వినమరుగైన

ప్రతాపరుద్రీయము - వేదము వేంకటరాయశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయా పాత్రల మధ్య కథను పడుగు పేకగా అమర్చి నాటక కథా సంవిధానానికీ, మనస్తత్వ చిత్రణకీ, రసపోషణకీ త్రివేణీ సంగమంలాగా ఆంధ్రౌన్నత్యానికి అనన్య దర్పణం లాగ వేదం వారు రచించిన ప్రతాపరుద్రీయ నాటకం అసదృశ్యకావ్యం. సంస్కృతాంధ్రాంగ్ల భాషా విద్వాంసులు, మహా వ్యాఖ్యాత, భాషాతత్త్వవేత్త అన్నిటిని మించి సృజనాత్మక ప్రతిభామూర్తి అయిన వేదమువారి నాటకాల్లో సంస్కృతానువాదాలు పోను బొబ్బిలి, ఉషా పరిణయం, ప్రతాపరుద్రీయం పేర్కొనదగినవి. వానిలో పఠన, పాఠన, ప్రదర్శన ప్రచారాల్లో ప్రథమ గణ్యం ప్రతాపరుద్రీయం. నిన్న నేడు రూపు అనే కాల విభజనల యవనికలను తొలగించి శతవసంత సాహితీ మంజీరనాదాలను నిరంతరం తెలుగు రసజ్ఞులకు వినిపించే సృష్టి.
ప్రతాపరుద్రీయ నాటక కథను గూర్చి వేదమువారు ఇలా అన్నారు. ‘‘ఓరుగంటి ప్రతాపరుద్ర మహారాజును సుల్తాన్ అనుచరులు ఢిల్లీకి ఖైదు కొనిపోయన కథ లిఖితముగాని, ముద్రితముగాని నాకెచటనూ దొరకలేదు. నేనెనిమిదేళ్ల వయసున నుండగా మా నాయనగారు వేదము వెంకట రమణ శాస్త్రులవారు తమ మిత్ర బృందముతో నీ కథను ప్రస్తుతించునపుడు నేనును వింటిని’’ అని. ఆ వృత్తాంతానికి కల్పన తోడై కథ రూపొందినది. 1320 నుండి 1325 వరకు ఢిల్లీ పరిపాలించిన ఘియాజుద్దీన్ ఓరుగల్లు ప్రతాపరుద్రుడు తనకి అవిధేయుడు కాగా కుమారుడైన ఉలూప్‌ఖాన్‌ను 1321లో దండు పంపాడు. దండయాత్ర పూర్తికాక ముందే ఘియాజుద్దీన్ కన్నుమూశాడు. తండ్రి మరణవార్త విని దండయాత్రను నిలిపి ఉలూఫ్ సైన్యాలను తరలించుకొని తిరిగి వెళ్తాడు. 1323 మళ్లీ దండెత్తి ఓరుగల్లును ఆక్రమించి ప్రతాపరుద్రుని బందీగా తీసుకొని వెళ్లాడు. మార్గమధ్యంలో నర్మదా నదిలో ప్రతాపరుద్రుడు ప్రాణత్యాగం చేశాడు. ఈ చరిత్రకి ఐతిహ్యాన్ని జోడించి మహాద్భుత కథాకల్పన చేశారు శాస్ర్తీగారు. ఈ కల్పనలో సంభావ్యత కేవలం నాటకీయ శిల్పానికీ, ఉదాత్త భారతీయ బ్రాహ్మక్షాత్ర ధర్మప్రతిపాదనకీ, రసపోషణకీ మాత్రమే సంబంధించినది.
మహామాత్యుడు యుగంధరుడు రామేశ్వరం వెళ్లినపుడు సుల్తాన్ సేనాని సైన్యంతో ఓరుగల్లు పరిసరాల విడిది చేశాడు. తమ దేశం మీదికి దండెత్తిన ఆఫ్‌గన్ సుల్తానును ఎదుర్కోవటానికి సైన్య సహాయం అర్థించడానికి వచ్చినట్లు నటించాడు. మోసాన్ని పసిగట్టిన జనార్థనమంత్రి పరిపాలన వ్యవస్థ పటిష్టం చేసి అన్నగారైన యుగంధరులకీ, ప్రభువు ప్రతాపరుద్రునికీ వర్తమానాలు పంపి, రాచపోలిక పేరిగాణ్ణి అందికలో వుంచి అప్రమత్తుడైనాడు. ఇది నాటక కథాబీజం. వేటలో అలసి నిద్రించిన ప్రతాపరుద్ర ప్రభువు బంధితుడు కావడం కథాగమన ప్రథాన కేంద్రం. అటుపైన చెకుముకి శాస్ర్తీ రంగప్రవేశము, యుగంధర మంత్రి ఢిల్లీ ప్రయాణము, ఉన్మాద ప్రదర్శన అన్నవి ఒక ముఖంగాను, ప్రభువు ఆచూకీ తెలిసి తనవారికి తెలిపి అప్రమత్తుడై వ్యవహరించిన విద్యానాధుని విజృంభణము మరొక ముఖంగాను, చెకుముకి శాస్ర్తీ వ్యూహంవల్ల వలీఖాన్ ఖుసూఖాన్‌ని హత్యచేయడం ఇంకో ముఖంగానూ; యమునా నది ఓడల్లో వున్న వజ్రాల నగల వెల నిర్ణయించడానికి ప్రతాపరుద్ర సమేతుడైన సుల్తాన్ తన వారితో సహా ఆహూతుడై వచ్చి చమత్కార గోష్ఠితో ప్రవర్తిల్లి అనంతరం బంధితుడు కావడం- మరొక ముఖంగాను; ఓరుగల్లుకి ప్రతాపరుద్రుని పునరాగమన పూర్వక శుభాంతము సమన్వయంగాను నాటక కథ అలంకారిక మర్యాద ననుసరించి గోపుచ్ఛాకృతితో రూపొందింది. అంక విభజనను ప్రధానంగా పాటిస్తూ స్థల నిర్దేశం చేస్తూ ఆదిలో నాంది, అంతంలో భరతవాక్యమూ కలిగి సువిశాలమైనా కుదించి ప్రదర్శించటానికి అవకాశమున్న దృశ్యకావ్యం ప్రతాపరుద్రీయం. నిన్నటి ఆంధ్ర నాటక రంగాన ఒక వెలుగు వెలిగింది.
ఉత్తమ దృశ్యకావ్యానికి గాఢ కథాబంధంతోపాటు ప్రేక్షకుల మదిలో ఎల్లవేళలా నిలచే పాత్రల చిత్రణము అవసరం. ప్రతాపరుద్రీయ నాటకంలో అన్నీ అలాంటి పాత్రలే అయినా యుగంధర పాత్ర అనన్యము. మేథాశక్తి, దీక్షాదక్షతలు, రాజభక్తి, నిర్వహణ, సామర్థ్యము, శౌర్యము కరువున బోసిన యుగంధరుడు తెలుగు నాట అమాత్య ప్రతిభకి మారుపేరు. ఈ పాత్ర సృష్టి శాస్ర్తీగారి స్వోపజ్జము. ‘‘శత్రువులను మన సీమలోనికి ఏల బోవంగ నిచ్చితివి’’ అంటూ జనార్దన మంత్రి మందలించి, ముమ్మడమ్మకు ప్రభువును తిరిగి తీసుకొని వస్తానని అభయమిచ్చి కార్యరంగంలోకి దూకి ఉన్మాదాభినయంతో వ్యూహరచన చేసిన ప్రతిభామూర్తి యుగంధరుడు. అభినయంలో ఒక హాస్య రస ప్రపంచం వెలిసింది. ఒక చమత్కార సౌరభం విరిసింది.
‘‘ఆవూ పేడా మీకి హల్కి కొంటార్ హావూ వూతీ మీర తాగి కొంటార్ హావూ ఎక్వా మీకి మనిషీ తక్వా.. కుక్కసామీ మీకి ఛీ ఛీ ఛీ- కోతి సామీ మీకీ ధూ ధూ ధూ’’ వంటి వ్యాఖ్యలు ఎవర్నీ నొప్పించవు. నవ్విస్తాయి.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ధరా రామనాధశాస్ర్తీ