వీరాజీయం

చిన్నమ్మ శశికళా వైభోగం గుట్టురట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపోద్ఘాతం చెప్పాలి- సస్పెన్సు అనవసరం. అంతస్తుకు మించిన ఆస్తులు కలిగివున్న శశికళమీద జైలుబాసుకి, సిబ్బందికి రెండు కోట్ల రూపాయలు లంచమిచ్చి ప్రత్యేక సదుపాయాలూ గట్రా అనుభవిస్తున్నట్లు ఆరోపణరాగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగారు దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చాడు. అర్జంటుగా ట్వీట్ చేసి మరీ ఆమెని ఇరకాటంలో పెట్టేశాడు.
తమిళనాట జయమ్మకెంత ‘ఇది’ ఉన్నదో చిన్నమ్మకి కూడా అంత వైభోగం ఉండేది. అఖిల భారత అన్నాడిఎంకె పార్టీకి ‘అమ్మ’ నాయకురాలయితే- ఆమెకి బాస్ శశికళ నటరాజన్ అనిపించకుంది. అటువంటి విఐపికి ఇవాళ బెంగలూరు సెంట్రల్ జైల్లో మళ్లీ ‘నోట బెడ్డ’ పడ్డది. లక్షాధికారి అయిన లవణ మననమే గాని మెరుగు బంగారమ్ము మ్రింగబోడు అన్న కవి- బంగారం విలువ కూడా చెప్పకనే చెప్పాడు.. చిప్పకూడుకి బదులు జైలు లోపల తనకి అలవాటయిన ‘సాపాటు కుడవడాని’కి చిన్నమ్మ చచ్చినంత కలగాసింది. కటిక నేలమీద తన నేస్తం (జయమ్మ) పడుకున్నది కాని- ఆ బాధ తనకి లేదు అనుకున్న శశికళ సరిగ్గా ఆ బాధని ఒక రాజకీయ ఖైదీగా గాక- ఏడుస్తూ కుములుతూ సాధారణ నేరస్తురాలిగా అనుభవిస్తూ మ్రగ్గడానికి నాలుగేళ్ళపాటు జైలుకెళ్లింది. సదరు పరప్పాన్ అగ్రహారం జైలు తన తమిళనాట కూడా లేదు. పొరుగు రాష్ట్రంలో వుంది. సుప్రీంకోర్టు చట్టప్రకారం శిక్ష వేసింది గాని- విధి, ఆమెకి నిత్య పరాభవం జరిగే చోటుకి పొమ్మన్నది. నిన్న తాను ఎంత పవర్‌ఫుల్ అంటే, గద్దెమీద ... కూర్చుని వున్న, జనాలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని ‘‘అబ్బీ, నువ్వు క్రిందకి దిగి నన్ను కాళ్ళు కడిగి ఆ గద్దెమీద కూర్చోబెట్టరా’’ అంటూ హుకుంజారీచేసిన శశికళకి తెలియని కళ లేదు- అన్నారంతా. అరవై నాల్గు కళలన్నారు మనవాళ్ళు కాని శశి అరవై ఐదో కళ ఎరిగిన మేధవి అన్నారంతా...
జయమ్మ అనే ‘సుప్రీమ్ మదర్ని’ ఈమె శాసించింది.
