వినమరుగైన

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలం స్ర్తి గురించి చేసిన ఈ వ్యాఖ్యలకు అక్షర రూపమే రంగనాయకమ్మగారి ఈ విప్లవ రచన జానకి విముక్తి. ఈ రచన ఇప్పటి ఛాందసవాదుల్ని మూర్ఛపోయేలా చేసింది.
జానకి విముక్తిని చదివిన పాఠకులు తమని తాము అర్థం చేసుకోవగలుగుతారు. ఆర్థిక రాజకీయాంశాలను గురించిన కనీస అవగాహనకు వస్తారు. ఆత్మవిశ్వాసాలకూ, ఆత్మగౌరవాలకూ సంబంధించిన స్పష్టమైన నిర్వచనాలూ, మానవ సహజాతాలైన దయ, స్నేహం, ప్రేమ, శారీరక, మానసిక స్పందనలూ, పునరుత్పత్తి క్రియలలోని మాధుర్యాలను గురించి పునరాలోచిస్తారు.
ప్రకృతి విరుద్ధమైన వివాహపద్ధతులూ, వికృత చేష్టలయిన అలంకరణలూ, బలిసిన వ్యక్తుల ఆడంబరాలూ, బ్రతుకుల ఎడల కనీసపు ఆలోచనలు లేకుండా యాంత్రిక జీవనానికి అలవాటుపడిపోయిన వ్యక్తుల డొల్లతనాలూ స్పష్టంగా కళ్లకు కనపడతాయి ఈ నవల్లో. పశుపక్ష్యాదుల మీదా, పసిబిడ్డలమీదా, వృద్ధులమీదా, చెట్లుచేమల మీదా మనం పోగొట్టుకున్న మానవీయ భావాలు మళ్లీ మన కళ్లబడతాయి.
ఇలా ఎన్నో అంశాలపై పాఠకుడి జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎంతో మానసిక, శారీరక ఆనందాలూ, ఆరోగ్యాలూ పాఠకుడిలో చోటుచేసుకుంటాయి.
ఇక మళ్లీ మనం పాత్రల దగ్గరకొస్తే ఈ నవలలోని ఇంకో ప్రధానమైన పాత్ర శాంత. ఈమె లాయరు. ఈమె, సత్యం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుని పెళ్లితతంగం లేకుండా కలిసివుంటారు. సంస్కారవంతమైన చేష్టలతో, విప్లవాత్మక భావాలతో తనేమిటో, తన వర్గమేమిటో తెలుసుకొని, తమ ఉమ్మడి సమస్యల పరిష్కారానికి తన సహకారాన్ని అందించటమే తన జీవితాదర్శంగా జీవితాన్ని ప్రారంభించిన పాత్ర శాంత పాత్ర.
చదువు సంధ్యలు పెద్దగా లేని, ప్రపంచ జ్ఞానం అసలే లేని స్థాయి నుండి, శాంత ఆలోచనలతో సమానమైన స్థాయికి ఎదిగి, రాజకీయాలను అర్థం చేసుకుని విముక్తి ప్రస్తానం వైపు అడుగులు వేసే పాత్ర జానకి పాత్ర. అయితే బాగా చదువుకొని, జీవితానికవసరమైన అన్ని అంశాలలోనూ కనీస పరిజ్ఞానం పొందాక స్ర్తి విమోచనవైపు నడక సాగించిన పాత్ర శాంత పాత్ర.
ఈ రెండు పాత్రలూ పాఠకుల మనస్సుల్లో నుండి చెరిగిపోవు. ఈ ఇద్దర్నీ వెనక వుండి, ఆ స్థాయికి తీసుకువచ్చినవాళ్లు సత్యం, డాక్టర్ మూర్తి.
ఇంకోరకంగా చెప్పుకోవాలంటే, ఈ పాత్రలన్నీ ఎప్పుడూ అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా తమని తాము వున్నతీకరించుకుంటాయనటం సబబుగా వుంటుంది.
ఇప్పుడిక సత్యం పాత్ర గురించి చెప్పుకొందాం!
ఇప్పటివరకూ తెలుగులో ఏ అభ్యుదయ, విప్లవ రచయితా ఏ నవలలోనూ పరిచయం చేయని పాత్ర ఇది సంప్రదాయ తెలుగు నవలా సాహిత్యంలో కనబడే అసహజమైన కల్పిత, కృత్రిమ హీరో పాత్రలకు విరుద్ధమయిన, విలక్షణమైన పాత్ర ఇది.
