విజయవాడ

ఓ మనిషీ.. మీమధ్య నేను బతికేదెలా?! (గో విలాపం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియ మిత్రమా.. మానవా! కుశలమా?
నేను కుశలమని చెప్పలేకపోతున్నాను. ఎందుకో నీకు తెలిసే ఉంటుంది. ఈమధ్యకాలంలో నేను మీ మానవ జాతికి ఒక కాలక్షేపాన్నయ్యాను కదా! అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారుగా! నీ మిత్రుడినైన నన్ను నీ తోటివారు కించపరుస్తూ అవమానిస్తుంటే వింటూ ఉన్నావేగాని ‘అలా అనడం తప్పు. అది మనందరికీ మంచి మిత్రురాలు’ అని ఏనాడైనా చెప్పావా? ‘దానిని ఎందుకు ద్వేషిస్తారు? అది చేసిన తప్పేమిటి? అది మీకు ఏం అన్యాయం చేసింది?’ అని ధైర్యంగా ప్రశ్నించావా? ఏమిటో నా పిచ్చి అంతా! ఏదో మిత్రుడివి కదా! చేదోడు వాదోడుగా నిలిచి నాకు పూర్వవైభవాన్ని తెచ్చిపెడతావనే చిన్న ఆశతో నీతో మొరపెట్టుకుంటున్నా! ఏంటీ? నేనెవరినో తెలియడం లేదా? గుర్తుకు రావడం లేదా? అయ్యో! అది కూడా నేనే చెప్పాలా? ఏమిటి నాకీ కర్మ? ఎంత మందని తరింపచేశాను! ఎంత మందని సంతానవంతుల్ని చేశాను, ఎంతమందికి ఆయురాగోగ్యాలు ప్రసాదించాను. ఎంతమంది మహానుభావులు, ఋషులు నన్ను ప్రస్తుతించారు... ఇదంతా గుర్తులేదా? మరచిపోయవా? ఇప్పుడైనా గుర్తుకు వచ్చానా? లేదా? అయినా నా పిచ్చిగాని, తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు అదేదో ఆధునిక మాయా దర్పణంలో (టెలివిజన్)లో పోగేసిన పనికిమాలిన సోదినంతా మెదడుకు ఎక్కించుకోవడంలో ఉన్న తాపత్రయం, శ్రద్ధ, నున్న గుర్తు పెట్టుకోవడంలోనూ, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి తిరగబడటంలోనూ ఉండి ఉంటే...? ఈరోజు నేను నీకు ఇలా మొరపెట్టుకునే దానినా? నాకీ దుస్థితి వచ్చేదా? ఏంచేస్తాం! కాల మహిమ! నా గురించి నేనే చెప్పుకోవలసి వస్తోంది. నేను రుద్రులకు తల్లిని. వసువులకు కూతుర్ని. ఆదిత్యులకు కోడల్ని. నెయ్యి రూపంలో ఉన్న అమృత భాండాగారాన్ని! కోరిన కోరికలు తీర్చే కామధేనువుని. దిలీప మహారాజు నన్ను పూజిస్తే పుత్ర సంతతిని ఇచ్చాను. వేదాలు, పురాణాలు నన్ను ఎంతగానో కీర్తించాయి. నా ముఖంలో నాలుగు వేదాలు ఉన్నాయని పద్మ పురాణం పేర్కొంది. ముక్కోటి దేవతలూ నాలోనే ఉన్నారని, అన్ని నదీ జలాలు నాలో ప్రవహిస్తున్నాయని, పధ్నాలుగు లోకాలకు తల్లి లాంటిదాననని స్కంధ పురాణం చెప్పింది కదా! దేవీ భాగవతంలో సురభిగా నన్ను వర్ణించారు. గౌతమి మహర్షి గొప్ప తపస్సు చేసి నన్ను చంపిన పాప శాపాన్ని పోగొట్టుకున్నాడు.
హా... హమ్మయ్య! గుర్తుకు వచ్చానట్టుంది! గుర్తుకు వచ్చే ఉంటానులే. ఇంత చెప్పాక రాక చస్తానా? ఇప్పుడు నా మిత్రుడుగా నీవు నాకు ఏం చేయబోతున్నావు? యుగయుగాలుగా తరతరాలుగా నేను నీకు ఎంతో సేవ చేశానే! ఇప్పటికీ నన్ను కొలుస్తున్న వారి కోరికలు తీరుస్తున్నానే! పూర్వకాలంలో వ్యవసాయానికి నేనేగా ఉపయోగపడింది! చక్కటి పంటనిచ్చి దేశం సుభిక్షం కావడానికి కారణమైనది. అప్పుడేమో మాలో రెండు వందలకు పైగా తెగలు, జాతులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ నశించిపోయాయి! కేవలం మూడు పదుల సంఖ్యలో మాత్రమే మా జాతులు ఉన్నాయి. మా బలం తగ్గిపోయింది. మా శక్తి సన్నగిల్లింది. దీనికి నీ చుట్టూ సమాజంలో నీతో పాటే జీవిస్తున్న కొందరు కారణం కాదా? వారిని నీవు ఎందుకు సరిచేయలేకపోతున్నావు?
ఏమిటీ? నీవు చెప్పినా వారు వినరా? మాకు లాగానే మీలో కూడా రకరకాల జాతులవారు ఉన్నారా! ఒకడు ముందుకెళ్తుంటే మరికొందరు వెనక్కి లాగుతున్నారా! అలాంటి వారిలో ఒక వర్గం వారు సూడో సెక్యులరిస్టులా! వారి వాదన వారిదే కాని ఎదుటివారు చెప్పినా పట్టించుకోని మేధావులా! ప్రతిదానికీ తప్పుడు అర్థం వెతుకుతారా! అవును ఈమధ్య నేనూ విన్నాను.. అలాంటి వారి గురించి.. అదేమిటది! ఆ...!
‘అఘాను హస్యనే్త గావః!’ (గోవులు పాపాలను నశింపచేస్తాయి) అనే అర్థం వచ్చేలా వేదాల్లో ఉంటే అందులోని అఘాను పదాన్ని తొలగించి ‘హస్యనే్త గావః!’ (గోవులను చంపండి) అని ఉన్నట్లు ఆధునిక మేధావులు ప్రచారం చేస్తున్నారట. ఎందుకో నాపై వారికి అంత కక్ష?
వాళ్లెపుడూ ఇంతేనట కదా! సంస్కృతంలోని ప్రతి పదానికి తప్పుడు అర్థం చెప్పి మన వేదాలను, పురాణాలను వక్రీకరిస్తున్నారట. మన జీవన విధానాన్ని తప్పుపడుతున్నారట. అలా చేయడం వల్లనే వారు మేధావులుగా గుర్తింపు పొందుతున్నారట. ఏమిటో! పిదపకాలం! పిదప బుద్ధులు. అయినా భాషలకే భాష సంస్కృతం గొప్పతనాన్ని నీవు వాళ్లకి తెలియచెప్పలేకపోయావా?
నేనైనా నాలుగు తన్ని చెబుదామంటే నోరులేని జీవాన్ని అయ్యానయ్యే! జరిగేదంతా చూస్తూ ఊరుకోవడం, జరుగుతున్న పరిణామాలను వౌనంగా అర్థం చేసుకోవడం తప్ప నేనేమి చేయలేనాయే! ఏదో నన్ను అభిమానించి గౌరవించే నీవైనా నున్న రక్షించేందుకు ఏమైనా చేస్తావేమోనని ఇదంతా నీకు చెప్పుకుంటున్నా! నా బాధను అర్థం చేసుకునే సహృదయత మనిషిగా పుట్టిన నీకుకాక ఇంకెవరికి ఉంటుంది?
నన్ను పశుశాలలకు తీసుకెళ్లి చంపేస్తున్నారు. వద్దని వాళ్లని వేడుకోలేను. నా వౌనరోదన వారి చెవిన పడదు! నన్ను ఉపయోగించుకుని చక్కటి పంట పండించుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాల్సిందిపోయి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ మేధావులమని విర్రవీగుతారేంటి? పిచ్చి కాకపోతే?
నా మాంసం తినడం వారి హక్కుని వాదిస్తున్నారట. రాజ్యాంగం చెప్పిందట. అసలు రాజ్యాంగాన్ని వాళ్లు పూర్తిగా చదివారా? చక్కగా అర్థం చేసుకున్నారా? నాకు అలా అనిపించడం లేదే!
జాతీయ జెండాను గౌరవించండి, జాతీయ గీతాన్ని అవమానించకండి, మన దేశ సంపదను కాపాడండి - అంటూ రాజ్యాంగం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది కదా! ఆ! వాటిని ఆదేశిక సూత్రాలు అంటారు కదా! అవి పౌరులుగా మీ బాధ్యతలు కదా! ఆ బాధ్యతల్లో నా రక్షణ అంశాన్ని కూడా చేర్చారు కదా! మరి మేధావులు ఈ విషయాన్ని గ్రహించలేక పోయరా? హవ్వా! నవ్విపోదురు!
నీకు తెలియదా? నన్ను తల్లితో పోలుస్తారు. తల్లి పురిట్లోనే మరణిస్తే ఆ పసిబిడ్డకు నా పాలు పడతారు. తల్లి పాలే లేకపోతే నా పాలే శరణ్యం! నా పాలు తుష్టిని, పుష్టిని కలిగిస్తాయి. నేను నీకు పూర్వులు ఇచ్చిన వారసత్వ సంపదని. ఇంకా ఆ మేధావులు అనే వారేగా నాపై అనేక పరిశోధనలు చేసి నేను ఎంత ప్రయోజనకారినో చెప్పారు. ఎటొచ్చీ నేను చనిపోయాక నా మృతకళేబరాన్ని కబేళాకు తరలించి మాంసం, చర్మం, ఎముకలు తీసుకుని అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. బతికి ఉండగా కూడా ఉపయోగించుకోవాలన్న స్వార్థం దేనికని? సరైన ఆలోచనా జ్ఞానం ఉన్న వారికి ఇది తగునా? బతికుండగానే నన్ను వేధించుకు తినడం న్యాయమేనా? ధర్మమేనా? నన్ను నరికి, నా మాంసాన్ని తెగ తినేస్తున్నారు. అది వద్దంటే రాద్ధాంతం చేస్తున్నారు. వాళ్లకున్న సిద్ధాంతాలను మరిచిపోతున్నారు. డబ్బాలకు డబ్బాలు నా మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయినా నా పుణ్యభూమి భారతదేశంలో నా మాంసం తినేవాళ్లు 4శాతం మంది మాత్రమేనని గణాంకాలు తేల్చాయట! మిగిలిన 96శాతం మంది నన్ను అత్యంత భక్తిప్రపత్తులతో పూజిస్తున్నారుగా! ఆ కొద్దిమంది కోసం గొడవలు చేయడమంటే వారి ఉనికిని కాపాడుకోవడానికేగా? తమలోని అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోడానికేగా? మైనార్టీ వర్గాల మెప్పు పొందడానికి మెజార్టీ వర్గాల నమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే మేధావితనమా?
ఏమో! మీరూ, మీ జాతీ! ఒకరంటే ఒకరికి పడదు. ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ. అందరూ సమానమేనంటూ విభజన సూత్రాన్ని తు.చ.తప్పక పాటిస్తారు. రుగ్వేదంలో నన్ను ఎంతగా స్తుతించారు! మానవ జాతికి నేను చేసే మేలు గురించి ఎంతగా వివరించారు. ఇదంతా అర్థం చేసుకోలేనివారా మేధావులుగా చెలామణి అవుతున్నది?
ఏమో బాబు! నా గురించి నీకు పూర్తిగా తెలుసు. ఈ సూడో సెక్యులర్ వాదులు, కుహనా మేధావుల నుంచి నన్ను నీవే కాపాడాలి. నా జాతిని సంరక్షించాలి! నా ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి! నా నాలుగు కాళ్లూ జోడించి నీకు నమస్కరిస్తా! ఒక మానవతావాదిగా, తోటి జీవాలకు రక్షణ కల్పించాలన్న విశాల హృదయం కలవాడివిగా, నా ఆత్మీయ బంధువుగా మానవులనే నీ వాళ్లందరినీ కలుపుకుని సంఘటిత పరిచి, నా రక్షణ బాధ్యత చేపట్టవూ! ప్లీజ్! ఇంతకన్నా నినే్నమీ కోరనుగాక కోరను!

