వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి రాణిగారు, తోడబుట్టిన సరస్వతమ్మగారు కనులవెంట అశ్రుధారలు - అతిథి మర్యాదలు- ఆ రోజులు మళ్లీ తలచుకునేందుకు చదువుతాం. పార్మసీ ఉద్యోగం తర్వాత కాన్పూర్ మిల్ యజమాని రామేశ్వరంగారల దగ్గర మూణ్ణాళ్ల ముచ్చట ఉద్యోగం- అయ్యదేవర కాళేశ్వరరావుగారు చూస్తున్న ఇన్సూరెన్స్ పనిచూసేందుకు బెజవాడ కేంద్రంగా సిమ్లా నుండి తిరుగు ప్రయాణంలో స్మృతిపథం నుండి సాగుతున్న యాత్రలో ప్రవేశిస్తాం.
సూరన కళాపూర్ణోదయంలో కల్పనా వైచిత్రిలా జానకిరాం ఆత్మకథలో వాస్తవ చిత్రణా వైచిత్రి ఉందనిపిస్తుంది. సాగుతున్న యాత్ర తొలి భాగంలో ఇన్సూరెన్స్ కంపెనీ (ఆ రోజుల్లో చావు కంపెనీలనేవారు) సెక్రటరీగా చేసిన ఉద్యోగం. టూ సీటర్ సిట్రియాన్ కారు ప్రయాణాలు దృశ్యాలుగా కదలిపోతాయి. యాదృచ్ఛికంగా పాలసీలు లభిస్తాయి. ఏజెంట్ల వంచన చవిచూస్తారు. బెజవాడలో టెన్నిస్ ఆట బసవరాజు వారి సాహచర్యం. కాకినాడ అమలాపురాల్లో సాహితీ మిత్రులతో వ్యాసంగంతో సాగిపోతుంది.
1938 జూన్ 16 మద్రాస్ రేడియో కేంద్రం ఆరంభమయ్యింది. జూన్ 16 జానకిరాం పుట్టినరోజు కూడా. రేడియో ఉద్యోగం ఎలా లభించిందీ ఎవరికివాళ్లే చదువుకోవాలి. ఆ రోజుల్లో ఎంపిక విధానం తెలిసేందుకు రాత్రంతా తోటమాలి కథ రాసి తెల్లవారు జామున చలిలో కథ చదివి వినిపించడానికి గోపీచంద్ దగ్గరకు వెళ్లిన జానకిరాం తోటమాలి ఉద్వేగాన్ని చూస్తాం. కుమార్తె శిల్పసౌందర్యాన్ని చూద్దామని వచ్చిన రాజమాతకు శిల్ప స్థానంలో వున్న పారిజాతాలు ప్రసరించే సూరి కిరణాలు తాకుతాయి.
రజని చండీదాస్ నాటకం రాసి సమర్పించాడు. ఊహ మేరకు రాలేదని భోరున విలపించసాగాడు. రజని లాంటి కళాశీలిని ఊరడించలేని నిస్సహాయతను చూస్తాం. నాటకం ఎన్నో రెట్లు బాగుందన్న సత్యం రజని నమ్మలేకపోయాడు. ఇక్కడ జానకిరాం నిస్సహాయుడు.
బుచ్చిబాబు నవలకు ఏకాంతం అని పేరు పెడదామని- పాత్రలనూ కథనూ వివరిస్తుంటే చివరకు మిగిలేది పేరు సూచించిన ప్రజ్ఞ జానకిరాందే. టి.ఎస్.ఇలియట్ గురించి బుచ్చిబాబు ద్వారా విని ఇలియట్‌కు ఉపనిషద్వాణికి అన్యాయం కల్పించుకోజూసిన అనే్వషణ జానకిరాంలో కనబడుతుంది.
కూవమ్ నది పొంగిన కారణంగా మద్రాస్‌లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌లో ఒక రోజు మూగపోతే పడ్డ బాధనూ, మరుసటి రోజు సవ్యంగా ప్రసారాల నందించినందుకు కలిగిన పారవశ్యానందాన్ని జానకిరాంలో చూస్తాం.
కృష్ణశాస్ర్తీగారితో రేడియో నాటిక శర్మిష్ఠ వ్రాయించే మహాయజ్ఞం జానకిరాం చేయగలిగాడు. ప్రాచీన నవీన భావసమ్మేళనంగా మూర్తి దాల్చిన పిలకా గణపతి శాస్ర్తీతో, పాతబంగారంతో కొత్త నగలు చేయించడమే నవ్య సాహిత్యమంటే అని తీర్పు ఇచ్చిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీతో, పారిశ్రామిక యుగధర్మమే కొత్త కవిత్వానికి మూలమవుతుందన్న శ్రీశ్రీతో బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యం, అబ్బూరి, రాయప్రోలు, వేదుల, పంచాగ్నుల ఆదినారాయణశాస్ర్తీ, గిడుగు రామమూర్తి, తెలికచర్ల వెంకటరత్నం, గూడవల్లి రామబ్రహ్మం, హరీంద్రనాథ్, కమలాదేవి మొదలైన వారితో పెనవేసుకున్న మైత్రీ బంధం ప్రతి అక్షరంలో చూస్తాం.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు