విజయవాడ

అస్తిత్వం (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ, ఆనంద్‌ల పదహారు రోజుల పెళ్లి పండుగ ఆరోజు. పెద్దలంతా వారిని ఆశీర్వదిస్తున్నారు. ‘ఏమైనా పెళ్లికొడుకు ముందు పెళ్లికూతురు వెలవెలాబోతోంది’ అని అమ్మలక్కలు అంటుంటే అరుణ బాధపడలేదు సరికదా, ఒకింత గర్వపడింది - అందగాడైన తన మగడిని చూసుకొని.
ఆనంద్ - అరుణల కాపురం వయసు పదేళ్లు దాటింది. అరుణ ఇద్దరు బిడ్డల తల్లయింది. అరుణ ఆనాటికీ, ఈనాటికీ భర్త అనుగ్రహం కోసం పరుగులు పెడుతూనే వుంది. కానీ, అరుణను చూస్తే ఆనంద్‌కు అసహనం. తనలాంటి అందగాడికి అరుణ అసలు జతేకాదని అతని భావన. అందుకే అందగత్తెలతోనే తిరుగుతుంటాడు. అతని దృష్టిలో భార్య అంటే ఒక జీతం లేని పనిమనిషి. ఏ సమయంలో ఇంటికి చేరినా అతనికి సేవ చేయాల్సిందే. అయినా అరుణ అస్సలు బాధపడదు. అతని దర్శనం దైవదర్శనంగా భావిస్తుంది. అతని పలుకే వేదమంత్రం ఆమెకు.
ఆనంద్ అంటే అరుణకు పిచ్చి. అరుణ కనిపిస్తే ఆనంద్‌కు కచ్చి. ఏ ఫేషన్ ఎరుగని పల్లెటూరి మొద్దు. ముఖ్యంగా తన దయకు పాకులాడే ఆ జీవిని చూస్తే ఒళ్లంతా కంపరం. ఇంటికి వచ్చిన స్నేహితుల ముందు ఆమెను అనరాని మాటలతో అవమానిస్తాడు. నవ్వటం తెలీదని, ఒక సంగీతం వినటం రాదని, సరదా తెలీదని, మగాడిని ఆకర్షించటం అసలే రాదని, పిల్లలను పెంచటం రాదని, ఇల్లు సర్దటం తెలీదని, చీరకట్టు కూడా చేతకాదని.. ఇలా ఎన్నో ఎన్నో అభియోగాలు. అతని ఫిర్యాదుల వెల్లువకు ఆనకట్టలు వుండవు.
అవన్నీ వింటూ ఆ అభిమానవతి కళ్లలోనీరు కళ్లలోనే కుక్కుకోవటం మినహా మరేం చేయలేదు. ఎందుకంటే ఆమె బలహీనత అతనే. ఎవరో అన్నట్లు ఆమె బలం, బలహీనత కూడా ఆనందే. అందుకే మారటానికి ప్రయత్నించి మరింత కుంచించుకుపోయింది.
అరుణ, ఆనంద్‌లు ఏదైనా ఫంక్షన్‌కు వెడితే అందరూ ఆమెను ‘ఎంత అదృష్టవంతురాలివో!’.. అంటూ పొగిడేస్తారు - అంత అందమైన భర్తను పొందినందుకు. మొదట్లో గర్వపడిన అరుణ ఇప్పుడు ఏడ్వలేక నవ్వుతోంది. అతను - ఒక కాగితం పువ్వని వీరికి తెలీదు - అనుకుంటుంది.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆనంద్ మాటలు అరుణపై విపరీత ప్రభావం చూపసాగాయి. ఒకప్పుడు అతను చూపిన తన తప్పులు ఇప్పుడు తన సహజ గుణాలన్నంతగా ఆమె మనసులో స్థిరపడిపోయింది. తానేమీ చేయలేనని, తనకేమీ చేతకాదని, తాను అసమర్థురాలిననీ, ఒక భార్యగా, తల్లిగానూ కూడా పనికిరానని.. ఇలా తనను తానే నిందించుకోసాగింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, ఇక తన జీవితం అనవసరమని నిర్ణయానికి వచ్చేసింది.
ఆనంద్‌కు అరుణ ప్రవర్తన వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. తన సరదాల్లో తాను మునిగితేలేవాడు. పైగా అరుణ నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేకపోవటం అతనికి మరింత సంతోషాన్నిచ్చేది.
