విజయవాడ

జబ్బు - డబ్బు (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబ్బు ఒక్కోసారి మనుషులను దగ్గర చేస్తుంది. కమల, గౌతమ్ ప్రేమించి పెళ్ళి చేసుకుని ఒక పాప కలిగేక అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. పదేళ్ళ తరువాత ఏదో పురుగు కుట్టి కమల చనిపోతుందని తెలిసినప్పుడు గౌతమ్ ఆమె దగ్గరకెళ్ళి ఓదార్చి తనకు తెలిసిన డాక్టర్ ద్వారా ట్రీట్‌మెంట్ ఇప్పించి బతికించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ప్రేమగా మళ్ళీ దగ్గరయ్యారు.
ఇక డబ్బు మనుషులను దూరం చేస్తుంది. రమేష్‌కి తల్లంటే ప్రాణం. కాని భార్యకి భయపడి ప్రేమగా మాట్లాడలేకపోయేవాడు. ఒక ప్రయాణంలో అతను బస్సు నుంచి చెయ్యి బయటకి పెట్టడం వల్ల మోచేతి వరకూ చేయి కట్ అయింది. ఆర్టీసీ వాళ్ళు నష్టపరిహారం పెద్దమొత్తమే ఇచ్చారు. దానికి అతని భార్య ‘పదేళ్ళుగా మీ అమ్మని మనం చూశాం. ఇప్పటి నుంచి మీ తమ్ముడికి వదిలేయండి. అతనికి చదువైపోయింది. త్వరలో జాబ్ కూడా రావచ్చు. మీ చెల్లెలి పెళ్ళి బాధ్యత అతనిదేనని చెప్పండి. లేకపోతే మనమ్మాయికి మంచి సంబంధం చెయ్యలేం. అబ్బాయిని పెద్ద చదువు చదివించలేం’ అని చెవినిల్లు కట్టుకుని పోరిపోరి అతని మనసు మార్చింది. అతను తల్లి, చెల్లి, తమ్ముడిని దూరం చేశాడు
తనకు తెలిసిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలని బట్టి తన అభిప్రాయం చెప్పింది శ్యామల. శైలజ దీనికి ఏకీభవించలేదు. తనకి తెలిసిన కొందరి జీవితాల గురించి చెప్పింది.
‘రాజమ్మ గారికి ఇద్దరు కొడుకులు. కోడళ్ళు ఆమెను కన్నతల్లి కంటే మిన్నగా చూసుకునేవారు. జీవిత చరమాంకంలో ఆవిడకి ఏదో పెద్ద జబ్బు చేసింది. దాంతో కోడళ్ళు ఆమెను హాస్పటల్లో చేర్పించారు. ‘మంచి వైద్యం చేయించండి. దగ్గరలో ఒక రూం అద్దెకి తీసుకుని మీ దూరపు చుట్టం సుందర మాణిక్యాన్ని ఆమెకు ఆసరాగా వుంచండి. ఆమె ఎంత డబ్బు అడిగినా ఇవ్వండి. ఆవిడ జబ్బు అంటురోగమైతే ఇబ్బంది. ఆవిడ ఇక్కడ వుంటే మన పిల్లలు ఒక్క క్షణం కూడా వదలరు. మాకు రోగిష్టి వాళ్ళంటే చిరాకు’ అని నసపెట్టి ఇంటికి దూరంగా పంపేశారు అత్తగారిని. భార్య మాటను కాదనలేని ఆ బడుద్ధాయి భర్తలు తల్లిని ఒక మంచి ఆశ్రమంలో చేర్పించి, మంచి వైద్యం చేయించి నయమయ్యాక ఇంటికి తీసుకెడదామని వస్తే ఆవిడ ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. తన పేర వున్న ఆస్తిని ఆశ్రమానికి రాసేసి ‘నాకు అసలైన ఆత్మీయులు వీళ్ళే. నేను వారికి సేవ చేస్తూ జీవితం గడిపేయదలచుకున్నాన’ని నిర్మొహమాటంగా కొడుకులకి చెప్పి పంపేసింది.
ఇక డబ్బే అన్నిటికీ మూలం. ‘చక్రవర్తికీ, వీధి బిచ్చిగాడికీ బంధువౌతాననీ అంది మనీ మనీ’ పాట గుర్తింది కదా. కులాంతర వివాహం చేసుకున్నందుకు కొడుకుని గెంటేసిన రామశాస్ర్తీగారు కొడుకు బిజినెస్‌లో పైకి వచ్చాక సతీసమేతంగా అతని దగ్గరకెళ్లి సెటిలైపోయాడు. కొడుకు గ్రాండ్‌గా చెల్లి పెళ్ళి జరిపించాడు. డబ్బు, జబ్బు మనుషుల స్వభావాలను బట్టేకదా’ అంది త్రిపుర.

- గంగాధరుని నాగమల్లిక, గుంటూరు.

వెంటాడే కవులు

భావ, అభ్యుదయ కవితా శిఖరం.. తిలక్
తెలుగు కవిత్వంలో మరచిపోలేని భావ, అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన రాసిన ఒకే ఒక వచన కావ్యం ‘అమృతం కురిసిన రాత్రి’. ఆయన మరణానంతరం ప్రచుతమైంది. మరణానంతరం వచన కవిత్వానికి కొత్త వెలుగును అందించిన భావాభ్యుదయ కవి తిలక్. తొలినాళ్లలో పద్య కవిత్వం వైపు మొగ్గుచూపినా, అనంతరం వచన కవితా మార్గం వైపు మరలి కొత్త కవితా లోకాన్ని ఆవిష్కరించారు. ‘ప్రభాతము-సంధ్యా’ యవ్వన ప్రాదుర్భావ దశలో విరచించాడు. ‘గోరువంకలు’ పద్యకవితా సంపుటితో తెలుగు సాహితీ లోకానికి ఆయన పరిచయమయ్యాడు. తిలక్ కథలను విశాలాంధ్ర 1967లో ప్రచురించింది. అనేక నాటికలు, నాటకాలు కూడా ఆయన రచించారు. సుచిత్ర ప్రణయం, సుప్తశిల, ఇరుగు-పొరుగు, భరతుడు ఏకపాత్రాభినయం ప్రసిద్ధంగా వచ్చాయి. సుశీల పెళ్లి , సాలెగూడు నాటకాలు ప్రసిద్ధమయ్యాయి. తిలక్‌ను గురించి ప్రఖ్యాత అభ్యుదయ కవి కుందుర్తి ‘తెలుగు తల్లి నొసట నిత్య రసగంగాధర తిలకం’ అని అమృతం కురిసిన రాత్రి పీఠికలో ప్రకటించారు.
తిలక్ లేఖా సాహిత్యం ‘తిలక్ లేఖలు’ పేరుతో, తిలక్ ‘సాహితీ సరోవరం’ జూన్ 1968లో ప్రచురితమయ్యాయి. తిలక్ సాహితీ సమాలోచనం, మొదలైన ఎన్నో వ్యాసాలు రాశారు. 1968లో తిలక్ రాసిన వచన కవితా సంపుటిని విశాలాంధ్ర ప్రచురించింది. ఆధునికాంధ్ర కవితా చరిత్రలో శిఖరాయమాన స్థితికి చేరిన వచన కవుల్లో శ్రీశ్రీ, కుందుర్తి తరువాతి స్థానం తిలక్‌దే. కవిత్వ రహస్య తత్వవేత్త తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’కి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరణానంతరం లభించాయి.
తిలక్ కవిత్వ వ్యక్తిత్వాన్ని గురించి ఆయన లేఖల్లో దర్శించవచ్చు. తిలక్ అన్నట్లుగానే ఆయన అక్షరాలు ‘కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు’, ‘వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’! కవిత్వ రహస్యం తెలిసిన అల్కెమిస్టు, అగ్నిజల్లిన, అమృతం కురిసిన అందం, ఆనందం తన పరమావధిగా భావించినవాడు. చైతన్య పరిధి విస్తరించాలని ప్రకటించిన వాడు తిలక్. ఆయన ప్రసిద్ధమైన కవితల్లో సైనికుడికి ఉత్తరం, ఆర్తిగీతం, నువ్వులేవు నీ పాట ఉంది, నగరం మీద ప్రేమగీతం, జవహర్ లాల్ నెహ్రూ చనిపోయినపుడు రాసిన ‘స్మృతి గేయం’ సాహితీ లోకంలో అందరి ప్రశంసలు పొందాయి. అందుకు సాక్ష్యంగా ఆయన యువకవి లోకంపై తీవ్ర ప్రభావం చూపిన ప్రఖ్యాత కవిగా కీర్తి పొందారు. తిలక్ శైలి, ఆయన కవితా శిల్పం విలక్షణమైనవి.
