వినమరుగైన

బారిష్టర్ పార్వతీశం - మొక్కపాటి నరసింహశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక వచన వాఙ్మయంపైన ఏ మాత్రం దృష్టి కలిగిన వారికైనా బారిష్టరు పార్వతీశం కనపడకపోడు. అతడు తన హాస్యం చేత అందర్నీ నవ్విస్తూ మిగిలిన ప్రతిభా విశేషాలవల్ల ఆలోచనాపరుల్ని ఆశ్చర్యపరుస్తూ, ఆంధ్ర సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఈ పార్వతీశం తన సృష్టికర్త మొక్కపాటి నరసింహశాస్ర్తీగారినే మించిపోయాడు. రచయితలకు వారి పాత్రలకు వుండే సంబంధాలు చాలా చిత్రంగా ఉంటాయి. కొందరు రచయితల పాత్రలు వారి వెనుక ఒదిగి ఒదిగి వుంటాయి. మరికొందరి పాత్రలు, రచయితలతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి. ఇక కొన్ని పాత్రలు తమ సృష్టికర్తల్నే ముంచేసి ముందుకు నడుస్తుంటాయి. అలాంటివారిలో చిలకమర్తి వారి గణపతి ఒకడు. అంతకంటే ప్రబుద్ధుడు మన బారిష్టరు పార్వతీశం.
మొక్కపాటి నరసింహశాస్ర్తీగారు 1892లో జన్మించారు. ఏకోదరులు, మిస్ మనోహరి అనే నవలలు- సుబ్బరాయుడు, సత్యంవద, పెద్ద మామయ్య, అనశ్వరం మొదలైన ఏకాంకికలు. ‘మన ప్రముఖ హాస్య రచయితలు’ ‘హాస్యరసం’ మొదలైన విమర్శనలు వీరి కలంనుండి వెలువడ్డాయి. అన్నిటిలో అందరికీ గుర్తుండేది బారిష్టరు పార్వతీశం నవల. దీన్ని పూర్తిగా నవల అనటానికి లేదు. రచయిత ఒక పాత్రను రంగస్థలం ఎక్కించి తన కథను తానే చెప్పుకొనేట్లు చేశాడు. ఇది ఒక రచనా కౌశలం. ఈ కథ హాస్యరస ప్రధానమయినది. గాజుపాలెం గాంధి, నేటి వరూధిని, బారిష్టరు గారి బాతాఖానీ లాంటి మరికొన్ని హాస్యరచనలున్నా మొక్కపాటి వారి పేరు నిలిపింది పార్వతీశమే అనటంలో అతిశయోక్తి లేదు.
నరసింహశాస్ర్తీగారు 1913లో ఇంగ్లండులోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో, వ్యవసాయ శాస్త్రానికి సంబంధించిన ఒక కోర్సు నాలుగు సంవత్సరాలపాటు చదివి, డిగ్రీ తీసుకొనకుండానే స్వదేశానికి తిరిగి వచ్చారు. బందరు జాతీయ కళాశాలలో కొంతకాలంపాటు ఉద్యోగం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆయన ఇంగ్లండునుండి తిరిగి వచ్చి వివాహాదికాలు పూర్తిచేసుకున్న తరువాత బహుశా 1922 ప్రాంతంలో కావచ్చు తన మామగారి ఊరయిన గుమ్మలూరు వెళ్లారు.
అప్పటికే ఆయన పిలక, నేను మా ఆవిడ, లక్ష్మి అనే కథలు వ్రాసి వున్నారు. మొదటి రెండు సాహితి అనే పత్రికలో, మూడవది భారతిలో అచ్చుపడ్డాయి. రచయిత హాస్య సంభాషణ చతురుడు కావటంవల్ల ఆయన బావమరుదులు, మరదళ్లు చుట్టుప్రక్కలవున్న కుర్రాళ్లు ఆయన చుట్టూ మూగి ఏవో సరదా కబుర్లు చెప్పమని కోరారు. శాస్ర్తీగారు తన విదేశ ప్రయాణ అనుభవాలు కొన్ని, విన్నవి, కన్నవి, ఊహించినవి మరికొన్ని తమాషాలు హాస్య సన్నివేశాలు కలిపి ఒక కుర్రాడికి అంటకట్టి కథానాయకుణ్ణి చేసి వారికి వినిపించారు. వారు చాలా సంతోషించారు. ఎలాగూ కథలు వ్రాసే అలవాటుంది కనుక ఇదంతా ఒక కథగా వ్రాస్తే బాగుంటుందని సూచించారు.
మొక్కపాటివారికి ఆ సలహా నచ్చింది. 1924 డిసెంబరు మొదట్లో గుంటూరు వెళ్లిన శాస్ర్తీగారు తన మిత్రులు, తల్లావఝుల శివశంకరశాస్ర్తీ, శ్రీనివాస శిరోమణి మొదలైన వారికి ఆ కథ చెప్పారు. వారు చాలా బాగుందని, పూర్తిగా వ్రాయమని ప్రోత్సహించారు. మొక్కపాటివారు చెప్పగా శ్రీనివాస శిరోమణి వ్రాయగా కథ పూర్తయింది. శివశంకర శాస్ర్తీగారప్పుడే ఆ కుర్రాడికి అంటే కథానాయకుడికి పార్వతీశం అని నామకరణం చేశారు. వెంటనే విజయవాడ శారదా ప్రెస్‌లో అచ్చయి అదే నెల 24న తెనాలి సాహితీ సమితి ప్రథమ సమావేశంలో ఆవిష్కరించబడ్డది. అప్పుడొక గమ్మత్తు విషయం జరిగింది. పుస్తకం చివర ఎవరు వ్రాశారో ఏమో ప్రథమ భాగం సమాప్తమని అచ్చుపడింది. శాస్ర్తీగారు గాని శ్రీనివాస శిరోమణిగాని వ్రాసింది కాదు. ఏమైతేనేం అది పార్వతీశానికి ఎంతో భవిష్యత్తునిచ్చి అతని మేధాసంపదని ప్రయోజకత్వాన్ని చెప్పే మరి రెండు భాగాల రచనకు కారణమయింది.
*
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*

-పింగళి వెంకట కృష్ణారావు