వినమరుగైన

కర్పూర వసంతరాయలు -సి.నారాయణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జయ జయ సమగ్రాంధ్ర/ సర్వం సహా భార
సంభరణ శేషాహి రూపా!/ పరి పంథి నృపతి దో
ర్చల కంధి మంధనా/ పర మంద రాద్రి స్వరూపా!’’
అంటూ సాగే సంస్కృత సమాన రచన రెడ్డిగారి ఉభయ భాషా పాండిత్యానికి నిదర్శన.
అభివ్యక్తిలో సరిక్రొత్త అందాన్ని ఆవిష్కరించడం రుూ కవికి వెన్నతోపెట్టిన విద్య. ఉత్సాహం ఉరకలు వేసే యువతీ యువకుల సంబరాన్ని వర్ణిస్తూ-
‘‘ఏ మొగమ్మున చూపు నిలిపిన
యిగురు వోసెడు కాంతి వల్లులు
ఏ సిగను పరికించి చూసిన
ఏటవాలుగా నవ్వు మల్లెలు’’ అంటారు కవి
ఈ చరణంలో మొదటి రెండు పాదాలు యువకుల మనోభావాలకి, మిగిలిన రెండు పాదాలు యువతుల నయనాభిరామ సౌందర్యానికి అద్దం పడతాయి. వడివడిగా నడిచేటప్పుడు, గాలి విసురుకి సిగలోని మల్లె సరులు నిటారుగా కాక ఏటవాలుగా ఎగురుతుంటాయి. ఈ సూక్ష్మాన్ని ఎంతో సుందరంగా అక్షరబద్ధం చేశారు కవి. ఇది వారి పరిశీలనా దృష్టికి ఒక ఉదాహరణ మాత్రమే!
లకుమ, కుమారగిరిరెడ్డి- ఇరువురి మధ్య పొటమరించిన అనురక్తి కేవలము కాయికమైన వ్యామోహానికి సంబంధించినది కాదని, జననానంతర సౌహృదాని ఏర్పడిన రాగబంధమని ధ్వనింపజేస్తారు డాక్టర్ నారాయణరెడ్డి.
‘‘లకుమయే రాణ్మౌళి/ బ్రతుకు నావను నడుపు చుక్కాని/ లకుమయే ఱేని లీ/ లా మహా సామ్రాజ్యమున రాణి’’
‘‘ఆమె కన్నులు విరిసి/ నంతనే అతడు పగలను కొనును/ ఆమె కన్నులు మోడ్చి/ నంతనే రాతిరియయ్యెననుకొనును’’
‘‘నా దేవర నా గుండియు/ పాదున రతనాలమొలక
నా మనసే పంజరమ్ము/ గా మెలగెడు రామచిలుక’’
అన్న పంక్తులు ఈ సత్యానే్న చాటి చెపుతాయి.
భంగ్యతరంగా సౌందర్యాన్ని ప్రభావోత్పాదకంగా వర్ణించడము రుూ కావ్యంలోని మరొక విశేషమైన అంశము. లకుమ సౌందర్యాన్ని వర్ణించిన తీరు యిందుకు మకుటాయమానంగా నిలుస్తుంది. తనలో రాగము రవళి రవళింపజేసిన లకుమను పంచభూతాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా రాజు భావించడం, ఆ పంచభూతాల పోలికతోనే పరోక్షంగా లకుమ శారీరక సౌందర్యాన్ని మన మనోపటలంపైన అంకితం చేయడం - కవి ప్రతిభకు మచ్చుతునకలుగా నిలుస్తాయి.
‘‘పృధివి నాయమ జఘన పీఠమ్మునం జూచి
జల మామె కంటి పాపల లోతులం జూచి
తేజమ్ము నామె ముఖ రాజీవనమున గాంచి
వాయుగతి నామె నిశ్వాసముల గుర్తించి
ఆకాశమాయె మధ్యము నందు గమనించి
నిఖిల సృష్టికి లకుమనే ప్రతీకగా నెంచి’’
అన్న వర్ణనలో కవి ప్రకటించిన కౌశలం, ఆయన ప్రతిభా వ్యుత్పన్నతలకు నికషోపలం-
సాంప్రదాయికమైన ఉపమానాలను స్వీకరిస్తూనే స్వతహాగా వున్న ప్రతిభతో అభివ్యక్తిని మరింత హృదయంగమంగా రూపొందించడం రుూ కవికి కరతలామలకం- లకుమ- రాయలు వీరి పరస్పర రాగానుబంధాన్ని తెలియజేసే ఘట్టంలో-
‘‘నీ వొక నాగ స్వర మవు/ నేనో నాగిని మాత్రము
ఇరువుర బంధించి వేసె/ నేదో అంతస్సూత్రము-
నీవు నిండు చందురుడవు
నేనో కల్వల చెల్వను/ పరిమళ సోపాన పంక్తి
యిరువుర నేకము చేసెను’
అన్న పంక్తులను యిందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ఒక క్రియకు జరిగే భిన్న ప్రతిక్రియలను ఏకకాలంలో, గుండెకు హత్తుకునేలా వర్ణించడం రుూ కావ్యంలోని యింకొక ప్రత్యేకమైన అంశం.
లకుమను రాజనర్తకిని చేసినపుడు-
‘‘లకుమ కావార్త క
ల్వ నెలంత కంటి పా
పల పైన పాల వె
నె్నల సోకినటులయ్యె’’
రాణి కా వార్త క
ల్వ నెలంత చెవులలో
ఖర కరుని అశ్వరిం
ఖల చప్పుడుగ తోచె’’ అన్న వర్ణన-
‘‘లకుమ అపుడె తొలిసారిగ
రాయని తన మనసారా కౌగిలించె
అచట కొండ వీట రాణి
అతి వికృత స్వప్నమున కలవరించె,
ఇట ఱేడు లకుమ ను తన
హృదయ పట్టమహిణిగా ప్రతిష్ఠించెను
అచట రాణి కలలో శ
య్యపై పొరలి, పొరలి నేలపై దొరలెను’’
అన్న పంక్తులు రుూ భిన్న దృశ్య మాలికాగ్రధన కౌశల్యానికి కరదీపికలుగా భాసిస్తాయి.
ఏ కథా కావ్యంలో అయినా, నాటకీయత, సంవాదాత్మక శైలి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అవి పాఠకుని మనస్సులో పాత్రలను సజీవంగా ప్రతిష్ఠిస్తాయి. ఈ కావ్యంలో కూడా లకుమ-వసంతరాయలు మధ్య సాగిన ఎన్నో సంవాదాత్మక సంభాషణలు ఆ ప్రయోజనాన్ని పుష్కలంగా సాధించాయి.

-సశేషం

-కె.వి.ఎస్.ఆచార్య