వినమరుగైన

ఫిడేలు రాగాల డజన్ -పఠాభి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడుపు వృత్తిలో దయనీయమైన స్థితిని అనుభవిస్తున్న అభాగినుల్ని ఇలా వర్ణించారు.
ఓ భోగంచానా! నీవు
సంఘానికి వేస్టు పేపరు బాస్కటువా?
మష్టు మషాణము
పడవేయబడునట్టి దిబ్బవా
ఇలా అన్నారంటే పఠానికి భోగం చానల మీద సానుభూతి ఉన్నట్టే. అందుకే ‘రక్తంలేని వారి అధరాలపయి, అంటుకొనియున్నది మాసిక హాసరేఖ’ అని అనగలిగారు. పడుపు వృత్తి పడతికన్నా మిగతా ప్రపంచమంతా అబద్ధం అని భావించారు పఠాభి.
‘‘నిన్ను గవురవిస్తున్నా నేను/ నీలోనే నాకు జీవితం నిజంగా/ సరిగ్గా ప్రతిఫలిస్తున్నది/ ఇతర స్థలాలలోన/ అంతా బూటకం/ అంతా నాటకం/ గొప్ప అబద్ధం/ పూజారి యబద్ధం/ పురుషుని జూచి తలవ్రాల్చే/ పతివ్రత సతీత్వ మబద్ధం/ యోగు లబద్ధం, అందరూ అబద్ధం/ సర్వ మబద్ధం/ కానీ నీవు/ మసుగులేని నిష్ఠురమగు నిజానివి/ నీడ పడనటువంటి నిర్మలమగు నిజానివి’’
వాల్ట్‌విటమన్ వచన పద్యాల్ని ఎన్నోసార్లు తనివితీరా చదువుకొన్న తన మీద శ్రీశ్రీ, చలం ప్రభావం కూడా వుందని పఠాభి చెప్పుకున్నారు. పఠాభి వచన గేయాలు రాయటంలో ఎంతో వర్ణనా వైచిత్రి ప్రదర్శించారు. సొంత గొంతుక ఉన్న కవిగా పఠాభి కన్పిస్తారు. పఠాభి సొంత గొంతుకను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది వర్ణనా వైచిత్రం, రెండోది శబ్ద వైచిత్రం. ముందు పఠాభి వర్ణనా వైచిత్రిని గమనిద్దాం. ఆయన తన కవితలలో ఎంగిలి ఉపమానాలు వాడలేదు.
‘పాడనారంభించింది రేడియో
సముద్రం పక్కన సముద్రం లాగా’
రేడియో పాట సముద్రంలాగా సముద్రంతో పోటీ పడుతుందని పఠాభి భావన.
మంచి కవిత్వం వున్న ఇలాంటి వాక్యాలు చాలాచోట్ల కన్పిస్తాయి. రాత్రిని ఎందరో కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు.
‘‘రగులు నలుసులుగల నల్లతారు లాగ’’ అంటూ రాత్రిని సరికొత్త రీతిలో వర్ణించారు.
మహానగరము మీద మబ్బుగమ్మి/ గర్జిస్తున్నది/ దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచున్నట్టుల’’ అంటారు కవి.
ఆలోచిస్తే ఇందులో గంభీరభావాలు పట్టుకోవచ్చు. విమానం దిగేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఉరుములు కూడా అలాగే పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి. కేవలం కొత్తదనమే కాకుండా మంచి ఔచిత్యం వున్న ఉపమానం ఇది. నల్లమబ్బుల గుంపును ‘‘పాతబడినటువంటి బస్సులాగా బడబడయనుచున్నవి అంటారు పఠాభి. ప్రయాణవేగం తక్కువే అయినా పాత బస్సు ఒకటే మోత. కురిసే వర్షం తక్కువే అయినా మబ్బుల ఆర్భాటం ఎక్కువని చమత్కరించారు పఠాభి.
ప్రాచీనదిశ సూర్యచక్రం రక్తవర్ణంతో
కన్పట్టింది, ప్రభాతరేజరు
నిసినల్లని చీకట్ల గడ్డంమును షేవ్
జేయన్ పడిన కత్తిగా టట్టుల’’
చీకట్లను గడ్డంతో పోల్చటం నవ్యత. ఈ చీకట్ల గడ్డాన్ని ప్రభాత రేజరుతో షేవ్ చేసుకుంటుంటే పడిన కత్తిగాటులా ఉన్నాడట సూర్యుడు. అద్భుతమైన, అనన్యమైన పఠాభి వర్ణనా నైపుణ్యానికి ఈ చరణాలు సాక్ష్యాలు. నవ్యస్ర్తిని వర్ణిస్తూ-
‘‘క్రాస్వర్డు పజిల్సు లాగున్న/ నీకన్నులను సాల్వుజేసే మహాభాగ్యం/ ఏ మానవునిదో కదా!’’ అన్నారు.
