విజయవాడ

ఇది కథ కాదు.. వ్యథ (కథ .. )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ శ్రీరాం సాహితీ పురస్కార సభకు వెళ్లాడు ధర్మశాస్ర్తీ. తనకు తెలిసిన సాహితీమిత్రుడు శ్రీ ఉంగరాల వెంకట సూర్యారావు అందుకుంటున్నాడు ఆ పురస్కారాన్ని. చూద్దామని వెళ్లాడు శాస్ర్తీ ఓపిక లేకపోయినా. సభ బాగానే జరిగింది. చివరిదాకా ఉండి, పురస్కార గ్రహీతను అభినందించి, తన పుస్తకాలిచ్చి వస్తుంటే ‘ఏవండోయ్.. శాస్ర్తీగారూ! కులాసానా? మీకో బరువైన పని అప్పచెప్పాలనుకుంటున్నా. మీరే కనిపించారు. ఏంలేదు, ఉగాదికి పద్యకవితల పోటీ పెట్టాం. రచనలు చాలా వచ్చాయి. మీరు న్యాయనిర్ణేతగా ఉండాలి. మన ఊళ్లో మన తరంలో మీరుతప్ప మరెవరూ లేరు - ఆ నిర్ణయం చేయగలవారు, ఆ విషయం బాగా తెలిసినవారూ. వచ్చి రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తాను’ అన్నారు పీవీఎస్ నారాయణగారు. ఆయన స్థానిక ‘సాహితీ స్రవంతి’ కార్యదర్శి. ‘స్పీడు వర్కర్‌ను కాను. కాస్త తొందరగా ఆ కాగితాల్ని ఇవ్వండి. నెమ్మదిగా చూసి నాకు తోచిన రీతిని నిర్ణయిస్తాను’ అన్నాడు శాస్ర్తీ. ‘అయినా, మన ఊళ్లో ఇంకా చాలామంది పెద్దలున్నారు గదా!’ అని కూడా అన్నాడు. ‘అలా కాదు. మీరే చూడాలి, చేయాలి. త్వరలో మిమ్మల్ని కలుస్తాను’ అని వెళ్లిపోయారు పీవీఎస్‌గారు.
ఓ సంస్థవారు తనకు ఇంత గొప్ప పెద్దరికాన్ని ఇచ్చారు కదా! అని మనసులోనే ఉప్పొంగిపోతూ ఎదురు చూడసాగాడు శాస్ర్తీ. ఒకరోజు.. రెండురోజులు.. వారంరోజులు గడిచాయి. వాళ్లెవ్వరూ రాలేదు. ‘వేరే వాళ్లనెవరినైనో చూసుకున్నారేమోలే’! అనుకున్నాడు శాస్ర్తీ. ఉన్నట్టుండి ఓరోజు సాయంకాలం ఫోన్ మోగింది. ‘శాస్ర్తీగారూ.. ఇంట్లో ఉన్నారా? వస్తున్నా’నంటున్నారు. ఆయనెవరో కాదు పీవీఎస్ గారే! ‘రండి’ అన్నాడు శాస్ర్తీ. వచ్చి పద్య కాగితాలున్న కవర్ చేతికిచ్చారు పీవీఎస్‌గారు. చూసి, ఏవో తనకు కలిగిన చిరుసందేహాల్ని తీర్చుకుని ‘ఓ వారం రోజుల్లో ఇస్తాన’న్నాడు శాస్ర్తీ. ‘అమ్మో! వారం రోజులా? కాదండీ! మీరు రేపు ఉదయానికే ఇవ్వాలి. ఇవ్వగలరు కూడా’ అని ఆయనే భరోసాగా, కులాసాగా అన్నారు. ‘రేపు సాయంత్రానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తానండీ!’ అన్నాడు శాస్ర్తీ. ‘సరే’నని వెళ్లారు పీవీఎస్‌గారు.
ఆరోజు రాత్రి 8 గంటలకు కూర్చున్నాడు శాస్ర్తీ. యాభైకి పైగా వచ్చిన పద్య కవితల్ని యుద్ధప్రాతిపదికన మొదటిసారిగా చదివి చూశాడు. ఓ పదిహేను బయటికి తీశాడు. మర్నాడు ఉదయం 11 గంటలకు కూర్చున్నాడు. ‘ఆత్మబుద్ధిః సుఖంచైవ’ అన్నట్టుగా ఓ నాలుగు కవితల్ని మొదటి, రెండవ, మూడవ, ప్రోత్సాహక బహుమతులన్నట్లుగా వరుసగా నిర్ణయించాడు. ఆ కవితల మీద పేర్లు లేవు. పోటీ సంఘం వారు వేసిన కోడ్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. పేర్లు రానీయకుండా జిరాక్స్ కాపీలు తీసి, ధర్మశాస్ర్తీకి అందించారన్నమాట ఆ సంస్థవారు. అనుకున్న ప్రకారంగా పీవీఎస్ గారికి ఫోన్ చేశాడు శాస్ర్తీ. ఆయన