వీరాజీయం

యడ్డీ ‘గెలుపు’.. బిజెపికి కొత్త ఊపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరులో వారు దీపావళి పండుగను అం దరికంటే ముందుగానే చేసేసుకున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత బిఎస్ యడ్యూరప్పపై అవినీతి కేసులు కొట్టివేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా టపాసులు పేల్చి ‘్ధమ్ ధామ్’ నిర్వహించారు.
‘బిఎస్‌వై’ పేరు యడ్యూరప్పగా వుంటే కలిసి రాలేదని జ్యోతిష్యుల సలహాతో, ఆయన మరో ‘డి’చేర్చి ‘యడ్డియూరప్ప’గా మార్చేసుకున్నాడు. ఈ మాజీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు అక్రమంగా గనులు తవ్వించి మరింత అక్రమంగా లోహాన్ని ఎగుమతి చేయించాడనీ- అందుకోసం నలభై కోట్ల రూపాయల ముడుపులు పరోక్షంగా తన కుటుంబ సభ్యుల ద్వారా ఆరగించేశాడనిన్నీ- 2011లో ‘లోకాయుక్త’ ఆరోపించగా- పదవినీ, కంటిమీద కునుకునీ కూడా పోగొట్టుకున్న ఈ ‘లింగాయత్తుల ప్రియతముడు’, ‘సూపర్ హీరో’ అన్నివిధాలా కుంగిపోయాడు. ఆయన చివరికి జ్యుడిషియల్ కస్టడీలో కూడా కూర్చున్నాడు. అంతా అనుకున్నారు- ‘అయిపోయింది.. ఎడ్డియూరప్ప పనయిపోయింది’ అనీ, ‘అవినీతి గనులలో భూస్థాపితం అయిపోయాడు’ - అనీ. గానీ- అదే పొరపాటు. రాజకీయ నాయకుల గురించి యిటువంటి కామెంట్స్ చెయ్యడం రిస్కుతో కూడిన పని. గనుల లోతుల్లో కూరుకుని పోయిన వాడే హిమాలయ శిఖరం మీద తిరిగి మనకి ప్రత్యక్షమయినా ఆశ్చర్యముండదు. అందుకే- ‘నీ పని అయిపోయింది’అని వారిని చులకనగా అనకూడదు. రాజకీయ రంగంలో పడిలేచే అమర్‌సింగ్‌లుంటారు, యడ్యూరప్పలుంటారు.
‘లోగడ- ‘పచ్చళ్ల భాయ్’ని ఎక్కడో అమెరికాలో దూరంగా చూసి మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు- ‘ఆప్కాకామ్ హోగయా’- అన్నారు. అతని పని ఏమోగానీ, ‘కడవంత గుమ్మడికాయా కత్తిపీటకు లోకువే’- అన్నట్లు పి.వి. చివరికి కోర్టుపక్షి అయిపోయాడు. అలాగే బిఎస్‌వై తనకు ముఖ్యమంత్రి పదవికి అచ్చిరాడు అనిపించుకున్నాడు. వెనుకటికి- డి.కుమారస్వామి కొట్టిన దెబ్బకి- కొంత కాలమయినా, ముఖ్యమంత్రి కావల్సినవాడు- ఏమీ కాకుండాపోయాడు. ఈ ‘షిమోగా వీరుడు’ చివరికి తన పార్టీ అధిష్ఠానం చేత కూడా మాట పడ్డాడు. లోకాయుక్త సంతోష్‌హెగ్డే- పాపం! యడ్యూరప్ప మీద వ్యాఖ్యానిస్తూ- ‘రాష్ట్రంలో పొలిటీషియన్స్, బ్యురోక్రాట్‌లు, ఇండస్ట్రియలిస్టులు కలిసి ఒక ‘మాఫియా’గా రూపుకట్టారు’- అన్నాడు. పేరులో మరో ‘డి’ని చేర్చి- అతని పేరుని ‘ఎడ్డియూరప్ప’ అని ఒత్తి పలకాల్సి వచ్చినట్లే- మళ్లీ పెద్దపాము నోట్లోనుంచి పరమపద సోపాన పటంలో నిచ్చెన దాకా ఎగబ్రాకాడు. పదవుల సంగతి ఎలావున్నా లింగాయత్ కులానికి ఆయన సిద్ధలింగప్పే. (ఎస్ అంటే సిద్ధలింగప్ప- శివుడు) తమను ఉద్ధరించాల్సిన దేవుడనే ఉత్తర కర్నాటక అంతా ఆయనను కీర్తిస్తుంది. చూడండి..! విధి తంతే బూరెల గంపలో పడ్డట్లు బయటికిపోయి, సొంత పార్టీ పెట్టి సవాల్ చేసిన బిఎస్‌వైనే తిరిగి తెచ్చుకుని- రాష్ట్ర అధ్యక్ష పదవినప్పజెప్పింది భాజపా.
భాజపా దక్షిణాదిన విజయప్రవేశం చేయగలిగిందీ, 2008లో అంటే - అది ‘అప్ప’చలవే! ఇండియాగేట్ లాంటి సౌత్ ఇండియాగేట్- ఈ మాజీ ముఖ్యమంత్రి సారు. అందుకే అన్నాడు- ‘ఈసారి భాజపా గెలిస్తే నేనే ముఖ్యమంత్రిని అవుతా. ఇన్నాళ్లూ నన్ను అడ్డుకున్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి’అంటూ- ‘సత్యమేవ జయతే’ అంటూ ట్విట్ చేశాడు.
