విశాఖ

ప్రత్యేక డి.ఎస్.సి. నిర్వహించాలని 17న విద్యా సంస్థల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 14: గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డి.ఎస్.సి.ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యా సంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స తెలిపారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో విద్యా సంస్థల బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక డి.ఎస్.సి. నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. మైదాన ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సాధారణ డి.ఎస్.సి.ని ప్రకటించిన ప్రభుత్వం, ఏజెన్సీ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డి.ఎస్.సి.ని ప్రకటించకుండా వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. గిరిజన ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక డి.ఎస్.సి. ద్వారా భర్తీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాలు కావచ్చినా దీని గురించి పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరులో జరిగిన బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక డి.ఎస్.సి.ని నిర్వహిస్తామని ప్రకటించినా ఇంతవరకు ఇందుకు సంబంధించిన కసరత్తు చేయకపోవడం గిరిజన విద్యను నిర్లక్ష్యం చేయడమేనని ఆయన విమర్శించారు. ఏజెన్సీలో వందలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా వీటిని భర్తీ చేయకపోవడంతో గిరిజన విద్య కుంటుపడుతుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీతో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయని, గిరిజన ప్రాధమిక పాఠశాలలో ఏకోపాధ్యాయులు పనిచేస్తుండడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. గిరిజన ప్రాధమిక పాఠశాలల్లో రెండో ఉపాధ్యాయుడిని నియమించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు. గిరిజన విద్య పట్ల ప్రభుత్వం చూపుతున్న సవతితల్లి ప్రేమతో గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఇందులోభాగంగా 17వ తేదిన గిరిజన ప్రాంతాలలో విద్యా సంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని అప్పలనర్స కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, ఎస్.ఎఫ్.ఐ. నాయకులు ఎం.ఎం.శ్రీను, చిన్నారావు, చందు, చలపతి, బాలక్రిష్ణ, కె.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
గిరిజనాభివృద్ధికి బి.జె.పి. ఎనలేని కృషి
పాడేరు, డిసెంబర్ 14: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రంలో తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని భారతీయ జనతా పార్టీ (బి.జె.పి.) జిల్లా అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు చెప్పారు. పాడేరు పట్టణంలో శుక్రవారం ఇంటింటికి బి.జె.పి. కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమం పట్టణంలోని మొయినరోడ్డు, గుడివాడ, లోచలిపుట్టు, ఆర్.టి.సి. కాంప్లెక్స్, పాత బస్టాండ్, గడ్డికాలనీ ప్రాంతాలలో బి.జె.పి. నాయకులు పర్యటించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసారు. కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వ చలవేనని అన్నారు. గ్రామాలలో సి.సి.రోడ్ల నిర్మాణం, విద్యుత్ బల్పుల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలు, మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం వంటి ఎన్నో కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని ఆయన వివరించారు. అయితే తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తాము చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి పనిని అవినీతిమయం చేస్తున్నారని, ప్రజల సంక్షేమం ఆయనకు పట్టదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేసినా తమకు ఏదీ చేయలేదని దుస్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడిపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే గిరిజనుల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమకార్యక్రమాలు అమలు జరుగుతాయని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంత ప్రజలు దీనిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించాలని అప్పారావు కోరారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి. నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, బొజ్జయ్య, రాజారావు, సల్లా రామక్రిష్ణ, మాసాడ వెంకట్, కె.శ్రీను, మఠం రాజంనాయుడు, కురుసా రామరాజు కొణతాల అప్పలరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హామీ అమలు కాకపోతే మళ్లీ ఆందోళన
పాడేరు, డిసెంబర్ 14: ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబరు 132ను రద్దు చేస్తామన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీని పది రోజుల్లోగా అమలు చేయకపోతే మరోసారి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం నాయకులు చిట్టపులి శ్రీనివాస్ పడాల్, కిల్లు గంగన్నపడాల్, పలాసి క్రిష్ణారావు, జి.శేషగిరిరావు చెప్పారు. శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జి.ఒ.ను వ్యతిరేకిస్తూ తమ సంఘం గత కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఇందులోభాగంగా ఈ నెల 10వ తేది నుంచి ఐ.టి.డి.ఎ. ఎదుట రిలే నిరాహర దీక్షలు చేపడుతుండగా గిరిజన మంత్రి శ్రావణ్‌కుమార్ శిబిరాన్ని సందర్శించి జి.ఒ.ను పది రోజుల్లోగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. మంత్రి హామీతో తమ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నప్పటికీ గడువులోగా హామీని అమలు చేయకపోతే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు చెప్పారు. అయితే ఆశ్రమ పాఠశాలల్లోని ప్రదానోపాధ్యాయులు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తారని, పర్యవేక్షణ విధులు, టర్న్ డ్యూటీలను, సైన్స్ ఫెయిర్ వంటి ఇతర కార్యక్రమాలను చేపట్టబోమని వారు స్పష్టం చేసారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఇతరత్రా విధులను బహిష్కరిస్తున్నట్టు వారు చెప్పారు. మంత్రి తమకు ఇచ్చిన హామీని పది రోజుల్లోగా అమలు చేసి న్యాయం చేయాలని వారు కోరారు.
ప్రాధమిక పాఠశాలల్లో నాణ్యత లేని విద్యాబోధన
ఐ.టి.డి.ఎ. పి.ఒ. బాలాజి అసంతృప్తి
పాడేరు, డిసెంబర్ 14: గిరిజన ప్రాంతంలోని ప్రాధమిక పాఠశాలల్లో నాణ్యత లేని విద్యా బోధన జరుగుతుందని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి అసంతృప్తి వ్యక్తం చేసారు. నాణ్యత ప్రమాణాలు లేని విద్యాబోధన కారణంగా ప్రాధమిక స్థాయి విద్యార్థులలో తగినంత సామర్జ్యం లేకుండా పోతుందని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శిక్షణ పూర్తి చేసుకున్న 68 మంది ఉపాధ్యాయులు, 55 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బాలలకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయుల తప్పిదం వలన వందలాది మంది బాలల భవితవ్యం ప్రమాదకరంలో పడనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. బాలల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, దీనిని ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించి బాధ్యతతో విద్యాబోధన చేయాలని ఆయన హితవు చెప్పారు. చీపురుపల్లిలో సోధనా సంస్థ వినూత్న రీతిలో రూపొందించి అమలు చేస్తున్న ఆట పాటలతో విద్యాబోధన, అభ్యసన ప్రక్రియలు సత్పలితాలను ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో విద్యాబోధనలో మెలకువలను అభ్యసించేందుకు విశాఖ ఏజెన్సీ నుంచి ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలను శిక్షణకు పంపించామని ఆయన చెప్పారు. సోధన సంస్థ ఇచ్చిన శిక్షణలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో మిగిలిన ఉపాధ్యాయులకు, అంగన్‌వాడీలకు రిసోర్స్ పర్సన్‌లుగా వ్యవహరించి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యాబోధన కోసం తెలియచేయాలని ఆయన సూచించారు. ప్రాధమిక విద్యను అభ్యసించే బాలలకు ఆట పాటలతో విద్యాభ్యాసం చేయాల్సి ఉందని, ఉపాధ్యాయులు దీనిని అనుసరించి చిన్నారుల మనస్థత్వానికి అనుగుణంగా విద్యాబోధన సాగించి ఉత్తమ ఫలితాలను సాధించేందుకు పాటుపడాలని బాలాజి కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్, పి.ఎం.ఆర్.సి. ఎ.ఎం.ఒ. రాజుబాబు, సి.ఎం.ఒ. జ్ఞానప్రకాష్, కోఆర్టినేటర్లు చిన్నారావు, రేణుకాప్రసాద్, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి
పాడేరు, డిసెంబర్ 14: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎ.బి.వి.పి. ప్రతినిధులు పి.మత్యకొండబాబు, జి.సీతారాం చెప్పారు. శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడం వలన బాలికలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. కళాశాలలో మంచినీటి సౌకర్యం కూడా లేదని చెప్పారు. విద్యార్థులకు వౌళిక వసతులు కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వలన అనేక సమస్యలతో సతమతవౌతున్నారని వారు అన్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందచేసినట్టు వారు చెప్పారు.
రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని వినతి
అరకులోయ, డిసెంబర్ 14: మండలంలోని చొంపి పంచాయతీ గెమ్మెలివలస రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర కోరారు. పాడేరులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారికి ఆయన వినతిపత్రం అందచేసారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం రహదారి నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు పూర్తి చేయకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అర్థాంతరంగా రోడ్డు నిర్మాణం నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు జరగక గిరిజనులు రవాణా సదుపాయానికి నోచుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. గ్రామంలో గిరిజనులు రోగాలకు గురైనప్పుడు ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారి మెరుగ్గా లేకపోవడంతో కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన చెప్పారు. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా ఉన్న ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సురేంద్ర కోరారు.
అరెస్ట్ చేసిన గిరిజనులను విడుదల చేయాలి
అరకులోయ, డిసెంబర్ 14: అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్ల దాడి సంఘటనపై అరెస్ట్ చేసిన గిరిజనులను విడుదల చేయాలని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్.నర్శింగరావు డిమాండ్ చేసారు. స్థానిక గిరిజన సంఘం భవనంలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన సి.పి.ఎం. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లపై దాడి సంఘటనతో సంబంధం లేకపోయిన వారిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు. దీంతో వారి కుటుంభ సభ్యులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. అరకులోయ ఎమ్లెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల అనంతరం చోటుచేసుకున్న ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా అమాయకులైన గిరిజనులను అరెస్ట్ చేయడం పోలీసులకు తగునా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన నాయకులే దాడికి ప్రదాన సూత్రదారులైనప్పటికీ వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాల్సిన అవసరం పోలీసులకు ఉందని ఆయన అన్నారు. గిరిజనులపై పెట్టిన కేసులను ఉపసంహరించకుని వారిని విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని నర్సింగరావు చెప్పారు. ఈ సమావేశంలో సి.పి.ఎం. నాయకులు కిల్లో సురేంద్ర, పోద్దు బాలదేవ్, వి.ఉమామహేశ్వరరావు, కె.రామారావు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్లపై దాడి ఘటనలో అరెస్ట్‌ల పర్వం
అరకులోయ, డిసెంబర్ 14: అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడి సంఘటనలో మళ్లీ అరెస్ట్‌ల పర్వం మొదలయ్యింది. స్థానిక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల అనంతరం పోలీసు స్టేషన్లపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, శుక్రవారం మరో ముగ్గురిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. పోలీసు స్టేషన్ల దాడి సంఘటనలో సుమారు రెండు వందల మంది పాల్గొన్నట్టు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దశలవారీగా నిందితులను అరెస్ట్ చేస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నిందితులను అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్న మిగిలిన వారిని కూడా రానున్న కాలంలో అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గిరిజనుల అరెస్ట్‌లపై ఇప్పటికే ఒకవైపు నిరసనలు వ్యక్తవౌతుండగా, మరోవైపు అరెస్ట్‌ల పర్వం కొనసాగుతుతుండడంతో సర్వాత్రా ఆందోళన వ్యక్తవౌతుంది. పోలీసు స్టేషన్లపై దాడి సంఘటనలో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న తెలుగుదేశం నాయకులలో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసారు. దీంతో ఈ సంఘటనతో సంబంధాలు ఉన్న కొంతమంది తమను కూడా అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం నాయకుల అరెస్ట్ విషయమై సమాచారం అందుకున్న గిరిజన మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఇంతవరకు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.