందరగోళం ప్రేక్షకుల్లో రాకుండా సినిమా చివరిలో ‘ప్రపంచంలో సంపూర్ణ స్థాయి నిజం’ అంటూ ఏదీ ఉండదు అంటూ ముగించి జనావళికి ఏ అపరిచితుడు కాలింగ్ బెల్ నొక్కి డోర్ తెరవమని అన్నా, జాగ్రత్తగా ముందు, వెనుకలు చూసి స్పందించమని హితవు పలికారు. ఎందుకంటే దండుపాళ్యం గ్యాంగ్‌లో ఒకరు ముందుగా వచ్చి కాలింగ్ బెల్ నొక్కి ఏదో మిషతో లోపలికొచ్చి అనంతరం అంతా జొరబడి దొపిడీలు, మానభంగాలూ చేసేస్తారు. పోలీసులకు ఏ రకమైన క్లూ దొరక్కుండా మొత్తం కార్యక్రమాన్ని పూర్తిచేయడం వీళ్ల కళ. అయితే ఇవన్నీ సేకరించిన సమాచారం ఆధారంగా అని చెప్పడం, దాంతోపాటు ‘ఏదీ సంపూర్ణ...’ కాదు అని ముందే రక్షణాత్మక వ్యాఖ్యానం చేయడం- ఇదంతా ఒక కల్పిత అంశాల పుట్టా? అన్న మీమాంస ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే ఈ భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ కొన్ని తరాల క్రితం కర్నాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు గనుల నుంచి బంగారం రైళ్లలో ఇతర ప్రాంతాలకు రవాణా చేసే ప్రక్రియలో దొంగతనాలు చేసే ఓ గ్రామ వారసులు అంటూ చెప్పారు. ఇదీ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేదే. అలాగే ఆ దొంగలపై ఇది పోలీసు వెర్షన్ వివరించే భాగమే అయినా సినిమా ఆరంభంలో ఈ కేసుని విచారిస్తున్న పోలీసు అధికారి (రవిశంకర్) ఓ పెద్దమనిషి వద్దకెళ్లి పదిహేను లక్షలియ్యి, ఈ గ్యాంగ్ మొత్తం కనపడకుండా చేస్తాను అంటాడు. మరి ఈ సన్నివేశం మిగిలిన భాగంలో చెప్పిన అంశాలకు విరుద్ధంగా వుంది. పోనీ ఇలా పోలీసు ఆడే నాటకం, ఈ కేసుని పరిశోధిస్తున్న జర్నలిస్టు సేకరించిన సమాచార ఫలితమా? అన్నది స్పష్టంగా తెలియలేదు. దీంతో చాలా సన్నివేశాల్లో క్లారిటీ కొరవడి అవన్నీ తేలిపోయాయి. అసలు ఈ సినిమా విషయంలో ఉన్న మరో బలహీనత ఏమిటంటే ‘దండుపాళ్యం-2’ సినిమా చూసిన వాళ్లకే దండుపాళ్యం-3 ఓ మాదిరిగా అర్థం అవుతుంది తప్ప మిగిలినవారి విషయంలో ఇది కష్టమే. ఎందుకంటే అది పూర్తి అయిన చోటనుంచే ఇది ఆరంభమవుతుంది కనుక. ఈ ప్రధాన ప్రతిబంధకం వదిలేసినా ఇంకొన్ని అరాయించుకోలేని సన్నివేశాలు చాలా ఉండడం సెన్సార్ ఉనికినే ప్రశ్నించేలా చేసింది. ఉదాహరణకు సినిమా సంభాషణలు ఎంతగా ఇది కొంతవరకూ వాస్తవ సంఘటనలు ఆధారంగా అని చెప్పుకొచ్చినా కొన్నిచోట్ల వినపడ్డ సంభాషణలు తీవ్రాతి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. సన్నివేశ ఔచిత్యం పేరిట ఇలాంటివి (ప్రచురణార్హం, పేర్కోతగ్గరీతి కూడా లేనివి) ఉపయోగిస్తేనే సన్నివేశం పండుతుంది అనుకోవడం శుద్ధ అవివేకం. దాన్ని సరళంగా చెప్పుకోవచ్చు. అలాగే దొంగలు లోపలకు వచ్చి ఓ స్ర్తిని మానభంగం చేయడమన్నది చూపే తీరు కూడా పరిధిలు దాటిపోయి చూపారు. ఇలాంటి వాటివల్ల విషయ సేకరణ పేరిట సన్నివేశాల ద్వారా వాణిజ్యకోణం విజృంభింపజేయడానికే ఎక్కువగా దర్శకుడు కృషి చేశారు అన్నది స్పష్టమైపోయింది. ఇది చాలా దయనీయం. అదేవిధంగా మరోచోట హంతకులు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా అవలంబించే ప్రక్రియలు అంటూ ఓ పోలీసు పాత్రతో చెప్పించడమూ సమాజానికి చేటు సంకేతాలు ఇవ్వడమే. ఈ విషయాన్ని సినిమాలో పోలీసు అధికారి పాత్రధారే ‘‘పోలీసులమే ఇలాంటి విషయాల్లో దొంగలకు ఇన్‌ఫర్‌మేషన్ ఇస్తున్నాం’’ అని చెప్పించడమూ ఈ సంగతికి కొసమెరుపు. అలాగే స్ర్తి పాత్రపైనా అభ్యంతరకర పదాలు ఉచ్ఛరింపజేసి చూపరుల్ని తెగ ఇబ్బంది పెట్టేశారు. అయితే కొన్నిచోట్ల సంభాషణలు ఆయా పాత్రల తీరుతెన్నులకు లోబడి రాయడం ఓకే! ‘పెద్దోళ్లని ఎగిరి కొట్టాలి, చిన్నవాళ్లని పడేసి తొక్కాలి’, ‘పొట్టకన్నం దొరుకుతుందంటే, పెంటెత్తే పనేనా చేస్తాను’ లాంటివి ఇలాంటి వాటిలో కొన్ని. అర్జున్ జన్య స్వరాల్లో చెప్పుకోదగ్గవి లేవు. నేపథ్య సంగీతం అందివ్వడంలో మాత్రం కొంత ప్రతిభ చూపడానికి వారు ప్రయత్నించారు. నటీనటులు పెర్‌ఫార్మెన్స్ విషయంలో ప్రత్యేకంగా పేర్కోదగ్గది ఏదీ లేదు. ఎందుకంటే దండుపాళ్యం అన్ని సీరీస్‌ల్లోనూ దాదాపు వీళ్లే నటించారు. ఓ రకంగా ఆయా పాత్రల్ని వీళ్లు మాస్టరీ చేసేశారని అనవచ్చు. కొన్ని కొన్ని చోట్ల ‘దండుపాళ్యం’ అసలు బృందంలో వాళ్ళు ‘వీళ్ళే’నేమోనన్న భావననీ మనకు కలగజేయడంలో కృతకృత్యులయ్యారు. ముఖ్యంగా కెంపి పాత్రధారణి పూజాగాంధి, ఇన్స్‌పెక్టర్ పాత్రధారి రవిశంకర్ తదితరులు ఆ పాత్రలకు అతికినట్లు సరిపోయారు. వాస్తవిక కథా నేపథ్యాల కోసం దాదాపు నిజాలకి దగ్గరగా ఉండే ఇతివృత్తాలు ఎంచుకోవడం వైవిధ్యానికి పెద్దపీట వేయడం మాట కొంతవరకూ నిజమే అయినా, ఆ మాటున పరిమితులు అతిక్రమించి సంభాషణలు, సన్నివేశాలూ, చిట్కాలూ చొప్పించి చూపించడం ఏ విధంగానూ హర్షణీయం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే దండుపాళ్యం-4 అందించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.

-అనే్వషి