వినమరుగైన

రాణా ప్రతాపసింహ చరిత్ర - దుర్భాక రాజశేఖర శతావధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాణా ప్రతాపసింహ చరిత్ర ఆధునికాంధ్ర పంచకావ్యాల్లో అగ్రగణ్యమైంది. డాక్టర్ నారాయణరెడ్డిగారి మాటల్లో చెప్పాలంటే రాణాప్రతాప సింహ చరిత్ర, శివభారతం రెండూ రాయలసీమలో సూర్య చంద్రబింబాల్లాగా ఉదయించిన తేజఃపుంజాలు; ఓజఃపుంజాలు విశేషించి ప్రొద్దుటూరులో పురుడుపోసుకున్న కావ్యరత్నాలు- శివభారతం కంటే పదేండ్లు ముందుగా పుట్టి రాణాప్రతాపసింహ చరిత్ర తెలుగులో చారిత్రక కావ్య రచనకు మార్గదర్శకమైంది. ఈ ఆధునిక ప్రబంధకర్త అవధాని పంచానన, కవి సార్వభౌమ బిరుదాంచితులయిన శ్రీ దుర్భాక రాజశేఖర శతావధానిగారు- ఖండకావ్యాలు అసంఖ్యాకంగా వస్తున్న రోజులలో చరిత్రను పద్యకావ్యంగా సంతరించి రాజశేఖరులు కవి రాజశేఖరులైనారు. రాణా ప్రతాపసింహ చరిత్ర కావ్య రచనతో రాజశేఖర కవికి వీర రసరత్నాకర, సాక్షాద్వీర ప్రతాప అనే బిరుదులు సార్థకాలైనాయి.
రాణాప్రతాప సింహ చరిత్ర ఐదాశ్వాసాల ప్రబంధం. ఇందులో రాణా ప్రతాపుడు నాయకుడు- అక్బరు పాదుషా ప్రతినాయకుడు. రాణాప్రతాపుడు దేశాభిమానం- ఆత్మాభిమానం- ధైర్యసాహసాలూ మూర్తిదాల్చిన వీర శిఖామణి. అక్బరు పాదుషా సార్వభౌమత్వాన్ని అంగీకరింపక ప్రతిఘటించిన మేవాడ రాజ్యపాలకుడు. అక్బరు పాదుషాతో ఇరవై ఐదేండ్లు హోరాహోరి పోరాటం సాగించారు.
ప్రతాపుని జీవితమంతా స్వాతంత్య్ర సమరానికే అంకితమైపోయింది. అపార సైన్య సంపద సమేతుడైన అక్బరు పాదుషాకు ఎదురు నిలువలేక భార్యాబిడ్డలతో ఆరావళీ పర్వతాలకు పారిపోయి ఉన్నచోట ఉండలేక, తిన్నచోట తినలేక అష్టకష్టాలు అనుభవించి, తుదకు గడ్డి రొట్టెలు కూడా తిని జీవయాత్ర సాగించారు. అతని భార్య పాటేశ్వరీదేవి మహాప్రతివ్రత. ఎన్ని కష్టాలు వచ్చినా చలించక, భర్తకు సర్వకార్యాలలో చేదోడు వాదోడుగా నుండి అతని సమరోత్సాహాన్ని ఇనుమడింపజేసిన వీరనారీ తిలకం. ప్రతాపరుద్రుడెంతటి యోధుడైనా, విధి విరామాలు లేకుండా పాదుషా సైన్యాలతో పోరాటం సాగించి- విసిగి వేసారి చివరకు ఆరుమాసాలపాటు యుద్ధం ఆపమని అక్బరుకు ఒక లేఖ రాశాడు. అక్బరు కొలువులో ఆ లేఖ చదివే ధైర్యం కలవాడే లేడు. చివరకు పాదుషాయే ఆ లేఖ చదవగా వెంటనే పృధ్వీరాజు లేచి- అతని కంఠంలో కొనవూపిరి వున్నంతవరకూ నీకు లోబడతాడనే మాట నీళ్లమూట అని పలికాడు. గుణగ్రహణ పారీణుడైన అక్బరు పాదుషా నిజాన్ని అంగీకరించి, ప్రతాపుడంటే తనకెంత గౌరవమో వెల్లడించారు.
‘‘ఆ మహానాయక వతంస - మా ప్రతాపు
డెన్ని గతుల యోజించిన నన్నుబోలు
కోటి సార్వభౌములు చేరి కొలువదగిన
క్షాత్రనిధి యనుమాట వజ్రాల మూట!’’
అని పలికి ప్రతాపునితో యుద్ధం ఆపు చేయించాడు. తుదకు భామాసాహి అనే పురోహితుని సహాయంతో, ప్రతాపుడు విజయాన్ని సాధించి, స్వాతంత్య్ర పతాకాన్ని ఎగురవేశాడు. ఇది సంక్షిప్తంగా ఈ కావ్యంలో కథా వస్తువు- నాయక, ప్రతినాయక పాత్ర చిత్రణలో రాజశేఖర కవి ప్రదర్శించిన నిష్పాక్షిక దృష్టి పాత్రోన్మలనంలో నికషోఫలం వంటిది.
అక్బరు విశ్వంభరాధీశ వౌళిది
ధనసేవ! నీయది దైవసేవ!
ఆతని దెల్లపు డాత్మవైభవము! నీ
యది నిరంతరము నాత్మావబోధ!
మతని కుండినదెల్ల నైహికబలము; ని
న్నాశ్రయించిన దెల్ల నాత్మబలము!
నతని దంతటి కన్ను లలరించు భోగము;
నీది జగము మెచ్చు నిండు త్యాగ
మతడు జగము గెలిచె; నాత్మ గెల్చితివి నీ
వాతఁ డితరజనుల నాశ్రయించు
నీవు స్వాశ్రయుడవు- నీకు నతని కెన
లేదు- జగము క్రిందు మీదులైన!
అనే పద్యంలో అక్బరు-ప్రతాపసింహుల గుణశీల తారతమ్యాన్ని అద్భుతంగా అభివర్ణించారు రాజశేఖర కవి.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-జంధ్యాల మహతి శంకర్