సత్యం సాదా సీదా మనిషి. ఆకారంలో, ఆలోచనలలో వున్నతమైన భావాలున్నవాడు. చిన్నపాటి ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. పుస్తక పఠనం ద్వారా, తనకన్నా తెలివైనవాళ్ల ద్వారా తనని తాను అనునిత్యం జ్ఞానవంతుణ్ణి చేసుకుంటూ శ్రమిస్తుంటాడు. సరియైన జ్ఞానంలోంచి ఎదిగిన అతను మానవ శరీర ధర్మాలను గురించి, సమాజ నిర్మాణం గురించి, వ్యక్తులమధ్య సంబంధాల్ని గురించి, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అంశాల్నిగురించి స్పష్టమైన అవగాహనతో వుంటాడు. అతని మనస్సులోని స్వచ్ఛత, మాటల్లోని స్పష్టత పాఠకుడికెంతో నచ్చుతాయి.
సత్యం శుభ్రంగా వంట చేస్తాడు. ఇంటిని శుభ్రపరుస్తాడు. ఆడవాళ్లతోపాటు అన్ని పనులూ సమానంగా చేస్తాడు. తను చెప్పేదాన్ని నూరుశాతం చేతల్లో ప్రదర్శిస్తాడు. ప్రేమించవలసినవాళ్లని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ద్వేషించవలసినవాళ్లని ధైర్యంగా ద్వేషిస్తాడు.
సాధారణ పాఠకుడికి ఈ సత్యం పాత్ర ఎంతో విస్మయం కలిగిస్తుంది. ఆనందం కలిగిస్తుంది.
పురుష పాఠకలోకానికి మింగుడుపడని స్ర్తిని చలం సృష్టిస్తే, మహిళా పాఠక లోకానికి ప్రీతిపాత్రమైన పురుషుణ్ణి ఈ నవల్లో రంగనాయకమ్మగారు సృష్టించారు.
నవలంతా సున్నిత హాస్యంతో, హేతుబద్ధ తర్కంతో, సహజమైన వాక్య నిర్మాణంతో హాయిగొలిపే సన్నివేశాలతో నిండిపోయి జీవనంతో నిండి పొంగిపొర్లుతుంటుంది. చాలా చాలా సుందరమైన కొత్త పదాలు. అంతకుముందెప్పుడూ పరిచయం లేని కొత్త వ్యాఖ్యానాలు అడుగుగడుగునా మనకు కనిపిస్తాయి. ఇలాంటి కొత్తదనానికి కారణం బహుశా జానకి విముక్తి నవలాంశం కొత్తది కావటమే.
ఇన్ని విభిన్న సాంప్రదాయేతర అంశాల మేలుకలయిక జానకి విముక్తి. వెయ్యిన్నొక్క కొత్త విషయాల్ని ఈ నవల ద్వారా పాఠకుడు నేర్చుకుంటాడు.
ఇంతటి గొప్ప రచనను అందించిన రంగనాయకమ్మగారు మన సమకాలీనులు కావటం మనకు సంతోషం.
మంచి సాహిత్యానికుండాల్సిన లక్షణాలను గురించి మనం కొత్తగా ఇపుడు నిర్వచనం చెప్పుకోవాల్సన అవసరం ఏమీ లేదు. మంచి సాహిత్యం ఎలా వుండాలో ఈ నవలలోనే మూడవ భాగంలోని 190-191 పేజీల్లో రంగనాయమ్మగారు చెప్పారు. ఆ వాక్యాల్నే ఇక్కడ గుర్తుచేసుకోవటం సందర్భోచితంగా వుంటుంది.
మంచి సాహిత్యంలో మానవ జీవితం వుంటుంది. మానవ హృదయాలలో వుండే న్యాయమూ, ఔన్నత్యమూ వుంటుంది. మార్గదర్శకత్వాన్నిచ్చే పాత్ర చిత్రణ వుంటుంది. దానిని చదివిన పాఠకుడికి తనని తాను సంస్కరించుకోవాలని ఆరాటం కలిగించే కళాత్మకత వుంటుంది. అందుకే వున్నత సాహిత్యం ఒక శాస్తమ్రే. శాస్త్రంగా కనిపించని శాస్త్రం. శాస్త్రంకన్నా శక్తివంతమయిన శాస్త్రం. చక్కని రంగుతో, రుచితో, సువాసనలీనే ఔషధం లాంటిది మంచి సాహిత్యం.
జానకి విముక్తి నవల విషయంలోనూ ఈ నిర్వచనం అక్షరసత్యం.
-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జి.మోహన్‌రావు