‘నలభై కోట్లు’ లంచం కేసులోవున్నా భారతీయ జనతాపార్టీ రుూ జనప్రియ నాయకుణ్ని కిరీటం పెట్టి, ‘నువ్వే పార్టీ రాష్ట్ర బాస్‌వి’- అన్నదంటే- వోటుబ్యాంకులో అతనికి ఎన్ని ఫిక్సెడ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలూ వున్నాయో వూహించుకోవచ్చు.
అయితే, అక్కడికి చేరుకోడానికి ‘యడ్డీ’కి ఎ వ్వరూ లిఫ్ట్‌గానీ, హెలికాప్టర్ గానీ యివ్వలేదు. ఆయన కూడా ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్నవాడే. కార్యవాహక కార్యదర్శి పదవి మొదలుకొని అంచెలంచెలుగా అటు భాజపా పార్టీలో కూడా ఎదిగాడు. ఇటు మున్సిపాలిటీలో గుమాస్తా పదవి నుంచి జిల్లా, రాష్టస్థ్రాయి పదవులన్నింటా అనుభవం గడిస్తూ- లింగాయత్‌ల ధర్మమా అని- తిరుగులేని ఎమ్మెల్యేగా అక్కడ్నుంచి ఎంపీగా ఎదిగాడు. ఒకప్పుడు భాజపా అగ్రనాయకత్వాన్ని ధిక్కరించి, ‘కర్నాటక జనపక్ష’ పార్టీని (కెజెపి)ని పెట్టి హడలగొట్టాడు. 2008లో ఆయన ద్వారానే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అతనే దక్షిణాదిన భాజపా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటివాడు. పైగా బిసి కులస్థుల్లో ఓ రికార్డు ‘యడ్డీ’ది.
మాండ్యా తాలూకా బూకనకారే గ్రామంలో 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించాడు. అంటే ఇంకా కనీసం మరో పదేళ్లు దృఢంగా - రాజకీయ జీవితాన్ని నిభాయించగలడు. బిఎస్‌వై-లో ‘బి’అంటే ‘బూకనకారే’ అనే అర్థం. అతని తొలి నియోజకవర్గం శిఖరపురా. తన కొడుకుని అక్కడ నుంచే గెలిపించాడు. అతని కుటుంబంలో 13 మందికి సిబిఐ కోర్టు అవినీతి కేసుల నుంచి విముక్తి ప్రసాదించింది. అందులో కొడుకులు, అల్లుడూ కూడా వున్నారు. యడ్డీ తన నాలుగవ ఏట మాతృవియోగానికి లోనైనాడు, గానీ మాండ్యాలోనే పట్టుదలగా చదువుకుని- 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో క్లార్క్ అయినాడు. అది వదిలి ‘శిఖరపురా’ (ఇదే ఆయన లాంచింగ్ ప్యాడ్) ఒక బియ్యం మిల్లులో ఉద్యోగంలో చేరాడు. అక్కడే చాలా తెలివైన గడుసు యువకుడుగా- మిల్లు యజమాని కుమార్తె మైత్రాదేవిని ఆకర్షించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఒక హార్డ్‌వేర్ షాపును కూడా నడిపాడు. రాజకీయాలలో చురుకుగా తిరిగాడు. ఐదుగురు సంతానం. ఆ విధంగా కష్టపడి పైకి వచ్చిన బిఎస్‌వైకి సామాన్య జనాల స్థితిగతులు, వారి మనసులోని కోరికలూ అన్నీ తెలుసు.
ఐతే, కష్టాలు అతణ్ని వెంటాడుతూనే వున్నాయి. 2004లో భార్య మైత్రాదేవి ఒక ‘సంప్’లోనుంచి నీళ్లుతోడుతూ ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించింది. అటు తర్వాతనే ఆయన తన పేరులో మరో ‘డి’ అనే అక్షరాన్ని గుడ్‌లక్ కోసం చేర్చుకొని ముందుకుసాగాడు. 1970-’72ల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ శిఖరపురా విభాగానికి కార్యదర్శి అయినాడు. 1975లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత తాలూకా నాయకుడు- అలాగా ఎమ్మెల్యే అయ్యేదాకా వెనుదిరిగి చూడని యడ్డీ ఎమర్జెన్సీ కాలంలో బళ్లారి జైలుకీ, అటు తర్వాత షిమోగా జైలుకీ వెళ్లాడు. అతని నాయకత్వానికి ‘పరిణతి’ అంటింది. షిమోగా వీరుడైనాడు. షిమోగా వూరు చిన్నదయినా కళాఖండాల దుకాణాలతో విలసిల్లుతూ వుంటుంది. దీన్ని ‘శివమొగ్గ’ అంటారు. అక్కడ అందరికీ తెలుగు ‘తెలుస్తుంది’. ఆ తెలుగు తెలిసిన ఆటోవాళ్ల నుంచీ అధికారవర్గాల దాకా అందరికీ యడ్యూరప్ప ప్రియమైన ‘అప్ప’. ఆ విధంగా జనంతోనే పెరిగిన బిఎస్‌వైకి కావాలంటే ఇవాళ కేంద్రమంత్రి పదవి దొరుకుతుంది. కానీ, ‘నన్ను భాజపా అగ్రనాయకత్వం కర్నాటక ముఖ్యమంత్రిగానే చూడాలని అనుకుంటోంది. మా పార్టీ గెలుస్తుంది. నేను కాబోయే ముఖ్యమంత్రినే’ అంటూ ఈమధ్య ఆయన ప్రకటించాడు. చిల్లర మల్లర కేసులు అవే ఎగిరిపోతాయని కూడా అన్నాడు. మంచిది!
హీ రుూజే సెల్ఫ్‌మేడ్ లీడర్! *