వినమరుగైన

కాంతం కథలు- మునిమాణిక్యం నరసింహారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ చతురకతే ఒకో సందర్భంలో ఓడిపోవాల్సొచ్చినా ఆ ఓటమిలోనే గెలుపు వెతుక్కుంటూంటాడు భర్త వెంకట్రావు. మొండివాదన కథలో బందరు నుండి ఒంగోలుకు పోయే దోవలో గుంటూరు తగలకపోయినా ‘ఆ!తగలకేం లెండి. ఇష్టమైతే బాగానే తగులుతుంది’ అని సూటీ పోటీ బాణమేసి మొత్తానికి వాళ్ల వాళ్లకి ఆవకాయ బుట్ట పంపగలిగే చతుర నారీమణి కాంతం. కనె్నకాంతం ప్రౌఢ కాంతంగా మారేసరికి ఐదుగురు పిల్లలు. అవధానులు అష్టావధానం చేసినట్టుగా కాపురం చేస్తుంది కాంతం. గృహ సామ్రాజ్ఞిత్వం ఆమె మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనబడుతూంటుంది. మునిమాణిక్యంగారి మనసు అట్టడుగు పొరల్లోని కోరికమేమిటంటే అటువంటి ధీమతి శ్రీమతిగా దొరికితే ఆ భర్త బ్రతుకు ధన్యం అని.
అందుకే తెలిసీ ఓడిపోతూ ఆమెకు విజయాలనందిస్తూ సంసారం పునాదులను గట్టిపరచుకుంటూంటాడు. భార్యని లొంగదీసుకోవడమంటే భార్యకి పూర్తిగా లొంగిపోవడమేనని ఆయన తరచూ అందరితో జోక్ చేస్తూండేవారు. కాంతానికి భర్తా, పిల్లల ఎడమ ప్రేమానురాగాలుంటే భర్త వెంకట్రావుకి ఆమెపట్ల లోలోపల ఆరాధనాభావం కూడా ఉంటుంది. నీ వంట బాలేదు, నే బయట భోంచేస్తానన్న పెద్దమనిషి అయ్యరు సాంబారు ఎండు మెతుకులతో బుద్ధితెచ్చుకుని మళ్లీ ఇంటికొచ్చి కాంతం అమృతహస్తంతో వడ్డించిన భోజనాన్ని తృప్తిగా తిని ఆమె ఒడిలో విశ్రమిస్తాడు. దాంపత్య జీవనానికి కంచం, మంచం ఈ రెంటిమధ్యా సహకారం, సర్దుబాటు ఇవే మేలైన బాటలని మునిమాణిక్యం గారు కాంతం కథల్లో అన్యాపదేశంగా చాటుతుంటారు. అందుకే కాంతం ప్రతీ ఇంటికీ అంటే ప్రతీ తెలుగింటికీ ఆరాధనీయమైన ఇల్లాలుగా రూపొందింది. మునిమాణిక్యం గారి హాస్యం అరటిపండు తొక్కమీంచి జారిపడ్తే వచ్చే నవ్వు కాదు. పడ్డచోట సుఖం వెతుక్కునే హాస్యం. ప్రతీ బరువైన విషయాన్నీ తేలికగా తీసుకోవడంలోనే ఆయన కలం ద్వరా హాస్యం చిప్పిల్లుతుంది. అందుకే ఆయన హాస్యం నవ్వించదు- సున్నితంగా గిలిగింతలు పెడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం- ఆయన హాస్యానికి పునాది కరుణ. ఎదటి మనిషిని క్షమించి అర్థం చేసుకుని సహించే గుణం. కాంతం తోటి ఆయన సాంసారిక యాత్రలో చాలా దూరం వెళ్లేక తృప్తి చెందిన ఆయన కలం ఇక కాంతం గురించి చెప్పాల్సిందేమీ లేదని తీర్మానించుకుని కాంతం కథలకి పుల్‌స్టాప్ పెట్టడం కోసం కాంతం వృద్ధాప్యం, పిల్లలు