అరుణ మనోవేదన శరీరానికీ తాకింది. నిండా నలభయ్యేళ్లకే 80ఏళ్ల దానిలా నీరసించిపోయింది. ఆమెను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అల్లుడిని అడిగి ఇంటికి తీసుకొచ్చారు. ఎందరు వైద్యులకు చూపించినా, ఎన్ని టెస్టులు చేయించినా ఆమెకు ఏ రోగమూ లేదంటారు. కళకళలాడాల్సిన పిల్ల కళతప్పి వుండటం వారికి కడుపుకోతే అయింది. అల్లుడిలో కూడా ఏ లోపం చూడలేదు వారు. చివరికి ఓ సైకాలజిస్టుకు చూపించారు అరుణను - ఇరుగుపొరుగు వారి సలహాపై.
సైకాలజిస్టు అరుణను పరీక్షించారు. ఆమె జబ్బు నయమవుతుందని హామీ ఇచ్చారు. ఈ మాట విని ‘హమ్మయ్య’! అని ఊపిరిపీల్చుకున్నారు అరుణ తల్లిదండ్రులు.
వైద్యం మొదలైంది. మొదటి నెలంతా ఆమెకు నిద్రపోవటమే సరిపోయింది. నెమ్మదిగా డాక్టరు గారు ఆమెతో మాట్లాడసాగారు. ‘ఏం చదువుకున్నావు? నీకు ఏ కళలంటే ఇష్టం?’.. ఇలాంటి ప్రశ్నలెన్నో ఎదురయ్యాయి. అరుణ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటీ? నాకేం గుర్తుకు రావట్లేదు. నేనుకూడా చదువుకున్నాను కదూ! అన్ని తరగతుల్లో క్లాస్ ఫస్ట్ వచ్చేదికదూ తనకి’ అనుకుంది. ఆ ఆలోచనే ఆమెలో కొత్త ఉత్సాహం నింపింది. ‘అవును! నేనూ ఒక విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నదానినే కదూ!’ అనుకుంది. అలాగే డాక్టరు గారి రెండో ప్రశ్న - ఆమెకి ఏ కళల పట్ల ఆసక్తి అని. ‘అవును! నేను పెళ్లికి ముందు కుట్టుపని, అల్లికలు అంటే ప్రాణం పెట్టేదాన్ని కదూ! నా పనితనం చూసి చుట్టుపక్కల వారంతా ఎంతగా మెచ్చుకునేవారో! ఏదీ ఆ నైపుణ్యం? ఇప్పుడు నాలో మచ్చుకైనా కానరాదేం?’ అనుకుంది. పూలదండలు అల్లటం తనకు మరెంతో ఇష్టమైన పని. ‘ఎందుకు వీటన్నిటినీ మర్చిపోయాను?’ అని తనని తానే ప్రశ్నించుకుంది.
చీకటిలో వెలుగురేకను చూపారు డాక్టరు గారు. ‘అమ్మా.. అరుణా! నీ ఉనికిని మరచిపోకు. నీ దారిలో సాగిపో. నువ్వు మరొకరి దారిలో నడవాలనుకోవటమే దీనికంతటికీ కారణం. మన దారిలో మరొకరిని కలుపుకోవటం తప్పుకాదు. కానీ, నీ దారిని మరచి నచ్చని దారిలో ఎంతోసేపు నడవలేవు. ఆ దారిలో రాళ్లూ, ముళ్లూ నిన్ను నొప్పించాయి. పాదాలు గాయపడ్డాయి. నడవలేననుకున్నావు. తప్పు పాదాలది కాదు, దారిదే సుమా!’ అని వివరించారు సైకాలజిస్టు.
అరుణ కళ్ల పొరలు ఒక్కొక్కటిగా విడిపోసాగాయి. ఆమెకు లోకం మళ్లీ అందంగా కనిపించసాగింది. పచ్చని రహదారులు ఆమెను ‘రా..రమ్మ’ని స్వాగతిస్తున్నట్లుగా అనిపించసాగింది. తానూ మనిషినే అని గుర్తుకు వచ్చింది. చిన్నపిల్లలా చెంగున లేచి నిలబడింది.
‘్ధన్యవాదాలు డాక్టరు గారూ!.. సెలవు’ అంటూ నవ్యలోకం వైపు అడుగులు వేయసాగింది - అంతులేని ఆత్మవిశ్వాసంతో!