వచ్చారు. తాను నిర్ణయించిన ఫలితాల కాగితాన్ని చూపిస్తూ, పాపం శాస్ర్తీ చాలా అమాయకంగా ఆ న్యాయనిర్ణయం చేయడంలో తనకు కలిగిన అనుభూతుల్ని వివరించాడు. అంటే కొందరు నీతి శతకాలలోనివీ, మహాభారతంలోనివీ కొన్ని పద్యాల్ని పేర్కొంటూ తాత్పర్యాల్ని రాశారనీ, ఒకరు మంచి కవితను పంపారు కానీ - అదే కవితను ఓ పత్రికకు పంపారనీ, ఆ పద్యాలు అచ్చయ్యాయనీ, అయితే- ఆ కవి అప్పటికే కీర్తిశేషులైనారని ఆ పత్రిక ద్వారానే తెలుసుకుని ఆశ్చర్యపోయాననీ ఇలాంటి వాటిని పీవీఎస్ గారికి ఆసక్తికరంగా చెప్పాడు శాస్ర్తీ - మిత్రుడు కావడం వల్ల. ఇంట్రెస్టుగా వింటూ ‘వాటినన్నిటినీ ఒక కాగితం మీద రాసి ఇవ్వండి’ అని అడిగారు సరదాగా పీవీఎస్ గారు. రాసి ఇచ్చాడు శాస్ర్తీ. ఆ ఫలితాల్లో చిరుమార్పుల్ని కోరారు పీవిఎస్ గారు. అదీ ధర్మంగానే ఉందని భావించి, ఫలితాల్ని ఫైనలైజ్ చేసి మరో కాగితం మీద రాసి ఇచ్చాడు శాస్ర్తీ. ‘ఆహ్వానం పంపిస్తాము. తప్పనిసరిగా మీరు కార్యక్రమానికి రండి’ అని శాస్ర్తీకీ, ఆయన సతీమణికి కూడా చెప్పి వెళ్లారు పీవీఎస్ గారు.
ఉగాది వచ్చింది. కానీ, శాస్ర్తీకి ఆహ్వాన పత్రిక ఏమీ రాలేదు. అంతగా బాధపడలేదు. పండుగ ముందురోజు పేపర్లో ఆ సంస్థ ప్రోగ్రామునూ, పోటీ ఫలితాల్నీ చూశాడు శాస్ర్తీ. బహుమతి గ్రహీతల పేర్లు ఉన్నాయే కానీ వారి కవితల పేర్లు లేవు పేపర్లో! తను నిర్ణయించినట్లే ఫలితాలు ఉంటాయి గదా అని మామూలు ధోరణిలోనే ఉండిపోయాడు శాస్ర్తీ.
ఉగాది రోజు మీటింగుకు వెళ్లాడు శాస్ర్తీ పెళ్లాంతో కలిసి. హాల్లో కిక్కిరిసిన జనం. ఓ మూల కూర్చున్నాడు. సభ బ్రహ్మాండంగా జరుగుతోంది. ఉపన్యాసాలు, ఉగాది కవితా పఠనాల మధ్యలో పద్య కవితల బహుమతి విజేతల్ని పిలిచారు నిర్వాహకులు. ప్రథమ బహుమతి ‘హేవిళంబి’ కవితకు, ద్వితీయ బహుమతి ‘్ధనదాహం’ కవితకు.. అని ఎనౌన్స్ చేస్తున్నారు. మతిపోయింది శాస్ర్తీకి. తాను నిర్ణయించిన ద్వితీయ బహుమతికి ప్రథమ బహుమతిని ప్రకటించారు. తానిచ్చిన ప్రథమ బహుమతి కవిత సోదిలో కూడా లేదు. వేరే కవితకు ద్వితీయ బహుమతి ఇచ్చారు. సభలో న్యాయనిర్ణేత పేరు చెప్పలేదు. కనీసం ‘కృతజ్ఞత’ అనే మాట కూడా చెప్పినట్లు లేదు. అంతా స్వయం నిర్ణయం. చేస్తే చేశారు - ఆ సంఘం వారు. వారికా హక్కు ఉంది కూడా. కానీ- ‘ఈ మార్పు చేశాం’ అని కనీసం చెప్పనైనా చెప్పలేదు శాస్ర్తీకి. ‘్ఫన్ ద్వారా అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంది గదా! ఏమనుకోవాలి వీళ్లని. మరీ ఇంత లోకువా? అటువంటప్పుడు నన్ను న్యాయనిర్ణేతగా ఉండమని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు? న్యాయానికి ఇది న్యాయమేనా?’ అనుకున్నాడు శాస్ర్తీ. ధర్మానికి అమాయికంగా కట్టుబడి ఉన్న ధర్మశాస్ర్తీ - వాడి ‘ఖర్మ’ కాలిందేమో! ‘ఖర్మ’శాస్ర్తీ అయ్యాడు - ఇప్పుడు. వాడి కర్మకు తగిన ‘శాస్తి’ జరిగింది. ఇది కథ కాదు. న్యాయానికి జరిగిన వధ ఇది. ధర్మశాస్ర్తీ వంటి న్యాయనిర్ణేతల వ్యధ ఇది. అంతే! అంతే!

