అంతర్జాతీయం
వాషింగ్టన్, ఫిబ్రవరి 3: ఇమిగ్రేషన్ చట్టాన్ని సమగ్రంగా సంస్కరించాలనుకుంటున్న అమెరికా ఈ లోగా నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను ఆకర్షించడానికి ఎఫ్-1, హెచ్-1బి వీసాలలో మార్పులతో సహా పలు చర్యలను ప్రకటించింది. దీనివల్ల భారత్ లాంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం లాంటి వాటిలో ఇంతకు ముందే డిగ్రీలు కలిగి ఉన్న విద్యార్థులను కూడా చేరుస్తూ, కొన్ని రకాల హెచ్-1బి వీసాలు కలిగి ఉన్న వారి జీవిత భాగస్వాములకు కూడా ఎఫ్-1 అంతర్జాతీయ విద్యార్థులకున్న 17 నెలల వర్క్ ఆఫ్షనల్ ట్రైనింగ్‌సదుపాయాన్ని పొడిగించడం, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రొఫెషనల్స్, పరిశోధకులు, తాము సాధించిన విజయాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించడానికి విస్తృతమైన అవకాశాలు కల్పించడం లాంటివి ఉన్నాయి. ఇది కాక ఈ నెల 22న సిలికాన్ వ్యాలీలో ‘ఎంటర్‌ప్రెన్యూర్స్ రెసిడెన్స్ ఇనిషియేటివ్’ పేరిట ఒక సమాచార సదస్సును నిర్వహిస్తున్నట్లు కూడా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. 21వ శతాబ్దపు అమెరికా అవసరాలను తీర్చడానికి అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకుంటున్న చర్యలలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలియజేసింది. అమెరికాలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా స్థానికుల్లో పోటీతత్వాన్ని పెంచే విదేశీ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించి దేశంలోనే అట్టి పెట్టుకునేందుకు సమగ్రమైన ఇమిగ్రేషన్ విధానాన్ని రూపొందించాలని ఒబామా ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
Add new comment