విశాఖ

మోదీ సభ రైల్వే గ్రౌండ్స్‌లో * అనుమతిపై నిర్ణయం తీసుకోని ఏయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాడుతున్న టీడీపీ బీజేపీకి చెక్ పెట్టాలని యోచిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా ప్రధాని మోదీ రాష్ట్రంలో బహిరంగ సభల్లో ఏ మొహం పెట్టుకుని పాల్గొంటారంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ ఇప్పుడు అసలు మోదీ సభకు స్థలమే లేకుండా చేస్తే ఏలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 1న విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. రెండు సార్లు వాయిదా పడిన మోదీ సభ మార్చి 1న నిర్వహించేందుకు ఖరారు చేశారు. అంతకు ముందు ఫిబ్రవరి 27న మోదీ సభను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. అనివార్య కారణాలతో 27 కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి మార్చి 1న మోదీ సభకు అనుమతివ్వాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా ఏయూ వీసీకి, సీఎస్‌కు లేఖలు పంపినట్టు విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ ఏయూ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బీజేపీ నుంచి తమకు ఎటువంటి అభ్యర్థన అందలేదని, అందిన పక్షంలో పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 10న గుంటూరులో మోదీ బహిరంగ సభలో పాల్గొనగా, అధికార టీడీపీ సహా విపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. దీనిపై బీజేపీ, టీడీపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటలయుద్ధ జరిగింది. ప్రధాని హోదాలో మోదీ దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందంటూ బీజేపీ స్పష్టం చేస్తూనే టీడీపీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు సంధించింది. తాజాగా విశాఖ బహిరంగ సభకు ఏయూ మైదానం అనుమతి విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి అనురిస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో బీజేపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. చివరి నిముషం వరకూ సభా వేదిక ఖరారు కాకపోతే ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా రైల్వేగ్రౌండ్స్‌ను బీజేపీ వర్గాలు ఎంపిక చేశాయి. రైల్వేగ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సంబంధించి అనుమతులు తీసుకున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ధృవీకరించారు. మోదీ సభకు దాదాపు లక్షమంది వరకూ హాజరవుతారని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