- ఆర్ హరితశ్రీ విశాఖశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

చిన్న కథ

చేతులు కాలాక..
‘మూడు నూనె పాకెట్లు నెలకి చాలవండీ..’ అంది అవంతి.
‘అప్పుడు ఆరు అయ్యేవి కదా’ అన్నాడు ఆనందం.
‘అవును. మీ నాన్న గారు, అమ్మ గారు కుక్కర్‌లో ఉడికించి చెంచా నూనెలో తాలింపు వేసేవారు. మనకి వేపుళ్లు అయ్యేవి’ చెప్పింది.
‘ఇస్తీవాడికి 60 రూపాయలు ఇవ్వాలి’ చెప్పింది.
‘వాళ్లు లేకపోయినా అంతయిందా?’ అన్నాడు.
‘మనింట్లో మీరు తప్ప ఇంకెవరూ ఇస్ర్తి చేయించుకోరు’ చెప్పింది అవంతి.
వేరుపడిన తరువాత గానీ ఆనందానికి తమకు ఎంత ఖర్చవుతోందో తెలిసిరాలేదు. పాప పేరున ప్రతినెలా వెయ్యి రూపాయలు రికరింగ్ డిపాజిట్, ఏడాదికి 10వేలు ఎల్‌ఐసి. ఖర్చులు చూస్తుంటే అతని మతిపోయింది. కూరలు కూడా పావుకిలో తెస్తుంటే సరిపోవటం లేదు. అప్పుడు నాన్నగారు అరకిలో తెచ్చేవారు. దుంపకూరలు, వేడిచేసే కాకరకాయ కూర తినేవారు కాదు. అందువల్ల అందరికీ సరిపోయేది. ఆనందానికి పాత సినిమాలో శరత్‌బాబు గుర్తుకొచ్చాడు. మళ్లీ కలుద్దామంటే నాన్నగారు ఒప్పుకోరు. వాన పడుతుంటే బజ్జీలు, పకోడీలు వెయ్యలేదని అలిగి కోపంగా వేరుగా వచ్చాకా తాను చేసిన తప్పు తెలిసిందతనికి. దాన్ని ఒప్పుకోలేక బాధగా ‘ఇంటి అద్దె ఎలా కట్టావు?’ ఆశ్చర్యంగా అడిగాడు భార్యను. ‘అత్తయ్య గారు ఇచ్చి వెళ్లారు. మనం వచ్చేశాక మూడు గదులు అద్దెకిచ్చి ఒక గది, వరండాలో సర్దుకుంటున్నారట. ఇంట్లో విషయాలన్నీ చెపితే మూడు వేల రూపాయలు ఇచ్చివెళ్లారు అత్తయ్యగారు’ చెప్పింది అవంతి. ‘ఇలాంటి అమ్మనా నేను నానామాటలు అన్నది’.. అతని కళ్లు వర్షిస్తున్నాయి.
- విఎస్ రామలక్ష్మి, విజయవాడ.

