మెయన్ ఫీచర్

విపత్తు నివారణకు సమష్టి కృషి అవసరం

  • -శంకర్ రాయ్‌చౌదరి
  • 22/02/2012

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలోని ఎఎంఆర్‌ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం డిసెంబర్ 8న చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 98 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే గతంలో జరిగిన ఓ సంఘటనను ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. 1997 జూన్ 13న దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది చనిపోగా, సుమారు 103 మం ది గాయపడ్డారు. పైన పేర్కొన్న సంఘటనలు శత్రువులు, తీవ్రవాదుల దుశ్చర్యలు ఏమాత్రం కావు. ఇక 2008 నవంబర్ 8న ముంబయిలో తీవ్రవాద సంస్థ లష్కరే తోయ్‌బా సృష్టించిన అరాచకం వల్ల 166 నిండు ప్రాణాలు బలికాగా, 293 మంది గాయపడ్డారు. మరో సంఘటనను ప్రస్తావిస్తే.. 2010 మే 30న పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో రైల్వే పట్టాలపై మావోయిస్టుల దుశ్చర్య కారణంగా జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో సుమారు 140 మంది మృత్యువాతపడగా, సుమారు 290 మంది క్షతగాత్రులయ్యారు. ఈ సంఘటన వల్ల సంభవించిన ప్రాణ నష్టం ఇంచుమించు 26/11 ముంబయి వరుస పేలుళ్ళ సంఘనలో జరిగిన ప్రాణనష్టానికి సమానం. ఇక ప్రకృతి బీభత్సం గురించి ప్రస్తావించాల్సివస్తే.. 2009 జూలైలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అయిలా తుఫాను తాకిడికి 275 మంది భారత, బంగ్లాదేశ్ వాసులు ప్రాణాలు విడిచారు. ఉగ్రవాదం, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి విషాద సంఘటనలకు నేపధ్యాలు ఒకే మాదిరిగా ఉండవు. కానీ ఇవన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలను కలిగివుంటాయి. అవే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం, ఆ తర్వాత చేపట్టే సహాయకార్యక్రమాల నిర్వహణలో లోపాలు! మనదేశంలో అనేక రూపాల్లో వైపరీత్యాలు చోటు చేసుకుంటాయనేది కఠోర వాస్తవం! అటువంటివాటిల్లో పైన పేర్కొన్నవి చాలా చిన్న సంఘటనలుమాత్రమే! విపత్తులు, ఉపద్రవాలు, ఆపదలు, వైపరీత్యాలనేవి ఎటువంటి ముందస్తు సూచనలు, హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వాటిల్లుతుంటాయి. ప్రకృతి వైపరీత్యానికి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అయిలా తుఫాను, మానవ తప్పిదాలకు గతఏడాది వచ్చిన భూకంపంతో జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం పేలిన సంఘటన, 26/11 ముంబయి తీవ్రవాదుల దుశ్చర్య, జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టలు తప్పడం వంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
వైపరీత్యాలు ఎటువంటివైనా.. సంఘటన జరిగిన తర్వాత తక్షణ సేవలు, సహాయం అందించేందుకు సరైన రక్షణ వ్యవస్థ, యాజమాన్య పద్ధతులు అవసరం. విపత్తు నివారణ చర్యలు వివిధ విభాగాలతో కలగలిపి ఉంటాయి. దీనికి సమష్టి కృషి, సమన్వయం అవసరం. వేగంగా స్పందించే గుణం, విపత్తు నివారణ చర్యలు చేపట్టిన సంస్థలల్లోని వ్యక్తుల మధ్య సత్వర సమన్వయం ఉండాలి. విపత్తు నివారణకు కావలసిన అన్నిరకాల పరికరాలు, వస్తుసామగ్రి అవసరం. విపత్తు నివారణ చర్యల్లో భాగంగా సంఘటన జరిగిన ప్రాంతంపై ప్రభుత్వ, ప్రైవేట్ సేవా సంస్థలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
విపత్తు నివారణ చర్యల్లో ముఖ్యమైన విభాగాలుగా ఇంజనీరింగ్, సమాచార వ్యవస్థ, వైద్య బృందం, పరికరాలను పేర్కొనవచ్చు. వైపరీత్యం చోటు చేసుకున్న సంఘటన ప్రాంతానికి నివారణ చర్యలు చేపట్టే బృందం వేగంగా చేరుకోవడం అతిముఖ్యం. మనదేశంలో ఏదైనా దుర్ఘటన చోటుచేసుకుంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జిల్లా పౌర సంబంధాలు, పోలీసు శాఖలు మొదట స్పందిస్తున్నాయి. ఇటువంటి సమయాల్లో తక్షణ రక్షణ, ఉపశమన చర్యలు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, సమీపంలోని వైద్యశాలలు, అంబులెన్స్ సిబ్బంది చేపడుతున్నారు. అయితే వీటికి ప్రజా రవాణా వ్యవస్థ కూడా తోడవుతోంది. పోలీసుల సమాచార వ్యవస్థ, టెలిఫోన్, సెల్‌ఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. పరిపాలనా విభాగం నిర్మాణంలో ఆదేశాలు, నియంత్రణ వ్యవస్థ ఇప్పటికే వ్యవస్థీకృతమయి ఉన్నాయి. కానీ వాటి పనితీరు వేరేవిధంగా ఉంది. స్థానిక అవసరాలు, పనితీరు, రాజకీయ దృక్కోణాలు వీటిపై ప్రభావం చూపుతాయి. విపత్తు నివారణ యాజమాన్యం ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే కొనసాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపత్తు నివారణ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వ నుండి అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయలోపం ఇప్పటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెప్పకతప్పదు. ఆపద సమయాల్లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర రాజకీయ వ్యవస్థల పనితీరు విపత్తునివారణ చర్యలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందడం లేదు. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణాలోపం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎఎంఆర్‌ఐ ఆసుపత్రిలోని ఉద్యోగ పరిపాలన విభాగం పనితీరు అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. ఇక్కడ పరిపాలన, నిర్వహణా వ్యవస్థల పనితీరు మెరుగుపడవలసిన అవసరం ఎంతో ఉంది. ముందుచూపు, సరైన సమయపాలన లేకపోవడం, ప్రభుత్వ నియమ నిబంధనలు సక్రమంగా లేకపోవడంతో పెద్ద ప్రమాదానికి దారితీసింది. ప్రజల భద్రతపై దశాబ్ధాలుగా ఇదే తీరు కొనసాగుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రైల్వేలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు ఇలా చెబుతూపోతే పలురకాల ప్రజావసరాలపై ప్రభుత్వ దృష్టి కొరవడిందనడానికి ఉదాహరణలు కోకొల్లలు. విపత్తు నివారణ, ప్రజా భద్రత ఏజెన్సీలకు ఒక క్రమపద్ధతిలో విధివిధానాలు లేవనడంలో సందేహించాల్సిన పనిలేదు. అయితే గతంలో జరిగిన సంఘటనల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవడమూ లేదు. గత సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఆపద సమయాల్లో సరిగ్గా స్పందించే పనితీరు లేకపోవడం గమనార్హం. ఎఎంఆర్‌ఐ ఆసుపత్రి అగ్నిప్రమాద సంఘటనపై దర్యాప్తు చేసేందుకు ఒక అధికారిక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. సంఘటనకు గల కారణాలను, ప్రమాదం జరిగినపుడు నివారణ చర్యలు చేపట్టిన వివిధ విపత్తు నివారణ ఏజెన్సీలతో కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇలాంటి సంఘటనలు తిరిగి భవిష్యత్‌లో చోటుచేసుకోకుండా తగిన సలహాలు, సూచనలు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇవేమి కార్యరూపంలో దాల్చలేదు.
ఏదిఏమైనా ఇప్పటివరకు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సరైన నివేదిక సిద్ధం చేసి పటిష్టమైన కార్యచరణ అమలు చేయవలసిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. దేశ భద్రతకు కార్యచరణ, ప్రజా రక్షణ వ్యవస్థ, ఆపద నివారణ వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. పభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే వివిధ విభాగాలు సుదీర్ఘ కాలంపాటు అలక్ష్యంగా వ్యవహరించడం వల్ల విఫలమయ్యాయ. ఎఎంఆర్‌ఐ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటనకు దారితీసిన పరిస్థితులు, అనంతరం చేపట్టిన రక్షణ చర్యలను పరిశీలిస్తే అవి ఎంత అసమర్ధంగా పనిచేస్తున్నా యన్న విషయం ఇక్కడ స్పష్టం అయ్యింది. సహాయక చర్యలు అందించాల్సిన కీలక సమయంలో అన్ని వ్యవస్థల అసమర్ధత బట్టబయలైంది. ఈ సంఘటనలో బాధితులను రక్షించడం, అనంతరం వారికి సహాయం అందించడంలో ప్రభుత్వ శాఖల తీరు చాలా అధ్వాన్నంగా ఉండ టంతో అభాసుపాలుకావాల్సి వచ్చింది. ప్రజా రక్షణ వ్యవస్థ అనేది జాతీయ స్థాయి కార్యచరణ. విపత్తుల నివారణకు స్థానిక, రాష్ట్ర స్థాయి పరిపాలనా విభాగాల స్థాయి నుండే పటిష్టంగా రూపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొల్‌కతా ఎఎంఆర్‌ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భద్రతకు సంబంధించిన అనేక లోపాలను వెలుగులోకి వచ్చాయ. ఈ అగ్నిప్రమాద నివేదికలు ప్రజలు ఎదుర్కొనే మిగిలిన ఉపద్రవాలకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇప్పటికీ ప్రజా రక్షణ సంబంధిత విషయ అంశాలను ప్రభుత్వాలు గాట్లో పెట్టలేకపోతున్నాయి. ఎఎంఆర్‌ఐ ఆసుపత్రి సంఘటనను కొల్‌కతా నడిబొడ్డున జరిగిన విపత్తుగా పరిగణించవచ్చు. ఒక ఎఎంఆర్‌ఐ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న చాలా ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థల్లో రక్షణ చర్యలు అంత సంతృప్తికరంగా లేవన్న అంశాన్ని గుర్తుంచుకోవాలి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం హడావుడి చేయడం తర్వాత మళ్ళీ షరామామూలుగా ఉండిపోవడం మన ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయంది. అట్లా కాకుండా జరిగిన సంఘటన నేపథ్యంలో భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా సత్వర చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు లెక్క
-శంకర్ రాయ్‌చౌదరి

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading