వినదగు!

ఇంద్రియ భోగం నాయక శోభ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని ఆలోచనలు, ఇంకొన్ని సూచనలు, మరికొన్ని దృక్పథాలు... వెరసి నాయకత్వ ప్రతిభ. ఈ ప్రతిభకు అక్షర దర్పణం భగవద్గీత. ముఖ్యంగా సమకాలీన నాయకత్వానికి కావలసిన లక్షణ తరంగాలపైన మనం ప్రయాణించగలిగితే కృష్ణోపదేశంలో అంతర్లీనంగా వలసినంత నాయకత్వ చైతన్యం మనల్ని తడుపుతుంది. మోడర్న్ డే లీడర్‌కి కావలసిన ‘మేనేజిరియల్ కాన్షియస్‌నెస్’ గీత నిండా పరచుకుని కనిపిస్తుంది. అయితే ఆ నాయకత్వ ప్రతిభ మానవత్వాన్ని పొదువుకుని దర్శనమిస్తుంది. అది అధిభౌతిక చైతన్య ప్రతిభలా అనిపించే సమకాలీన భౌతిక నాయకత్వ చైతన్య ప్రభనే.
నిజానికి నాయకత్వం ఒక వృత్తి జీవనం.. అయితే అది సేవక ప్రవృత్తితో ముడిపడినటువంటిది. ఏదో ఉద్యోగ రీత్యా కొన్ని గంటలు వృత్తికి అంకితమై పోవడం కాదు.. జీవితమే నాయకత్వ లక్షణానికి అంకితమై పోవాలి. జీవన గమనం నాయకత్వ ప్రవృత్తితో మిళితమైపోయి, నాయకత్వం తప్ప మరొకటి ఈ జీవితానికి సరితూగదన్న ‘సెల్ఫ్ ఎస్టిమేషన్’ సాధ్యం కావాలి. హృదయ దౌర్బల్యం లేని తత్వం వల్లనే ఈ సెల్ఫ్ ఎస్టిమేషన్ సాధ్యవౌతుంది.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం ప్రోది అవుతుంది. యుద్ధం చేయటం అర్జునుడి క్షాత్ర ధర్మం అన్నట్టుగా సేవకత్వం నాయక ధర్మం. కాబట్టి నాయకుడికి సేవక చింతన తప్ప మరో చింతన అనవసరం.
ఇక, నేల విడిచి సాము చేయటం నాయక లక్షణం కారాదు. నాయకులుగా రాణించాల్సిన సమాజంలో... ఈ సమాజానికంటూ కొంత సంస్కృతి, కొన్ని ధర్మాలు, కొన్ని విలువలు ఉంటాయి. కాబట్టి సాంస్కృతిక వారసత్వంలో వొదిగిపోవటం అవసరం... సంస్కృతికి సంబంధించిన అంతర్దృష్టి అవసరం... అప్పుడే అర్థవంతమైన నాయకత్వం సాధ్యవౌతుంది. ఇలా మనలోని ప్రతి ఒక్కరం నాయకులం కావాలంటే కేవలం లీడర్‌షిప్ స్కిల్స్ అంటూ క్లాస్‌రూమ్‌లో పాఠాలు నేర్చుకుంటే సరిపోదు. మనలోని ప్రతి ఒక్కరం ఒక్కో సెల్ఫ్ మాస్టరీ క్లాస్ కాగలగాలి. కాబట్టి కృష్ణోపదేశం తరగతి గదిలో చెప్పిన పాఠం కాదు.. విన్న పాఠమూ కాదు. అది అర్జునుడ్ని చైతన్యపరచి సెల్ఫ్ మాస్టర్‌ను చేసిన జీవన వేదం.
అసలు, ఏకలవ్యుడికి పాఠం ఎవరు చెప్పారు? అదీ సెల్ఫ్ మాస్టరీ అంటే. తాత్కాలికంగానైనా హృదయ దౌర్బల్యానికి వశమైన అర్జునుడ్ని మరోమారు సెల్ఫ్ మాస్టరీ క్లాస్‌కి పంపించటమే కృష్ణుడు చేసిన గీతోపదేశం. ఆ ఉపదేశం నుండి అర్జునుడు ‘సెల్ఫ్ మాస్టర్’ కావటమే కృష్ణుడు ఆశించింది.
ఏ గ్రంథమైనా కొన్ని వందల, ఏళ్ల కాలానికి ఎదురు నిలిచి నిలబడగలుగుతోందంటే అది ఏ ఒక్క కాలానికో, ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వ్యవస్థకో పరిమితమైందని కాదు. ఆ గ్రంథ విస్తృతికి ఎల్లలు ఉండవు.. ఏ పరిధులకు వొదిగేది కాదు. కాబట్టి భగవద్గీతను ఒక్క మన భారతదేశ సంపదగానో, ఒక్క హిందూమత గ్రంథంగానో పరిగణించటం తగద.. అది విశ్వరచన.
ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా, ఇరువర్గాల మధ్యనైనా, రెండు సమాజాల మధ్యనైనా, రెండు దేశాల మధ్యనైనా ‘పోరు’ సంభవిస్తే గెలుపొందేది ఒక్కరే... ఒక్కటే. అయితే ఆ ఒక్కటీ నిలబడాలంటే మానవీయ దృక్పథాలు, మానవీయ విలువలు ముఖ్యం. ఇక్కడ అంటే ధర్మం విషయంలో మూఢచిత్తం పనికిరాదు... సెల్ఫ్ మాస్టరీ కావాలి. దీనే్న ఈ రోజు మనం ‘క్వాలిటీ మేనేజ్‌మెంట్’ అని చెప్పుకుంటున్నాం. కాబట్టే కృష్ణోపదేశంలో మనకు కేవలం అడ్వైజ్ అండ్ డైరెక్షన్ మాత్రమే కనిపించవు. అందుకే అర్జునుడు కృష్ణుడిని ఒక మేనేజర్‌గాను, ఒక లీడర్‌గాను, ఒక కన్సల్టెంట్‌గాను చూడగలిగాడు. ఈ మూడు కోణాలలోనే అర్జునుడు కృష్ణుడ్ని అనుశీలించటం జరిగింది. ఫలితంగా మనకు కృష్ణోపదేశంలో ‘మోరల్ గైడెన్స్’ కనిపిస్తుంటే నాయకుడైన అర్జునుడికి దానివల్ల ‘సిస్టమాటిక్ అండర్‌స్టాండింగ్’ సాధ్యమైంది.
నాయకుడికి తాను నిర్వహించాల్సిన పాత్ర, తన బాధ్యత స్పష్టంగా తెలిసి ఉండాలి. మలి అడుగు విచక్షణతో పడాలి... మూడో అడుగు తిరుగులేని పోరాట తత్వంతో కార్యాచరణ అయి ఉండాలి. ఇక నాలుగో అడుగు నాలుగువైపులా మంచిని నిలబెట్టటానికే అయి ఉండాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే నిస్వార్థం అవసరం. దీనే్న మనం ‘సెల్ఫ్‌శాక్రిఫైజ్’ అంటాం. ఇక్కడ సెల్ఫ్ శాక్రిఫైజ్ అంటే తనను తాను త్యజించటం.. అంటే తన బాగుకోసమే కాక పరుల బాగు కోసం పరిశ్రమించటం.
నాయకుడి చూపు నేలకు అతుక్కుపోయి ఉంటే చూపు ప్రసరించేది కొంతమేరకే. అదే తలెత్తి చూపును ఆకాశం వైపు నిగిడించగలిగితే కనిపించేది సువిశాల ఆకాశం... నక్షత్రాలు, గ్రహ మండలాలు.. ఖగోళం. అంటే కనిపించే భూమిపైన అనంత పాత్ర పోషించవలసి ఉంటుంది. కనిపించే బాంధవ్యాల మధ్యనే కాక అల్లుకుపోయిన ప్రతీ బాంధవ్యమూ బాధ్యతగా పరిణమిస్తుంటుంది. దీనే్న కృష్ణుడు ‘స్వాభావిక కర్మ’ అంటాడు. అయితే ఈ స్వకర్మనిరతికి విధి నిర్వహణ ఎంతో ముఖ్యం.
‘శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్’ - పరధర్మంతో మనం ఎంతలా తలమునకలై కలగని ప్రయోజనం కాస్త దోషభూయిష్ఠమైనదైనప్పటికీ స్వధర్మాచరణే మిన్న అన్నది కృష్ణ ఉవాచ. ఇంకా మనం పాపం పుణ్యం అని కొట్టుకుంటున్న మనస్తత్వంతోనే జీవిక సాగిస్తుంటే ‘స్వభావ నియతం కర్మ కుర్వన్నా ప్నోతి కిల్బిషమ్’ అంటూ స్వధర్మాచరణలో మనకు ఎటువంటి పాపమూ సంప్రాప్తించదని కాస్త ఆశ చూపిస్తాడు.
అయితే ఈ ‘ఆశ’కే కట్టుబడిపోయిన నేటి నాయకులు పరధర్మాన్ని పాతరేస్తున్నారు. కారణం - హింస, మోసం, చౌర్యం, అబద్ధం, కపటం అనేవి స్వధర్మ లక్షణాలు కాదని తెలుసుకోలేక పోవటం వల్లనే. ఇలా తప్పుదోవ పట్టకూడదనే గీతాచార్యుడు ‘నైష్కర్మ్య సిద్ధి’ అని అంటాడు. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేకుండటం.. అంటే ఇంద్రియ భోగాలపై అనురక్తుడు కాకుండటం. విగత స్పృహతో జితాత్మ కావటంవల్ల నైష్కర్మ్య సిద్ధి సాధ్యమవుతుంది.