- నిడుమోలు అన్నపూర్ణ,
విజయవాడ.

స్వగతం

పేరుకు పెద్దనోట్లు
వినలేమిక జనం తిట్లు

‘నేను! రెండు వేల రూపాయల నోటుని! నన్ను గుర్తుపట్టే ఉంటారు. నా గురించి నేను నాలుగు మాటలు చెప్పుకోవాలని ఇలా మీ ముందుకొచ్చాను. కొత్తగా లోకంలోకి వచ్చిన పసిబిడ్డను ఎవరైనా ముద్దుగా చూస్తారు. గారాబం చేస్తారు. అదెంటోగానీ నా పరిస్థితి దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మొదట్లో నన్ను చూస్తేచాలు అందరూ ‘మాకొద్దు.. మాకొద్దు.. ఈ నోటు’ అనేవారు. సరే, ఎవరి కారణాలు వారివి. అసలు నా పుట్టుకే విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. నేను పుట్టడంతోనే నా సోదరులైన వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను నేను పొట్టన పెట్టుకున్నానే నిందను మోశారు. వాస్తవం కూడా అదే. అల్లకల్లోలం మధ్య నేను కళ్లు తెరిచాను. ఉన్న నోట్లు రద్దయి కొత్త నోటునయిన నేను పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో మీ బాధలు అన్నీఇన్నీ కావు. మీరు పనీపాటలు మానుకొని, రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ, ఎటిఎం సెంటర్లు చుట్టూ తిరగడం చూస్తే నాకు ఎంతో బాధేసింది. అసలు నాకు తెలియక అడుగుతాను! పెద్దనోట్లు రద్దు అంటూనే ఐదు వందలు, వెయ్యి రూపాయిల కన్నా పెద్ద విలువున్న నన్ను సృష్టించడం ఎందుకో? ఇది నాకే అర్థంకావడం లేదు. సరేలే! నేను పుట్టిన కొన్నాళ్లకు ఐదు వందల రూపాయల నోటు కొత్త రూపంలో రావడంతో నామీద కొంతలో కొంత భారం తగ్గిందనే చెప్పాలి. త్వరలో వెయ్యి నోటు వస్తుందని అంటున్నారు. ఆ నోటు ఎంత త్వరగా వస్తే నాకు అంత మంచిది. ఇక నా జీవితకాలం ఎంతో నాకు తెలియదు. త్వరలో నన్ను కూడా రద్దు చేస్తారనే వార్తలు నన్ను భయపెడుతున్నాయి. నేను చలామణిలో ఉన్నా లేకున్నా అత్యవసర పరిస్థితుల్లో ఆవిర్భవించి చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించాననే సంతృప్తి నాకు ఎప్పటికీ మిగిలిపోతుంది. చివరగా ఒక్కమాట! నల్లధనంపై పోరాటం చేయాల్సిందే. అదే సమయంలో సామాన్యుడు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఏలినవారిపై ఉంది. సామాన్యుడు నాలుగు వేల రూపాయల కోసం గంటల తరబడి క్యూల్లో నిలుచుంటే.. ఈ సమాజంలో పలుకుబడి కలిగిన పెద్దల చేతుల్లో నేను బందీగా మిగిలిపోయాను. కొత్త పెద్దనోటుగా నేను కట్టలు కట్టలుగా దొరికినపుడు నా మనసు బాధతో కుంగిపోయింది. అయినా ఎంతోకొంత సామాన్యుడి చెంతకు చేరాననే సంతృప్తి చాలు నాకు! అంతకన్నా నా జీవితానికి కావాల్సిందేముంది?’

- అజయ్‌కుమార్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా.
చరవాణి : 7842061938

పుస్తక పరిచయం

మతోన్మాద ఆగడాల్ని ఎండగట్టే ‘జ్ఞానగుళికలు’!
పుస్తకం : జ్ఞానగుళికలు
రచన : సింగంపల్లి
అశోక్‌కుమార్,
పుటలు : 80
వెల : రూ. 60.
ప్రతులకు : ఆలోచన, 305, ప్రగతి టవర్స్, వీరయ్య వీధి,
మారుతీనగర్,
విజయవాడ - 520004

