విజయవాడ

ఐకమత్యం (బాలల కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేళ్ల రాజు రోజూ ఉదయం 8 గంటలకు టిఫిన్ తిని బడికి వెళతాడు. ఇదే అతని నిత్యకృత్యం. రోజూ టిఫిన్ తినేటప్పుడు వాళ్ల ఇంటి పెరటిలోని మామిడి చెట్టు కింద కొంచెం పెట్టేవాడు. దాన్ని ఆ చెట్టు మీదున్న పక్షులు తింటుంటే ఎంతగానో ఆనందించేవాడు.
ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని, రాజు పెట్టిన ఇడ్లీ ముక్కను ఒక కాకి వచ్చి తిని ఎగిరిపోయింది. తరువాత రాజు టిఫిన్ తినేటప్పుడు చెట్టు మీద ఉన్న కాకి అరవటం ప్రారంభించింది. అలవాటుగా రాజు కొంచెం పెట్టేవాడు.
కాని ఒకరోజు రాజు టిఫిన్ పెట్టగానే కిందకి దిగిన కాకి తినకుండా దాని దగ్గర నుంచుని కావ్.. కావ్.. అంటూ అరవసాగింది. అది తినకుండా అరవడం చూసిన రాజుకు ఆశ్చర్యమేసింది. ఇంతలో ఎక్కడి నుంచో మరిన్ని కాకులు వచ్చి దాన్ని తిని ఎగిరి వెళ్లిపోయాయి.
దాన్ని చూసిన రాజు ఆశ్చర్యంతో వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ల తాతయ్య దగ్గరకు వెళ్లాడు.
‘తాతా.. తాతా! ఇవ్వాళ నేను మామిడి చెట్టు దగ్గర ఇడ్లీ పెడితే ఒక కాకి వచ్చింది. అది తినకుండా అరుస్తున్నది. అది అలా అరుస్తుంటే కొంత సేపటికి కాకులు ఒకటొకటిగా కొన్ని వచ్చాయి. అప్పుడే అది వాటితో కలిసి దాన్ని తిన్నది. అలా చేస్తే నేను పెట్టిన కొంచెం దానికి ఏం సరిపోతుంది?’ అని ప్రశ్నించాడు.
‘ఓహో! అదా నీ అనుమానం! అది అలా ఎందుకు అరుస్తుందంటే.. ఇక్కడ ఆహారం ఉంది. అందరం కలిసి తిందాం రండి’ అని తనవారికి చెప్పటమన్నమాట. అందుకే అది కావ్.. కావ్‌మని అరవగానే కాకులన్నీ అక్కడికి వచ్చి చేరాయి’ అని చెప్పాడు రాజు తాత.
‘అయ్యో! అలా అయితే నేను పెట్టిన చిన్న ముక్కను అవి అన్నీ ఎలా తింటాయి? వాటన్నింటికీ అది ఏమి సరిపోతుందీ?’ మళ్లీ ప్రశ్నించాడు రాజు.
‘అదికాదు రాజూ! ఎంత తిన్నామన్నది కాదు, ఉన్నది కొంచెమైనా అందరితో పంచుకు తినాలి - అని దాని అర్థం. దానే్న కాకులు మనకు నేర్పిస్తున్నాయి. రోజూ నువ్వు ఏమైనా పెట్టగానే అది ఒక్కటే తినకుండా కావ్.. కావ్.. అని అరుస్తోంది. అంటే తన సహచరులను పిలవటమన్న మాట. తనవారు రాగానే అవన్నీ కలిసి ఆనందంగా తింటాయి. నువ్వు రోజూ చూస్తున్నావుగా! అంతేనా? అందుకే కాకుల్లో ఐకమత్యం ఉన్నది అని మనకు తెలుస్తుంది. అందుకే ఒక కవి ‘కాకుల కులమును చూసిన నాడే ఐకమత్యమనేది తెలిసేది’ అన్నాడు.
అంతేకాకుండా ఒక్క కాకి ఆపదలో చిక్కుకుంటే మిగతావన్నీ కావ్.. కావ్ అని అరుస్తూ కాపాడటానికి వస్తాయి. మనుషుల్లో ఆ ఐక్యత లేదు. మనకెందుకు వచ్చిన తంటా! అని వదిలేస్తారు’ వివరించి చెప్పాడు తాత.
‘అవును తాతా! ఒకసారి మా స్కూల్లో ఒక కాకి దెబ్బతగిలి పడిపోయింది. అప్పుడు కావ్.. కావ్.. అని అరుచుకుంటూ ఎన్ని కాకులు దాని దగ్గరకు వచ్చాయో!’ అన్నాడు రాజు.
‘చూశావా మరి! ఆహారం పంచుకునేటప్పుడే కాదు, ఆపద సమయంలో కూడా అవి ఒక దానికొకటి ఎలా తెలియపరచుకుంటాయో! రాజా, దీనివలన నీకు తెలిసిన విషయం, నీతి ఏమిటి?’ ప్రశ్నించాడు తాత.
‘నీతి అంటే ఏమిటి తాతా?’ అడిగాడు రాజు.
‘మనుషులు చూడు స్వార్థపూరితులయి చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు’ చెప్పాడు తాత.
‘అంటే?’ అడిగాడు రాజు. ఆ చిన్ని బుర్రకు తాత చెప్పింది అర్థం కాలేదు మరి.
‘సరే! నీకు అర్థమయేటట్లు చెబుతాను, విను..’ అన్నాడు తాత.
‘సరే చెప్పు తాతా!’ అన్నాడు రాజు ఆసక్తిగా.
‘ఇప్పుడు మన పక్కింటి రాముకు ఏమైనా పెట్టాననుకో! వాడేం చేస్తాడు? చెప్పు’ అడిగాడు తాత.
‘వాడొక్కడే తింటాడు’ టక్కున బదులిచ్చాడు రాజు. ‘ఎందుకంటే, ఒకసారి వాడు జామకాయ తింటుంటే నాకు కొంచెం పెట్టమన్నా. నాకు పెట్టకుండా వాడొక్కడే తిన్నాడు తాతయ్యా’ ఒక సంఘటనను ఉదాహరణగా గుర్తుచేశాడు రాజు.
‘ఆఁ! మరి అదే స్వార్థమంటే! మన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకోవాలి. అప్పుడే మనల్ని అందరూ మెచ్చుకుంటారు. అవునా? కాదా?’ ప్రశ్నించాడు తాత.
‘అవును నిజమే తాతయ్యా! ఒకసారి పరీక్షల్లో మా ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ లేకపోతే నా దగ్గరిది ఇచ్చాను. మా టీచర్ నన్ను మెచ్చుకుని, మా ఫ్రెండ్స్ అందరి చేత చప్పట్లు కొట్టించారు’ మరో అనుభవం తాత ముందు పెట్టాడు రాజు.
‘అందుకే అందరూ ఎప్పుడైనా ఐకమత్యంగా కలిసి ఉండాలి’ అన్నాడు తాత.
‘అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు. అంతేగా తాతా!’ రెట్టించిన ఉత్సాహంతో అన్నాడు రాజు.

