వినమరుగైన

పాండవోద్యోగ విజయాలు -తిరుపతి వేంకటకవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి వేంకట కవుల వంటి అసాధారణ ధారణా సంపన్నుల చేతిలో భారతగాధ ఆరు నాటకాలుగా విరచితమైంది. ఆరు నాటకాలలో వారి శక్తి సామర్థ్యాలకు పరాకాష్ఠగా మిగిలింది పాండవోద్యోగం, పాండవ విజయం నాటకాలే.
ఈ చిన్న చిన్న వాక్యాలలో సన్నివేశానికి ఎంతో బలాన్ని కలుగజేయడం తిరుపతి కవుల రచనా వైదుష్యానికి నిదర్శనం. షేక్‌స్పియర్ నాటకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి కారణం చిన్న చిన్న సంభాషణలలో ఎక్కువ భావాన్ని నిబిడీకరించడమే కదా. ఈ సన్నివేశంలో చివరకు కర్ణుడు కూడా బావా వసుదేవనందనా అని పిలిచి నిష్క్రమించే సన్నివేశం ప్రేక్షకుణ్ణి కదిలిస్తుంది. వెళుతూ-
సకల క్షత్రకుల వినా
శకమగు నీ సరమర భరము సడలిన పై దీ
రికమై నినుదర్శించెద
నొకొ! స్వర్గమున జూతునొకొ- లేకున్నన్
అన్న పద్యం తెలుగు నాటక చరిత్రలోనే నానృతో దర్శనీయం.
కుంతీ కర్ణ సంవాదంలో సైతం కుంతీదేవి కర్ణుని తండ్రి యని కుమార అని- తమ్ములతో గలసి రాజ్యమేలుమని అనునయిస్తూ పిలుస్తుంటే కర్ణుడు కుంతీదేవిని అమ్మ అనో, జననీ అనో, మాతా అనో సంబోధించడు. పాండుమహిషీ అని, పాండవ జననీ అనీ, కురుకుల వధూమణీ అని సంబోధిస్తుంటాడు.
అసలు ఈ పాండవోద్యోగ విజయాలలోని సంబోధనలన్నీ సాభిప్రాయాలు. ప్రతి సంబోధన వెనుక వ్యంగ్యమో, చమత్కారమో, దెప్పిపొడుపో ఉంటాయి. రాయబార సన్నివేశంలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని ‘‘మామా సత్యవతీ పౌత్రా!’’ అని సంబోధిస్తాడు. దూతగా వచ్చినవాడు మామా అనుటయేగాక, సత్యవతీపౌత్ర అనడంలో అర్థం వేరే ఉంది. సత్యవతి మనుమడవునీవు- సత్యవతి తన పిల్లలకు రాజ్యం కావాలని పట్టుబట్టింది. ఆమె యొక్క మనుమండవు- నీ పట్టు ఏమిటోనని, అదీకాక ‘మామా’ అనడంలో ‘‘నీకు నాకు బంధుత్వం ఉంది. నీ వంశం యొక్క గతం నాకు తెలుసు’’ అనడం. ఆ రెండు మాటలలో అంతటి అర్థం పొదిగారు తిరుపతి కవులు. కర్ణుడు కూడా అశ్వద్ధామను ‘నిరభిమాన బ్రాహ్మణుకుల సార్వభౌమ’ అనీ, ‘లక్షణమాత్ర పరిజ్ఞాత ధనుర్వేదసార!’ అనీ సంబోధిస్తాడు. దానికి ప్రతిగా అశ్వత్థామ దురహంకార పరిభవిష్య మాణ కురుకుల రూపధేయ! రాధేయ అని సంబోధిస్తాడు. ఒక్కొక్క సంబోధనలో వాళ్ళ జీవితాల తాలూకు ఏవో సంఘటనలు, మనస్తత్వ ప్రతిబింబాలు ఉంచడం ఈ నాటకం యొక్క ప్రత్యేకత.
పాండవోద్యోగంలో ఆరవ అంకం అంతా యుద్ధ ప్రారంభం. యుద్ధానికి ముందు గురువందనం, ధర్మరాజు, భీష్ముడు, ద్రోణులకు వందనం ఆచరిస్తాడు. ఇక్కడ రెండు కంద పద్యాలున్నాయి. అవీ సంస్కృతంలో కంద పద్యాలు. సంస్కృత ఛందస్సులో తెలుగు కంద పద్యానికి సారూప్యం ఉన్న ఛందస్సు ఆర్యావృత్తం. కాని పూర్తి తెలుగు కందపద్య గణాలతో సంస్కృతంలో తిరుపతి కవులు రాయడం ఒక ప్రయోగం. ఇట్టి ప్రయోగంగా సంస్కృత భాషలో మొదటిది. ఆ కందశ్లోకాలు ఇవి. యతిప్రాసలు కలిగి ఉండటం మరో విశేషం. ధర్మరాజు భీష్మునితో-
సాయిక రహస్యకృతినే
శ్రీయుత కీర్త్యబ్ధి శంభు శేఖరమణయే
భీయో భూయో పిచ గాం
గేయాయ నమో మహాత్మ గేయాయనతే
ధర్మరాజు ద్రోణునితో
ధ్రోణాయ! శిష్యకోటి
త్రాణాయ! ధను ష్మదధిక దర్వాపహార
ప్రాణాయ! శ్రీఘ్రకల్పిత
బాణాయ! నమోస్తుదేవ భగవతే గురవే-
పాండవ విజయం ఎనిమిదంకాల నాటకం. ఇందులో అన్ని యుద్ధ సన్నివేశాలు. రౌద్రం - కరుణం - బీభత్సం ప్రధాన రసాలు. ఈ నాటకంలో ప్రస్తావనలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. ఈ పద్యం ఇంతవరకు ప్రాచుర్యం పొందకపోవడం ఆశ్చర్యమే.
ప్రస్తావనలో నటి ఆలస్యానికి కారణాన్ని సూత్రధారుడు అడుగుతాడు. తలదువ్వడంలో ఆలస్యమైంది అంటుంది నటి. ‘‘అవునవును స్ర్తిలకు కృతిమాలంకరణములలో కురుల సంతతియే ప్రథమగణ్యము’’ అంటూ సూత్రధారులు
కృష్ణవిమతంబు ద్రోణగాంగేయ భూషి
తంబు ద్విష్ణ శిఖండ మద్ర బహుళంబు
కర్ణ సంరోధియై కల్మిగాంచుగాని
కాలగతి గ్రుంగు బాండవా క్రాంతమగుచు
ఆడవారి కేశ సంపద సౌందర్యంలో కురు పాండవ సంగ్రామం చిక్కుపడింది.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

--రాళ్ళబండి కవితాప్రసాద్