వినమరుగైన

కర్పూర వసంతరాయలు -సి.నారాయణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం ఒక అక్షర తపస్సు
కవిత్వం ఒక అక్షయ యశస్సు
కవిత్వం భావాంబర వీధుల్లో విహరించే మనోవిహంగం ముందు సాక్షాత్కరించే ఒక రసోదయ ఉషస్సు!
ఆ తపస్సును పండించుకుని, ఆ యశస్సును సముపార్జించుకుని, తాము దర్శించిన రసోదయ ఉషస్సులోని రోచిస్సులను, అక్షర గవాక్షాల ద్వారా అశేష పాఠక లోకానికి అందించి, అలరిస్తున్న కవులలో ప్రముఖులు డా. సి.నారాయణరెడ్డిగారు.
ఆయన మాటకు పరిమళాన్ని, పాటకు సంగీత గమకాన్ని నేర్పిన శబ్దశిల్పి. పూల పాటల నుండి నేటి మినీ కవితల మేలి బాటల వరకు, నవ్వని పువ్వు నుండి నారాయణరెడ్డి గజల్స్ వరకు వెనె్నలవాడ నుండి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న విశ్వంభర వరకు ఆయన కవితా ప్రస్థానం ఒక సాహితీ జైత్రయాత్రగా కొనసాగుతూనే వుంది.
ఆధునిక గేయ కవిత్వంలో లఘు కథా కావ్యాలను ప్రారంభించిన ఘనత, అభ్యుదయ కవితలవాడ శ్రీ గురజాడకు దక్కుతుంది. ఆయన వ్రాసిన లవణ రాజు కల, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి రచనలు రుూ కోవకు చెందుతాయి. ఆ తర్వాత శ్రీ తల్లావఝల శివశంకర శాస్ర్తీ వకులమాళికని, శ్రీ విశ్వనాథ స్యనారాయణ కినె్నరసాని పాటలని, శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని గేయ కథాకావ్యాలుగా అందించారు. వీటిలో కథ నామమాత్రంగా ఉండి, కవి రచనా విన్నాణమే ఎక్కువగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కావ్యానికి కథాబలం ముఖ్యమన్న విషయాన్ని గమనించిన డాక్టర్ సినారె వస్తువులోను, అభివ్యక్తిలోను ప్రకృష్టమైన బంధాన్ని ఏర్పరచి, తమ కావ్యాలను గేయ ప్రబంధాలుగా తీర్చిదిద్దారు. నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం, జాతిరత్నం ఆయన వ్రాసిన గేయ కథా కావ్యాలు. వీటిలో వాసిలోను, వనె్నలోను, సొబగులోను, బిగువులోను తారామణిహారంగా నిలిచే కావ్యం కర్పూర వసంతరాయలు.
కర్పూర వసంతరాయలు కావ్య రచనకు మూలప్రేరణ రెడ్డి రాజుల యుగంలో ప్రసిద్ధుడైన కుమారగిరి రెడ్డికి- కర్పూర వసంతరాయలు అనే బిరుదు వుందన్న యెఱుక. ఆ యెఱుకతో పొందిన స్పందన శ్రీ మల్లంపల్లి రచనలు అందించిన వివరణ, రుూ కావ్య రచనకు ఆధారమని స్వయంగా కవి డాక్టర్ సి.నారె తమ భూమికలలో పేర్కొన్నారు. కవి కమనీయ కల్పనతో రూపం దిద్దుకున్న రుూ కావ్యం- అయిదు ఆశ్వాసాల గేయ ప్రబంధం. మొదటి ఆశ్వాసంలో ‘మదనోత్సవ సంబరం, నగరోద్యానంలో పూవిల్తుని పూజ, లకుమ నృత్య కళా ప్రదర్శన, రాయలచే కంఠహార బహూకరణ’ ప్రధానమైన అంశాలు. రెండవ ఆశ్వాసంలో లకుమ- వసంతరాయలుల ప్రణయోద్దీపన, లకుమకు రాజనర్తకి పదవీ పరికల్పన, లకుమ సంతోషము మహారాణి సంతాపము హృద్యంగా వర్ణించబడ్డాయి. మూడవ ఆశ్వాసంలో లకుమ- రాయలుల తీర్థయాత్రలు, లకుమ నాట్యలీలలో రాయలు అనుభవించిన ఆనందహేల, అంతఃపురంలో మహారాజ్ఞికి పీడకలల కలత- అక్షర రూపాన్ని సంతరించుకున్నాయి. నాల్గవ ఆశ్వాసంలో లకుమ కోసం కేళీ మందిర నిర్మాణం కాటయ వేముని దండయాత్ర, లకుమ నాట్య భంగిమలకు పరవశించిన రాయలుచే వసంత రాజీయ నాట్యశాస్త్ర రచన. రాచకార్య బహిష్కరణ- కాటయ వేముని అభ్యర్థన ముఖ్యమైన ఘట్టాలు. ఇక ఐదవ ఆశ్వాసంలో బావమరిది అభ్యర్థనపై రాయలు దర్బారుకు రాక, లకుమ కాలు బెణికిందన్న వార్తతో రాజు నిష్క్రమణ- ప్రజల గుసగుసలు- మహారాజ్ఞి పరితాపు- స్వయంగా లకుమ మందిరానికి వెళ్లి వ్యక్తిగత స్వార్థం కోసంగాక దేశ క్షేమం కోసం రాయలుపై గల ప్రణయాన్ని త్యాగం చేయవలసిందిగా అభ్యర్థన- లకుమ త్యాగం- రాయలులో కర్తవ్య జాగరణ- కమనీయంగా కావ్యబద్ధమయ్యాయి.
కర్పూర వసంతరాయలు కావ్యంలో భావగాంభీర్యము, భాషా సౌకుమార్యము రెండూ సమపాళ్లలో ముందుకు సాగాయి. మదనోత్సవానికి బయలుదేరిన కుమారగిరిరెడ్డిని ప్రశంసిస్తూ వంది మాగదులు పలికిన కైవారాలు-

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కె.వి.ఎస్.ఆచార్య