- డా. మైలవరపు లలితకుమారి,
గుంటూరు.
చరవాణి : 9959510422

చిన్న కథ

అమ్మ కావాలి
శంతన్‌గంగ తన పేరు. చాలా గమ్మత్తుగా వుందని అంటారు ఫ్రెండ్స్. ‘ఎందుకలా పెట్టారు? అమ్మా - నాన్న నన్ను నీ దగ్గర వదిలేసి ఎందుకెళ్లిపోయారు?’ శంతన్‌గంగ ప్రశ్నలకి బాధగా నవ్వింది యమున. ‘అక్కయ్య గంగని ఏడో ఏటనే మా చినమామయ్యకిచ్చి పెళ్లిచేశారు. ఒకే ఒక్కరోజు ఏదో విషజ్వరం. చినమామయ్య చనిపోయాడు. తెల్లచీరలో అక్కని చూడలేక పెదమామయ్య కాలేజీలో చేర్పించడానికి పట్నం తెచ్చాడు. ఎదురింటి శంతన్ లెక్చరర్. అక్క చదువు విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యేసరికి వారిద్దరి మధ్య ప్రేమబంధం. పెదమామయ్యే వారిద్దరి పెళ్లి జరిపించాడు. గతాన్ని గుర్తుచేసినా, ఎవరికైనా చెప్పినా తాను వెళ్లిపోతానని ముందుగానే చెప్పింది గంగ.
నినె్నత్తుకుని పుట్టింటి నుంచి రాగానే మీ నాన్న ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ‘అందరిలా ఆదర్శాలు చెప్పడం కాకుండా ఆచరణలో చూపించాడు మావాడు’ అన్నాడొక ఫ్రెండ్. అంటే అతనికి శంతన్ విషయమంతా చెప్పేశాడని అర్థమై నిన్ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది గంగ. తనను శంతన్ దగ్గరికి పంపాలని చూస్తే చచ్చిపోతానని బెదిరించింది. శంతన్ వెళ్లి బతిమాలితే.. ‘మరోసారి నాకోసం మీరు ఈ ఊరువస్తే కనిపించకుండా పోతాను’ అంది. అంతే! మీ నాన్న నిన్ను నాకప్పగించి ఎటో వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరి పేరు మరువకుండా నీ పేరు శంతన్‌గంగ అని పెట్టాను’ వివరించింది యమున.
‘అమ్మ ఇంకా ఆ ఊరిలోనే వుందా?’ అడిగాడు.
‘నాన్న చనిపోయినా ఆ ఇంట్లోనే వుంటూ, రామాలయంలో రాముని సేవ చేసుకుంటూ ప్రశాంతంగా వుంది’ చెప్పింది యమున.
‘నేను అమ్మని చూడాలి. నాకు అమ్మ కావాలి పిన్నీ’ అడిగాడు శంతన్‌గంగ.
‘వెళ్లు! నువ్వు అచ్చంగా మీ నాన్న పోలిక. ఎవరూ పరిచయం చెయ్యనవసరం లేదు’ అంది యమున.
‘నువ్వొస్తావని నాకు తెలుసు’ అంటూ ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది గంగ శంతన్‌ని.
- లోకపావని, విజయవాడ.

పుస్తక పరిచయం

మనసు చిలికే ‘చల్లకవ్వం’.. సోమేపల్లి కవిత్వం!

