వినమరుగైన

రాజమన్నారు నాటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమమీద మతానిదీ పెత్తనమే. వీరశైవుల రాకుమారి నందినిని జైనుడైన ఉదయాదిత్యుడు ప్రేమించి- తన ప్రేమకోసం మతాన్ని వదులుకుని ఆమెను పెళ్లాడితే.. ఆమె సోదరులు మతవ్ఢ్యౌం అతనిని నరికి పోగులు పెట్టింది. తోడబుట్టిన చెల్లిలి ఆక్రందన కూడా వారిలో కారుణ్య భావనను కలిగించలేకపోయింది.
తథాగతుడు బోధించిన మహోన్నత ప్రేమనూ మానవ సహజమైన శరీర కాంక్షకు నడుమ నలిగిన జయశ్రీ తనను ‘నాగుపాము’లా కాటువేసిన భౌతికతృష్ణను దగ్ధం చేసుకొని ఆత్మిక ప్రేమకు ఆహుతి అయ్యింది. ఈ ఉదాత్త ప్రేమికను ఉల్కతో పోల్చుతారు శ్రీపాద.
‘‘తథాగతుని దిగ్విజయంలో లోకాన్ని సౌందర్యవంతం చేసే ప్రేమజ్యోతులెన్నో ఆరిపోయాయి’’ అని రాయడం రాజమన్నారు వంటి హృదయశీలికే తగినది.
మరో గాఢ ప్రేమికుల జంటకు కులాలు అడ్డం రాలేదు. అన్ని విధాలుగా వారిరువురూ ఒక్కటి కాగల అవకాశంవున్నా వారికి వివాహానికి ముందు తెలుస్తుంది. తండ్రులు వేరైనా వారి తల్లి ఒక్కటేనని!
‘‘ఇందులో ప్రకృతికి విరోధమైంది ఏదీ లేదు. ఉంటే అసలు ప్రేమించుకోవడం ఎలా సంభవిస్తుంది?’’ ఆ ప్రేమికుల సంభాషణ ఇలా సాగుతుంది పాఠకుల్ని చకితుల్ని చేస్తూ.
‘‘ప్రేమ సహజమైంది. నీతి మానవులు నిర్మించుకున్నది. ప్రపంచమంతటా ఒకే నీతి లేదు. వేరొక దేశం వెళ్లి వివాహమాడితే? మరి అంతరాత్మ? దానినేం చేయాలి?’’’
‘‘మానవుని అంతరాత్మ సంఘ నియమాలకు లోబడే వుంటుంది’’. ఆ అంతరాత్మతోపాటు ఆ నాటికలోని పాత్రలూ చివరికి సంఘ నియమాలకు లోబడినా బంధాలు నాటిక ఇతివృత్తమూ ఇటువంటి చర్చ. ఈనాటికీ మింగుడుపడదేమో.
కానీ శ్రీపాదవారు ‘అద్భుత రసమాధుర్యము దానిని నిజంగా గొప్ప నాటికనే చేసింది’ అన్నారు.
మానవ సంబంధాలన్నింటిలోనూ వైచిత్రి కలిగినది దంపతీ సంబంధం. అది ఆ ఇరువురికీ సంబంధించినది కాదు. వారి చుట్టూ అల్లుకుపోయిన పలువురికి సంబంధించినది.
భార్యాభర్తల సంబంధాలలోని అపేక్షనూ, ఆర్ద్రతనూ, ఆంతర్యాన్ని భిన్న స్వరాలలో వినిపిస్తాయి రాజమన్నారు నాటికలు.
దీర్ఘరోగపీడితుడైన భర్త తన భార్యతో రోజురోజుకీ పెరుగుతోన్న ప్రేమ రాహిత్యాన్ని గ్రహించి ఆ మనోవేదనను తల్లితో పంచుకుంటాడు. మరో పురుషుడి ప్రేమఫలాన్ని తన కోడలు కడుపున మోస్తోన్నదన్న నిజం కొడుకుకు తెలిస్తే- ఆ శరీర బాధకన్నా మనోవిఘాతమే అతన్ని పొట్టన పెట్టుకుందని భావించిన తల్లి ఆ విషాద సందర్భం రాక మునుపే కొడుకును శాశ్వతంగా నిద్రపుచ్చుతుంది మాతృప్రేమతో.