1921లో మండపాకలో దేవరకొండ సత్యనారాయణ, రామసోదమ్మ దంపతులకు 6వ సంతానంగా ఆయన జన్మించారు. పూర్వ కవులు నన్నయ, తిక్కన, కాళిదాసు ప్రభావమేకాక శ్రీశ్రీ, కృష్ణశాస్ర్తీ, ఆంగ్ల కవుల ప్రభావం కూడా ఆయనపై కనిపిస్తుంది. మాత్రోబద్ధ ఛందస్సును వదిలి ‘ప్రీవర్స్’ కవిత్వంలోకి తన శైలి విన్యాసాన్ని కొనసాగించారు తిలక్. అనేక మంది కవులతో స్నేహసంబంధాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ తన సాహితీ సరోవరంలో స్వీయ కవితా పఠనం చేసేవారు. ఆనాటి అభ్యుదయ కవులైన అనిశెట్టి, ఆరుద్ర, దాశరథి, సోమసుందర్‌లతో కలిసి తాను కూడా అభ్యుదయ కవితా ప్రభావానికి లోనయ్యారు. తిలక్ తన కవితతత్వంగా మానవతా తత్వాన్ని ప్రధాన ఆలోచనగా ముందుంచారు. భావకవుల ప్రభావంలోని కవితా వస్తువులైన ప్రణయం, ప్రకృతి, ఆంగ్ల కవులైన షెల్లీ, కీట్స్, వర్డ్స్‌వర్త్ ఆయనను ప్రభావితం చేశారు. అందుకు సంకేతంగానే ఆయన అనుభూతి గాని, సమాజం పట్ల ఆవేదన, ఆర్ద్రత కాని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కనిపిస్తాయి.
తిలక్ కవితా శిల్పాన్ని గురించి చెప్పాలంటే - ప్రకృతి, ప్రణయం, సామాన్యుని మనోవేదన, వారి జీవితాల నుండి తీసుకున్న కవితా వస్తు వైవిధ్యాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’లో దర్శించవచ్చు. ఆర్థిక అసమానతల్ని, పేదల జీవితాలను, యుద్ధాలను, బాధల్ని, నిరాశా నిస్పృహల్ని, దేవుడిని నిందించడం కూడా మనం చూడవచ్చు. అంతర్ముఖ, బహిర్ముఖత్వంతో కూడిన రచనలు ఇందులో కనిపిస్తాయి. ఉదాహరణకు కఠినోపనిషత్తు, కాస్మోపాలిటన్, నగరం మీద ప్రేమగీతం, గుండె కింద నవ్వు, ప్లస్ ఇంటు మైనస్.. మొదలైన ఖండికల్లో ఈ సంఘంలో కనిపించే భిన్న దృశ్యాలు ప్రతిఫలిస్తాయి. నగరం మీద ప్రేమగీతంలో హైదరాబాద్ నగర జీవితాన్ని తిలక్ వర్ణించారు. భావ వైచిత్రితో కూడిన పదచిత్రాలను, ప్రత్యేక ప్రతీకలను వాడటంలోనూ ఆయన మహా నేర్పరి.
తిలక్ సంస్కృత, ఆంగ్ల పదాలను విరివిగా ప్రయోగించారు. ఆయన శైలిని అందుకోడానికి ఇప్పటికీ యువ కవితా లోకమంతా ఆరాటపడతారు. గొప్ప శబ్ద సౌందర్యవాది, గొప్ప కాల్పనికవాదిగా అనుభూతి పరిమళాల్ని కవితల్లో దట్టించినవారు తిలక్. సరళతని, స్పష్టతని అలంకారాలుగా గ్రహించి ‘సామాన్యుని జీవితాన్ని’ వీక్షించారాయన. ప్రణయం, ప్రకృతి, తాత్విక చింతన ఆయన ప్రధాన భావాలుగా భావించవచ్చు.
‘నేను చూశాను నిజంగా
తల్లి లేక తండ్రి లేక
తిండిలేక ఏడుస్తూ ఏడుస్తూ
ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ
మురికి కాల్వ పక్కనే నిద్రించిన
మూడేళ్ల పసిబాలుణ్ణి..
నేను చూశాను నిజంగా
పిల్లలకు గంజికాసి పోసి తాను నిరాహారుడై....
ఇలాంటి పంక్తులు సమాజంలోని సామాన్యుల జీవితాన్ని గొప్ప భావావేశంతో అక్షరీకరించిన ప్రఖ్యాత కవి తిలక్ 1966 జూలై 1న తన 45వ ఏట చిరుప్రాయంలోనే కన్నుమూశారు.

