వినమరుగైన

మా గోఖలే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షావుకారు భవనానికి రాళ్లెత్తినకూలీల కథ రాయి మడుసులు. కిష్ట ఒడ్డున నుండే నల్లరాయి కొండ తొలిచి భవంతి కట్టిన రాయి మడిసికి గృహప్రవేశం విందులో చోటుండదు. ఇంటికిపోయి తిండికి కూర్చుంటే బువ్వలోకి చల్లలేక దోపిడీ స్వరూపం చూపిస్తుంది.
కొత్త కౌల్దారి చట్టం వచ్చింది. పొలంలోంచి కౌల్దారును అకారణంగా తొలగించగూడదు. పండిన పంటలో సగం అతనికే చెందాలి. అయినా పెద్ద బసవయ్యగారి ఆరెకరాల మాగాణి పొలం కౌలుకు చేస్తున్న రాములు కుటుంబాన్ని చిన్న సాకుతో తొలగిస్తాడు రైతు. ఇసువంటి చట్టాలు పులుసు గారి పోతయ్యని అందరికీ తెలుసు- అయితే పెదబసవయ్య దగ్గర ఇక జీతగాడుగా పని చెయ్యనని రాములు చేసిన తిరుగుబాటు భూస్వామ్యానికి ఒక హెచ్చరిక (పంటసేలు).
మోతుబరి రైతు కొడుకు గోపాలం మోసంజేస్తే పెళ్లిగాకుండానే గర్భవతి అయింది పనిపిల్ల మంగ. కుటుంబం నలుగుర్లో తలెత్తుకు తిరగలేని పరిస్థితిలో ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు బండి రాముడు. కృత్రిమమైన ఏ సామాజిక నిర్బంధాలు లేవతనికి. మంగ దుస్థితికి గోపాలమే కారణమని కథ చివర మాత్రమే మనకి తెలుస్తుంది. సున్నితమైన శిల్ప సంవిధానంగల ఈ కథ బండి రాముడి పెళ్లాం.
పొరుగూరినుంచి పొట్ట చేత బట్టుకు వచ్చిన గురవయ్య కొట్టు పెట్టుకొని కొద్ది కాలంలోనే సావుకారు అవుతాడు. తాపీ పని చేసే కొండయ్య బతుకంతా రెక్కలు ముక్కలు జేసుకున్నా గట్టి యిల్లు కట్టుకోలేకపోతాడు. ఈ వైరుధ్యానికి కారణం కనుక్కోమంటుంది దేవుడిచ్చిన సొమ్ము కథ.
కుటుంబ మూలాలు కదలబారిదారి తప్పి సెన్నాపట్టం చేరిన ఇద్దరు మనుషులు అప్పయ్య, మాదిగ రామయ్య. ఇద్దరూ పట్నంలో ఇమడలేకపోయినవాళ్లే. అక్కడ వీధిలో అరుగులు లేవు. ఎందుకు అరుగులు ఉండనియ్యరో అప్పయ్యకు తెలియలేదు. మనుషులు తిరుగుతుంటారు కానీ నిలబడరు. నిలబడి మాట్లాడరు. మాట్లాడితే బాస అర్థంగాదు. రిక్షాలొస్తయి. కార్లొస్తయి. అందులో మనుషులెవరైందీ తెలవదు. గ్రామ, పట్టణ జీవన వైరుధ్యాన్ని ఈ దారి తప్పిన ఇద్దరు మనుషులు బట్టబయలు చేస్తారు. అప్పుల పాలయ్యే కుటుంబాలు, భాగాలు పంచుకొని బస్తీల దారి పట్టిన కొత్త తరం కుర్రాళ్లు, లేచిపొయ్యే ఆడకూతుళ్లు, పస్తులుండే కూలీలు- ఈ నేపథ్యంలో తమకు మిగిలిన ముప్పాతిక ఎకరం పొలం అమ్మటానికి పదేళ్ల తర్వాత సొంత వూరికి వచ్చిన గోపాలానికి ఈ పతనమంతా కనబడితే ఏదో పురాతన శిథిలాన్ని చూస్తున్నట్టుంది. ఇది మార్పు కథ.
అకృత్రిమమైన సజీవ కథా శైలి మా గోఖలేది. తన జీవితానుభవ మూలంలోంచి వచ్చిన ఆ శైలి అప్పటి గుంటూరు ప్రాంతపు గ్రామీణ జీవనశైలే. ఆ మాండలిక భాష, ఆ యాస అద్భుతంగా పట్టుకున్నాడతను. ఆ మాటలు తప్పించి వేరే మాటలు అక్కడ చొప్పించలేం. అంటే ఆ మనుషులు అచ్చంగా అట్లానే మాట్లాడతారన్నమాట. ‘‘పోనీలే, పిల్లలు గల కుటుంబం. అట్ట కలిసొచ్చింది గనుక పరువు దక్కింది.
పాపం, ఇంతకుముంగల నాగరత్తమ్మా బిడ్డలు ఎన్ని అగసాట్లు బడిందీ, ఎవురికి తెలవదు? మరదేందో సొరాజ్జం, సొరాజ్జం అనరుత్తా సబలు బెట్టేతలికి, అందిన పెతోణ్ణీ బట్టుకుని కొట్టో ఏసి బాదేత్తిరి. కాత్తె వుండ మారాజు గందా సబల గుబులు రుూ రంగయ్యగోరికి దేనికి సెప్పరాదూ? కొట్టో పణ్ణూకితిరి. ఏనిగంటి మడ్చి కాత్తా ఆవజాన నీలక్కపోయి బెయిటపడేతలికి బెమ్మాండమయిపాయె’’ (ఆరికేం మారాజులు)
కథల్లో సంభాషణలు కూడా ఎంతో తేలిగ్గా సహజంగా వుంటాయి.
‘‘అయితే అన్నకు బువ్వెత్తికెల్లవేందిరా కొండయ్యా!’’ అని యిసుగుతో అరిసింది రుూస్సెరమ్మ. ‘‘నూ పలకవేందిరా గానిగెద్దుకుమల్లే? గొంతు గుంజకపోతుండది. కాత్తె మాటిన్రా కొండయ్య సచ్చినోడా?’’
‘‘నన్ను కొండకు పంపిత్తానంటే’’ మాట సల్లగా రానిచ్చాడు కొండయ్య. శివరేత్రి దెగ్గినకొచ్చుంటాన.
‘‘ఆడే పడిసావు-కొండేందీ, కొండేందిరా మాయదరి పచ్చీ?’’
‘‘నే పోను!’’
‘‘యాడికిరా నూ పోందీ?’’
‘‘నే బువ్వెత్తికెల్లనే!’’
‘‘పొళ్లు రాల్దన్తా ఎదవ సచ్చినోడా! ఎత్తికెల్లకుంటే యియ్యాల నీకేవుండా వుండయి!’’
‘‘నన్ను కొండకు పంపిత్తానంటే!’’’
‘‘కొండేందిరా నీ మొదులారా?’’
‘‘కోటయ్య కొండకే’
‘‘‘కోటయ్య కొండకీ! ఈడికేం బుట్టిందమ్మా!’’ (శివరేత్రి సంబరం)
పల్లెటూరి చెతుర్లు, సరదాలు, సంబరాలు దైనందిన జీవితంలోని కొన్ని సన్నివేశాల్ని అమాంతం కత్తిరించి కథల్లో పెట్టేస్తాడుమా గోఖలే.
‘‘ఓ బల్లకట్టు పాపయ్యన్నోవ్? యిటే వుండావంటయ్యా! నీకు పునె్నం వుంటది, కాత్తె ఆదరికి దొబ్బున పోనియి బాబూ, అప్పుడే తెల్లార్తుండది. నాగరత్తీ, రాయే దొబ్బునా! చుబ్బక్కా, లచ్చుమ్మా రాండి రాండి- ఎంకాయి పిన్నాం ఏదీ. ఓ చీతామోవ్ లగెయ్ లగెయ్’’ అంటూ గొల్ల జనం కడాలు, గొలుసులు కొట్టుకొంటూ, మట్టెలు టక్ టక్‌మనిపిస్తా, పెరుగోసన గబ్బు మనిషిస్తుంటే, రవిలు బండి పెట్టెలకు మల్లే తోసుకుంటూ వొచ్చి బల్లకట్టు మీన నుంచుండారు సోల్పున మానికా, తవ్వా, సల, గిద్దలకి మల్లే.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం

పాపినేని శివశంకర్