- కాకుమాను శ్రీనివాసమూర్తి,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9704082336

చిన్న కథ

సంసారానికి
బ్రేకప్‌లు వద్దమ్మా..

ఆటో దిగి స్పీడుగా వస్తున్న వైదేహిని చూసి మళ్లీ ఏదో గొడవ వచ్చి వుంటుంది. ముఖం కందగడ్డలా వుంది- అనుకున్నాను.
‘అతనితో నేనింక కలసి బతకలేను ఆంటీ’ అంది దుఃఖాన్ని ఆపుకుంటూ.
‘ఏం జరిగింది?’ మెల్లగా అడిగేను.
‘నన్ను కసురుకున్నారు. ఇది మొదటిసారికాదు. ఆయన ముఖంలో చిరాకు చూసినా, కసురుకున్నా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది’
వైదేహి కళ్లు వర్షిస్తున్నాయి.
తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.
‘్భర్త కసురుకుంటేను, విసుక్కుని నాలుగు మాటలంటేను.. సంసారానికి ‘గుడ్‌బై’ చెప్పేసే మాటయితే ఇండియాలో ఒక్క సంసారం కూడా నిలవదు. మా పక్కింటి సుశీలకి పెళ్లయి పనె్నండేళ్లు. ఒక పాప, బాబు. రోజూ తాగి వస్తాడు. నెలకి రెండుసార్లు భార్యని చావబాదుతాడు. అయినా తెల్లారేసరికి ‘పిన్నిగారూ!’ అంటూ నవ్వుతూ పలకరిస్తుంది. ఈ మొగుడిని వదిలి వెళ్లిపోతాను అనదు’ విడమర్చి చెప్పాను.
ఆశ్చర్యంగా చూసింది వైదేహి.
‘పిల్లలు లేని పెద్దమ్మకి నన్ను చిన్నప్పుడే ఇచ్చేసింది అమ్మ. నన్ను పెంచి, పెద్దచేసి పెళ్లి చేసింది కూడా పెద్దమ్మే. ఆవిడ వస్తే పర్సులో వెయ్యి రూపాయలు తీసి చీర కొనిపెట్టేను. నేను వెళ్లినప్పుడల్లా పెద్దమ్మ నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లి నాకు నచ్చిన అరడజను చీరలయినా కొనిస్తుంది. అవే ప్రతి పండక్కి ఒక్కొక్కటి తీసి కట్టుకుంటాను. పెళ్లయ్యాకా ఆయన ఇంతవరకూ నాకు చీర కొన్నది లేదు. అలాంటప్పుడు పెద్దమ్మకి వెయ్యి పెట్టి చీర కొనడం తప్పెలా అవుతుంది? ‘కృష్ణారెడ్డిలా నా జీతం ఇరవై వేలు కాదు. ఇంటి అద్దె, కరెంటు కలిపి ఆరువేలు’ అంటూ ప్రతిసారీ నస. వినీవినీ విసుగు పుడుతోంది. ‘ఆవిడ స్థోమతని బట్టి నీకు చీరలు కొనిస్తారు. మన స్థోమతను బట్టి మనం కొనిపెట్టాలి. మా అమ్మకి గానీ, అక్కకి గానీ ఇంతవరకూ 500 రూపాయల చీరను మించి పెట్టలేదని నీకు తెలుసుగా. వాళ్లకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే..? ఎవరో ఎందుకు అమ్మ రాగానే నువ్వే గొప్పగా ‘మా పెద్దమ్మకి వెయ్యి పెట్టి చీర పెట్టేన’ని చెప్పేస్తావు. అప్పుడు వాళ్లు ఎలా ఫీలవుతారు?’ అంటూ బోడి వెయ్యి కోసం సహస్రనామార్చన చేసేశారు. ఇలా మాటలంటుంటే ఎలా పడను? పోనీ నేను కూడా జాబ్ చేస్తానంటే ఒప్పుకోరు’ చిరాగ్గా అంది.
‘నువ్వు ఇంటికి పో. వాడికి ఫోన్ చేసి పిలిచి నేను మందలిస్తాను. దాని మనసు సున్నితం. కరకుగా మాట్లాడవద్దని చెపుతాను. సాయంత్రం నిన్ను నవ్వుతూ పలకరిస్తాడు. నువ్వు ఉదయం గొడవ మరచిపోయి మంచి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పాలి. కోపం కొద్దిసేపుంటే ఉత్తములని, రెండు రోజుల వరకూ వుంటే మధ్యములని, ఇంకా ఎక్కువుంటే అధములని అంటారు. నువ్వు ఒకటో కేటగిరీకి చెందాలి’ నచ్చచెప్పి పంపాను వైదేహిని.

