వినమరుగైన

ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేగాక తిక్కనగారికి ప్రాణభూతమైన నాటకీయతను గురించి విశదీకరిస్తూ ‘‘తెలుగు కవులలో కూలంకష ప్రజ్ఞ గల మహాకవి తిక్కన. ప్రబంధకవులలో అట్టి ప్రజ్ఞ కలవారు మరికొందరు కలరు కాని వారు తిక్కన తర్వాతనే పరిగణింపదగినవారు. మరియు ఆ ప్రబంధములు భారతమువలె అతి విస్తృతి గల కథలు కావు’’ అని చమత్కరించారు.
తిక్కన యుగానికి చెందిన మరికొంతమంది కవులలో కేతన, మారన, రంగనాథుడు, యథావాక్కుల అన్నమయ్య వంటివారు పేర్కొనదగినవారు. కేయూర బాహుచరిత్రను రచించిన ‘మంచన’ కవి కూడా తిక్కన యుగానికి చెందినవాడే!
తిక్కన యుగం తర్వాతది శ్రీనాథయుగం. కవిత్రయం తర్వాత పేర్కొనదగ్గ కవులలో శ్రీనాథుడు ప్రథముడు. వృత్తంలో నన్నయ, కందంలో తిక్కన ప్రసిద్ధులైనట్టే సీసపద్య రచనలో శ్రీనాథుడు సిద్ధహస్తుడు. అటువంటి సీసపద్య నిర్వహణలో శ్రీనాథుని గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఆచార్య పింగళి ‘‘విశేషించి సీసపద్య రచనలో శ్రీనాథుడు అవలంభించిన అనువాద పద్ధతి ఒక విశిష్ట గుణముకలది. అర్థ సంవాదములు గల శ్లోకములు కొన్ని తటస్థించినపుడు వానిలో నొక్కక్కదానిని నొక్కక్క సీస పద్య పాదమున నిముడ్చును. సంపూర్ణ సీస పద్యమునకు వలయునన్ని శ్లోకములచ్చట లభించనిచో, మిగిలిన పాదములును మూలమున లేని అర్థముతో తాను పూర్తిచేయును. వలసిన దానికంటే ఎక్కువ శ్లోకములు లభించినపుడు రెండుమూడు శ్లోకముల సారమును ఒక పాదమునకు వలయునంత మాత్రమే గైకొనును. ప్రాయికముగా ఏ సీసపద్యమును చూచినను దానిలో పరస్పరము ఒండొంటితో సంవదించు శ్లోకములు యిమిడియున్నవని గ్రహింపవలెను అని ప్రస్తుతించారు.
ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీనాథుని తర్వాత ఎన్నదగిన కవి పోతన. భాగవతాన్ని ఆంధ్రీకరించడం నిజంగా తన పూర్వజన్మ సుకృతమని భావించిన భక్త కవి. సహజ పాండితీ బిరుదాంకితుడు బమ్మెరపోతన. అటువంటి పోతనామాత్యుని గురించి ఆచార్య పింగళివారు ‘సమస్త కళలకు మూలధర్మములగు శ్రుతిలయలను కవిత్వమున ఛందో నిబద్ధమగు శబ్దమెంతవరకు సాధింపగలుగునో, పోతన వలె దృష్టాంతపూర్వకముగా చూపిన పురాణ కవి యింకొకడు లేడు. ఛందస్సంభవమైన మాధురి రుూయనవలె యింకొక కవికి లభ్యము కాదు. ఆయనకుగల శబ్దాలంకార ప్రియత్వము దీనికి మరికొంత వనె్న పెట్టినది. మితిమీరినచోట్ల నను ప్రాసయు, అర్థౌచిత్యమునకు పాల్పడిన పట్టులున్నను, సముచితప్రయుక్తమైన చోట్ల నది భాగవత కవితాగానమునకు మృదంగ వ్యాపారము నిర్వహించుచున్నట్లుండును. కవి స్వేచ్ఛగా పాడుకొను భక్తగానమును, ఆ గానమున కనువైన మధురాతి మధురమైన శబ్దమును, ఆ శబ్ద సంఘమునకు మకుటాయమానమైన యంత్య ప్రాసలు గలవి భాగవత కవితా పఠనమును తాళ మృదంగముల తోడి గానముగా నర్తింపజేయును.
స్వభావముచే తిక్కన కవితా ప్రతిభ నాటకీయమైనట్లు, పోతనది భావకవితా ప్రతిభ మరియు తిక్కన శైలి బుద్ధిగమ్యము. పోతన్న శైలి కర్ణపేయము. భాగవతము భక్తి ప్రధానమైన పురాణమగుటయు, ఈ కవి వతంసుడు మహాభక్తుడగుటయు, కారణములుగా అందలి భక్తులతో ఈయన కవితాత్మకు తాదాత్మ్యము కలిగి తానుగా, తానే వారుగా వర్తించున్నాడా? అనెడి ఊహను కలిగించును. అందును భక్తి శృంగార భావ పరిపోషణమునందు పోతన అతి మాత్రమునకు పాల్పడు భావలోలుడు. శ్రీకృష్ణుని బృందావన విహారాదులవేళ ఆనందమున ఉప్పొంగి యమునా నదిని వలెనే భావగతమున వెల్లివిరిసిన శృంగార రస ప్రాధాన్యమును పోతన భావలోలతయే ప్రధానకారణము.

- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ధూర్జటి వేంకట బాలాజీ