వినమరుగైన

వరవిక్రయము -కాళ్లకూరి నారాయణరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయిన మూడేళ్లకు కూడా కాపురానికి తీసుకుపోకపోయినా, పెళ్లి వేళ పెట్టిన నగలను తనకు ఈయకపోయినా, కనీసం భర్త అనే ఆ వ్యక్తి తనని తొంగి చూడకపోయినా అక్కనే తలుచుకుంటూ ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలంటే తన అత్తింటివారికి ఓ శాశ్వత గుణపాఠమును చెప్పాలని భావించిన మహోపద్వేష్టి. చివరికి న్యాయాధిపతి ముందు తాను తన భర్తని 5,500 రూపాయలకు కొనుక్కున్నానని, ఆ కారణంగా అతడు తన కొనుగోలు వస్తువు అయ్యాడని, అతడిమీద అధికారం తనకే వుంటుందని, పైగా శుభలేఖని చూపిస్తూ కమలకిచ్చి బసవరాజుని వివాహం జరిపించడం అని ఇందులో ఉంది కాబట్టి, ఈ విషయం ప్రకారం అతడు నాకు సంబంధించిన నా వ్యక్తి. నాక్రింద దాసుడని నిర్భయంగా చెప్పిన గడుసరి. నియమాన్ని తప్పుతున్నవారికి ఓ కాపరి ఈ కమల.
ఇక పాపం పురుషోత్తమరావు అసలుసిసలైన గాంధేయవాది. ఉద్యోగాన్నీ స్వదేశీ ఉద్యమంలో పోగొట్టుకొని, పిత్రార్జితం పదెకరాలతో కాలక్షేపం చేసే వ్యక్తి. సమస్యకి సమాధానం పాపం కామే అని ఎదురుచూసే సామాన్యుడు. ఆటుపోటులకి తట్టుకోగల మేరునగధీరుడు అయినా, వియ్యంకుడైన సింగరాజు లింగరాజు ఎంత ఆగడాన్ని చేసినా ఏం మాట్లాడని, మాట్లాడలేని సహతత్పరుడు ఈయన. ఈయన భార్య భ్రమరాంబ, భ్రమరంలా తన గోడు నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. వరకట్నాలూ, ఉద్యమాలూ ఇవన్నీ ఎందుకని పైకి గట్టిగా వాదించకపోయినా ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారనే దిగులుతో ఉండే సహజమైన తల్లితనం చూపించే లక్ష్యం ఆవిడది.
బాల్య వివాహాలు వద్దని ఉపన్యాసం చెప్పే బాపిరాజు ఆరేళ్ల కూతురికి నాలుగో పెళ్లివాడు అరవై ఏళ్లనాడు అతన్నిచ్చి కట్టబెట్టాడు. స్ర్తి పునర్వివాహాన్ని గురించి దంచేసే శివయ్య చెల్లెలి భర్త పోగానే తన వంట మనిషిని ప్రేమించి ఆ స్థానాన్ని ఈమెతో భర్తీచేశాడు.. అని ఇలాంటివన్నీ ఉదాహరించి ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు అని కళ్లలో నీరు నింపుకుని వౌనంగా ఉండిపోయేటటువంటి పాపం ఈ భ్రమరాంబను చూస్తే చాలా జాలివేయక మానదు. కళ్లతో జరుగుతున్న చరిత్రను చూస్తే ఇల్లాలు తప్ప విని ఊకొట్టే వింత శ్రోత మాత్రం కాదావిడ. ఇక అటువైపుకు వచ్చి చూస్తే సింగరాజు లింగరాజు ఈ పురుషోత్తమరావు వియ్యంకుడు. పిడకలు, కట్టెలు, బొగ్గులు, కొబ్బరికాయలు కూడా ఏ రోజు కారోజు ఎన్ని ఖర్చయ్యాయో ఎంత మిగిలాయో వంటవాడి నుంచి రోజూ అప్పజెప్పుకుని తాళం వేసుకునే లోభి, లక్ష్మీ దండకాన్ని చదువుతూ ఒకే ఒక్కసారి హారతిని వెలిగించి అంతలోనే ఉఫ్‌మని ఊది ఆర్పే మేధావి.
వడ్డీకి ఎవరూ అప్పుగా ధనాన్ని తీసుకోకపోతే ఆ రోజు ఉపవాసం చేసే ఉదారుడు. ధనాన్ని పొట్టకి, బట్టకీ, లంక పొగాకు చుట్టకి వ్యర్థం చేయరాదు అనేది అతని ఖచ్చితమైన శాసనం. పిల్లవాడు బసవరాజు పెన్ను కావాలని అడిగితే ఆగరా, పెళ్లికానీ అత్తారింటి నుంచి తెచ్చుకోవచ్చుగా అనే అతని మాట. కాకిగూడు పడగొట్టి ఒకరోజు వంట చేయడం బావుంటుందనేది అతని ఆదేశం. ధనమే ఉచ్ఛ్వాసంగా, కోర్టు వ్యాజ్యాలే నిశ్వాసంగా ఉన్న సింగరాజు మొత్తానికి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని తన జీవిత లక్ష్యమైన ధనాన్ని పాపం పధ్నాలుగు వేలు మాత్రమే సాధించగలిగాడు. అందాల భరిణ, విద్యావతి, గుణవతి ఇలాంటి మాటలు మాత్రం అనవసరం. ఇంటి పనులన్నీ చేసి ఎన్ని తిట్టినా పడే ఓ కాంత కోడలు కావాలనేది అతని దృఢ నిర్ణయం. అందుకే ఇతడి పుత్రుడి పేరు బసవరాజు అని పెట్టాడు కవి. బసవుడు అంటే ఎద్దు అని తెలుగులో అర్థం.