‘‘నాకు దహనక్రియ చెయ్యవే’’ అని అడిగిన స్నేహితురాలికి గోరీ కట్టించిన ఈ చండశాసన్నురాలిని - కాలం అంతలో సైజుకి కత్తిరించేసింది. నా తల కొట్టుకుని ఏడవడానికా? నీకు సమాధి కట్టించాను అంటూ విలపించిన శశికళకి ఆమె నేరానికే కాదు పూర్వాశ్రమంలో వున్న హోదాకి కూడా తగినదే అన్నట్లు - పరప్పాన్ అగ్రహార జైలు దొరికింది. నలభై ఎకరాల విస్తీర్ణంగలది అది. నాలుగువేల నాలుగు వందలమంది ఖైదీలు ప్రస్తుతం ఆమె సహచరులు. అయినా, ఆమె తనకి కావలసిన సదుపాయాలను సంపాదించుకున్నది. వేరే ‘వంట ఇంట’ ఆమె భోజనం తయారుచేస్తున్నారు. పక్షం రోజలుకో సందర్శకుడు మాత్రం రావాలి అంటే- ఆమెకి పక్షం రోజుల్లో ఇరవై ఒక్కమంది గెస్టుల్ని జైలు గేట్లు బార్లా తెరచి లోనకి కావాల్సిన వాళ్లని రానిస్తున్నారు. అంతా బాగానే వున్నది- ఆమె సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ కూడా పెట్టుకున్నది. ఆ దరఖాస్తు విచారణకి రాబోతోంది అనుకున్న సమయంలో - రూపముద్గల్ అనే పడతి రంగ ప్రవేశం చేసింది. పానకంలో పుడకలాగా అనుకుంటున్నారా? కాదు డొక్కలో పిడిబాకులాగా- వచ్చింది. రూపా జైళ్ళకే డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్. పదిహేను సంవత్సరాల సర్వీసు వున్నదామెకి. మంచి ట్వీట్సు ఇవ్వడంలో ఫేసుబుక్ పోస్టింగ్‌లు చెయ్యడం టీవీలకి ఇంటర్‌వ్యూలు గట్రా ఇవ్వడం అన్నీ చేస్తుంది. మంచి పాపులర్ ఐపిఎస్ ఆఫీసర్- మొన్న పదో తారీఖు నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మాట కూడా కాదని సెంట్రల్ జైలు మొత్తం తనిఖీ చేసింది. అక్కడే వున్న దొంగ స్టాంపుల బ్రహ్మ తెల్గీపై కూడా ఆరా తీసింది. బోలెడు ఎవిడెన్సు ప్రోగు చేసింది.
రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చి శ్రీమతి శశికళ నటరాజన్‌గారు జైల్లో విఐపి హోదాను కొనుక్కున్నారని, నేరుగా ఈ ముడుపులు ఐజీగారి దగ్గర నుంచి క్రింది తోటీ దాకా అందరు అందుకున్నారని ఒక పెద్ద చిట్టా తయారుచేసింది. టాప్ అధికారి నుంచి తన బాస్ వరకు అందరికీ దాని కాపీ అందించడమేగాక ప్రెస్సువారికీ కూడా లీకు చేసింది.
ఐజీగారు ఖంగుతిన్నాడు. ఈలోగా ముఖ్యమంత్రి మొత్తం అవకతవకలన్నీ తూర్పారబట్టమన్నారు. నిజంగా శ్రీమతి రూప ముద్గల్ సాహసమే చేసింది. పోలీసు డిపార్టుమెంటు యొక్క క్రమశిక్షణ సంగతి దేవుడెరుగు- ముందు తీగ లాగితే డొంకంతా కదిలింది.
ఐజీగారు కూడా చలించాడు, స్పందించాడు. రెండు కోట్ల రూపాయలా? రెండు పైసలు కూడా నాకెవ్వరూ ఇవ్వలేదు.. గంజాయి మొబైల్స్ లాంటివి జైళ్ళు అన్నాకా రాకమానవు. వాటిని నిరోధిస్తూనే వున్నాం అన్నాడాయన. లోగడ ఇదే జైలులో ఘనత వహించిన గాలి జనార్దన్‌రెడ్డి వున్నపుడు అతనికి స్పెషల్ వంట ఇల్లేనేమిటి? ఒక జిమ్ కూడా ఏర్పాటుచేశారు. కోర్టుకి పోడానికి ఓ కారు కూడా ఏర్పాటుచేశారు. అటువంటి స్పెషల్ హోదా ఎలా వచ్చింది? అప్పుడు ఈ రూపమ్మ లేదేమో? డిఐజకి ఆమెకి పొంతన వుండేదేమో?
