వినమరుగైన

చివరకు మిగిలేది -బుచ్చిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరకి మిగిలేదేమిటి? అనే ప్రశ్నకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం రావచ్చు. అసలీ ప్రశ్నలోనే మూడు అంశాలిమిడి వున్నాయి. చివరికి అంటే ఎప్పటికి చివరకవుతుంది? మిగలటం అంటే ఏమిటి? ఏమిటి అనేది ఏది? ఈ మూడు ప్రశ్నలూ దార్శనికమైనవి. సాంఘిక, సామాజిక శాస్తజ్ఞ్రులు మరోరకంగా ప్రశ్నిస్తారు. ఏది మిగలాలి? ఏది మిగలకూడదు? అని. వేయిపడగలు నవలలోని ధర్మారావు పాత్రకూ చివరకు మిగిలేది నవలలోని దయానిధి పాత్రకూ దొరికిన సమాధానాలు ఒకరకమైనవి కావు. మనోవైజ్ఞానికవేత్తలు మరోరకమైన మూడు సందేహాలు వెలిబుచ్చారు. ఎవరికి? ఎందువలన? శేషమా నిశే్శషమా? అనేవా ప్రశ్నలు. కళాకారులు ఈ ప్రశ్నకు లభించే సమాధానపు సారాన్ని కంటే రూపాన్ని పట్టించుకుంటారు. వాళ్ల దృష్టిలో సారం అంటే అంతర్ముఖీనమైన రూపమే.
చివరకు మిగిలేది నవల ఏ ప్రశ్నతో మొదలయ్యిందో అదే ప్రశ్నలో ముగిసి విశ్రాంతి పొందింది. కాల్పనిక సాహిత్యంలో ఒకానొక ప్రక్రియ అయిన నవలని చదవటం ముగించిన తర్వాత కూడా ఆ నవలలోని జీవితం నవల నుండి బయటపడి జీవితంలో కొనసాగుతుంది. బుచ్చిబాబు రచించిన ఒకే ఒక నవల చివరకు మిగిలేది ఓపెన్ ఎండింగ్ నవల. మహాగ్రంథమేదయినా మృతువుతో అంతమయ్యేదయినా అది జీవన స్రవంతిలో భాగమైపోతుంది. శేషప్రశ్నకు లభించే సమాధానం ఆబ్జెక్టివ్ కొరిలేటివ్ అయినపుడే అది పాఠకుల సహానుభూతిని పొందుతుంది. వస్తుస్థితి ఆత్మగతమవటమే ఆబ్జెక్టివ్ కొరిలేటివ్ అంటే-
అసలీ ‘సమాధానం’ అనే మాట చాలా విచిత్రమైనది. అన్ని మతాలూ, సంస్కృతులూ, విశ్వాసాలూ, రాజకీయాలూ, సాంఘిక నీతి నియమాలూ, విద్యా వైద్య ప్రణాళికలూ, అభ్యుదయ, విప్లవ భావ వాదాలూ ఏవైనా కానివ్వండి. అవన్నీ విడివిడిగా వాటికి అనుకూలమైన సమాధానాల్నే అందిస్తాయి.
దయానిధికి దొరికి సమాధానమేమిటి? దొరికింది వజ్రమే అయినా అతడు కోల్పోయిందేమిటి? తీరా తిరిగి దరి చేరిన కోమలికి నిధి దొరికిన దయానిధి ఏ సమాధానమిస్తాడు? ఓ శిశువునిచ్చి అమృతాన్ని అమృతం చేసిన దయానిధి మరలా ఆ అమృతానే్న ఎందుకు తాగలేకపోయాడు? తమ తమ కాల్పనిక, కృత్రిమ అవసరాల్లోంచి దయానిధి జీవితంలోకి ప్రవేశించిన నాగుమణి, సుశీల ఎందుకని అలా అసంకల్పితంగా నిష్క్రమించారు? తల్లి అప్పుడెప్పుడో చేసినట్లు చెప్పబడుతున్న ఓ తప్పుకి ఏ పాపమూ ఎరుగని దయానిధికి ఈ సభ్య సమాజం ఇంకా ఎన్నాళ్లని శిక్షిస్తూనే ఉంటుంది? ఏ మేరకు ఆ శిక్ష? వ్యక్తిని సమాజం శిక్షిస్తే అదే సమాజాన్ని వ్యక్తి శిక్షించగలడా లేడా? అసలా తప్పు ఒప్పు అనే మాటలకు నిశ్చితార్థాలు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాయా?
అడపాదడపా ఒకటో రెండో ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అపుడపుడు సమాజం అతలాకుతలం అవుతుంది.
క్షామం, ప్లేగ్, నిరుద్యోగం సమాజంనించి వ్యక్తుల్ని విడదీసి దూరంగా పాకల్లోకి శవాల్లా విసిరేస్తుంటుంది. క్షామంనించి, ప్లేగ్ నించి, నిర్వ్యాపారాన్నించి రక్షించబోయే దయానిధిలాంటి డాక్టర్లని అదే సమాజం ఏకాకుల్ని చేస్తుంది. బయట జరిగే యుద్ధాలకూ లోపల జరుగుతూండే సంఘర్షణకీ పోలికలూ కారణాలూ కన్పించవ్. ఉప్పు సత్యాగ్రహంలోని నిప్పుని అంతర్జ్వాలలో రగుల్తూన్న దయానిధి లాంటి వ్యక్తి ఒకే ఒక్క రోజు ముట్టుకుంటే చివరికది భస్మం చేసింది అతని వైవాహిక జీవితానే్న. చచ్చిన ఎలుకలూ ఒకనాటి రాయలసీమ - రాళ్లసీమలో ఆకలి దప్పులకు కారణం పరాయిపాలనేనా? దయానిధి భార్య ఇందిర చేతులపైని చర్మం తిరగబడటానికి కారణం దయానిధిలోని ప్రేమ రాహిత్యమేనా? అమ్మ మాతృదేవత అయింది కాని తండ్రి పితృదేవుడు ఎందుకు కాలేకపోయాడు? బొంబాయి మహానగరంలో భర్తతో ఏకాంతాన్ని పొందలేని శ్యామల పంజరాన్ని విసిరేస్తుంది కాని ఆమె మనోవ్యాధికి నిజంగా మందుందా లేదా? స్వయంగా డాక్టర్ దయానిధి మనోవ్యాధికి గురైన మందు ఎవరిస్తారు చివరికి?
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వేగుంట మోహనప్రసాదు