వినమరుగైన

కాంతం కథలు- మునిమాణిక్యం నరసింహారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషులందు పుణ్యపురుషులు వేరయినట్లు, నామధేయులందు సార్థక నామధేయులు వేరుగా ఉంటారు. మునిమాణిక్యం ఇటువంటి రెండో కోవకు చెందినవారు. ఆయన ఇటు సాంసారిక జ్ఞానానికి ముని, అటు హాస్యానికి మాణిక్యం గూడాను. నటుల్లో ఇంగ్లీషువారికి పాల్‌ముని ఎటువంటివాడో రచయితల్లో తెలుగువారికి మన హాస్యముని అటువంటివాడు.
అటువంటి హాస్యముని మాణిక్యం నరసింహారావుగారు రచనల్లో మాట విడిచి సాము చేసిన వ్యక్తి కాదు. కబుర్లలోనూ సంగీతంలోనూ ఉండేవి సంగతులేనని హాస్యోక్తి. అది రచనలకి కూడా వర్తిస్తుంది. ఇక్కడ సంగతి అంటే సబెక్ట్ లేక కథావస్తువు అని అర్థం. కబుర్లు చెప్పుకోడానికి ఒక సబ్జెక్ట్ ఎలా కావాలో కథలు చెప్పుకోవడానికీ, కథలుగా రాయడానికీ కూడా సబ్జెక్ట్ అవసరం. ఒక వ్యక్తిమామూలు జనసమూహం నించి జ్ఞానిగా ఎదిగి కవిగానో రచయితగానో పరిణితి చెందే ప్రక్రియ ప్రయాణంలో ఒక ‘దశ’ ‘దిశ’ దొరకడం అనేది అందరి రచయితల విషయంలోనూ కుదర్దు. దానినే విమర్శకులు శైలీ, శిల్పం అనడం కూడా కద్దు. ఇవే కాక ఒక స్ర్తి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా ఒక రచయితకు ఒకే పాత్రకి జీవం పోసే అదృష్టం దొరకడం గూడా బహు అరుదు. మన తెలుగు సాహిత్యంలో ఒక అడివి బాపిరాజుకి ఒక నారాయణరావూ, ఒక గురజాడకి ఒక పూర్ణమ్మ గిరిశాలూ, ఓ ముళ్ళపూడికి ఓ బుడుగూ అప్పారావులూ, ఓ మొక్కపాటికి ఓ పార్వతీశం, ఓ చిలకమర్తికి ఓ గణపతీ- ఓ భానుమతికి ఓ అత్తగారూ మాత్రమే దొరికారంటే- ఒక బిడ్డకు జన్మనిచ్చి పోషించి పైకి తీసుకురావడం ఎంత కష్టమో ఒక పాత్రని సృష్టించి పెంచి నిలపడం కూడా అంతే కష్టం. యాదృచ్ఛికం. కాంతం ద్వారా మునిమాణిక్యం వారికి అటువంటి మహదవకాశం దొరకడం తెలుగు జాతి అదృష్టం. అలా తెలుగువారికి ఆనందించడానికి అందిన సాహితీ అదృష్టం పేరు కాంతం.
మునిమాణిక్యంగారు హాస్య కథలు, తెలుగుకోపం, తిరుమాళిగ, రుక్కుతల్లి, దాంపత్యోపనిషత్, మన హాస్యము అని ఎన్నో రచనలు చేసి హాస్యం యొక్క విశ్వరూపాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసినా కాంతం కథల ద్వారానే ఆయన మనకు దగ్గరయ్యేరు. ఎవరీ కాంతం? అంటే ఆయన ‘నేను’ అని ప్రథమ పురుషలో వ్రాయబట్టి ‘కాంతం’ ఆయన భార్యామణిగానే వెలుగు చూసింది. ఐతే కృష్ణశాస్ర్తీ బాధ లోకం బాధైతే- లోకం బాధ శ్రీశ్రీది అన్నట్టు ‘కాంతం’ పదహారణాల తెలుగు ఇల్లాలు. వాస్తవానికి ఆమె ఏ తెలుగు భర్త యొక్క భార్యయైనా కావొచ్చు. ఆ యొక్క పాత్రకి ఈ ‘సార్వకాలీనత’ ‘సార్వజనీనతా’ ఆపాదించి పెట్టింది ఆమెలోని గడుసుదనం, పెంకెదనం. మొగుడిపైన ఒక గట్టి పట్టు, అంతకుమించిన ప్రేమానురాగాలూ, కర్తవ్య పరాయణత అను పతివ్రతా లక్షణాలు ఏ తెలుగు ఇల్లాలి మనసులోంచి ఈ గుణాలన్నీ తొంగి చూడవూ? అందుకే ఆమె అచ్చతెలుగు ఇల్లాలై మన అభిమానాన్ని చూరగొంది. వెనె్నలలో అనే కథలో ఆయనే అంటాడు నేను నా కథలన్నీ నీ పేరే రాసినట్టు అని. అవును మరి, ఎవరి పెళ్లాల్ని గురించి రాస్తే ఎవరూర్కుంటారు. నా పెళ్లాన్ని గురించి మాత్రమే నేను వ్రాశానని భ్రమింపజేస్తే అందరూ ఆనందిస్తారు. సాధారణంగా మనుషులలోని తేడాలూ, వారి మనసులోని గూఢాలోకనలూ, ప్రవర్తనలోని అసమానతలూ రచయితలకి కథా వస్తువులవుతాయి. ఈ దుర్గణాల్ని నీలో చూచానని రచయిత చెప్తే అంతే సంగతులు. అందుకని వాటిని తన మీదా, తన భార్యమీదా ఆపాదించుకొని మునిమాణిక్యంగారు తన సాహితీయాత్రను సాగించేరు. వీరి కాంతం మొదట్లో స్నిగ్ధ, ముగ్ధ, అందుకు ఉదాహరణ ఎనిమిదీ ఎనిమిదీ అనే కథ. అందులో ఏమీ ఉండదు. కథ సింపుల్. కథనం సూపర్బ్. ఒక కుర్రవాడు కొత్తగా పెళ్ళైన కుఱ్ఱవాడు అత్తారింటికొచ్చాడు. పెళ్లాంమీద పెరపెరలాడే మనసు. అమ్మాయి కనబడదు. ఎదురైతే ఏదో చెయ్యాలని ఏకాంతంలోని ఎన్‌కౌంటర్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ పిల్ల కూడా ఇతని ఆకలి చూపుల్ని గమనించి కార్యం కాకముందు నా జోలికొస్తే అందర్లో అల్లరి చేస్తా, చెంపదెబ్బ కొడ్తానని మనసులో శపథం చేసుకుంటుంది. కాలం కలిసొచ్చి డాబామీద ఒంటరిగా దొరికినప్పుడు ధైర్యం చేసి ముద్దుపెట్టుకుంటే ఆమె పరవశించి రెండో బుగ్గ అందించడం అందమైన ముగింపు. అన్నట్టు చెప్పడం మరిచాను, ఆమె పేరు కాంతం అని చెప్పడం ఇంకా అనుకోని ముగింపు.
- సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పిశుపాటి ఉమామహేశ్వరమ్