ఆధునిక తెలుగు సాహితీ రంగంలో ‘అశోక్‌కుమార్’లు చాలామంది కనిపిస్తారు. కానీ సింగంపల్లి అశోక్‌కుమార్ అంటే కొందరికి, ‘శ్రీశ్రీ అశోక్‌కుమార్’ అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. అంతటి శ్రీశ్రీ వీరాభిమాని అశోక్‌కుమార్. శ్రీశ్రీ స్ఫూర్తితో కలం పట్టి కవిత్వం రాస్తున్న వారిలో అశోక్‌కుమార్ ఒకరు. అలాగే ‘మినీ కవిత్వం’ ఉద్యమంలా మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఆ ప్రక్రియలో కవిత్వం రాస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ఇద్దరే. వారిలో అశోక్‌కుమార్ ఒకరనే సంగతి విడమర్చి చెప్పనక్కర్లేదు. అశోక్‌కుమార్ ఇప్పటి వరకు హేతువాద దృక్పథంతో 11 కవితా సంపుటాలు వెలువరించి పాఠకుల మన్ననలు పొందారు. ఇప్పుడు తాజాగా 12వ సంపుటిగా ‘జ్ఞానగుళికలు’ అందిస్తున్నారు. ఇందులోని కవితలు 1970-2016 కాలాల మధ్య రాసినవి అయినప్పటికీ అవి ఇప్పటి కాలానికీ సరిగ్గా నప్పేవే! నానాటికీ మతోన్మాదం పేట్రేగిపోయి ప్రగతిశీల వాదులపై, ప్రశ్నించే వారిపై భౌతిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం తేవటం సరైన సందర్భమని సాక్షాత్తూ కవి అశోక్‌కుమార్ పేర్కొని, ఆయా ధోరణులపై నిరసన వ్యక్తం చేయటం గమనార్హం. మొత్తం 60 హేతువాద మినీ కవితలున్న ఈ సంపుటిలో చాలా కవితలు పాఠకుల మనస్సులను సూటిగా తాకుతాయి. నిజాన్ని నిర్భయంగా తెలిపి, మసకబారుతున్న కళ్లను విదిలించి, పిడికిళ్లు బిగించి ఉద్యమించేలా ఉసిగొల్పుతాయి.
‘నీలోని నెత్తురు ఎరుపు/ నాలోని నెత్తురు ఎరుపు/ నువ్వూ, నేనూ వేరువేరని/ మతోన్మాదుల అరుపు’ అంటూ ‘మతహాసాన్ని’ సూటిగా చెప్పిన అశోక్‌కుమార్, ‘రాళ్లన్నీ మొక్కు/ దక్షిణలు కక్కు/ నెత్తిన నీకు/ శఠగోపం దక్కు’ అంటూ భక్తిపేరుతో కొందరు కుచ్చుటోపీ ఎలా పెడుతున్నారో వాస్తవాల్ని నిక్కచ్చిగా చెప్పటం పాఠకుడు ఇట్టే అర్థం చేసుకుంటాడు. అయితే గతంలో అశోక్‌కుమార్ రాసిన మినీ కవితలకు ఈ మినీ కవితలకు మధ్య కొంత తేడాను గమనించవచ్చు. సాధారణంగా మానవత్వాన్ని పెంపొందించేవి, మతోన్మాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసే కవిత్వాన్ని అందరూ అర్థం చేసుకొని మారవచ్చు, మార్చవచ్చు. కానీ ఈ ‘జ్ఞానగుళికలు’లో కొన్ని వివాదాస్పదమైనవి కూడా చేరటం గమనించవచ్చు.
‘మంత్రాలకు’ శీర్షికలో ‘ప్రభు ప్రార్థనలతో/ మనిషి స్వస్థత ఐతే సరి/ ఇన్ని మిషనరీ ఆసుపత్రులు/ ఎవరికో, ఎందుకో మరి’
‘హిందుత్వం సరేసరి’ శీర్షికలో ‘క్రైస్తవమ్ము ఐనా/ మహమ్మదీయమైనా/ ఉన్మాద పోటీలో/ నువ్వా నేనా?’
‘హంతక ఆయుధాలు’ శీర్షికలో ‘గుడి పూజారి కావచ్చు/ చర్చి ఫాదరు కావచ్చు/ మసీదు వౌల్వీ కావచ్చు/ ధనం దోపిడీ ఉచ్చు’
ఇలాంటి మినీ కవితల్లో వాస్తవం వుండొచ్చు కానీ, అత్యధిక ప్రజానీకం మనస్సులు గాయపడేలా కాకుండా, మత ప్రస్తావన లేకుండా మతవ్ఢ్యౌన్ని మాత్రమే ఎండగట్టేలా వుంటే బాగుండేదనిపిస్తుంది. అశోక్‌కుమార్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు మొదట్లో చెప్పుకున్నట్లు ఈ కాలంలో ప్రగతిశీల వాదులపై జరుగుతున్న మతోన్మాదుల దౌర్జన్యాలకు కలవరపడి రచయితల్లో ఇంతటి కోపానికి, ఆక్రోశానికి కారణమై వుండవచ్చని ఆలోచనాపరులు అర్థం చేసుకోగలరు.