- కోట సావిత్రి, విజయవాడ.

పుస్తక పరిచయం

సామాజిక సంఘర్షణల వేదిక... ‘తెలుగు కథానిక’

‘తెలుగు కథానిక-2014’
సంపాదకులు:
ఎంఆర్‌వి సత్యనారాయణమూర్తి,
పుటలు: 248. వెల: రూ.150/-
ప్రతులకు: ఎం.రాజేశ్వరి, జె.వి.ఎల్.రావు నగర్,
పెనుగొండ - 534320, ప.గో. జిల్లా
ప్రతి సంవత్సరం వివిధ పత్రికల్లో వందలాది కథలు ప్రచురితమవుతున్నాయి. కొన్ని సంకలనాలు, సంపుటాలుగా వన్నాయి. కాని చాలా కథలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో కొందరు కథాప్రియులు, కథా రచయితలు, సాహిత్య సంస్థలు ఆ సంవత్సరంలో వచ్చిన ఉత్తమ కథలు కొన్నిటిని ఏరి ‘కథా వార్షికలు’ వెలువరిస్తున్నాయి. అలా చెయ్యడం వల్ల ఆయా సంవత్సర కాలంలో జరిగే వివిధ పరిణామాలు, ఆనాటి పరిస్థితులు, సంఘటనలు, జీవన నాగరికతలో ఏర్పడ్డ మా ర్పులు భవిష్యత్ తరాల వారికి తెలియజేసి వాళ్లు నాటి కాలానికి, అప్పటి కాలానికి వచ్చిన తేడాలను బేరీజు వేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికీ రెండు మూడు సంస్థలు ఇలాంటి కథా వార్షికలు టంఛనుగా వెలువరిస్తూ అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. ఈ కోవలో ఇప్పుడు మరో సాహితీ సంస్థ ప్రవేశించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో కవితా సంకలనాలు, కథా పారిజాతాలు, ఉత్తమ కథలకు, కవితలకు జాతీయస్థాయి పురస్కారాలిస్తూ వస్తూన్న పెనుగొండకు చెందిన ‘రమ్యసాహితి’ సంస్థ ఇప్పుడు కథా వార్షికలను పోలిన ‘తెలుగు కథానిక - 2014’ను ప్రచురించి, ఒక సంవత్సరకాలంపాటు వచ్చిన ఉత్తమ కథలను తెలుగు పాఠకులకు అందించే బృహత్తర బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుంది. ఈ సంస్థకు అధ్యక్షులైన ఎంఆర్‌వి సత్యనారాయణమూర్తి సంపాదకత్వంలో వెలువడిన ఈ ‘కథానిక’ 2014 సంవత్సరంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథలను వడబోయగా, ఈ సంస్థ వారికి వచ్చినవి, నచ్చినవి, మెచ్చినవి కేవలం 24 కథలు మాత్రమే మిగిలాయి! ఇందులో ప్రచురించిన ఈ 24లో కూడా మళ్లీ వడబోస్తే, ఐదారు కథలు మాత్రం అత్యద్భుతంగా... పాఠకుల మనస్సులను హత్తుకునే విధమైనవిగా నిలుస్తాయి. అవి - రంగనాథ రామచంద్రరావు రచన ‘అడవి పిలిచింది’, డా. దిలావర్ రచన ‘పాటకు మరణం లేదు’, జయంతి పాపారావు రచన ‘జీవన సౌందర్యం’, విఎస్ పాణి రచన ‘ది వైట్ టైగర్’లను చెప్పుకోవచ్చు. ‘అడవి పిలిచింది’ కథలో అతను ఉన్నతికి సహకరించిన ఆవును ముసలిదైపోయిందని కొడుకు అమ్మేయ్యడానికి ప్రయత్నిస్తే, ఆ తండ్రి ఒప్పుకోకపోగా చివరికి ఆ ఆవుతో పాటు ఇల్లొదిలి అడవికి పోవడం... చెప్పడం కంటే ‘చదివితే మనస్సు ద్రవించకమానదు. ‘పాటకు మరణం లేదు’ కథ ఒక పల్లెలోని పాటగాడిని ఉద్యమకారుడిగా చిత్రించి పోలీసులు అతని కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన తీరు పాఠకుడి మనసుని కదిలిస్తుంది.
‘ది వైట్ టైగర్’ కథలో ఒక మధ్యతరగతి జీవితం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఏవిధం గా మదనపడి, జూలో పులికి ఆహారంగా.. ఆత్మహత్య చేసుకుంటే.. పులిముందున్న అతని ప్రవర్తన, మనసులో చెలరేగే సంఘర్షణ, భయం ఎలా ఉంటాయో, అతి భయంకరంగా కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత. జానపద కళాకారుల జీవితాల్లో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వాళ్ల బతుకుల్లో ఎంత వెలుగుల్ని, ఆనందాల్ని అందించగలవో ఐతా చంద్రయ్య రాసిన ‘పొద్దు తిరిగింది’, త్యాగం, ప్రేమను మిళితం చేసి చూపిన పిడుగు పాపిరెడ్డి ‘సినక్క’... ఇలా ప్రతి కథా ఏదోఒక సామాజిక సంఘర్షణను ఆవిష్కరించి, మనస్సుకు హత్తుకునే, కళ్లు ఒత్తుకునేవిగా ఈ ‘తెలుగు కథానిక-2014’లో చోటుచేసుకున్నాయి. సంపాదకులు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా వచ్చే ఏడాది కూడా మరిన్ని మంచి కథలతో కాలాన్ని రికార్డు పరుస్తారని ఆశిద్దాం.

