వినమరుగైన

అత్త గారి కథలు (భానుమతీ రామకృష్ణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిని పువ్వులలో పెట్టి చూసుకునే కుమారుడు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది. ఈ అవ్వని అబ్బురంగా చూసుకునే మనవడు. నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తున్నట్టు అనిపించే కోడలు- కక్షలు కార్పణ్యాలు, కావేషాలు, మాట పట్టింపులు వున్నా రుూవిడని ప్రేమతో రంధ్రానే్వషణతో భూషిస్తూ దూషిస్తూకూడా అనుక్షణం గౌరవించే బంధుకోటి- ఇరుగు పొరుగు.
ఈవిడ ఏ వీధిలో ఎదురైనా సరే వెంటనే గుర్తుపడతాం. ఆవిడ మనని వెంటనే గుర్తుపట్టలేకపోయినా.. ఎంతో ఆప్యాయంగా ఆవిడే మనల్ని పలుకరిస్తుంది. చంద్రుడి లాంటి వాడికే మచ్చ వుండగా లేనిది మానవ మాత్రులొక లెక్కా.. ఈ అత్తగారూ అంతే.
అత్తగారు అన్నీ తెలిసి ఏమీ తెలియని వ్యక్తి. ఆవిడ పరిజ్ఞానానికి ఆధారం లేదు. ఏ మాత్రం సంకోచం లేదు. ప్రపంచకంలో ఏ పనినైనా ఎవరైనా అవలలీగా చేయవచ్చునని- సాధ్యంకానిది ఏమీ లేదని ఆవిడ ప్రగాఢవిశ్వాసం. అది ఆవకాయ విషయం కావచ్చును. నిమ్మకాయకు ఆవకాయకు తేడా లేదని నమ్ముతుంది. అట్లాగే ఆవుని, గేదెని ఒకటిగానే భావించగల సమదృష్టి, సమభావన.
ఆవిడ ఎపుడూ బాధ్యతారహితంగా ప్రవర్తించాలని అనుకోదు. అలాగే ఆవిడ తన దక్షతలు ఎక్స్‌పెర్టైజ్ చెట్లు నాటడం అరటికాయ పొడి చెయ్యడం, వడియాలు పెట్టడం, చాకలి పద్దు, కిరాణా కొట్టు లిస్టు ఒకటేమి తాను చేసే ప్రతి పనిలోను వాటి నిర్వాకంలోను కల్తీలేని నమ్మకం.
అందుచేతనే తన నిర్వాహకానికి విఘ్నాలు కలిగినప్పుడు ఆవిడ అప్రయత్నంగా తప్పు మరొకరిపైకి తేలికగా నెట్టివేస్తుంది. అంతేకాదు తన తప్పును ఒకంతట ఆవిడ ఒప్పుకోదు. చాలా సందర్భాలలో అది తప్పని కూడా తెలుసుకోలేని అమాయకురాలు.
కావటానికి అత్తగారు భారీ మనిషే కాని ఆవిడ అంతస్తులో వున్న ప్రపంచకం చాలా చిన్నది. కొంచెం పురాతనమైనది కూడా. ఆ ప్రపంచకంలో పూటకు అయిదు మానికలు- పంచితం యిచ్చే ఆవుకు స్థానం ఉన్నది కాని- అయిదు మానికలు పాలు యిచ్చే ఆవుకు లేదు. జపాను ఢిల్లీదగ్గరే అంటే నమ్ముతుంది కాని మూడువేల మైళ్ళ దూరం అంటే ససేమిరా ఆవిడ ఒప్పుకోదు. అట్లాగే కారు, బస్సు, వ్యాను- ఇవి విడివిడి వాహనాలని గుర్తించదు.
అత్తగారి మనస్తత్వానికి- బాహ్య ప్రపంచానికి ఎక్కడా పొంతనలేదు. అందుకే ఆవిడ హాస్యం పుట్టిస్తుంది. ‘సవతులన్న తరువాత పోట్లాడుకోద్దూ. మీరిద్దరు పోట్లాడుకోరేం అని పాలవాడి పెండ్లాలతో పోట్లాడుతుంది. అదేం ప్రారబ్దమో ఆవిడకు జరిగేవి కూడా అట్లాగే జరుగుతాయి. కాని ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఇంటివాళ్ళకే కాదు ఇరుగుపొరుగువారికే కాదు బంధుజనానికే కాదు నౌకర్లకు చాకర్లకు ఆవిడ అమృతమూర్తి, దిగివచ్చిన దేవత. ఎన్ని యిక్కట్లు ఇబ్బందులు ఆవిడ చర్యలతో వారికి కలిగినా, ఆంజనేయులవారు శ్రీరామచంద్రుమూర్తిని, విష్ణుర్తిని, గురుడాళ్వార్ సేవించినంత భక్తిశ్రద్ధలతో వారు ఆవిడ ఆజ్ఞలను శిరసావహించడం సేవించడం.
గోచీ పోసుకుని గోల్కొండ వ్యాపారుల యింటి ఆడపడుచులాగా కనపడే రుూ మహావ్యక్తి పూర్తిగా శ్రీవైష్ణవురాలు కావడం అందరి అదృష్టం.
భానుమతిగారి కథలలోని సంఘటనలు గురించి నేనేం చెప్పను. అవి ఎవరికి వారు ఆస్వాదించి ఆనందించవలసిదే. భానుమతిగారి కథలలో ముఖ్యులు మనుష్యులు. వారి ఆలోచనలు అంతఃకరణాలు. మనిషి సుఖంగా వుంటే ప్రపంచకం సుఖంగా వుంటుంది అని రుూ కథలు పైకి చెప్పకుండానే చెబుతాయి.
హాస్యాన్ని ఇంత వెదజల్లిన భానుమతిగారు జీవిత సత్యమెరిగిన వేదాంతి- కోరికలని గురించి ఆవిడ యిచ్చిన సందేశం. జాగ్రత్తగా వినండి..

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సశేషం

- మల్లాది సూరిబాబు 90527 65490