కొన్ని అక్షరాలు అలా జత కలవడంతోనే అంతులేని ఆప్యాయతను హిమపవనంలా మనసుల్లోకి.. మనుషుల్లోకీ అలవోకగా చొచ్చుకు వస్తాయి.
కొన్ని పదాలు తమను తాము వ్యక్తీకరించుకునే క్రమంలో అనంత ప్రేమానురాగాలను హత్తుకుంటాయి.
నాలుగైదు పదాలలో విశ్వమంత ప్రేమను పొదిగి కవిత్వం చేయాలన్నా.. రాసే ప్రతి అక్షరమూ సామాజిక చైతన్యపు వెలుగు రేఖై దారి చూపేలా ఉండాలన్నా.. అది కొన్ని కలాలకూ, ఆ కలాలను నడిపించే వ్యక్తిత్వాలకే సాధ్యం. అలాంటి అరుదైన హృదయమున్న కలం, కాలానికి.. కలానికీ సున్నితమైన పూలవంతెన లాంటి కలం.. సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారిది.
‘నానీ’లు ఎక్కువ రాశారనిపించినా అవి అన్నీ సమాజపు అన్ని పార్శ్వాలనూ స్పృశిస్తూ పాఠకుడిని మెత్తని ముఖమల్ సూదితో గుచ్చినట్టు.. నెప్పి తెలియకుండా మత్తు సూదేదో ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు.. చదివాక, దాన్ని మనసు జీర్ణించుకున్నాక ఒక కొలిక్కి వచ్చిన ఆలోచన కొత్త చూపునిస్తుంది. అదే సోమేపల్లి కవిత్వపు గొప్పతనం.
ఉదాహరణకు ‘తొలకరి చినుకులు’ నానీల సంపుటి మొదటి పేజీలోని ‘చినుకువో.. చిగురువో’ అంటూ అంకితపు పలుగు పాదాలూ ప్రారంభించారు. ఇలా కాస్తంత కవిత్వం తెలిసిన అందరమూ అనగలం కానీ, ఆ తర్వాత ‘బతుకులు చెలిమివో.. చేతిలో దివ్వెవో’ అంటూ జీవితపు ముప్పాతిక భాగం ప్రధాన భూమిక పోషించే అర్ధాంగిని పోల్చటంతో ‘చెలిమి’కి సోమేపల్లి ఎంత గొప్ప స్థానమిచ్చారో అర్థమవుతుంది. తను దివ్వె అయితే జీవితం వెలుగుల ప్రస్థానమయ్యే క్రమమేదో తెల్సినవాడు కనుకనే నాలుగక్షరాల నైవేద్యంతో హృదయాన్ని ఆవిష్కరింపచేశారు.
ఉద్యోగపు వేటలో పడి, పల్లె నుంచి పట్నమొచ్చి జర్నలిస్టు జీవితపు గట్లు ఒరుసుకుని, అక్షరాల నదై ప్రవహించి, అధికారిగా ప్రభుత్వోద్యోగపు సుడిలో దూకినా తానేంటో.. తన మూలాలేమిటో మరచిపోని, మరచిపోలేని వాడు గనుకే ఇలా కవిత్వమై పరిమళిస్తున్నాడు. సంతకాలకు విలువ కలిగిన సమాజంలో కవిత్వపు సంతకమై మెరుస్తున్నాడు. బ్యూరోక్రసీ చెక్కిన శిల్పాల రాతి గుండెల కదలికల్ని ‘ఫైలు కదలాలంటే’ పేరిట కవిత్వీకరించిన విధానం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘నాట్ అప్రూవ్డ్’ కాస్తా ‘నోట్ అప్రూవ్డ్’గా మారటాన్ని కవిత్వీకరించిన తీరు కార్యాలయాల కర్కశత్వాన్ని కళ్లకు కడుతుంది.
‘పల్లె పాదాలు’ పేరిట నాన్న వడిసెల రాయిగా మారి బిడ్డలకు కాసిని జొన్నగింజలు అందించాలనే తపననూ, ఆ జొన్నలను పేలాలుగా అందించే ప్రయత్నంలో ‘మంగలం’లో వేగిపోయే అమ్మ తడి గుండెనూ, రామయ్య పంతులు బడి, వైద్యుడి పరుగూ.. అన్నిటినీ అచ్చంగా కళ్లముందు దృశ్యాలుగా పరుగెత్తించి పల్లెను మన మనసు పాదాల్లోకి జొప్పించి మనమూ మనసుతో మన పల్లెను గుర్తుకు తెచ్చుకునేలా సాగుతుంది ‘పల్లెపాదాలు’ కవిత.
‘్భజానికి సంచీ
చెవిలో పెన్సిల్ ముక్కా
ఖాకీ దుస్తుల్లో గేట్లోంచి వస్తుంటే
మనసు చెలికాడి నుంచి
మమతల పరిమళం గుబాళించేది’ అంటూ ‘ఉత్తరాయణం’ శీర్షికగా ఉత్తరాలనూ, అవి అందించే పోస్ట్‌మాన్ ఉనికినీ, ఊహలను కవిత్వంగా ప్రవహింపజేశారాయన.
‘మాటల పల్లవి పూసల్ని
ఆశల సంచీలో మోసుకొచ్చి
గుండె తలుపులు తట్టేవాడు చుట్టంగా..
మాటలకి సెకండ్ల ముల్లు
గుచ్చుకుని ‘సెల్’లో మాటల ఖైదు
మొదలయ్యాక, ఉత్తరాలు ఉత్తర దిక్కుకేసి పయనమైన వైనాన్ని హత్తుకునేలా కవిత్వీకరించారు.
సోమేపల్లి కవిత్వం వస్తువును కవిత్వీకరించటమే కాదు శీర్షికలు నిర్ణయించటంలోనూ కొత్తపుంతలు తొక్కుతోంది. పర్యావరణానికి పలురకాలుగా చేటుగా నిలుస్తున్న ‘క్యారీ బ్యాగ్’ను ‘పాడెసంచీ’గా పేర్కొనటంతో శీర్షిక నుంచే కవిత్వం ప్రారంభమై కవితా కడలిగా ముగుస్తుంది. కాల్చినా అది కాన్సర్‌గానూ, పూడిస్తే అది చిరంజీవిగా నిలిచి నేల పొరల్ని నాశనం చేసే వైనాన్ని చెపుతూ, అమాయకంగా ఆహారం చేసుకున్న మూగప్రాణుల జీర్ణాశయాల్లో పోగులుపడుతున్న టన్నులకొద్దీ పాడెసంచులను ఎందుకు వెలివేయాలో బాగా కవిత్వీకరించారు సోమేపల్లి.
నానీల సంపుటుల్లో తనదైన శైలిలో నాలుగు వరుసల్లో ఎన్నో కావ్యాలకు సరిపడినంత వస్తువును చురుక్కుమనేలా.. చటుక్కున మస్తిష్కంలోకి చొరబడేలా రాసిన తీరు సోమేపల్లిని ప్రజల నాలుకల మీద నిలబెడుతుంది.
‘రెప్పల చప్పుడు’లో
‘కులాలు, మతాలు ఉన్నాయి
ఊరు మాత్రం ఉమ్మడి కుటుంబమే’ అని మనదేశపు లౌకికత్వపు లక్ష్యాన్ని చక్కగా అక్షరీకరించారు. ఎప్పుడు రాశారో తెలియదు గానీ ఇప్పటికీ సజీవంగా మిగిలి సాక్ష్యంగా కళ్లముందున్న వర్తమానమై నిలిచిన నానీ.
‘పుష్కరాలకు సిద్ధం
మరపడవలూ ఈతగాళ్లూ
మరి
నీళ్లో..!? అని ముగించి ఇప్పటి నదుల నిర్జీవత్వాన్ని కవిత్వమయం చేశారు.
ఒక తరం పల్లెలో మిగిలి, కొత్తతరం పట్టణానికి వలసపోతున్న పద్ధతిని నానీగా మలచిన తీరు ఎలా ఉందో చూడండి..
‘పల్లె చెరువులో
తల్లి చేప
‘పట్నం అక్వేరియంలో
పిల్లచేప’.. అంటూ పల్లె జీవితాన్ని స్వేచ్ఛగా ఈదగలిగే చెరువుతో, పట్నపు జీవితాన్ని అక్వేరియంలా అక్కడక్కడే తిరిగే బందీఖానాలా వర్ణించి తరాల మధ్య అంతరాల్ని, నగరీకరణానికీ నాటకీయంగా, నర్మగర్భంగా చంపబడుతున్న పల్లె జీవితానికీ మధ్య వైరుధ్యాన్ని నాలుగు లైన్లలోకి వొంపిన తీరు మనల్ని కట్టిపడేస్తుంది. అతి సామాన్య పాఠకుడికీ పోలికలోని లోతంతా అర్థమై కొత్త దృక్కోణాలు మొలకెత్తుతాయి.
పల్లెను పలకరించాలన్నా, మనసు మృదుత్వాన్ని స్పర్శించాలన్నా చెరువుకట్ట మీది గాలిలా.. తాటి ముంజల్లోని స్వచ్ఛతలా.. కాడెద్దులు నిటారుగా దున్నిన దుక్కిలా.. అమ్మచేతి ముద్దలా.. నుదుటి మీద నాన్న పెట్టే ముద్దులా.. పలువిధాల భావాల పరిమళాల్లో మునిగి తేలాలన్నా సోమేపల్లి కవిత్వం చదువుదాం. ‘లోయలో మనిషి’నీ, ‘తొలకరి చినుకుల్నీ’, ‘చల్లకవ్వాన్నీ’ పచ్చని వెనె్నట్లో పలకరించి వద్దాం!