భర్త స్నేహితుడే తన తొలి నాటి ప్రేమికుడని గ్రహించిన భార్య అతనితో శాశ్వతంగా వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. ‘‘ప్రేమానుభవం నిష్కామ కర్మ’’ అంటూ పరకీయనే వదలివెళతాడు ప్రేమికుడు. అన్ని విషయాలు చూచాయగా గ్రహించినా ఏమీ ఎరగనట్లే ఆర్తిగా భార్యను దగ్గరకు తీసుకుంటాడు భర్త.
ఒక గయ్యాళి భార్య చేతికి భర్త పడుచు ప్రియురాలి ఉత్తరం చేరింది. అతను నిద్రలేచీ లేవగానే వ్యవహారం తేల్చుకుందామని ఆమె అనుకొనే లోపలే ప్రియురాలు వచ్చి- ఆ ప్రేమకు హుళక్కి చెప్పి- తన ఉత్తరం తీసుకుని మరీ వెళ్లింది మరొకరిని వివాహమాడను. ఇక భర్త చిక్కాడు భార్య చేతికి. ఆమెకు ఆవకాశం ఇవ్వకుండానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఆమెకు వృధాయాసం మిగిల్చి.
ఇక ఆధునిక యువతుల మోజులో పడిన భర్తల బూజు వదలకొట్టడానికి భార్యలే పూనుకుంటారు భార్యాభర్తలు అనే సరదా నాటికలో.
స్వతంత్రమూ, సమానత్వమూ కావాలని ఎంతగా అభిలషించినా మనసు లోలోపల మగవాడి ఆధిపత్యానే్న స్ర్తి కోరుకుంటుందని ఒక వాదన ఉంది. ఆ పోకడలో పోయి దారి తప్పిందేమోననిపిస్తుంది వెర్రిముండ నాటికను మొదటిసారి చదవగానే.
ఒక నవ జవానుడు తన భార్యను నొప్పించకూడదని తన పనులు తానే చేసుకోవడమే కాక ఆమె గౌరవానికి భంగం కలిగించకూడదని చనువుగా పిలిచే పిలుపును కూడా మానేస్తాడు. ‘‘మొదటినుంచి అలా ఉంటే ఆయన తరహా అనుకునేదేమో’’ కానీ ఈ ఆకస్మిక మార్పుకు ఆ భార్య ఎంతలా కళవళపడిందీ మళ్లీ ఎలా మారిందీ ఈ నాటిక ద్వారా తెలుస్తుంది.
ప్రతి నాటికలోనూ స్ర్తిపట్ల ఎంతో సానుభూతిని, ఉదాత్తను వ్యక్తపరిచిన రాజమన్నారు ఇలా రాయడంలోని ఆంతర్యం ఏమిటో అని తరచి చూస్తే- భార్య కోరుకొనేది భర్త ఆధిపత్యాన్ని అనవసర ఆడంబరాన్ని కాదు. అతని ఆత్మీయతనే అన్న భావన కావచ్చు.
తెచ్చిపెట్టుకున్న సంస్కారం తుమ్మితే ఊడే ముక్కులాంటిది. మేథో సంస్కరణ లేనిదే, మానవ ప్రక్షాళన లేనిదే పైపైని సంస్కారం మెరమెచ్చు గౌరవం ఎన్నాళ్లు ఉండబోతుంది? అంటూ నవజవానులపై వేసిన చురక కావచ్చు.
ఇదే చురకను కనకాంగి నిరసనగా చిత్రిస్తారు రచయిత ఏమి మగవాళ్ళు! నాటికలో. కనకాంగి నటి, గాయని, సౌందర్యవతి, సంభాషణా చతురత కలిగినది. ప్రముఖ వ్యక్తి. వైవాహిక బంధంపై గొప్ప గౌరవము కలిగిన ఆమె జన్మతః వేశ్య. నటి కాగానే కుల వృత్తి వదిలేసిన ఆమెను ఛాందస వంశీకుడు, విద్యాధికుడు అయిన వేణు పెళ్లాడాడు. ఒక పిల్లగాలి తాకిడికే భయభ్రాంతుడై అసలు స్వరూపం బట్టబయలు చేస్తారు. వివాహ వ్యవస్థ పట్ల కనకాంగికి వున్న విశ్వాసం విచ్చిపోతుంది. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పి.చంద్రలత