వినమరుగైన

లోవెలుగులు (ముట్నూరి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేఖ నాతి దీర్ఘంగా, నాది హ్రస్వంగా ఉండాలి. అది అందుకొనే వ్యక్తి మురిపంగా చదువుకొని అతనిలోని సందేహాలు తీర్చుకోవాలి. భాష ఆర్జవం అలరించాలి. అది వ్యక్తి నుద్దేశించేదే అయినా విషయం సమిష్టికి కూడా ఆసక్తిజనకం కావాలి. విషయ విశే్లషణం, సమన్వయం సంతరించుకోవాలి. ముగింపు ముచ్చటగొల్పుతూ ముసిముసినవ్వులు ముసిరేలాగా చేయాలా లేఖ. కలకాలం దాచుకోని, తన స్నేహితుల చేత కూడా చదివించి, సంతోషపడేలాగా ఉండాలి. ఈ లక్షణాలే కాక యింకా ఎన్నో లక్షణాలు విరాజిల్లే లేఖా సంపుటి ముట్నూరివారి లోవెలుగులు. ఈలేఖలు ముట్నూరి వారి ఉపనిషత్తులు. గద్యఖండకావ్యాలు. ఆర్ష సంస్కృతికి అక్షర దర్పణాలీ లేఖలు. కళదృష్టి, శాస్త్ర నైశిత్యం, సంప్రదాయం, సమన్వయం, సముద్దీపిస్తాయి. ఈ లోవెలుగుల్లో బహు సంవత్సరాలుగా విరచితం కావటంచేత ఎక్కడైనా పునరుక్తి గోచరించవచ్చు. అయినా విసుగు పుట్టదు. మనస్సు మరింతగా వికసింపజేస్తుందీ పునరుక్తి. విషయ వైవిధ్యం ఈ లేఖల్లో ఉద్దీపిస్తుంది. జగన్మిధ్య అంటే ముట్నూరివారు మూతి ముడుచుకొంటారు. మాయ అంటే మందహాసం చేస్తారు. జగత్తు నిఖిల రసామృతమూర్తి నిత్యకేళీ విలాసమంటే హాయిగా నవ్వుకొంటారు. దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర మహాభావాల్లోని దివ్యత్వానికి ఉప్పొంగిపోతారు. కైలాసమో, వైకుంఠమో, గోలోకమో ఎక్కడో ఉందంటే ముట్నూరివారికి తృప్తిలేదు. మనం ఉండే జగత్తే వైకుంఠంగా, గోలోకంగా చేసుకోవాలంటారు. కృష్ణాపత్రిక ఆఫీసు బృందావనం చేశారు. అందులోని మోహన మురళీకృష్ణుని విగ్రహం దగ్గరే సాయంకాలం కృష్ణారావుగారు ఆసీనులయ్యేవారు. రసపిపాసులు, కవులు కాటూరి, విశ్వనాథ, మాధవపెద్ది, పువ్వాడ ప్రభృతులు తమ కవితలు వినిపించేవారా నిఖిల రసామృతమూర్తికి.
తానాచరించని ఏ నియమాన్ని గూర్చిగానీ, తాను దర్శించని ఏ సత్యాన్ని గూర్చి గానీ, తానుపాసించి ఆనందించని ఏ సౌందర్యాన్ని గూర్చిగానీ, లేఖల్లో తన సోదరుడికి ముట్నూరివారు ప్రతిపాదించలేదు. నిత్య జీవితోపయుక్తంగాని ప్రసంగం ఏ లేఖల్లోనూ కనిపించదు.
ముట్నూరివారు అద్భుతంగా సాధించింది నిరంతర వౌనం. అందుకే లోకం వారిని వౌనముద్రాలంకారులుగా సంభావిస్తున్నది. వౌనాన్ని గూర్చి వారికంటే అధికారికంగా, అనుభవైకవేద్యంగా లేఖ వ్రాయగలవారుండరు. దయ, దాక్షిణ్యాదులు కూడా మాటలతోకాక, ఒక అశ్రుకణం, ఒక నిట్టూర్పు, ఒక చూపు, ఒక హస్త, స్పర్శ ద్వారా ప్రకటించి, బాధాతప్తులకు ఉపశమనం కల్గించాలంటారు. మితాహారం శరీరాగ్యానికెంత అవసరమో, మితవాక్కు, చిత్తశుద్ధి అంతకంటే అవసరమని తెలుసుకోమంటారు. కాస్త చదువుకొని, ఇతరుల కుపదేశించాలనే ఉబలాటం పనికిరాదంటారు. గుర్రాన్ని స్వాధీనం చేసుకోవటానికి నోటికి కళ్లెం వేస్తాం. అట్లాగే మనం, నోటికి కళ్లెం వేస్తే మనస్సు దుందుడుకుతనం తగ్గుతుందని ముట్నూరివారి సలహా. అందువల్ల ‘ఆత్మోన్నతి’ కల్గుతుంది. లోవెలుగు ప్రకాశిస్తుంది.

ఇంకాఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కీ.శే. బొడ్డుపల్లి పురుషోత్తం