వినదగు!

అనుచరుల అంతర్వాణిని వినగలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మతః సిద్ధించింది జ్ఞానం.
జీవన పోరాటంలో అంది వచ్చింది విజ్ఞానం.
ఇహ పర జీవన సాధనా ఫలితం ప్రజ్ఞానం.
అంటే, సంపూర్ణ పరిణితి విస్తృత సంకేతం ప్రజ్ఞానం.
ఇటువంటి ప్రజ్ఞానమూర్తి గీతా కృష్ణుడు.
కృష్ణుడంటే ది ఎటర్నల్ లీడర్! ఆతడిది ప్రధానంగా ఆపరేషనల్ లీడర్‌షిప్ స్టైల్ - అంటే కార్యాచరణే కృష్ణుడి నాయకత్వ శైలి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే - ఆదేశాలతోకాక అవలోకనతో ఆచరణశీలి అయిన ఆదర్శ నాయకుడు గీతాచార్యుడు.
Great Leaders create a vision, articulate the vision, passionately own the vision and relentlessly drive it. To completion - అన్న నిర్వచనానికి నిలువెత్తు రూపంగా గీతోపదేశ కృష్ణుడు కనిపిస్తుంటాడు. ఒక్క కృష్ణుడనే కాదు కురుక్షేత్రంలో తలపడుతున్న అర్జునుడు, భీముడు, ధర్మజుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు - వీరందరూ గ్రేట్ లీడర్స్‌కి ప్రతిరూపాలే!
వీరెవరికీలేని ఒక నాయక కుణం కృష్ణుడి స్వంతం - అదే సమయస్ఫూర్తి. పాండవులను ఏకత్రాటిపైకి తీసుకురాగల ప్రతిభ, ప్రతిపక్షాలను సైతం సమ్మోహపరచగల కరిష్మా. పాండవ పక్షంలోని అర్జునుడు కానీ, భీముడు కానీ కౌరవ పక్షంలోని దుర్యోధనుడు కానీ, కర్ణుడు కానీ చెదరని లక్ష్యం కలవారే! అయినప్పటికీ తెలివతేటలకు మించిన జ్ఞాన సంపన్నుడు కావటంతో కృష్ణుడు ఎటర్నల్ లీడర్ అయ్యాడు. అవును, కేవలం తెలివితేటలతో రాణించాలనుకునేవారు నాయకులుగానే మిగిలిపోతుంటే, వివేకానికి జ్ఞానాన్ని జోడించిన వారు నాయకులకే నాయకులవుతుంటారు.
కురుక్షేత్రంలోని పాండవపక్ష నాయకులను కానీ, కౌరవపక్ష నాయకులను కానీ పరిశీలిస్తే వారిలో విజువల్ లీడర్‌షిప్ స్టైల్ కానీ, స్ట్రాటజిక్ లీడర్‌షిప్ స్టైల్ కానీ, డైరెక్టివ్ లీడర్‌షిప్ స్టైల్ కానీ, ఆపరేషనల్ లీడర్‌షిప్ స్టైల్ కానీ, కనిపిస్తుంటుంది. లేదా వీటిలో రెండు, మూడు కలగలిసిన స్టైల్ కానీ కనిపిస్తుంటుంది. అయితే, ఈ నాలుగు రకాల నాయక శైలి ఒక్క కృష్ణుడిలోనే మూర్త్భీవించటం వల్ల కృష్ణుడు ఎటర్నల్ లీడర్‌గా అద్వితీయ నాయకుడనిపించుకుంటున్నాడు. అందుకే కృష్ణుడ్ని మనం పురుషోత్తమ నాయకుడిగాను ప్రస్తుతిస్తుంటాం.
* * *
నాయకుడంటే సృజనశీలి, సృష్టికర్త, విశ్వాస ప్రతీక!
అవును, విశ్వాసమే జీవితం.. విశ్వసనీయతే నాయకతత్వం. అసలు, సృజనశీలి నాయకుడు. ఆతడి సృజనలోనే విశ్వసనీయత పాదుకుని ఉంటుంది. ఆ విశ్వసనీయతే పరిణామానికి, పరిణతికి ఆలంబన. ఆ పరిణతిని సాధించటమంటే జీవితాన్ని ఆనందించటమే! ఆ విశ్వసనీయ ఆనంద జీవనానే్న నిస్వార్థ నాయకులు కోరుకునేది.
ప్రాపంచికంగా సామాజిక పురోభివృద్ధి, మానవ ప్రగతిని కోరుకునే నాయకుడు ప్రాపంచికేతరంగా మానవ ఆత్మోన్నతిని అభిలషిస్తుంటాడు. భౌతిక పరిణామాలకు కట్టుబడి ఉన్నంత వరకు నాయకుడు ఒక టీమ్ లీడర్‌గాను, ఒక ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్‌గాను రాణిస్తే అధిభౌతిక పరిణామంలో నాయకుడు ఎటర్నల్ లీడర్‌గా నాయకులకే నాయకుడవుతుంటాడు. నాయకులకే మార్గదర్శి అవుతుంటాడు.
అంతెందుకు, ఒక డాక్టర్ చేయాల్సిన పనిని సైతం లీడర్ చేస్తుంటాడు. అనారోగ్యాన్ని తన నైపుణ్యంతో, తన ప్రత్యేకతతో తీసివేయటం విద్యుక్త ధర్మం. లీడర్ కూడా తన ప్రత్యేకాంశతో అనారోగ్య వాతావరణాన్ని సమాజం నుండి తొలగిస్తుండవలసిందే. రోగాన్ని పోషించడం డాక్టర్ లక్షణం కానట్లే రోగపీడిత సమాజానికి కొమ్ము కాయటమూ లీడర్ లక్షణం కాదు. అందుకే లీడర్‌ని ‘ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్’ అనేది. అంటే, పరిణామానికి, పరిణతికి, అభ్యున్నతికి మార్గనిర్దేశనం చేసేవాడే అసలు సిసలు నాయకుడు.
ఇలా చూసినపుడు భగవద్గీత అనేక మంది నాయకులకు ఔషధశాల, చికిత్సాలయం అయింది. ఎటర్నల్ లీడర్‌గా గీతోపదేశం చేసిన కృష్ణుడు కురుక్షేత్ర నాయకులందరికీ ఒక డాక్టర్‌లా చికిత్స చేసాడు. అర్జునుడి విషయంలో రథాశ్వాల పగ్గాలను స్టెతస్కోప్ పట్టినట్లుగా పట్టాడు. ఇక్కడ స్టెతస్కోప్ చేతపట్టటమంటే కురుక్షేత్ర గుండె చప్పుల్లను వినగలగటమే! పోరు భూమి నాడిని పట్టుకోగలగడమే. స్వయంగా ఆపరేషన్ నిర్వహించినట్లుగా కార్యక్షేత్రంలో సారథ్యం వహించటమే!
కృష్ణుడు కురుక్షేత్రంలో చేసింది ప్రతిస్పందించటం కాదు.. స్పందించటం మాటకు చేతే సమాధానం అయింది తప్ప మాటకు మాట కృష్ణ సారధ్యం కాలేదు. కాబట్టే అర్జునుడికి చేసిన ఉపదేశం అంతా ఔషధీయ తత్వ సమ్మిళితమే! అలా కృష్ణుడు అర్జునుడ్ని అర్జునుడికి అందించటమే కాదు మనల్ని మనకూ అప్పగించాడు. అంటే ‘నేను’ను తట్టి లేపుతూ మనలోని నాయక తత్వాన్ని మనకందించాడు. అలా నాటి కురుక్షేత్రంలో అర్జునుడు విజయుడు... నేటి కార్యక్షేత్రంలో మనమూ విజయులమే! కాబట్టే, భగవద్గీత జీవితకాల నాయక గీత అయింది.
కృష్ణుడు ప్రత్యక్షంగా అర్జునుడికి ఒక్కడికే గీతోపదేశం చేసాడనటం ఎంత వాస్తవమో ఆ చేసిన ఉపదేశం కాలానికి అతీతంగా జరిగిందనటం అంతే వాస్తవం. కాబట్టే, నాటికీ నేటికీ ఏనాటికీ భగవద్గీత అద్వితీయ జీవనగీతనే! అది నాడు అర్జునుడ్ని పూర్తిగా మార్చి సంసిద్ధుడ్ని చేసినట్లే ఈనాటికీ మానవ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని పరిణమింపజేస్తూ ఉన్నతికి సంసిద్ధం చేస్తూనే ఉంది. ఇలా భగవద్గీత భౌతికంగా మానవ పరిణతికి, అధిభౌతికంగా ఆత్మోన్నతికి అమృత భాండం అవుతూనే ఉంది. అందుకే గీత లౌకికంగాను, అలౌకికంగాను మానవ అవతార పరిణామ తత్వంలోని అన్ని కోణాలను స్పష్టంగా చూపగలిగింది. ఇంకా చెప్పుకోవాలంటే మానవ పురుషోత్తమ తత్వానికి కావలసిన జ్ఞాన విజ్ఞాన ప్రబంధంగా అది తలమానికమైంది... ప్రజ్ఞాన పరిణతికి అది గిక గీత అరుంది.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946