పుస్తక పరిచయం

అద్భుత కృషికి అపూర్వ రూపం

‘మంచి ఆశయం ఎప్పుడూ మంచి ఫలితాలనిస్తుంది’ అన్నదానికి గొప్ప నిదర్శనం ‘సోమేపల్లి పురస్కార కథలు-2’. ఇంత మంచి పుస్తకం రావడానికి ముఖ్య కారణం శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు (గుంటూరు జిల్లా పరిషత్ సిఇవో). వీరి సాహిత్యాభిమానానికి తోడయినది తండ్రిగారైన హనుమంతరావుగారి పట్ల ఆయనకున్న గౌరవాభిమానాలు. కీర్తిశేషులైన తండ్రిగారి జ్ఞాపకార్థం తొమ్మిదేళ్ల క్రితం నుంచి వెంకట సుబ్బయ్యగారు రమ్యభారతి త్రైమాసిక పత్రిక ద్వారా జాతీయ స్థాయి ఉత్తమ చిన్న కథలను ఎంపిక చేస్తూ సోమేపల్లి అవార్డు ద్వారా సాహితీ సేవ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం క్రమంతప్పక కథల పోటీలు నిర్వహిస్తూ టీవీ, సినిమా రంగాల మోజులో పడిన యువతకు మళ్లీ పుస్తక పఠనంపై మక్కువ కలిగించాలనే సదుద్దేశ్యంతో, మంచి కథలను అతి తక్కువ నిడివితో పాఠకులకు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పోటీలు రచయితల స్పందననూ, పాఠకుల ఆదరణనూ విశేషంగా పొందుతున్నాయి. ఇక ఈ కథల విషయానికొస్తే..
ప్రతి మనిషి జీవితంలో సంభవించే అనివార్య పరిస్థితి వార్ధక్యం. వస్తువు పనికి వచ్చినన్నాళ్లూ వాడుకుని పాతపడగానే బయట పడవేసినట్లు వ్యక్తులకు శక్తిసామర్థ్యాలు ఉన్నన్నాళ్లూ ఉపయోగించుకుని, వృద్ధాప్యంలో వారిని చెరకుపిప్పిలా భావించే వారసులున్నకాలం ఇది. తమకు అలాంటి స్థితి దాపురించకూడదనే ప్రతి వ్యక్తి ఆకాంక్ష. వృద్ధుల హృదయ విదారక మనోస్థితికి మంచి దర్పణం షేక్ బషీరున్నీసాబేగం గారి ‘ట్రంకు పెట్టె’ కథ. జీవన యానంలోని సులువు బరువులనూ, మరణంలోని మర్మాన్నీ అద్భుతంగా ఆవిష్కరించిన కథ ‘క్షణం.. జీవితం’. ప్రాణం ఉన్నంతవరకూ మన ధర్మాల్ని నిర్వర్తిస్తూ సాగిపోవాల్సిందే.. మృత్యువు సమీపించేలోగా తలచిన కార్యాలను వాయిదా వెయ్యకుండా చేసెయ్యడమే..’ అంటూ జీవిత పరమార్థాన్ని పదిలంగా పాఠకులకందించారు శ్రీకంఠ స్ఫూర్తి. ఆపద సంభవించినప్పుడు తెలివిగా ఆలోచించాలి. లేదా పెద్దల సహాయం కోరాలి. అంతేగానీ పిరికిగా ఆత్మహత్యకు ప్రయత్నించకూడదన్న మంచి సందేశమిచ్చింది సిఎన్ చంద్రశేఖర్ గారి కథ ‘ఇది కథ కాదు’. క్రమక్రమంగా అడవులు నశించి భూ వాతావరణం వేడెక్కిపోతోంది. వర్షాలు కురవక చెరువుల్లో, నదుల్లోనూ నీళ్లు అడుగంటిపోయి, పంటలు పండక బీదాబిక్కీ నానాఅగచాట్లు పడుతున్నారు. అయినా నగరాల విస్తరీకరణలో భాగంగా అనేక చెట్లను నేలకూలుస్తున్నారు. భవిష్యత్తరాల వారికి మనం ఎలాంటి భూమిని మిగల్చబోతున్నాం?? మనసున్న ప్రతివారూ ఆలోచించవలసిన విషయం ఇది. మొక్కల పెంపకం ఆవశ్యకతను అందంగా చెప్పిన మంచి కథ కృష్ణకుమారి శాస్ర్తీగారి ‘ఆత్మశాంతి’. ఇలా ఇంకా ఎన్నో మంచి మంచి కథలున్నాయి ఈ పుస్తకంలో. ఇలా ఎన్నో మంచి కథాసుమాల సమాహారం ‘సోమేపల్లి పురస్కార కథలు-2’ (గతంలో కూడా సోమేపల్లి పురస్కార కథలు ప్రచురించారు). అనేకమందిలా పోటీ విజేతలకు నగదు బహుమతులందించి ఊరుకోదు సోమేపల్లి పురస్కార కమిటీ. బహుమతి ప్రదానోత్సవ సభను ఏర్పాటు చేయడం, విజేతలను ఆహ్వానించడం, వారికి నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువా, పూలదండలతో సత్కరిస్తారు. బహుమతి ప్రదానోత్సవ బ్యానర్‌పై విజేతల ఫొటోలు ప్రచురించి వారికి ఒక ఇమేజ్ కలుగజేస్తారు. అత్యంత గౌరవ మర్యాదలతో సన్మానిస్తారు. ఈ పురస్కార సభ ప్రతి సాహిత్యకారుడికి జీవితంలో ఒక్కసారన్నా సోమేపల్లి అవార్డును అందుకోవాలన్న కాంక్షను కలుగచేస్తుంది. ఈ పుస్తకంలో ‘ఏ పుటలో ఎవరి కథ?’ అంటూ వివరాలిచ్చారు. దీంతోపాటు కథ చివర ఆయా కథకుల చిరు పరిచయం ఇచ్చి ఉంటే ఇంకా హుందాగా ఉండేది. బహుమతి ప్రదానోత్సవ ఛాయాచిత్రాలు బ్లాక్ అండ్ వైట్ బదులు కలర్ ఫొటోలు ఇచ్చి ఉంటే ఇంకా అందంగా ఉండేది. ఇంత మంచి పుస్తకంలో పంటి కింద రాయిలా అచ్చుతప్పులు కొద్దిగా ఇబ్బందిపెట్టాయి. ఏమైనా ఈ కమిటీ వారి కృషికి అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజెయ్యాల్సిందే!