- డా. సిహెచ్ ఆంజనేయులు, ఖమ్మం.
చరవాణి : 7702537453

అక్షర నివాళి

కవిత్వాన్ని పెనవేసుకున్న ‘స్వర్ణలత’

చిట్లిపోయిన పాళితో ఏం రాస్తావు
మహా అయితే గుప్పెడు అక్షరాలు
పాలిపోయిన మొహంలో
ఎన్ని నవ్వులు పూయించగలవు
ఇరిగిపోయిన దేహానికి
ఎన్ని మరమ్మతులు చేయించుకోవాలి
ఆత్మ మరో దేహాన్ని వెతుక్కునేదాకా
చావుపుట్టుకల మర్మం తెలిశాక
నిరాశా నిస్పృహల ఎండుటాకుల్ని
ఊడ్చుకుంటూ శుభ్రం చేసుకోవాల్సిందే!
ఎంతకాలం బతుకీడుస్తూ సాగాలి
ఏదో ఒకరోజు కొండెక్కేదే కదా ఆత్మదీపం
అంతలోనే దేహానికైన గాయాలకు
స్టంట్లు బిగిస్తూ కుట్లేసుకుంటూ
శ్వాసాచక్రాన్ని తిప్పుకోవడం ఎందుకు?.. అంటూ యదార్థ జీవిత సత్యాన్ని ఎంత బాగా అల్లుకున్నారో ఆమె. యాదృచ్ఛికమే అయినా ఈ కవిత ఆమె గురించే ఆమె రాసుకున్న కవిత్వంలా వుంది. ఆమె స్మృతిగా ఇలా వ్యాఖ్యానిస్తున్నందుకు బాధగా వుంది. క్షరం కానిది అక్షరం. ఆ అక్షరాలనే తనివితీరా అల్లుకుని కవిత్వంగా మలచుకొని పెనవేసుకున్న స్వర్ణలత భౌతికంగా లేరనే వార్త సాహితీ ప్రియులందరిలో దుఃఖాశ్రువులు నింపింది. జూలై 3న అనారోగ్యంతో భాగ్యనగరంలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కవయిత్రి స్వర్ణలతా నాయుడు మనందరికీ చిరపరిచితమే. అయిదు పదుల వయసు సైతం నిండని ఆమె అకాలమరణం సాహితీ మిత్రులందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. ఖమ్మంకు చెందిన స్వర్ణలత ఎంఎస్సీ పట్ట్భద్రురాలు. సోమిశెట్టి నర్సింహారావును వివాహం చేసుకుని ఉత్తరప్రదేశ్ నోయిడాలో స్థిరపడ్డారు. అక్కడి నుంచే ఆమె రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 2012 నుంచి సాహిత్య ప్రయాణం చేసిన ఆమె అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుభాష పట్ల ఆమెకున్న పట్టును ఆమె కవిత్వమే తేటతెల్లం చేస్తుంది. సామాజిక స్పృహ కలిగిన కవితలే కాక బాలగేయాలు, పిల్లల కథలు, పెద్దల కథలు, ఏకవాక్య కవితలు, గజల్స్.. ఇలా పలు ప్రక్రియల్లో ఆమె సాధన చేసి మెప్పించటం సాహితీ ప్రియులకు తెలుసు. ఏకవాక్య కవితలు వేయి రాసి ‘పూల పిట్ట’ శీర్షికన సంకలనం వెలువరించారు. ద్విపాద కవితలు రాశారు. ‘శ్రీ స్వర్ణ కిరణాలు’ కవితా సంపుటిని హైదరాబాద్‌లోనే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సినారే ఆవిష్కరించారు. 