- చలపాక ప్రకాష్, విజయవాడ.
చరవాణి : 9247475975

మనోగీతికలు

చెక్కని శిల్పాలు
చరిత్ర గతానుగతం నుండి తొంగిచూస్తూ
వర్తమానాన్ని ఆవహిస్తుంది
విక్రమిస్తున్న పుస్తకీకరణతో
అక్షర అనుబంధం పెనవేసుకుంటోంది
సాంస్కృతీకరణ ప్రాంగణాల చుట్టూ అగడ్తలు
నిర్మించుకుంటూ అవ్యక్తీకరిస్తోంది
అడుగుల సవ్వడుల అనుకరణ అందిబుచ్చుకుని
ఆవిష్కరణ పర్వాలు తెరమీదకొస్తున్నాయి
తవ్వినదానినే తవ్వుకుంటూ
తరచినవాటినే తరచుకుంటూ
పరిశోధనల ఆత్మోదయానికి
అవధుల పరిధుల నుండి
ఉపాధుల ఉద్యమానికి ఊపిర్లు పోస్తోంది
రిక్తహస్తాల నీడన శుష్కించుకుపోతున్న ‘శోధన’
ఉన్న తలకు పరిక్రమణ తలపాగాలు చుడుతోంది
అమర్చబడిన పదబంధాల నుండి
స్థానభ్రంశం చెందిన పంక్తులు
పరమపద సోపానంపై పరిఢవిల్లుతున్నాయి
అంతర్జాలాల అంతరాల సంగ్రహణా మేథ
మేనాలెక్కి మేజువాణీ జరుపుకుంటోంది
గతితార్కిక వాదాన్ని యుక్తిమథనంతో
సాధన చమత్కారాల తళుకుల చమక్కే
శాస్ర్తియ నిర్దేశవౌతోంది
ఆర్భాటాల కోట నిండా గబ్బిలాల దండు
మెదళ్లు వేల్లాడేసుకుని అరికాళ్లతో
అవకాశాల ఆకాశాన్ని అడ్డుకుంటోంది
అక్షరాలను తూకం వేస్తూ గురుత్వం
గుజ్జనగూళ్లు కట్టుకుంటున్న
బజ్జల వక్రనేత్రం అక్రమార్కుల
ఆలింగనంలో ఆవలిస్తోంది
విజ్ఞాన ఘనులు శృతి చేసిన విశ్వాంతర
విద్వత్ తంత్రుల విహాయస విపంచి
వస్తు ప్రదర్శనశాలను అలంకరించింది
అవరోహణలో దిశాసూచిక
పాతాళ పరిష్వంగానికి ఆయత్తమైంది
కృతక జ్ఞానదీప మిణుగురుల ఎకసెక్కాలకు
సిగ్గుల చితి పేర్చుకుని ప్రతిభ ఆత్మాహుతి చేసుకుంది
గణనీయమైన గుణాంకాలతో జేబులు నింపుకుంటూ
ఆచారత్వపు ఆలంబన విశిష్ఠ వేదిక
గంతలు కట్టుకుంది
నిజాయితీ దర్పణం ప్రతిబింబిస్తున్న