- కోపూరి పుష్పాదేవి,
విజయవాడ.
చరవాణి : 9440766375

అందరి దాహార్తి తీర్చుదాం..
ప్రచండభానుడు క్రోధాగ్ని జ్వాలలతో
అగ్నిప్రళయంలా రగిలిపోతుంటే
వేసవి తాపాన్ని తాళలేక
గుక్కెడు నీళ్ల కోసం గుప్పెడు ప్రాణం
నిలబెట్టుకోవాలని కోసుల దూరం నడిచివెళ్లి
ఇసుక చలమల్లో ఊటచుక్కల్ని
వడిసిపట్టి దాహం తీర్చుకోవటానికి తపిస్తుంటే
అడవిలో మృగాలన్నీ జనారణ్యంలోకి
ఎగబడుతున్నాయి
మలమల మాడిపోయే ఎండలకి
గుండె బీటలువారి నెర్రెలిచ్చిన నేలతల్లి
వానచినుకు కోసం నిరీక్షిస్తుంటే
పర్యావరణ పరిరక్షణ కరవై
ప్రకృతినే వణికిస్తున్న ఓజోన్ పొరలకు
ఎండిన తరువులన్నీ తడి స్పర్శ కోసం
తపించిపోతూంటే
ఇక్కడ కార్లు, బైక్‌లన్నీ మినరల్ వాటర్‌తో
తడిసి తళతళ మెరిసిపోతున్నాయి!
సకల జీవరాసులకు ప్రాణాధారమైన నీరు
స్నానాల గదుల్లో ఏరులై పారుతున్నాయి
బిందె నీళ్ల బాటిల్‌కు ఖరీదు గట్టి అమ్మేస్తుంటే..
గుక్కెడు దాహం తీర్చలేక
పొడారిపోయిన గొంతులు తడుపుకోవటానికి
దాహార్తులై దూరాలను భారంగా మోస్తున్న
మారుమూల గ్రామాలు నిత్యం
అగచాట్లు పడుతున్నాయి
ఎండవేడిమికి ఆవిరైపోతున్న
భూగర్భ, నదీ జలాలన్నిటినీ జలయజ్ఞాలతో
పురుజ్జీవం కోసం జలాశయాల్ని నింపుదాం
వరుణుడి రాకతో చినుకుచినుకును వడిసిపట్టి
బొట్టుబొట్టును భూమిలోకి ఇంకించి
నేలపొరల్లో ఇంకుడు గుంతల్లో దాచుకుందాం
సకల జీవరాసుల దాహార్తినీ
మనమే తీర్చుదాం!

- ఉపద్రష్ట మానస,
గుంటూరు.
చరవాణి : 9550486434

మనోగీతికలు

కలల పూలచెట్టు
గుప్పెడు పూలతో నిండుగా
మా పెరట్లో పూలచెట్టు
నన్ను పలుకరించింది
పున్నమిరేయి ఒక పూవు తుంచి
నా కురులలో బంధించగానే
పరిమళాల అనుభూతులు ఆవలించి
వివశురాలినయ్యాను
వర్ణరహిత వస్త్రాలు ధరించి.. పరవశిస్తూ
దూదిపింజలా పైపైకి తేలిపోతూ
సరిహద్దుల్లేని ఆవరణలో ఆడుతూ
భాషలేని భావాలు పంచుతూ
కల్మషంలేని నవ్వులతో స్నేహం చేశాను
కులమె లేని కోయిల రాగానికి బదులిస్తూ
మతమే లేని మృదంగ ధ్వనికి పదమందిస్తూ
నిర్మల హృదయినినై గానం చేస్తూ
ఆనందసాగరాన ఓలలాడుతూ..
అంతలోనె తెలవారి మేలుకొన్నాను
కలల పూలచెట్టుకు
మురిపెంగా దిష్టితీసి
కృతజ్ఞతల జల్లు కురిపించాను
ఆ లోకాన్ని ఈనేలపై వెతుకుతూ..
వెతుకుతూనే ఉన్నాను!

