వినమరుగైన

ఎంకి పాటలు - నండూరి వెంకట సుబ్బారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర కవిత్వం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ ప్రభావంవల్లనే మన తెలుగు సాహిత్య నందనంలో ఎన్నో సరికొత్త పోకడలు పల్లవించాయి. ప్రధానంగా ఆంగ్ల సాహిత్యంలోని రొమాంటిక్ పొయట్రీ అంటే కాల్పనిక కవిత్వ ప్రేరణతో ఆంధ్ర సాహిత్యంలో భావకవిత్వ ప్రభలు శ్రీకారం చుట్టుకున్నాయి. ఈ భావకవిత్వపు ఉద్యమంలో సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయంతో పాటు ఆంగ్ల సాహిత్య పరిచయాన్ని సంతరించుకొన్న నవకవులు తమ గొంతుకలను సవరించి ఎన్నో ప్రణయగీతాలను గానం చేశారు. ఊహా ప్రేయసులను సృష్టించుకుని తమ అంతరంగంలోని ఆవేదనని, ఆనందాన్ని, సంతోషాన్ని, సంతాపాన్ని, కేరింతలని, కలవరింతలని అక్షర రూపంలో అభివ్యక్తం చేశారు. ఆంధ్ర కవితాభిమానుల హృదయ కేదారాలలో మూడు దశాబ్దాలకుపైగా ఆనంద రసరాజనాలని పండించారు. ఊర్వశి, హృదయేశ్వరి, శశికళ, వత్సల, కినె్నరసాని, యెంకి ఈ కోవకు చెందిన ప్రేయసులే. శ్రీ నండూరి వెంకట సుబ్బారావుగారి గుండె గొంతుకలో కొట్టాడి, జానపద సుందరిగా తెలుగు సాహితీ సౌధంలో అడుగుపెట్టి, పవిత్రమైన ప్రణయతత్వానికి జ్ఞానపథ నిర్దేశం చేసిన అమృతమూర్తి యెంకి. ఆమె ప్రేరణతో వెలువడిన రసరమ్య గీతాలే శ్రీ నండూరి వారి యెంకి పాటలు. యెంకి-నాయుడు బావలను ఆలంబనముగా చేసుకుని శ్రీ సుబ్బారావుగారు తమ ప్రణయానుభూతులనే ప్రకటించుకున్నారు. ‘‘యెంకి నా ప్రేమ రసానికాశ్రయము. నా శృంగార వాక్కునకు విశ్రామస్థానము. నా వలపులకు నిధానము’’ అన్న ఆయన మాటలే ఇందుకు నిదర్శనము.
శ్రీ నండూరి వెంకట సుబ్బారావుగారు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుతున్న రోజుల్లో, అంటే 1917-18 సంవత్సరాలలో ఈ యెంకి పాటలు ఆవిర్భవించాయి. ఒకరోజు శ్రీ సుబ్బారావుగారు ట్రాంబండిలో యింటికి వస్తుండగా గొంతుకలో ఒక సన్నని రాగం బయలుదేరింది. క్రమంగా గుండె గొంతుకలోన కొట్లాడుతాది అనే పల్లవి రూపుదిద్దుకుని ఇంటికి చేరే సమయానికి మొదటి పాట పూర్తయింది. చెలిమి కలమిని పంచుకున్న శ్రీ అధికార్ల సూర్యనారాయణరావుగారు ఈ పాటను విని ‘సెభాస్, వ్రాయమని’ ప్రోత్సహించారు. సారస్వత విషయాలలో చక్కని తర్ఫీదునిస్తున్న శ్రీ బసవరాజు అప్పారావుగారు మాత్రం ‘యిది నీవు నిత్యం వాడే భాష కాదు. ఈ భాష ద్వారా సత్యానే్వషణ చేయలేవ’ని హెచ్చరించారు. ఏ శుభముహూర్తలో శ్రీ సూర్యనారాయణరావుగారు ప్రోత్సహించారోగానీ, ఆపాతమధురాలుగా యెంకి పాటలు వెలువడి సహృదయులను యెంతగానో అలరించాయి. తర్వాత, తర్వాత శ్రీ అప్పారావుగారు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారంటే రుూ పాటలోని భావశబలత, రచనా విన్నాణము ఎంతటి ఉత్కృష్టమైనవో మనం ఊహించుకోవచ్చు. యెంకి పాటలు ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. ఇందులో తొలి వలపుల తొలకరిలో పులకరించిన భావాలున్నాయి. వివాహ బంధంతో ఒకటై భవ్యమైన దాంపత్య జీవితంలో పరవశించిన దివ్యమైన భావాలూ వున్నాయి. వీటితోపాటు, అలకలకో, అనుమానాలకో చోటిచ్చి, విరహ వేదనలో కుమిలిపోయిన భావాలూ వున్నాయి. ఏ భావాన్ని అయినా చూపులతో మాట్లాడి, ఊపిరితో తెనిగించే ప్రతిభ వున్న శ్రీ సుబ్బారావుగారు ఎంతో సుభగ సుందరంగా తీర్చిదిద్దారు. తొలి రోజుల్లో కొంత గాలి దుమారం చెలరేగినా, క్రమంగా అది సమసిపోయి యెంకి పాటలకు విధ్వద్భ్రమర శోభితమైన సాహిత్యసభలో సముచితమైన గౌరవం లభించింది.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కె.వి.ఎస్.ఆచార్య