మొత్తం సెంట్రల్ జైలు అవకతవకలన్నీ ప్రక్షాళన చెయ్యబడతాయో లేదో గాని చిన్నమ్మకి కష్టాలు వచ్చాయి. ఐజిగారు విలేకరులముందు ఆమెకి వేరే ఒక వంట గది, వేరే స్పెషల్ వంటకాలు వగైరా వున్నమాట నిజమేనని పరోక్షంగా అంగీకరించాడు. ఆమె ఒక పెద్ద పొలిటికల్ పార్టీ నాయకురాలు, ఆమె భద్రత కూడా మా బాధ్యతే.. ఎవరన్నా విషప్రయోగం గట్రా చెయ్యకుండా చూడాలి కదా/ అయితే, ఇటువంటివి కోర్టువారు చెప్పాలి కాని మీరు కాదు అంటూ డిఎంకె పార్టీవారు గోల మొదలుపెట్టారు. మిగతా అవకతవకలు ఎవరికీ కుతూహలజనకంగా లేవు. మీడియాలో చర్చ తర్జనభర్జన అన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. నిజంగా ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్నట్లు- ఇద్దరు పోలీసు ఆఫీసర్ల మధ్య తగాదా చిన్నమ్మ ‘చావు’కి వచ్చింది. ఇది యిలా వుండగా, జయలిలత ఇంటిమీద పార్టీ కార్యాలయం మీద వున్న ఆమె పోస్టర్లు- పాపం! ఇలా జాలిగా దండం పెడుతూ వున్నట్లు వున్నవి కూడా పీకిపారేశారు. పార్టీ ముక్కలయింది. పార్టీ గుర్తు లిటిగేషన్‌లో పడ్డది- ‘శశి’కళకి బహుళ పంచమి శోభ కూడా దక్కేట్లులేదు.
సుప్రీంలో రివ్యూ పిటిషన్ మీద దింపుడుకళ్ళెం ఆశలూ వున్నాయి. జైల్లో వున్నా ఆమెకి మనసంతా క్యాలెండరుమీదే వున్నది. నాలుగేళ్ళు యిట్టే తిరిగొస్తాయి కాని రెండు కోట్ల రూపాయలలు నేనివ్వలేదు అంటే ఎవరూ నమ్మరు కదా! వేరే సాపాటుకే రెండు కోట్లు అంటే రెండు వందల లక్షల రూపాయలు మామూలు ఖైదీ ఇవ్వగలదీమె. ఇంతకీ పాత నోట్లు సొమ్ము చేసుకోలేడు కదా? అని జనాలు అంటూనే ఉంటారు.
మొత్తంమీద రూపమ్మ ఇక రెండు దశాబ్దాలు కూడా సర్వీసు నిండకుండా ఇంత సాహసం చేసిందే? అందరికీ తేద్దునా? కొందరికే తేద్దునా? అన్న సామెత చందాన, మొత్తం చిట్టా ఆవర్జలన్నీ ప్రోదిచేసి రిపోర్టు హోం శాఖ దాకా అందించేసింది. గొప్ప సాహసి.. కర్ణాటక దేవంగేరేకి చెందిన అమ్మాయే. ఈ సాహసి భర్త కూడా స్టేటు సివిల్ సర్వీస్‌లో వున్నాడు. దీనివెనుక ఎవరున్నారు? అదీ ప్రశ్నా. కాగా ఆరోపణల విచారణ పూర్తిఅయ్యేసరికి నాలుగేళ్ళు దాటిపోవా? ఏదీ, ఇంకా కమిటీ వేయాలి.. అది కూర్చోవాలి. రూపమ్మకి భర్త మునీశ్‌కి కూడా చివరికి స్టేట్ పోలిటిక్సే గతి. శశికళకి చట్టమే కాదు విధి కూడా అనుకూలించాలి.. రేపు జయమ్మ మరణం మీద విచారణ అంటే? ఆమెకి ఈ నిద్ర కూడా దక్కదు, రెండు వ్రేళ్ల ‘వీ’ ఆకారంలో జోలీగా ఊపే అవకాశమే రాదేమో? చేతులు ఇలా పెట్టి జాలిగా జోడించడం ఒక్కటే మిగులుతుంది కాబోలు..
ఫేట్ ఈజ్ ది హంటర్ కాంట్ ఎస్కేప్!