- చలపాక ప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 9247475975

మనోగీతికలు

అగ్గిపుల్లలు కొన్ని..
సిగ్గుబిళ్లలు కొన్ని!
ఎన్ని రంగులో.. ఎన్ని హంగులో
ఎంత సౌరభమో.. ఎంత సౌందర్యమో
ఆత్మీయ ఆలింగనాలు కొన్ని
ఆశీస్సుల ఉషస్సులు కొన్ని
మైత్రీ మమకారాలు కొన్ని
అన్నీ ఆనందాలే... అన్నీ అపురూపాలే
తడుముకుంటూ పోతే అంతరంగాలన్నీ
వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యాలే
ఆవేశాల ఆవేదనలు కొన్ని
అగ్నిపర్వతాల భగభగలు కొన్ని
నిశ్శబ్దాలు కొన్ని.. నిట్టూర్పులు కొన్ని
అన్నీ అక్షరాలే.. అన్నీ ఆయుధాలే!
మధిస్తూపోతే
మస్తిష్కాలన్నీ మహాప్రస్తానాలే
అగ్గిపుల్లలు కొన్ని.. సిగ్గుబిళ్లలు కొన్ని
సముద్రాలు కొన్ని.. సాహసాలు కొన్ని
ఎదురీతలు కొన్ని.. ఎడతెగనివి కొన్ని
అన్నీ మేధస్సులే.. అన్నీ తపస్సులే
నిలువరిస్తూపోతే నిలువెల్లా గాయాలే
త్యాగాలన్నీ తలరాతలే
కొన్ని తీపిగుర్తులు.. కొన్ని చేదుమాత్రలు
కొన్ని కుత్సితాలు.. కొన్ని కుతంత్రాలు
అన్నీ ‘రాజీ‘నామాలే.. అన్నీ ‘వీలు‘నామాలే
వింటూపోతే.. అంతా లోకువే
కొన్ని ఆశాస్ర్తియాలు.. కొన్ని అసందర్భాలు
వాగ్దానపు వర్షాలు కొన్ని
అన్నీ అజ్ఞానాలే.. అన్నీ అస్పష్టాలే
భరిస్తూపోతే
బతుకంతా బానిసత్వమే
కొన్ని నినాదాలు.. కొన్ని నిరసనలు
కొన్ని జలదరింపులు.. కొన్ని చీదరింపులు
కొన్ని దారుణాలు.. కొన్ని రణాలు
అన్నీ ఒఠ్ఠి తీర్పులే.. అన్నీ ఓదార్పులే
రాసుకుంటూపోతే
అక్షరానికి అక్షరానికి
కొత్త ఒరిపిడే.. కొత్త ఒరవడే
అంతర్వేదాలు కొన్ని... అంతర్మథనాలు కొన్ని
అన్నీ అమూల్యాలే.. అన్నీ ఆణిముత్యాలే!

- కటుకోఝ్వల రమేష్,
ఖమ్మం.
చరవాణి : 9949083327

అక్షరశక్తి
కష్టజీవి వేదనాగ్నులను చూడగానే
మానవత్వపు మబ్బై కరిగి
మానసం కురిపించే కన్నీటి బిందువులను
తడితడి అక్షరాలుగా తర్జుమా చేసి
సమాజాన్ని స్పందింపజేసేలా
సజీవదృశ్య కథనాలను రూపొందించే
రుషి వంటి కవి
దీనుల దిగులు చీకట్లలో దివ్వెలు వెల్గించే
అద్భుత జీవి!

మానవాళికి మహోపకారం చేసే
సాహిత్య సేద్యానికి అంకితవౌతూ
సంఘంలోని కుళ్లిన రంగాలకు
అత్యవసర చికిత్సనందించే
వైద్య ధర్మానికి అర్పితవౌతూ
లోకకల్యాణ యాగానికి
నైవేద్యంగా సమర్పితవౌతూ
అక్షరాలు పునీతమవుతుంటాయి!
ప్రాణవాయు వీచికల్లా ప్రసరిస్తూ
జీవనదీ తరంగ మాలికల్లా ప్రవహిస్తూ
అక్షరాలు -
విశ్వసంక్షేమ విధినిర్వహణలో
విరాజితమవుతుంటాయి
అద్భుతాలు సృష్టిస్తూ
పూజితమవుతుంటాయి!
తిరోగమనవాదుల తిక్కవేషాలపై
తీవ్రమైన తిరుగుబాటు రణమై విప్లవిస్తూ
నిరంకుశవాదుల దమనకాండలపై
తీక్ష్ణమైన నిరసనల నిప్పుకణమై విక్రమిస్తూ
సర్వతోముఖాభివృద్ధికి
సాధనాలు సమకూరుస్తూ
జాతి సమైక్యతకు జవసత్త్వాలనందిస్తూ
మనిషికి అండదండై నిలచే
ప్రతి అక్షరం ఒక అద్భుతం!
అవనిలా, ఆకసంలా అలరారుతూ
ప్రతి ప్రాణినీ ఆదుకునే
అక్షరశక్తి అత్యద్భుతం!
అది అమేయం
అది అజేయం
అది అనంతం!

