వినదగు!

నాయక అహం పరోపకారార్థమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకల్పించటం నాయక తత్వం. అయితే ఆ సంకల్పాలు కార్యాచరణలో కొత్త పుంతలు తొక్కుతుంటాయి. కొన్ని మసిబారుతుంటాయి. కొన్ని కాంతి కాగడాలవుతుంటాయి. కాబట్టి సంకల్పించినవన్నీ ఆచరణలో ఫలవంతమవుతాయనుకోవటం పొరపాటు. కొన్ని సాధ్యం కావచ్చు. కొన్ని సాధ్యం కాకపోవచ్చు. అయితే ఈ సాధ్యాసాధ్యాలను బేరీజు వేయటంలోనే నాయకత్వ ప్రతిభ దాగి ఉంది.
ఇక్కడ, బేరీజు వేయటం అంటే సంకల్పానికి సంయమనం జత కలవటం అంటే, టీచర్‌లో స్టూడెంట్ ఉండాలి.. మాస్టర్ మీడియమ్ కావాలి... గురువు శిష్యుడు కావాలి.. సింపుల్‌గా చెప్పుకోవాలంటే - గురువు గురువుగానే కాక శిష్యుడిలా ఆలోచించాలి. టీచర్ స్టూడెంట్‌లో పరకాయ ప్రవేశం చేయాలి. యోగీశ్వరులు సైతం నిత్య సాధకులు కావాలి. అప్పుడే గురు శిష్యుల మధ్య సఖ్యత, సమమైత్రి సాధ్యమవుతుంది.
ఈ సఖ్యతకు, సమ మైత్రికి సంతకం అవసరం లేని గురుశిష్యులు కృష్ణార్జునులు. సామాన్యంగా గురువు అన్న వెంటనే మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ చోటు చేసుకుంటాయి. ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కళ్ల ముందు తారాడుతుంది. గురువు అనే ఆకర్షణ ఒక చైతన్య జ్వాలగా శిష్యుడిలో పదిలమై పోతుంది.
ఆ చైతన్య జ్వాలనే శిష్యుడిలోని నెగెటివిటీని, బలహీనతల్ని కాల్చివేసి పారదర్శకతను, పాజిటివిటీని నింపుతాయి.
కాబట్టి అనుచరులలో నెగెటివిటీ అన్నది ఒక కామన్ ఫాక్టరే. అయినా, నాయకుడు మాత్రం ఎప్పటికీ పాజిటివ్‌గానే ఉండగలగాలి. అలా పాజిటివ్‌గా ఉండే తత్వాన్ని, పారదర్శకత్వాన్ని వదలుకోని నాయకులను అనుచరులూ ఎన్నటికీ వదులుకోరు. అంటే నాయక - అనుచరుల మధ్య ఒక అర్థవంతమైన బంధం బలీయమైనట్లే. ఇలా గురుశిష్యుల మధ్య ‘దగ్గరితనం’ నెలకొని ఉంటుంది.
మొత్తానికి పాజిటివిటీకి గల ‘ఇనె్టన్సిటీ’తో సహచర్యం చేసేవాడు గురువు.. లీడర్. కాబట్టే, గురువైనా, మాస్టరైనా, నాయకుడైనా, టీచరైనా తమ శిష్య సంతతిలో సమూల మార్పులు తేగలుగుతున్నారు. కర్తవ్యోన్ముఖుల్ని చేయగలుగుతున్నారు... కర్తవ్య పరాయణతతో చరించగలుగుతున్నారు... శిష్యుల సత్ఫలితాలకు మంచి కాగడాలవుతున్నారు.
ఒక్కసారి భగవద్గీతలోని దశమాధ్యాయ 37వ శ్లోకాన్ని చూడండి - నాయకతత్వం సంపూర్ణంగా సుబోధకమవుతుంది.