- కోసూరి రవికుమార్,
దాచేపల్లి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9491336488

మనోగీతికలు

మనిషి
మనిషి మంచోడా.. చెడ్డోడా?
కొలబద్దలు ఏవీ?
అవసరం దిగజారుస్తుంది
అవకాశం ప్రలోభపరుస్తుంది
మనిషి నడవడికీ సాపేక్ష సిద్ధాంతమే!
ఏకాంతం నీలోని నిన్ను వెక్కిరిస్తుంది
నీ విలు, వలువలను ఊడ్చేస్తుంది
మనిషిని ఎలా గణించగలం?
ఎవరి విలువలు వారివి?
ఎవరి వ్యూలు, రివ్యూలు వారివే!
పాలెంలో పదెకరాల రైతు పెద్దోడు
ఫలక్‌నుమాలో పదొందల కోట్ల
ఆసామీకి లెక్కుండదు
సర్కిల్ మారలా? ఆరాటం పెరుగుతుంది!
నోటికి ముద్ద, వంటికి బట్ట, కంటికి నిద్ర
చాలని కబుర్లు చెబుదాం..
విలాసాల గూటిలో విలవిల!
ప్రపంచం డబ్బుమయం
మనిషీ మారతాడు!
సహజమైన పరిణామం
మెరుగులను నమ్మలేము
మరకలను అసహ్యించుకోలేం
ఆవలి గట్టు నుంచి చూస్తే అంతా కరెక్టే!
మనిషిని గణించలేము తేలికగా
మానవ సంబంధాలు ముఖ్యం మరి
చిదానందంగా, సదా ఆనందంగా
చిద్విలాసంగా జీవితాన్ని గడపాలి
ఈ గణించడాల గోల
మనకెందుకు మరి!

- ముక్కా సత్యనారాయణ,
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9441120047

మొక్కలే ఆయువు
పశువులకు గ్రాసం కావాలన్నా
పంటచేనుకు తడి పెట్టాలన్నా
పక్కులు ఎండలకు తట్టుకోవాలన్నా
పదిమందికీ దాహం తీరాలన్నా
పల్లెపట్టున ప్రజలు నివసించాలన్నా
పడిపరిగెత్తే వానలు కురవాలన్నా
పదికాలాలు నీడనిచ్చే చెట్లు కావాలన్నా
పచ్చని మొక్కలు నాటి పెంచాలి
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

కాకరపర్తి సుబ్రహ్మణ్యం,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9848297711

అమ్మ కంటి చెమ్మ
తన రక్తమాంసాల్ని పణంగా పెట్టి
మనకు జన్మనిస్తుంది అమ్మ
అమ్మే బొమ్మై మనల్ని ఆడిస్తుంది
తెనే పలుకులు మనం పలుకుతుంటే
తన్మయత్వంతో మురిసిపోయింది
పాలపంటి నవ్వులు మనం నవ్వుతుంటే
పరవశంతో పిచ్చిదైపోతుంది
బుడిబుడి అడుగులు వేస్తూ బడికి వెళ్తుంటే
మంత్రముగ్ధురాలై వీక్షిస్తుంటుంది
జీవితంలో మనం ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే
తన జన్మ ధన్యమనుకుంటుంది
అయితే..
అలాంటి అమ్మ కంట చెమ్మను మనం చూస్తున్నాం
గోరుముద్దలు పెట్టి కడుపునింపిన అమ్మకు
మెతుకు కూడా మనం పెట్టకుంటే
ఈ కడుపుమంట కన్నా
ఆ కడుపుకోతే మేలేమో అని విలపిస్తుంది
గుండె మీద తాకిన ఆ చిన్నిపాదమే
తనను వదలి వెళ్లిపోతుంటే
ఏంచేయాలో దిక్కుతోచక
ఎండమావిలో నీటి చెమ్మ అవుతుంది
ఎల్లప్పుడూ మనల్ని వెన్నంటి ఉండే అమ్మను
మనం వదిలేసి వెళుతుంటే ఆమె జీవితం
చిగురాశలు లేక చీకటి బారిపోతుంది
వెలుగు లేకుండా దుర్భరమైపోతుంది
లాలించి పాలించిన అమ్మ కంట చెమ్మ పెట్టిస్తే
మనం మనుషులమే కాదు
సంతానమంటే పాడె మోసేవారే కాదు
ప్రేమ పంచాల్సిన వారు!
ఆస్తి పొందాల్సినవారే కాదు
అండనివ్వాల్సిన వారు!
ఇకనైనా దూరంగా పోక
అమ్మను మీ దరి చేర్చుకోండి!!

- కట్టా శ్రావణి,
శనగపాడు.
చరవాణి : 9912450428

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- డా. మైలవరపు లలితకుమారి