వినమరుగైన

పాండవోద్యోగ విజయాలు -తిరుపతి వేంకటకవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైతేనేం, 19వ శతాబ్దం చివర 20 శతాబ్దం తొలి భాగంలో పౌరాణిక నాటక రచన సాగింది. ఆ నాటకాలు ప్రజాదరణ పొందాయి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర, ధర్మవరం వారి సారంగధర, చిలకమర్తివారి గయోపాఖ్యానం ఇవన్నీ తెలుగువారికి రసవత్ దృశ్యకావ్యాలను అందించాయి.
పాండవోద్యోగము పాండవ విజయం రెండు నాటకాలకూ తెలుగు పౌరాణిక నాటకాలలో ప్రత్యేక స్థానం ఉంది. కారణం వారి రచనా సంవిధానం మాత్రమే కాదు, అంకాలను విడమర్చడం, దృశ్యాలను సృష్టించడం కూడా ఒక కారణం.
వ్యాస మహర్షి భారతాన్ని నూరు పర్వాలుగా విభజించుకున్నాడు. నన్నయ్య భట్టారకుడు 18 పర్వాలుగా మార్చారు. తిరుపతి వెంకట కవులు 6 నాటకాలలో భారతాన్ని ప్రదర్శించారు. కొన్నిచోట్ల వ్యాసుణ్ణి కొన్నిచోట్ల నన్నయ్య తిక్కన ఎర్రాప్రెగడలను అనుసరిస్తూ కొన్నిచోట్ల యధేచ్చగా రచించారు.
అభిమన్యుని వివాహానంతరం మంచి ప్రథమదిన యుద్ధం వరకు పాండవోద్యోగంలో ఆరంకాలుగా పరిణమించింది. ‘ద్రుపదుని పంపునన్ జనె పురోహితుడు’ అని అర్జునుడు తనలో అనుకుంటూ ప్రవేశించడం ప్రథమాంకం.
సంధి చెడిపోయింది. కృష్ణుని సాయం అర్థించడానికి కృష్ణ దుర్యోధనులు సమాయత్తం కావడం ఇతివృత్తం. దీనే్న మనం పడకసీను అంటాం.
ఇది కేవలం తిరుపతి వేంకటకవుల కల్పన. కృష్ణుని పాదాల దగ్గర అర్జునుడు కూర్చోవడం, దుర్యోధనుడు తల వద్ద కూర్చోవడం కృష్ణుని కపట నిద్ర- కృష్ణుని నర్మగర్భ సంభాషణలు అన్నీ ప్రేక్షకుల్ని పాఠకుల్ని మరో లోకంలోకి తీసుకెళతాయి.
అర్జునుడు, దుర్యోధనుడు, కృష్ణుడు పాత్రలు తెలుగువారైపోతారు. భావ బావమరుదులు, జ్ఞాతుల మధ్య వైరం అంతా ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నట్టుంటాయి. ఆ పాత్రల మనస్సులు మాటల్లో అభివ్యక్తవౌతుంటాయి.
కృష్ణుడు అర్జునునితో-
ఎక్కడినుండి రాక యిటకు, ఎల్లరున్ సుఖులేకదా యశో
భాక్కులు నీదు నన్నలును భవ్యమనస్కులు నీదు తమ్ములున్
చక్కగనున్నవారె భుజశాలి వృకోదరుడగ్రజాకున్
దక్కగనిల్చ శాంతుగతి దాసు జరించునే తెల్పు మర్జునా
అని ఎంతో ఆత్మీయంగానూ, దుర్యోధనునితో
బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును, మన్నీలున్ సుఖోపేతులే
మీ వంశోన్నతిగోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె - నీ తేజంబు హెచ్చించుచున్’’
ఈ రెండు పద్యాలూ తిరుపతి కవులు పాత్ర చిత్రణకు గుణీభూతమైన వ్యంగాన్ని వ్యక్తపరిచే శక్తికి ఉదాహరణలు.
ఇక ఆపైన ‘కౌరవ పాండవుల్ పెనుగు కాలము చేరువయ’ అంటూ దుర్యోధనుడు