ఇప్పటి నాయకులను చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపించే అంశాలు - తన అవసరానికి ఈ రోజు ఈ రాజకీయ పార్టీ ఇంట, రేపు మరో రాజకీయ పార్టీ ఇంట, మూడోనాడు ఇంకో రాజకీయ పార్టీ ఇంట. అంటే తన మనుగడ, స్వప్రయోజనం స్వధర్మం అవుతోందే తప్ప తన సమాజ ధర్మం స్వధర్మం కావటం లేదు. వ్యవస్థాగత చైతన్యంతో నాయకుడిగా రాణించటానికి బదులు వ్యక్తి ధర్మంతోనే నాయకుడిగా చలామణి కావటం ఎక్కువవుతోంది. కృష్ణుడు చెప్పిన స్వధర్మం అంటే ఇటువంటి వ్యక్త్ధిర్మం కాదు.. వ్యవస్థా ధర్మమే స్వధర్మం కావాలని. కారణం నాయకుడి అడుగుజాడలలోనే అనుచర వర్గం అడుగులేస్తుంటుంది కాబట్టి స్వార్థం, స్వధర్మం కాదని కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. అంతేకానీ ఈ రోజు ఈ ఇంట తలదాచుకుని రేపు మరో ఇంట తలదాచుకోవటమంటే స్వధర్మం ముందు తలదించుకున్నట్టే... స్వసమాజం ముందు తలెత్తుకోలేనట్లే.
* నాయకత్వానికి వెన్నుదన్ను కార్యాచరణ.
* సామూహిక చైతన్యంతో అడుగులేయటమే స్వతంత్రత.
* సానుకూల వాతావరణంలో తాత్సారం పనికిరాదు.
* ఈ రోజు ముందుండకపోతే రేపటికి వెనకపడక తప్పదు.
* సంపూర్ణ ప్రాతినిధ్యంతో వర్తించాలి.. అంటే అగ్రెసివ్ యాక్షన్ ముఖ్యం.
* అవసరానికి పూనుకోకపోవటం అపజయం క్రిందే లెక్క.
* కావలసింది డిగ్రీల కొలమానాలు కాదు.. విచక్షణ.
* బాహ్యప్రేరణ ఒక్కటే సరిపోదు... ఇన్నర్ విస్‌డమ్ కావాలి.
* టీమ్ ఆసక్తులే మన ఆసక్తులు కావాలి. అప్పుడే బెటర్ అచీవ్‌మెంట్ సాధ్యం.
* అసహ్యించుకోవటం అంటే అహంకరించటమే.
* కోపగించుకోవటం కాదు.. క్షమాగుణం అవసరం.
* స్వప్రయోజనాన్ని అంటే సెల్ఫ్‌గెయిన్ ఆశించకపోవటమే హ్యూమనిస్టిక్ లీడర్‌షిప్.
‘అహింసా సత్యమక్రోధః త్యాగః శాన్తిరపైశునమ్
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్
తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా’
అంటుంది గీత.
అంటే-
* మన చూపు చేతగాని, మన మాట చేతగాని, మనచేత చేతగాని, మన ఆలోచనా చేతగాని - ఇలా ఏ విధంగాను ఇతరులను బాధించకపోవటం నాయకుడికి ఉండవలసిన అహింసా లక్షణం.
* ప్రియభాషణం, ఇతరులను నొప్పింపకుండటం, ఉన్నదున్నట్లు మాట్లాడటం సత్యభాషణం.
* ఇతరులు మనకు హాని తలపెడుతున్నా కోపగించుకోకుండా ఉచిత వర్తనం కావటం అక్రోధం.
* కర్తృత్వ అభిమానాన్ని వదులుకోవటం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండటం త్యాగం.
* చంచల స్వభావం లేకుండటం, నిశ్చలత్వానికి ప్రతీకగా ఉండటం శాంతం.
* ఇంద్రియ విషయ సంయోగంలో ఆసక్తి లేకుండటం అంటే ఉదాసీనత్వం అలోలుప్త్వం.
* అనవసరమైన వాటిపై దృష్టి కేంద్రీకరించకపోవటం అచాపలం.
ఇక, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నట్టుగా - తేజస్సు, క్షమ, ధైర్యం, శౌచం, అద్రోహం అనే అయిదు లక్షణాలు నాయకుల పాంచభౌతిక వర్తనాన్ని ప్రకాశింపజేస్తుండాలి.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946