వికార ఆకారం రంగులు దిద్దుకుంటోంది
పర పాలన పరపీడన ఆనవాళ్లు చెరగిపోయినా
సొంత గొంతుకలను నొక్కేసే స్వార్థచింతన
ఊడలుదిగి ఊపిర్లు తీస్తోంది
నవ్య ప్రమాణాల ఆవిష్కరణలకు
పురిటిలోనే ఆయువు తీరుతోంది
చెక్కని శిల్పాల చెక్క్భజన బృందాలకు
పీఠాధిపత్యం కట్టబడింది
మొక్కితేనో మొక్కుబడులు చెల్లిస్తేనో
అభిజాత్యానికి అంతరాత్మను ఆహుతిస్తేనో
పరిశోధన ‘పరిశీలన’ లేకుండానే
పురుడు పోసుకుంటుంది!

- బిఎస్ నారాయణ దుర్గా భట్టు,
బాపట్ల, గుంటూరు జిల్లా.

స్ర్తి సూక్తము
ఉ. భారత జాతి గౌరవము - పావనమైన భవత్ప్రవర్తనా
ధారితమైజెలంగెడిని - దారుణమైన విదేశ దుష్ట్ధా
చారిణివై మెలంగకు ప్ర-శస్తముతామన కట్టుబొట్టులన్
ధారణ సేయుమమ్మ భరతక్షితి పేరును నిల్పుసోదరీ!

మ. మెడలో తాళిని ఎక్కడుంచితివహో, మీగాళ్లపైదాకనా
పడతుల్ వస్తమ్రులన్ ధరించడము - బీభత్సమ్ముగా జుత్తున
ల్లడమేలేక విరుంగబోసితివి నీ-లాలిత్యమేమాయెనొ
క్కడుగానీ నిను గౌరవించునటనే - కాంతా యిదేమందమే!

శా. భ్రూమధ్యమ్మున బొట్టుబెట్టుకొని మె-ళ్లోతాళి వ్రేలాడగా
సీమంతమ్మున కుంకుమల్దుకొని రా-శీభూత హిందూత్వమై
‘శ్రీమాత్రేనమ’యంచు అక్కయని చె-ల్లీయంచు సత్పూరుషుల్
నీ మాంగల్యమె దేశరక్షయని త-న్వీ నిన్ను గొల్వన్ వలెన్

మ. సతిగా భర్తకు సేదదీర్చవలె నీ-సంతానమున్ దల్లివై
సతతమ్మాలన సేయగా వలయుని-స్వార్థమ్ముగా సేవికా
వ్రతవైదీనులనుద్ధరించవలె వా-ర్ధక్యమ్మునందున్న నీ
పతి తల్డండ్రుల సేవ జేయవలె దై-వారాధనా దృష్టితో..

- డా. మాదిరాజు రామసుందరావు, చరవాణి : 9441026360

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

email: merupuvj@andhrabhoomi.net

- కాకుమాను శ్రీనివాసమూర్తి