వినమరుగైన

నేనొక మానవుణ్ణి... జిజ్ఞాసకుణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)
*
కొత్తపల్లి వీరభద్రరావు: నమస్కారమండీ ధర్మారావుగారు. ఇంచుమించుగా, అరవై సం.లు నుంచీ తెలుగు భాషా సాహిత్య రంగాల్లో అనన్య సామాన్య ప్రతిభతో, అకుంఠిత దీక్షతో మీరు కృషి చేస్తున్నారు కదా, మీకు తెలుగులో కృషి చెయ్యాలని ఎప్పుడు తట్టింది? కొంచెం వివరిస్తారా?
తాపీ ధర్మారావు: వివరించడానికేముందీ, అక్షరాభ్యాసం నాడే నాకు తెలుగులో అభిమానం కలిగింది. చదువుకుంటున్నప్పుడు.. మూడవ ఫారం నాలుగవ ఫారం చదువుతూండినపుడు కూడా తెలుగు అభిమానమే. దానికితోడు, లోయర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో కొంచెం బాగా పాసయ్యానని నాకు భారతం ఒక ప్రైజ్‌బుక్: షేక్సిపియర్ (ది) ఇంకొక ప్రైజ్‌బుక్.. దాన్ని తెలిసినా, తెలియకపోయినా ఏదో పేజీలు తిప్పుకుంటూ... చదువుకుంటూ ఉండటం అనేటటువంటిది అభ్యాసమయిపోయింది. ఆ విధంగా ఒకరు చెప్పి, చేసినటువంటి అభిరుచి కాదు. దీనికితోడు ప్రతికూలంగా ఉండేటటువంటిది... మా నాన్నగారు. వారు మెడ్రాస్ మెడికల్ కాలేజిలో పాసయి వచ్చినటువంటి, పాశ్చాత్య నాగరికత కొంచెం బాగా అలవడినటువంటివారు. తెలుగు చదువుతున్నా, తెలుగు రాస్తున్నా.. వారిక్కోపం. ‘‘ఏమిట్రా అదంతాను.. తెలుగు చదువుతూ కూచున్నావు.. ఏదేనా ఇంగ్లీష్ పుస్తకం చదువుకో’మనేవారు.
కొ.వీ: ఆరోజుల్లో అలాగే ఉండేది దేశమంతా.
తా.్ధ: శనివారమాదివారం వచ్చిందీ అంటే, ఏదో డిబేటింగ్. మీటింగ్ ఒకటి పెట్టడం, టీచర్‌ని తీసుకురావడం, కూచోపెట్టడం, మాకు తోచినటువంటి మంచి మాటలు మంచివో... చెడ్డవో చెప్పుకుంటూపోతూ ఉండటం ఆ సమూహంలోనుంచి ఎవరికైనా సరియైన మార్కులు, క్లాసులో లేవూ అంటే మర్నాటినుంచీ మా ఇంటికి రాకూడదు. అదీ మా రూలు.
కొ.వీ: ఇవన్నీ మీ ఇంట్లోనే జరిగాయా?
తా.్ధ: ఇవన్నీ మా ఇంట్లోనే జరిగాయి. మా నాన్నగారు కాంప్‌కి వెళ్ళిపోయినప్పుడు, నాలుగింటికి వెళ్ళిపోయినప్పుడు, మేము పెద్దలం (నవ్వు)
కొ.వీ: సరే, మీరు కొత్తపాతల మేలుకలయికని అస్మదాదుల అభిప్రాయం. మీరు సర్వవిధాలా పురోగాములైనా, పాతలో, ఉన్నంతవరకూ, మేలు గ్రహించాలని నమ్మినట్లు, నమ్ముతున్నట్లు నాకు తోస్తుంది. కొంచెం ఈ విషయం విపులీకరించి చెప్పినట్లయితే బాగుంటుందండి.