గల తల్లి అన్న రెండు కథలు రాసి ఊరుకుంది. వీటితో కాంతం వృద్ధాప్యంలో కాంతం జీవనాన్ని గూర్చిన ప్రశంసాపూర్వక సమీక్ష ఉంటుంది. మొత్తానికి తనకి మంచి భాగస్వామినే లభించిందన్న తృప్తి వ్యక్తపరుస్తాడు వెంకట్రావు. పిల్లలు గల తల్లి కథలో కాంతం కాలధర్మం చెందుతుంది. ఆ కథలో కాంతం మరణశయ్యమీద వుండి గూడా తన ప్రాణాల్ని గురించి ఆలోచించకుండా ‘డాక్టర్‌గారికి కాఫీ ఇచ్చారా, మీరు భోంచేశారా, పిల్లలకి టిఫిన్ తెచ్చి పెట్టండి’ అంటూ కర్తవ్యాలను గుర్తుచేస్తూ పిల్లలు పలకపుల్ల కోసం పోట్లాడుకుంటూంటే తగువుతీర్చి పక్కలో పడుకోబెట్టుకుని కథలు చెప్పి నిద్రపుచ్చుతుంది. భర్త కాళ్లు పిసుకుతుంటే ‘నేనెంత పాపిష్టిదాన్ని’ అని లబలబలాడిపోతుంది. మునిమాణిక్యంగారి కలం హాస్యంతోపాటు కరుణరసాన్ని కూడా చిందిందించగలదని చాటి చెప్పే కథ ఈ పిల్లలు గల తల్లి. ఈ కరుణ వారి జీవితంలో ఎంత ప్రాధాన్యత వహించకపోతే ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ సంసార రథాన్ని ఇంత ఆనందంగా ఇనే్నళ్లూ లాక్కొచ్చారూ అన్న ప్రశ్న పాఠకుల మనసులో వొదులుతాడు మునిమాణిక్యంగారు. కాంతం వృద్ధాప్యం, నిర్యాణం చాలామంది సామాన్యులకు మల్లే దయనీయం కాదు, పరిపూర్ణం. కాంతం తన జీవితాంతం ఒక డిక్టేటర్ కాదు ఎబుల్ అడ్మినిస్ట్రేటర్. సుఖ సంసారికే కాకుండా అర్థవంతమైన సంసారనికి కాంతం కారెక్టర్ ఒక ప్రతీక. అందుకే ఆమె తెలుగు నేలన ఇంటింటి వెలుగైంది. కాంతం కాలం చేశాక కలం సాగదనుకున్నాడు రచయిత. కానీ ఆమె మరణం భౌతికమే కానీ మనసికం కాదు గదా.
మునిమాణిక్యం గారి తలపుల్లో సదా మెదుల్తూనే ఉంటుంది కదా. అందులోనూ కాంతమే తానుగా తానే కాంతంగా మమేకమైన మునిమాణిక్యంగారు తెలుగు ప్రజల కోసం మళ్లీ కలం కాప్ తీసి ప్రయాణ సన్నాహం అనే కథ రాసి కాంతానికి మరణం లేదని నిరూపించారు. అందుకే పీఠికా సామ్రాట్ తల్లావఝుల శివశంకరశాస్ర్తీగారు ఇలా అన్నారు- ‘కాంతం కథలు రాస్తే మునిమాణిక్యమే రాయాలి, మునిమాణిక్యం రాస్తే కాంతం కథలే రాస్తాడు’ అన్నారో సందర్భంలో. అందరూ సాధారణంగా వైవాహిక జీవితం కంటకప్రాయం అని అనుకుంటూంటారు. అటువంటిది సంసారిక జీవనవనంలో ముళ్లన్నీ ఏరిపారేసి కాంతం ద్వారా నవ్వుల పువ్వుల్ని మాత్రమే మనకందించి తెలుగు హృదయాల్లో శాశ్వత చిరునామా సంపాదించుకున్న మునిమాణిక్యం నిజంగా మన మాణిక్యమే.
- సమాప్తం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పిశుపాటి ఉమామహేశ్వరమ్