స్ర్తి హృదయం గెలవటం అనుకొన్నంత తేలిక కాదని, క్రాస్‌వర్డు పజిల్సులా ఆసక్తి ఉంటే పెద్ద కష్టం కూడా కాదని పఠాభి ధ్వని.
‘‘నాకు విచిత్రంబగు భావాలు కలవు/ నా కన్నులందున టెలిస్కోపులు/ మయిక్రాస్కోపులున్నవి’’
కన్నుల్లో టెలిస్కోపులు ఉన్నాయనటంలో కవిగా తనకు దూరదృష్టి ఉన్నదని, మైక్రోస్కోపులున్నాయనటంలో బాగా ఆలోచించగలిగే సూక్ష్మదృష్టి ఉన్నదని పఠాభి ఉద్దేశాలు.
ఇక పఠాభి శబ్దవైచిత్రం గమనిద్దాం! తెలుగు పదాల్ని, ఇంగ్లీషు పదాల్ని కలిపి సమాసాలు చేసేశారాయన. దుస్సాధ్యం, కాంపిటీషన్ అనే రెండు మాటల్ని కలిపి దుస్సాధ్య కాంపిటీషన్ అని అన్నారు. ఇలాంటిదేదో మరో సమాసం హంగ్రీకనులు. అలాంటిదే ప్రభాతరేజరు కూడా, హంసయాన, గజయాన మొదలైన సమాసాలతో పోటీపడేటట్లు హైహీలు చెప్పుల నడక కలిగినది అనే అర్థంలో హై హీలు యాస అనే సమాసాన్ని అద్భుతంగా సృష్టించారు. ఈ కొత్త సమాసాలు వినటానికి ఇంపుగా కూడా ఉండి అర్థాల్ని బాగా స్పష్టం చేస్తున్నాయి.
పఠాభి కవితల్లో కాముక ప్రవృత్తి కన్పిస్తుందని వచ్చిన విమర్శలు నిజమే. కానీ వ్యక్తిగా ఆయన అభ్యుదయవాది అనే విషయాన్ని విమర్శకులు విస్మరించకూడదు. బెంగాలీ తల్లికి, తమిళ తండ్రికి పుట్టిన బిడ్డను వివాహం చేసుకున్న అదర్శం పఠాభిది. కవిత్వంలో ఆదర్శాలు చెబుతూ జీవితంలో ఆచరణలేని కవులకన్నా పఠాభిది చాలా మెరుగు. సొంతంగా మొదటిసారి దర్శకత్వం వహించి ఆయన నిర్మించిన కన్నడ సినిమా సంస్కార ఉత్తమ చిత్రంగా రాష్టప్రతి స్వర్ణపతకం పొందింది. ఆయన కృషి చాలా గొప్పది. సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా సన్నిహిత అనుచరుడు పఠాభి.
పఠాభి ఫిడేలు రాగాల డజన్ కవితల్ని శ్రీశ్రీకి చూపించారు. శ్రీశ్రీ సలహాతో 1939 ఆగస్టులో ముద్రించబడిన ఈ పుస్తకం బయటకు రాగానే సాహిత్య లోకంలో గొప్ప సంచలనం రేపింది. ఇటువంటి కవిత్వాన్ని అప్పటిదాకా దేశం చూడలేదు. నగర జీవన చిత్రణలో, నిర్దిష్ట విషయాల్ని కవితలుగా మలచటంలో, వర్ణనా వైచిత్రిలో తరువాత కవులకు మార్గదర్శకమైనది ఈ ఫిడేలు రాగాల డజన్ వచన కవితల సంపుటి. ఈ వచన కవితల సంపుటి ముద్రించిన తరువాత చాలామంది వచన కవితలు రాయటం, వాటిని పుస్తకాలుగా ముద్రించటం బాగా ఊపందుకున్నాయి. రెండు వేల సంవత్సరానికి అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ ప్రతిభామూర్తి అవార్డును పఠాభికి ఆలస్యంగా అందించినా అభినందించదగిన విషయం.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రావి రంగారావు