- షేక్ బషీరున్నీసాబేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

వేట
వేట సాగుతూనే వున్నది!
వేటగాళ్లూ, వేట పద్ధతులూ మారుతూ
వేల సంవత్సరాల నుండీ వేట కొనసాగుతూనే వున్నది!
బరిసెలూ, బాణాలతో సాగిన
నాటి అనాగరికుల వేట ఆకలి తీరటం కోసం!
వంచనలు, దౌర్జన్యాలు, ఆక్రమణలూ
భేదభావాలు, ద్వేషాల వంటి అస్తశ్రస్త్రాలతో
నేడు సాగే నాగరికుల వేట
అంతస్తుల కోసం! ఆధిపత్యం కోసం!
నాడు ఏ కొద్దిపాటి భుక్తితోనో చల్లారిన జఠరాగ్ని
నేడు మన్నూ, మ్రానూ, చేనూ, చెరువూ,
గడ్డీ, గనులు, సైకత శ్రేణులూ
స్వాహాచేస్తే గానీ శాంతించడం లేదు!
సభ్యత ముసుగులో దాగిన సాతానులా
నరుడిప్పుడు ధనకనక వస్తు వాహనాలతో పాటు
సాటి మనిషి ప్రాణాన్నీ, మానాన్నీ హరిస్తూ
ధరణి సంపదలను ఆరగిస్తూ, అరిగిస్తూ చిందులేస్తున్నాడు!
వేటాడబడుతున్నవారు అల్లల్లాడుతున్నా ఆర్తనాదం విన్పించదిపుడు!
నేలరాలుతున్న రక్తపాతం కన్పించదిప్పుడు!
మానవలోకం రోజురోజుకూ
కొత్తకొత్త రూపురేఖలతో, బాహ్యాలంకారాలతో కులుకుతున్నా
మంచితనం మాత్రం ఔట్‌డేటెడ్ పదార్థం!
రీసైక్లింగ్‌కూ పనికిరాని వ్యర్థం!
కాలరీతులు - బలసంపన్నుల అధీనం!
ఒకరి పతనం వేరొకరి ప్రగతికి సోపానం!
ఒకరి విషాదం మరొకరికి మృగయావినోదాన్నిచ్చే సాధనం!
ప్రపంచీకరణ ‘వల్చరు’
నా కులవృత్తులను, కుటీర పరిశ్రమలనూ వేటాడుతున్నది!
పాశ్చత్య ‘కల్చరు’
నా సంప్రదాయాలను, సాంస్కృతిక కళారూపాలనూ తూటాడుతున్నది!
మనిషిపై, అతని మనుగడపై, సొత్తుపై
అతని విశ్వాసాలపై, స్వేచ్ఛపై జరిగే
ఎలాంటి దాడైనా క్రూరమైన వేటే! వ్రేటే!
ఆధునికుడు - మనోవాక్కాయకర్మణా
ఆటవిక దశను దాటినట్లు నిరూపించుకుంటూ
ఆఖేటవృత్తిని వీటిననాడే
జాతికి వికాసం! నీతికి వీకాశం!
జగతికి ఆదర్శాల అఖండ దీపదర్శనం!

- ఎరుకలపూడి గోపీనాథరావు,
విజయవాడ.
చరవాణి : 9848293119

ఆలోచనలు
అణిచివేత తూటాలకు
ఆహుతైన ఆలోచనలు
ఫిరంగిదళాలై పుట్టుకొస్తాయి
సునామీ విధ్వంసాలు సృష్టిస్తాయి

ఆధిపత్య కత్తులకు
అసువులుబాసిన ఆలోచనలు
అణువిస్ఫోటనాలై జనిస్తాయి
చితిమంటల క్షిపణులై ఎగసిపడతాయి

నిరంకుశత్వ విల్లులకు
నెత్తుటి నేలపై తెగిపడిన ఆలోచనలు
ఎరుపెక్కిన అక్షరాగ్నులవుతాయి
పిడికిలి పిడుగులతో
విప్లవ గొంతుకలై గర్జిస్తాయి!

- ఎన్ గోవర్ధన్‌రెడ్డి,
చరవాణి : 9866504089

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- ఆర్ హరితశ్రీ విశాఖశర్మ