‘వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః
మునీ నామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః’
ఇక్కడ ‘వృష్ణీనాం వాసుదేవోస్మి’ - వృష్ణి అంటే యాదవ వంశం. ఆ వంశంలో కృష్ణ జననం వాసుదేవ సుతునిగానే.. ‘మునీనా మప్యహం వ్యాసః- మునికులంలో ఆ కృష్ణుడే వ్యాసుడు.. ‘కవీనా ముశనా కవిః’ -త్రికాలవేత్తలలో ఆ కృష్ణుడే శుక్రాచార్యుడు.. పాండవానాం ధనంజయః’ - పంచపాండవులలో అటువంటి కృష్ణుడే అర్జునుడు. స్వయంగా కృష్ణుడే అర్జునుడితో అన్న మాటలు ఇవి.
కాబట్టి, అనుచరులలో నాయక అంశం ఉండే తీరుతుంది... శిష్యుడిలో గురుతత్వం కలబోసి ఉంటుంది.. భక్తుడిలో నగవంతుడు కలనేతగా ఉంటాడు. కాబట్టి, కృష్ణుడికి అర్జునుడికి మధ్యనున్న ‘దగ్గరితనం’లో ఏ మాత్రం ఎడబాటు లేదన్నది స్పష్టం. ఇద్దరిదీ త్వమేవాహ స్థితి. కాబట్టి, నాయకుడనే వాడు అనుచరుడిలో మూర్త్భీవించిన నాయకతత్వమై ఉండాలి.
నిజానికి, కృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ అసలు సిసలు నాయకుడు కాదని ఎవరమూ అనలేం.. కారణం-
‘దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్
వౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవలతా మహమ్’
అంటే ‘శిక్ష’తో ‘క్రమశిక్షణ’ను అందించే క్రమంలో దండాన్ని నేనే. విజయ దుందుభికి మూలమైన ‘నీతి’ని నేనే... రహస్యాన్ని రహస్యంగా పదిలపరిచే మార్గంలో ‘వౌనాన్ని’ నేనే... జ్ఞాన సంపన్నుల ‘జ్ఞానాన్ని’ నేనే - ఇదీ కృష్ణుడి నాయకత్వ శోభ. ఇలా కృష్ణుడిలా నాయకుడన్న వాడు సర్వవ్యాపి, సర్వసాక్షి అయి ఉండాలి. అంటే నలుగురి మధ్యకూ వెళ్లగలిగిన వాడు, నలుగురికీ అండగా ఉండగలిగేవాడే నాయకుడు.
* * *
నాయకుడు అంటేనే తనదైన తత్వానికి మూర్తరూపం. అంటే ఆంతరిక ప్రవృత్తే బాహిర కర్మాచరణకు మార్గం చూపుతుంది. ‘ఇన్నర్ రిసోర్సెస్’ను సక్రమంగా సద్వినియోగించుకో గలిగితే ‘సత్ఫలితం’గా ప్రకాశితమవుతుంది. అంతశే్చతన, అంతశ్శక్తితో నాయకుడు ఆత్మనిగ్రహం కలవాడు అయి ఉండాలి. నిజానికి, సెల్ఫ్ కంట్రోల్‌తోనే నాయకుడు సంయమనశీలి అవుతాడు... కోరికల పుట్ట కాకుంటే చాలు విజయం తన దగ్గరతనంలోనే ప్రకాశిస్తుంటుంది.
ఇక, సర్వవిధాలా, సర్వప్రకారంగా తానే కారణం కావటం అన్నది తొలి నాయక లక్షణం. ఫలితం ఏదైనా, ఎటువంటిదైనా దాని భారాన్ని వహించే బలం నాయకుడి వశమై ఉండాలి.. మోహ - వ్యామోహ పీడితుడు కాకుండాలి.
మోహపాశం లేని నాయకులకు అనుచర వర్గమంతా మానసపుత్రులే. అంటే, మనసా, వాచా, కర్మేణా నాయకుడిని ఔదలదాల్చేవారే అనుచరులు. కృష్ణుడు నుడివిన ‘మద్భావా మానసా’లోని అంతరార్థం ఇదే. ఇలా నాయకుడు పాలనాదక్షుడు, ప్రభువు, విచలిత యోగసంపన్నుడు అవుతున్నాడు.
‘అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే’ అన్నది కృష్ణ ఉవాచ. అంటే నాయకుడికి అనుచర వర్గ చైతన్యమంతా తన నుండి ఉత్పన్నమైనదే.. తానే ఈ కార్యాచరణకు ఉత్పత్తి స్థానం అన్న ‘అహం’ ఉండి తీరుతుంది. అహం, పరోపకారార్థమే తప్ప స్వార్థపూరితం కాదు. నిస్వార్థత ఎప్పుడు సాధ్యం అంటే ‘మచ్చిత్తా’ - నాయకుడిపై అనుచరవర్గ మనస్సు కేంద్రీకృతమై ఉన్నప్పుడే. అప్పుడే నాయకుడు తన అనుచర వర్గాన్ని అజ్ఞానం నుండి దూరం చేయగలడు. వివేక జ్ఞానంతో వారిని జ్ఞానమూర్తులుగా ఆవిష్కరించగలడు.
ఈ నేపథ్యంలో మనకొక ప్రశ్న తలెత్తుతుంది. అనుచరులు నాయకుడిని శిరసా వహిస్తేనే కదా ఇదంతా సాధ్యం - అని. అర్జునుడికి కృష్ణుడిపై ‘స్వయమేవా త్మనాత్మానం వేత్థత్వం’ స్వయం ప్రకాశితుడనే సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టే ‘సర్వమేతదృతం మనే్య యన్మాం వదసి’ తన గురించి చెప్తున్న కృష్ణుని వచనాలను సత్య సమ్మతాలుగా అంగీకరించగలిగాడు.
మొత్తానికి కృష్ణ గీతలోని నాయక తత్వాన్ని ఇలా అర్థం చేసుకోగలగాలి.
* అనుచరులలోని ఆత్మ నాయకుని అంశ అయి ఉండాలి. అంటే నాయకుడిని అనుచరులు ఆత్మపూర్వకంగా అంగీకరిస్తుండాలి.
* ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానా మస్మి చేతనా’ -అనుచర వర్గ ఇంద్రియ సంపన్నమైన మనస్సు, వారి చైతన్యమూ నాయకుడి సంపదలోనివే.
* * *
ఇలా, కృష్ణుడ్ని స్నేహితుడిగానే కాక, ఆత్మీయుడిగానే కాక ఆత్మసంపన్నుడిగాను, పరమాత్మగాను, పురుషోత్తముడిగాను, గురువుగాను, కురుక్షేత్రం నుండి తనను విజయుడ్ని చేయగల నాయకుడిగాను అంగీకరించటం, విశ్వసించటం అన్నది అర్జునుడికి సాధ్యమైంది. మనస్సు, హృదయం, స్వ ఇచ్ఛ కూడబలుక్కున్నాయి. కాబట్టే అర్జునుడు శ్రద్ధాళువు కాగలిగాడు. పైగా కృష్ణుడిలో ధర్మాధికారిని చూడగలిగాడు.
అప్పుడు తప్ప అర్జునుడు తన ‘హృదయ దౌర్బల్యం’ నుండి బయటపడలేక పోయాడు. తనలోని బలహీనతని పసిగట్టి, ఆ బలహీనతని తప్పించి శక్తి సంపన్నుడ్ని చేయగల నాయకుడ్ని తన రథసారథి అయిన కృష్ణుడిలో చూడగలిగాడు. కాబట్టే అర్జునుడు మళ్లీ యుద్ధ సన్నధుడయ్యాడు. కృష్ణుడు సైతం అర్జునుడ్ని తన నాయక ప్రతిభతో యుద్ధోన్ముఖుడ్ని చేయగలిగాడు. అంటే, కృష్ణుడు నాయకుడిగా అర్జునుడిలోని నాయకుడ్ని వెలికితీసి విజయుడ్ని చేయటం అంటే నాయకుడిగా తానూ విజయుడైనట్లే!

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946