2015లో 58 కవితలతో ‘జ్వలించిన రాగాలు’ కవితా సంకలనాన్ని తెచ్చారు. ఈ సంకలనం ఆమెకు మంచిపేరు తెచ్చింది. ఏది గొప్ప కవిత్వం, ఎవరు గొప్ప, కవులు, కవయిత్రులు, పేరుప్రఖ్యాతులు ఏస్థాయిలో వున్నాయి.. అనే మీమాంస ఇప్పుడు చాలా మందిని వెంటాడుతోంది. పోస్టు చేయని ఉత్తరాల్లా చాలామందివి తెరమరుగ్గా వున్న కవితలు చాలానే వున్నాయి. ప్రధాన శీర్షికగా ప్రచారానికి నోచుకోని కవయిత్రులు, కవులు తమపని తాము అభిరుచిగా చేసుకుంటూ పోయేవారున్నారు. కవిత్వం చదవడం వేరు, దాని నిసర్గ సౌందర్యాన్ని యథాతథంగా అనుభూతికి తెచ్చుకోగలగడం వేరు. కవయిత్రితో, కవితో సమాన ధర్మం కలిగిన సహృదయ భావకులకు మాత్రమే పట్టుబడే అరుదైన విద్య అది. అలాంటి వారిని సారమతులుగా పేర్కొంటారు ఆదికవి నన్నయ. రచయిత్రి స్వర్ణలత ‘జ్వలించిన రాగాలు’ కవితా సంపుటికి పట్టుబట్టి నాతో ముందుమాట రాయించారు. ఈ కారణం వల్లనే ఆమె కవితల్ని చాలా క్షుణ్ణంగా చదవాల్సి వచ్చింది. ఎవరికీ చిక్కని కొన్ని కోణాల్ని ఆమె స్పృశించటం ఆశ్చర్యం వేసింది. చాలామంది కవులు సైనికుడి గురించి చిత్రీకరించారు. స్వర్ణలత మాత్రం ‘సైనిక పత్ని మనోగతం’ కవితలో సైనికుడి భార్యను వస్తువుగా చాలా హృద్యంగా చిత్రీకరించారు.
ఇంకో మాట. చదువుల తల్లి సరస్వతిని వాగ్దేవిగా పూజించారు. ‘కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్’ అంటూ ఆరాధించారు. కవయిత్రికి, కవికి, కావ్యాలకు ఈలోకం ప్రత్యేక హోదాను ఆపాదించింది. ఎంతో సాహిత్య భవిష్యత్తును కలిగిన స్వర్ణలతను కోల్పోవడం బాధ మాత్రమే కాదు, ఈ సమాజం విలువైన సాహిత్య సంపదను సైతం కోల్పోవడమే! ఆమె సృజించిన సాహిత్యం మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

- కటుకోఝ్వల రమేష్, ఖమ్మం.
చరవాణి : 9949083327

వివేకానందుడు చెప్పిన
వీరశివాజీ గాథలు
ఇదొక అపూర్వమైన, అద్భుతమైన వచన రచన. స్వామి వివేకానంద తన జీవితకాలంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. స్వామి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవన్నీ గ్రంథస్థం అయ్యాయి. కాని శివాజీ గురించి ప్రస్తావించిన ప్రసంగం ఆ సంకలనంలో ఎక్కడా లేదు. ఇది కాకతాళీయమో, మరొకటో తెలియదు. 125 సంవత్సరాల అనంతరం ఆనాడు జరిగిన ఒకానొక ఘటన అక్షరరూపం దాల్చిన రచన ఇది. 1890లో వివేకానంద దేశసంచారం చేస్తూ చెన్నపట్నం వచ్చి మైలాపూర్‌లో విడిది చేశారు. స్వామి వారి పట్ల భక్తి, గౌరవం, అభిమానం ఉన్నవారు రోజూ ఆయనని చూసేందుకు వచ్చేవారు. సాయం సమయాలలో అలా వచ్చిన వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు విషయాలపై ప్రసంగించేవారు. అలా వెళ్లిన అభిమానుల్లో ప్రముఖ వైద్యుడు నంజుండరావు ఒకరు. ఒకానొక ప్రసంగంలో వివేకానందస్వామి ఛత్రపతి శివాజీని స్తుతిస్తూ భూషణ కవి రాసిన ‘శివభావనీ’ అనే కవితా ఖండికలోని పంక్తులను గానం చేస్తుండగా నంజుండరావు ‘శివాజీ మోసగాడు, దోపిడీదారు, గజదొంగ, హంతకుడిగా ముద్రపడిన వ్యక్తి. అతనిని ప్రశంసించడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. స్వామీజీ పాడడం మానివేశారు. ముఖం జేవురించింది. ‘‘ఏమిటి డాక్టర్! హిందూ సామ్రాజ్య నిర్మాత అయిన శివాజీకి మించిన నాయకుడు ఎవరున్నారు. ఆయనలాంటి తపస్వి, భక్తుడు మరొకరున్నారా? పురాణాలలో చెప్పినట్లు మహత్కార్యాల్ని నిర్వహించడానికి అవతరించినవాడు. హిందూ జాతి ఆత్మ చైతన్యానికి ప్రతినిధి. భారతమాత కన్న సుపుత్రులలో అగ్రగణ్యుడు. నీవు విదేశీయులు రాసిన చరిత్ర పుస్తకాలు చదివిన దానికి ఫలితం ఇది. శివాజీ కారణజన్ముడు’’ అంటూ వివేకానందుడు అన్నారు.
దాంతో శివాజీ గొప్పదనం ఆయనకి అవగతమైంది. శివాజీపై కొన్ని అపప్రదలు ఎలా వచ్చాయి? అతని వాస్తవ జీవితం ఎలా గడిచింది. శివాజీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన అఫ్జల్‌ఖాన్ వధ మున్నగు విషయాలను వివరించమని డాక్టర్ నంజుండరావు కోరగా వివేకానందుడు వినిపించిన శివాజీ గాథ 88 పుటల లఘు గ్రంథంగా అవతరించింది.
వివేకానందుని హృదయంలో శివాజీకి గల స్థానం ఎటువంటిదో ఈ గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి తెలుగు పాఠకుడు చదవాల్సిన గ్రంథం. దీనిని శ్రీ శివాజీ మెమోరియల్ ట్రస్ట్, శ్రీశైలం వారు ప్రచురించారు.

- ఎ. సీతారామారావు,
ఫోన్ : 08922 237122.