తా.్ధ: గురజాడవారు చెప్పడము మంచిమాటే.. ‘కొత్తపాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు జిమ్మగా...’ అని చెప్పారు. ‘పాత’ చెప్పడానికి అధికారం ఉన్నంత కొత్తను గురించి చెప్పడానికి నాకధికారం లేదు. ఇప్పుడు ‘ఎండనకుండా, వాననకుండా, కండలు తరిగే, కష్టం చేసి, పండించామిది మా పంట. దండుగ తిండికి రాకండి...’అని, పాటల్లో, ప్రస్తుతముండినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భావాల్నే, ఒక విధంగా, నేననుకరించుకోడానికి ప్రయత్నం చేశాను.
కొ.వీ: తరువాత...
తా.్ధ: ‘ఇంకా పాత పాటలేనా’అని, అనేకమైనటువంటి పాటలనీ రాశాను. కొత్త, పాత అన్నది సులభంగా అనుసరణీయమైనటువంటి పద్ధతిలో చేసినట్లైతే ఏ బాధాలేదు. పాతలో ఉన్నటువంటి కొన్ని దుష్టలక్షణాలు ‘కొత్త’లో కనిపిస్తున్నాయి. ‘పాత’లో దుష్టలక్షణం ఏమిటీ అంటే కాపీ కొట్టడం.
కొ.వీ: అవును.
తా.్ధ: ప్రబంధాల్లో... కోట, రాజు, పుష్పలావికలు, వేశ్యలు, ఒక రాజు... అనగనగా ఒకరాజు, ఈ రాజు అడవికి వెళ్ళాడు, వేటలో పిల్లని చూశాడు. ఆ పిల్లని పెళ్ళిచేసుకున్నాడు అని, ఒక సాధారణ పద్ధతిలో పోతూ ఉంది. అలానే, ఇప్పుడు. ఈ కొత్తలో కూడా.
కొ.వీ: అవును.
తా.్ధ: అటువంటి దుష్టలక్షణం... రిపిటిషన్... అని మనమంటాము.
కొ.వీ: అవును.
తా.్ధ: పునరుక్తిదోషం దానిక్కొంచెం తగుల్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకరి, ఇద్దరి కవిత్వాలు చూసిన తర్వాత... మూడవ వారిది, నాలుగవ వారిది...
కొ.వీ: చూడనక్కర్లేదు.
తా.్ధ: చూడడం అక్కర్లేదేమో అనిపించేట్టుగా కనిపిస్తూ ఉన్నది.
కొ.వీ: మన తెలుగులో వ్యాఖ్యానాలు రావలసినవి చాలా కావ్యాలున్నాయి కదా. ‘విజయ విలాసము’ ఎందుకు ఎన్నుకున్నారు? అదెందుకు మిమ్ముల్నాకర్షించిందో కొంచెం సెలవివ్వండి.
తా.్ధ: ‘విజయవిలాసము’నన్నాకర్షించింది. ఇందాక మనవి చేసినట్టుగా ఏ పది, పదకొండు సంవత్సరాల వయస్సులోనో, ఆనాడు ఎందుకాకర్షించిందంటే పుస్తకం చేతిలో దొరికింది కాబట్టే.
కొ.వీ: ఆహా...
తా.్ధ: ఇంట్లో నేను బి.ఏ. అనేటటువంటి వాడెవ్వడూ లేడు. అంచేత, పాసవాలి, అని ఒక నియమం చేసుకున్నాను. బి.ఏ. ఆ నియమం సాధించుకుంటూ వస్తూ.. ఈ సాహిత్య పిచ్చ ఒకటి బాగా ఆవహించి ఉండేది... నేను లెక్కల మేష్టర్ని.

*(సౌజన్యం:ఆకాశవాణి, హైదరాబాద్)
*
-సశేషం

చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు విశే్లషణల సమాహారం నుంచి. సంపా. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేష్‌బాబు
*