‘ముందుగవచ్చితీవు మునుముందు నర్జుననేను జూచితిన్’ వంటివి పద్యాలు కావు. తెలుగువారి జీవితంలో సామెతలై కూర్చున్నాయి. తిరుపతి కవులు పద్యాలు ఎక్కడైనా కోట్ చెయ్యడానికి వీలుగా ఉండటానికి కారణం తెలుగు పద్య ఛందస్సులో అవలీలగా ఇమిడిపోయే వ్యావహారిక పదజాలం.
‘ఐనను పోయి రావలయు హస్తినకున్’’
‘‘ఆయుధమున్ ధరించ అని, కగ్గముగా ఒక పక్క ఊరకే సాయము సేయువాడ’
‘నంద కుమార యుద్ధమున నా రథమందు వసింపు మదిన్’
‘ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ యాలమతికిన్ తిన్నది పుష్టి’
‘ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేర’
‘జెండాపై కపిరాజు, ‘చెల్లియో చెల్లకో’, అలసటయే ఎరుంగని’
వంటి అనేకానేక పద్యపాదాలు ఈ శతాబ్ద సాహిత్యంపై నిరంతరం ధ్వనిస్తుంటాయి. తెలుగువారి ఇళ్లలో- నోళ్లలో- ఆల కాపుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. వాక్యాలు రాసేటప్పుడు వచనం ఎంత సాఫీగా సాగుతుందో పద్యం అంత సాఫీగా సాగుతుంది. రౌద్రరసంలో పద్యం తదనుగుణంగా సమాస భూయిష్టంగా సాగుతుంది.
అసలు భారతంలోని ప్రతి పాత్ర తెలుగువారికి పరిచయమైనదే. ప్రతి పాత్ర యొక్క మానసిక లక్షణాలు తెలిసినవే. రామాయణ పాత్రలను భక్తితో చూస్తారు తెలుగువారు. పూజిస్తారు. ఆరాధిస్తారు. భారత పాత్రలను స్నేహంగాను, ఆత్మీయంగాను చూస్తారు. వాటిని తమ జీవితంతో అనువర్తించుకొంటారు. ఆ రహస్యాన్ని గుర్తించినవారు తిరుపతి వేంకటకవులు. అందుకే పాత్రల చిత్రణకు ఎక్కువగా అనువైన సాహిత్య ప్రక్రియ నాటకం. కనుకనే భారతాన్ని ఆరు నాటకాలుగా రాశారు. రక్తి కట్టించారు.
రాయబారం సన్నివేశంలో సుమారు 18 పాత్రలు ప్రవేశపెట్టారు. జాబాలి, జమదగ్ని, కృపాచార్యుడు, వికర్ణుడు, వృద్ధ పురోహితుడు, ద్వివేది, నారదాదులు వంటి పాత్రలు సన్నివేశానికి ఎంతో నిండుదనాన్ని కూరుస్తాయి. వాళ్లలో వైరుధ్యాలు, ప్రతిజ్ఞలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, అల్పాక్షరాలలో అనల్పంగా రచించారు.
ఒక్క పద్యాలే కాదు, దృశ్య విన్యాసం, పాత్ర పోషణ, సమయోచిత సంభాషణలతో పాండవోద్యోగ విజయాలు అత్యున్నత శ్రేణి నాటకంగా తెలుగు రంగస్థలంపై వనె్నకెక్కింది.
మహాభారతం మన దేశ మానసిక వ్యవస్థకు నిలువెత్తు దర్పణం. ఇది సార్వకాలికము, సార్వజనీనం కూడా. కథలుగా, గేయాలుగా, కావ్యాలుగా, నాటకాలుగా ఎన్ని రూపాలుగా అది రూపాంతరం చెందినా భారతీయులు తమ జాతీయతను అందులో దర్శిస్తుంటారు. సాధారణ రచయితల చేతిలో కూడా భారతగాథ ఎంతో ప్రతిభావంతంగా రూపుదిద్దుకుంటుంది. ఇక ప్రతిభావంతులైన రచయితల చేతిలో భారతగాథ రచించబడితే ఇక చెప్పేదేముంది!

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

--రాళ్ళబండి కవితాప్రసాద్