- ఎరుకలపూడి గోపీనాథరావు, విజయవాడ. చరవాణి : 98482 93119

నిరీక్షణ
జాలువారిన కన్నీటి బొట్లు ఆవిరై
మనోఫలకాన్ని మేఘాల్లా కమ్మేశాయి
కన్నకలలు కనుచూపునకు మరుగైపోయి
మనసులేని మైదానంలో కవాతు చేస్తున్నాయి
గతం, అతని జీవితాన్ని బుగ్గి చేయగా
వర్తమానం అతణ్ణి ఒంటరిగా మార్చింది
అనుకోని ఆపద అక్షుల్ని భక్షింపగా
కుక్షి నిండేందుకు భిక్షయే తెరవయ్యె!
రక్తసంబంధాలు రిక్తహస్తాన్ని చూపేసి
మాటల తూటాలతో, మతిని విరిచేసి
రోగియని చూడక రోడ్డుపైకి తోశాయి
దాయాదులెవ్వరూ, దారిచూపకపోయినా
మానవత్వమున్న మనసొకటి స్పందించింది
గుడిమెట్లపైనే చోటును సాధించుకుని
క్షణికావేశులతో మనసు సర్దుకొని
సాగుతున్నాడు సమస్యల వలయంతో
పడే చిల్లర పైసలతో ప్రమోదాన్నాహ్వానిస్తున్నా
సాయమందరికి అందాలని తలస్తున్నా
పెదవి దాటకనే ప్రార్థిస్తున్నాడు
మెట్లపై నీడనిచ్చే మర్రిచెట్లన్నీ
కాలుష్య ఘాతానికెప్పుడో కన్నుమూశాయి
ఎండపాటు, గుండెపోటును తలపిస్తున్నా
బండరాయిగ మారిపోయిన మనసుతో
మరణ పిలుపుకి నిరీక్షిస్తున్నాడు ఆశతో
దివారాత్ర భేదమెరుగని ఆ దివ్యాంగుడు!

- పరాశరం శ్రీనివాసాచార్యులు,
నరసరావుపేట, చరవాణి : 9966434265

జేజేలు
ఏ మట్టితో చేశాడో
మనుషుల్ని దేవుడు
తెల్లగా పాలపొంగులా ఒకరు
నల్లగా కాల్చినకర్రలా ఒకరు
మెత్తగా వెన్నపూసలా ఒకరు
కఠినంగా శిలారూపంలా ఒకరు
ఏ కుంచెతో రూపురేఖలు దిద్దాడో
నిలచి చూడాలనిపించేదొకరు
కలసి పలుకరించాలనేదొకరు
మెరిసి మాయమయ్యేదొకరు
జడిసి దూరమయ్యేదొకరు
ఏ సమయంలో సృజించాడో
కారుచీకట్లో ఒకరు
పగటి ఎండల్లో ఒకరు
సంధ్యానీడల్లో ఒకరు
వెలుగుదివ్వెల్లో ఒకరు
ఏ ఊపిర్లు ఊదాడో
కోపతాపాలు నింపుకున్నదొకరు
రాగద్వేషాలు చంపుకున్నదొకరు
ప్రేమాభిమానాలు
ఒంపుకున్నదొకరు
సుఖదుఃఖాలు
అశాశ్వతమన్నదొకరు
ఏ అనే్వషణతో
సమాధానపడగలమో
సృష్టికర్తను ఆరాధిస్తూ
అనంత ఆనందాన్ని అనుభవిస్తూ
చిరు జీవితాన్ని ఆస్వాదిస్తూ
మనోఫలకాన్ని శాంతపరుస్తూ
పలుకుదాం జేజేలు!

- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- నిడుమోలు అన్నపూర్ణ