వినమరుగైన

వేయ పడగలు- విశ్వనాథ సత్యనారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన విశిష్టమైన నవల వేయిపడగలు. విశ్వనాథవారి శతజయంతి దేశమంతటా సాహిత్యోత్సవాలుగా చేసుకోవటం జరిగింది. వారు 1895 సెప్టెంబరు 10వ తేదీ మన్మధనామ సం. భాద్రపద బహుళ షష్టినాడు పుట్టారు. బందరులో ఈ నవలను 1934లో సరిగ్గా 29 రోజుల్లో వారు డిక్టేట్ చేస్తుంటే తమ్ముడు వెంకటేశ్వర్లు వ్రాశారు. ఆనాడు ఆంధ్రా యూనివర్సిటీవారు ప్రకటించిన పోటీకై వ్రాయబడి బహుమతినందుకొన్న గ్రంథమిది. ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో 1937-38లో ఒకసారి 1987-88లో మరోసారి కొంతభాగం ప్రచురించబడింది. 1968 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న పి.వి.నరసింహారావుగారు దీనిని హిందీలోకి సహస్రఫణ్ అనే పేరుతో అనువదించారు. ఆ అనువాదం కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. 1976 ప్రాంతంలో దీనికి గుజరాతీ అనువాదం కూడా వచ్చి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి అంకితం చేయబడింది.
విశ్వనాథవారు ఈ నవలను మరణించిన తన భార్యకు అంకితం చేశారు.
ఉ నీవొక పెద్ద వెల్గువయి..
ఆమె మీద వున్న ప్రేమకు చిహ్నంగా ఇచ్చిన ఈ కృతిలో విశ్వనాథవారి పాత్ర, ఆమె పాత్ర రెండూ చాలా స్పష్టంగా గోచరిస్తవి. అసలు ఈ నవల వారి స్వీయానుభవ లహరియని చాలామంది విశ్వాసం. ఈ విషయమై విశ్వనాథ సాహితీ పరిశోధకులనేకులు పరిశోధించి వ్యాసాలు వ్రాశారు. సాక్షాత్తు వారి కుమారుడు పావని శాస్ర్తీ కూడా తండ్రిగారి నుండి విని గ్రహించిన అంశాలనుబట్టి 1987-88లో వేయిపడగలు రెండవసారి సీరియల్‌గా వచ్చినపుడు వేయి పడగల నేపథ్యం అన్న పేరుతో మూడు నాలుగు నెలలపాటు ఐటెం బాక్స్‌గా ఆంధ్రపత్రిక వీక్లీలో వ్రాయడం జరిగింది.
మొత్తంమీద సారాంశం- విశ్వనాథవారు చెప్పినది, విమర్శకులు భావించినది- ఈ నవలలోని చాలా పాత్రలు సమకాలీన సమాజంలోవే- దృశ్యాలుకూడా.
నవలలోని సుబ్బన్నపేట విశ్వనాథవారి స్వగ్రామమయిన కృష్ణా జిల్లా నందమూరు - అందులోని మేరు గోపాలస్వామి ఆలయం, విశే్వశ్వరస్వామి ఆలయం, మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంతో చల్లపల్లి, తోట్లవల్లూరు కోటలను తన చుట్టూ నిర్మించుకొని సుబ్బన్నపేట అయింది.
వేణుగోపాలస్వామి ఆలయ ధర్మకర్తలలో ఒకరైన గూడవల్లి బ్రహ్మయ్యగారు, నూజివీడు జమీందారులలో ప్రసిద్ధులైన ధర్మ అప్పారావుగారు, రంగయ్యప్పారావుగారు- కలిసి నవలలోని కృష్ణమనాయుడుగా రూపుదిద్దుకొన్నారు. ధర్మ అప్పారావుగారి ఔదార్యం, రంగయ్యప్పారావుగారి శౌర్యం కృష్ణమనాయుడిలో కనిపిస్తాయి.
కథానాయకుని తండ్రి రామేశ్వరశాస్ర్తీగారు విశ్వనాథవారి తండ్రి శోభనాద్రిగారే. రామాయణంలో తన తండ్రిని గూర్చి వారు చెప్పిన- ఆ నా తండ్రి ఎన్... అనే పద్యం శాస్ర్తీగారికి సరిగా అన్వయిస్తుంది. శాస్ర్తీగారి బహు వివాహాలు మినహాయిస్తే- ఆ పాత్ర ముమ్మూర్తులా శోభనాద్రిగారే. ఇటువంటి పాత్ర కార్యకంఠ గణపతిముని రచించిన పూర్ణ అనే నవలలో గోచరిస్తుంది. అది భారతిలో కొంత ప్రచురితమై తరువాత వారి కుమారునిచేత పూరించబడి ఆంధ్రప్రభలో సత్యప్రభ అనే పేరుతో నవలగా వచ్చింది.
నవలలోని ప్రధాన పాత్ర ధర్మారావు పూర్తిగా విశ్వనాథవారే. దానికి సంబంధించిన విశేషాలు చెప్పబోతున్నాను. అందులోని కిరీటి నాయని సుబ్బారావుగారు. రాఘవరావు - కొడాలి ఆంజనేయులుగారు. కొంతకాలం విశ్వనాథవారితో జంట కవిగా ఉన్నారు. సూర్యపతి పాత్ర కొల్లిపర సూరయ్య చౌదరిగారు. కుమారస్వామి పాత్రకు మూలం కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావుగారు.
కేశవరావు పాత్ర కోపెల్ల హనుమంతరావుగారు. రుక్మిణమ్మరావు పాత్రకు మూలం చాలావరకు మట్నూరి కృష్ణారావుగారి శ్రీమతి. ఆవిడ గాంభీర్యము, ఔదార్యము ఈ పాత్రలో గోచరిస్తవి. ఇక నాయరు పాత్రకు బందరులోని ఒక కిళ్లీ కొట్టు ఓనరు. పసిరిక- గిరిక పాత్రలు- కేవలం విశ్వనాథవారి ఊహావైభవంలో నుండి పుట్టిన పాత్రలు. కృష్ణమనాయుడు, రామేశ్వర శాస్ర్తీ మధ్య స్నేహం- కొన్నాళ్ళు మాట్లాడుకోకపోవటం మళ్లీ కలవటం- ఇదంతా గూడవల్లి బ్రహ్మయ్యగారు, శోభనాద్రిగార్ల మధ్య జరిగిన సంఘటనలే.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ప్రసాదరాయ కులపతి