ఈ పాత్రలన్నింటినీ ఎప్పటికప్పుడు వాళ్ల వాళ్ల వ్యక్తిత్వాలు మారిపోకుండా పట్టుకుని రక్షిస్తుండేవాళ్లు పెళ్లిళ్ల పేరయ్య. విశేషాల వీరయ్య అనేవాళ్ళు. మాటకి ఓ అబద్ధాన్ని ఎత్తుతూ, పూటకి ఓ సంబంధాన్ని తెస్తూ, నోటి నిండా అధర్మాన్ని నింపుకుని సంసారాలని కూల్చడమే ధ్యేయంగా నడుస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆశని రేకెత్తించి వాళ్ల జీవితాలు కలిపేస్తున్నట్లుగా దూరం చేయడం, కమిషన్‌లు గుంజడం వీళ్లకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. పెద్ద అమ్మాయి కాళింది బావిలోపడి దూకినపుడు వీళ్లిచ్చిన సలహా చిన్నమ్మాయిని చేసుకుంటే వాజ్యం ఉండదు. ఆ సొమ్ము కలిసొస్తుంది అని. చిన్నమ్మాయి గడుసరి అనే విషయం వీళ్లకి తెలియకపోవడం కథకి పట్టుకొమ్మ. పెళ్లి చేయడానికి 5,500 రూపాయలు కావలసి వచ్చి పురుషోత్తమరావు ఇబ్బంది పడుతోంటే తానే ఇయ్యదలచిన పెళ్లిళ్ల పేరయ్య ఎన్నో విధాలుగా చక్రాన్ని తిప్పి తిప్పి చివరకు రూ.8000 తానే ఇచ్చి పదెకరాల పొలాన్ని కాజేయాలని భావిస్తాడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా సింగరాజు లింగరాజు మొత్తాన్ని గుటుక్కుమనిపించాలని మరో పథకం వేస్తాడు, ఇంకా తక్కువగా కాజేయాలని. పెట్టుబడి ఏ మాత్రమూ లేకుండా రెండు వేల రూపాయల కమిషన్ ఈ పొలం అమ్మకంలో వస్తుంటే కొనుక్కోవడం దండుగ అని భావించిన పేరయ్య అందుకే ఆశపడి పురుషోత్తమరావు గొంతుని నిర్దాక్షిణ్యంగా కోసి పొలాన్ని కాస్తా ఫిరాయించడానికి ఆలోచిస్తాడు. ఆ రోజుల్లో ధనానికీ ప్రాధాన్యాన్నిచ్చి వ్యక్తుల్ని, వ్యక్తుల జీవితాన్ని ఎలా చిత్రవధ చేసిందీ, వాజ్యాలకి ప్రాణం పోసి ఎలా కోర్టుల చుట్టూ తిరుగుతూ, తిప్పుతూ చక్కని మేధని వ్యర్థం చేసుకున్నదీ, ఆనాటి సాంఘిక వ్యవస్థ ఎంత కుళ్లుతో నిండిందీ ఈ నాటకం మనకి అద్దంపట్టి చూపిస్తుంది. అతి గంభీరమైన వరకట్న సమస్య ఈ నాటకం నిండుగా కనిపిస్తూ ఉంటే, ఈ నాటకాన్ని హాస్య ప్రధానంగా భావించడం అంటే ఉప్మాలో జీడిపప్పు మాత్రమే తిన్నట్టవుతుంది. ఒక్కమాట మాత్రం నిజం, వరకట్నాన్ని వ్యతిరేకించలేక కాళింది వంటి వాళ్లు బలైపోతూ ఉంటే, ఏనాడో కమల వంటి వాళ్లు ఉండకపోతారా అని దాదాపు నూరు సంవత్సరముల క్రితం సాహసించిన శ్రీ కాళ్లకూరి నారాయణరావు తన ఆశయాన్ని నేడు వరకట్నం లేకుండా జరిగిన ప్రతి వివాహంలోనూ నెరవేర్చుకుంటూనే ఉన్నారనేది యదార్థం. అలాంటి వరవిక్రయాన్ని ఒక్కసారయినా చదివి కంటి నిండుగా ఒక చిన్న కన్నీటి బొట్టును విడిస్తే కాళ్లకూరి నారాయణరావు ఆత్మ యదార్థంగా శాంతిస్తుందనేది సత్యం.

-అయపోయంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మైలవరపు శ్రీనివాసరావు