వినమరుగైన

అమృతం కురిసిన రాత్రి -బాలగంగాధర తిలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేరుతో చెత్తను పేర్చే ధోరణిని వ్యతిరేకిస్తూ నవత-కవితలో
‘‘తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని
అర్థంలేని ఇమేజరీతో కలగాపులగపు వర్ణనల్తో
డిలీన్ థామస్‌కు చేతకాని అనుకరణల్తో
ఒకదేశం నిర్దేశం లేని వాక్యాల వికారంతో
ఎందుకు బాధిస్తావు...’’
అంటూ కవిత్వంలో అబ్‌స్క్యూరిటీ అన్ని సందర్భాల్లో పనికిరాదన్నాడు. పాఠకునికి కవి అనుభూతి ఆకారం హత్తుకోవాలన్నాడు. కవిత్వం పాఠకుని హృదయంలోని కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలన్నాడు.
కవితాన్ని ఒక ‘అల్కేమీ’గా తిలక్ భావించాడు. అది ట్రాన్స్‌పరెంట్ చీకటిలా ఉండాలంటూ కవిత్వాన్ని గురించి మరో అద్భుత సత్యాన్ని ఆవిష్కరించాడు.
‘‘ఈ కాలంలో బ్రతుకు, ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు
ఇంటికున్న కిటికీలన్నీ తెరచి
అన్ని పవనాల్నీ ఆహ్వానించు నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి. నీలోంచి రావాలి- చించుకొని రావాలి’’..
అనడంలో కొత్త కవులకు గొప్ప వెలుగు వాకిళ్లు తెరచినట్లైంది. ఈ పాదాల్లో తిలక్ అతి ముఖ్యమైన ఐదు అంశాలు చెప్పాడు. ఏ కవియైనా సమకాలీన చైతన్యం తప్పక కలిగుండాలి. ఆ చైతన్యంతో తన మాతృభాషలో కవిత్వం చెప్పినా అది విశ్వచైతన్యాన్ని కూడా కలిగుండాలని సూచించాడు. ప్రపంచంలోని అన్ని ఉత్తమ భావాల్నీ ఆహ్వానించమన్నాడు. కవిత్వం యొక్క స్వభావం విశ్వదృష్టి కావాలి. అయితే చెప్పే తీరు మాత్రం దేశీయం కావాలి. ఎందుకంటే, అనుభవం విశ్వజనీనం అయినా, చెప్పే ధోరణి మాత్రం తప్పక నీదై ఉండాలి. అది కూడా కవి హృదయాన్ని చించుకొని రావాలనడంలో, వేదనే కవిత్వానికి మూలంగా భావించడం కనిపిస్తుంది. కవిత్వ ప్రారంభకులకు ఇదొక గొప్ప పాఠం.
కవిత్వం పాఠకుని చైతన్య పరిధిని విస్తరించెయ్యాలనీ, అది అగ్ని చల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి కావాలన్నాడు. ఏ కవి స్థాయినైనా సరే అంచనా వెయ్యడానికి అతని కవిత్వమే కొలబద్దగా చెబుతూ ‘‘నా కవిత్వంలో నేను దొరుకుతాను’’ అనే వచన కవితలో ఇట్లా అన్నాడు.
‘‘ప్రతి కవిత్వమూ కవి తనమీద తాను రాసుకున్నదే ఓ విధంగా
ఎందుకంటే కవిత్వం అల్టిమేట్‌గా సబ్జెక్టివ్ కదా!’’
ఇది ప్రత్యక్షరసత్యంగా పరిగణించవచ్చు.
కవిత్వాన్ని సర్వసుందరమైన కళగా భావించిన తిలక్ మానవత్వానికి, కరుణకు దీనే్న వాహికగా భావించాడు. అందుకే ‘కరుణ లేని కవి వాక్కు సంకుచితవౌతుంది’ అన్నాడు. మానవీయమైన విలువను పెంపొందించే ఎన్నో ఖండికలు అమృతం కురిసిన రాత్రిలో కనిపిస్తాయి. ఆయన సామాజిక అవగాహన ఎంత గాఢమైందో ఈ ఖండికల ద్వారా తెలుసుకోవచ్చు.
ఆర్తగీతం, సి.ఐ.డి. రిపోర్టర్, వెళ్లిపొండి - వెళ్లిపొండి, టులాన్ మాగ్నకార్టా, గొంగళిపురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవుపట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్థన, మైనస్ యింటూ ప్లస్ లాంటి ఈ కవితలన్నీ కవిలోని వేదనలకు తెరచాపలెత్తినవేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వైజ్ఞానికంగా, నాగరికంగా ఎంతో ఎదిగిన ఆధునిక సమాజంలో మానవత్వం మాత్రం అట్టడుగు స్థాయిలోనే ఇంకిపోయింది. బౌద్ధికంగా మనిషి యాంత్రిక నాగరికతా స్రష్ట అయి ఉండవచ్చు. కాని విలువల పతనాన్ని పరిశీలిస్తే తాను సృష్టించుకున్న విజ్ఞానమే తన పతనానికి కారణమవుతున్నా పట్టించుకోవటం లేదన్న విషయం చాలా బాధ కలిగిస్తుంది. మనిషికి మనిషికి మధ్య సామరస్యం నశించి, ద్వేషం రగిలే విష సంస్కృతిని తిలక్ నిరసించాడు. ‘యుద్ధం’ అనేది చరిత్రను రక్తసిక్తం చేస్తుంటే తిలక్ భరించలేకపోయాడు.
‘‘జ్వలత్కాష్ఠమిలాతలం
శప్త్ధాత్రి నిర్జనమై, శ్మశానమై పరచుకొనెను
సుప్తదేవ హృదయ సృజ్ఞాళము లెగిరిపడెను’’ అని చెబుతూ
‘‘యుద్ధం మీద యుద్ధం వచ్చినా
మనిషి గుండె పగులలేదు
మనిషి మేధ మనిషి చచ్చినా
కన్ను తుదల జాలిలేదు
అనడంలో కవి హృదయావేదన ఎట్లాంటిదో మనకు తెలుస్తూంది. అందుకే నాగరికత పేర జరిగే యుద్ధాలు మానవ వినాశనానికి దారితీస్తాయన్న భావంతో ‘నాగరికత మైలపడిన దుప్పటిలా నన్ను కప్పుకుంది’ అని చెప్పాడు.
‘‘ఇదే ఇదే ఇదే ఇదే
మానవునకు చివరి రోజు
మనిషి మేధ మనిషి గుండె
విడిపోయిన ఆనవాలు
భస్మీకృత ధాత్రిమీద
కశ్చిన్మూర్దుని వ్రాలు, విధిహసించు, ఇది ముగింపు’’
ఇట్లా యుద్ధంవల్ల జరిగే మానవలోక నాశనాన్ని వర్ణిస్తూ వర్ణిస్తూ ఒక సైనికుని అంతరంగాన్ని ఇట్లా ఆవిష్కరించాడు.

-సశేషం

-జి.గిరిజా మనోహర్‌బాబు