మనోగీతికలు

అశ్రు నీరాజనం
పసిప్రాయంలో
బుడిబుడి అడుగులతో
పరుగులు పెడుతూ
జారి కిందపడితే
నీ గుండె ఆగిపోయినట్లు
కలత చెందావు!
పాఠశాలలో లెక్కల ప్రశ్నకు
సమాధానం తప్పుగా చెబితే
పంతులయ్య కొట్టిన
బెత్తం దెబ్బకు వాచిన
అరచేయిని చూసిన నీ నేత్రద్వయం
అరుణిమనుదాల్చి
దుఃఖాశ్రువులు రాల్చింది!
బాధ్యతల బరువు మోయాల్సిన నాన్న
భగవంతుని సన్నిధానానికి వెళితే
గుండెలోతుల్లో ధైర్యాన్ని నింపుకున్నావు
కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నావు
అవి నా దరిచేరకుండా కట్టడి చేశావు
నా చదువు నీ బాధ్యతగా
నా ఉద్యోగం నీ లక్ష్యంగా
నా పెళ్లి నీ గమ్యంగా
నా బిడ్డలు నీ పరిపూర్ణ జీవితంగా
నీ జీవితమంతా నాకోసంగా
విశ్రమించక శ్రమించి
నాకు ఓ అద్భుతమైన
జీవితాన్ని ప్రసాదించావు!
నాకోసం మహోన్నతమైన
జీవనగమ్యాన్ని సృష్టించావు!
కానీ..
కాలం చేసిన మాయలో
చదువుకున్న మూర్ఖుడనై
సతిపై మోజు, బిడ్డలపై మమకారంతో
ధనంపై ఆశతో, కీర్తికాంక్షతో
పలికే పెదవులకే కాదు
స్పందించే హృదయానికి కూడా
మమతల మాధుర్యాన్ని
రుచి చూపించిన
అనురాగమూర్తిని మరిచాను
స్వార్థం ఊబిలో కూరుకుపోయాను
నన్ను మన్నించు తల్లీ.. మన్నించు!

- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9866400059

చిరు వెలుగు
నువ్వు లేని లోకంలో
ఉండాల్సి వస్తుందనీ
ఊహించలేదెన్నడూ..
మనం కలిసి రువ్విన నవ్వులు
పంచుకున్న బాధలు
గడిపిన మధుర క్షణాలు
చేతిలో చెయ్యి వేసుకుని
నడచిన సుదీర్ఘపు బాటలు
క్షణికాలై పోతాయని
నా స్మృతులే మిగులుతాయని
అనుకోలేదెప్పుడూ..

నా జీవితంలోకి
చిరువెలుగై వచ్చింది
చిన్నారి మన మనుమరాలు
చిరునవ్వులు చిందిస్తూ
ప్రేమజల్లులు కురిపిస్తూ
కూతురులేని లోటు తీరుస్తూ
వేణుగానాలు పలికించింది
వసంతాలు మళ్లీ తెచ్చింది

ఈ కొత్త అనుభూతిని
నీతో పంచుకోలేని
నిరాశ మిగిలినా
నీ జ్ఞాపకాలతో
ఈ చిరు వెలుగు నీడలో
శేష జీవితం గడచిపోతుందన్న
ఆత్మవిశ్వాసం కలిగింది నాలో!

- శాంతిశ్రీ బెనర్జీ

పగిలిన అద్దం!

మనసుకు మనసుకు మధ్య
వంతెనలు కట్టేది మాట!
మాటలో మంచితనం
మమతల ఊటకు పునాది!
మాటలో పెళుసుతనం
మనసును ముక్కలుగా
విరిచేస్తుంది!
జీవుడు ఆశల లోకంలో
చిత్రవిచిత్రంగా నడుస్తున్నాడు
మాటకు మాయ రంగులద్దుతున్నాడు
అభివృద్ధి పరుగులో ఆలోచనే మరిచి
యాంత్రికత ముసుగులో
సహజత్వాన్ని కప్పెడుతున్నాడు
ఒకరి గురించి ఒకరు కాదు,
ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి!
పరిమళించిన పువ్వులా
మనసు విప్పుకోవాలి
నింగిలో నిలబెట్టడం,
నిలువునా కూల్చడం
మాటకే సాధ్యం!
మనసు విప్పి మాట్లాడనంత కాలం
మనిషి అంతరంగం
పగిలిన అద్దమే!
- రాచమళ్ల ఉపేందర్, ఖమ్మం.
చరవాణి : 9849277968

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- గంగాధరుని నాగమల్లిక