టీడీపీలోనే కొనసాగుతా
* పార్టీ మారుతానన్న ప్రచారంలో వాస్తవం లేదు
* టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: చివరి వరకూ టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ మారే యోచన లేదని యలమంచిలి ఎమ్మెల్యే, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నేపథ్యంలో పంచకర్ల పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తన వైఖరి వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ తరపున రాజకీయ అరంగ్రేటం చేసిన తాను కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత టీడీపీలో చేరానని గుర్తు చేశారు. టీడీపీకి బద్ధుడనై నడచుకుంటానని, పార్టీ మారే యోచన లేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.520కోట్ల వ్యాపార లక్ష్యం
* జీసీసీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.520 కోట్ల వ్యాపార లక్ష్యంతో సంస్థ ఎన్నో నూతన కార్యక్రమాలు చేస్తుందని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ అన్నారు. వుడాపార్కు సమీపానున్న జీసీసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా రిటైల్ అమ్మకాలపై దృష్టిసారించి ఇంతవరకు 30 రిటైల్ దుకాణాలను, కాఫీ దుకాణాలను విమానాశ్రయాలు, బస్ స్టేషన్లలోను, ప్రభుత్వ కార్యాలయాల్లోను, పర్యాటక ప్రాంతాల్లోను, మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. సంస్థ వ్యాపార అభివృద్ధిపై ఇక మీదట దృష్టి కేంద్రీకరించి సత్ఫలితాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవం జరుగుతుందన్నారు. సంస్థకున్న సిబ్బంది బాగోగులు గమనిస్తూ వారి ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో సంస్థకు ఆస్తులు (్భవనాలు, ఖాళీ స్థలాలు) అన్నింటినీ సంరక్షించి సంస్థ ఆర్ధిక పరిపుష్టికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను పెంచుకుంటూ వెళ్తామని, వీటి వలన గిరిజన రైతులు ప్రయోజనం పొందే విధంగా గిట్టుబాటు ధరను కల్పిస్తూ మరోపక్క నాణ్యమైన మెరుగైన ఉత్పత్తులను మార్కెట్‌లోకి దించడం ద్వారా వాటికి ఆదరణ పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఉన్న ప్రేమాభిమానులతో తనకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని గిరిజన ఆర్ధిక బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. గిరిజనుల సంక్షేమం కోసం అటవీ ఉత్పత్తులను పెంచుతూ వాటి మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే అరకు కాఫీ జాతీయ స్థాయిలో ఆదరణ లభించిందని, ఇదే తరహాలో మరికొన్నింటినీ కొత్త వాటిని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. అనేక రకాలుగా గిరిజనులకు అండదండగా ఉంటూ వీరి కోసం ప్రభుత్వాలు కేటాయించిన పథకాలను పటిష్టవంతంగా అమలు చేస్తామన్నారు. సంస్థ ఎండీ టీ.బాబూరావునాయుడు, జనరల్ మేనేజర్లు అశోక్‌కుమార్, ఉమాదేవి అధికారులు యోగీశ్వరరావు, పాత్రుడు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో జీసీసీ చైర్మన్ ప్రసాద్‌న ఘనంగా సత్కరించారు. జీసీసీ ఆయా విభాగాల అధికారులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు బాసటగా నిలుద్దాం
* విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: దివ్యాంగులకు బాసటగా నిలుద్దామని విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సీఎస్‌ఆర్ నిధుల నుంచి ఆలివ్ కో వారి సహకారంతో జిల్లాప్రజాపరిషత్ హాలులో గురువారం దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన హరిబాబు తొలుత జ్వోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ దివ్యాంగులుగా నామకరణ చేసారని వీరి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకేసారి రూ.32.5 లక్షల రూపాయలు వెచ్చించి 339 మందికి ఉచితంగా ఉపకరణాలు అందజేయడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఇదే తరహాలో అనకాపల్లిలో శనివారం 400 మందికి 45 లక్షల 89వేల రూపాయల విలువైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరుగనుందన్నారు. ఈ విధంగా విశాఖ జిల్లాలో మొత్తం 78 లక్షల 22వేల రూపాయలను వెచ్చించి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ జరిగిందన్నారు. విశిష్ట అతిథి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మూడు వేల రూపాయల పింఛన్లు అందజేస్తు వీరి అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ మాట్లాడుతూ దివ్యాంగులకు మనోథైర్యం చెప్పాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైన ఉందన్నారు. గౌరవ అతిథి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాహుల్ భరధ్వజ్ మాట్లాడుతూ ఐఓసీ ద్వారా సీఎస్‌ఆర్ నిధుల నుంచి పేద ప్రజల్లో దివ్యాంగులకు, స్కూల్ విద్యార్థులకు, సహాయ,సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీ జనరల్ మేనేజర్ ఎస్‌ఎస్ ప్రసాద్, అలిమ్ కో మేనేజర్ కెవీ రాజేష్, పరిమతా బెనర్జీ, వయోవృద్ధుల,దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడి వెంకటరత్నం, జాతీయ అవార్డుగ్రహీత రూపాకుల రవికుమార్, జగదీశ్ వాలెంటర్స్ సత్యా శ్రీనివాస్, తిరుమలరావు, లలిత, తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులుక, వీల్‌ఛైర్ల ట్రైసైకిళ్ళు, క్లచ్ఛస్, బ్యాటరీ సైకిళఉళ లిమ్స్, క్యాలిపర్స్, స్మార్ట్‌కమ్, స్మార్ట్ఫోన్, వాకింగ్ స్టిక్ తదితర వాటిని అందజేశారు.

ఉపాధ్యాయుల అంత ర్రాష్ట్ర బదిలీలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: మన రాష్ట్రానికి చెందిన సుమారు 354 మంది ఉపాధ్యాయులు తెలంగాణాలో పనిచేస్తున్నారని ఫోరమ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్రా (ఎఫ్‌డీఎన్‌ఏ) ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారలు. వీరంతా 2014 రాష్ట్ర విభజనకు ముందు డిఎస్‌సీ ద్వారా మెరిట్‌లో ఉద్యోగాలు పొంది, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలోని జిల్లాల్లో నియమించబడ్డారన్నారు. అపదుడు ఇంటర్ జోనల్ బదిలీ ద్వారా సొంత జిల్లాలకు రావచ్చని భావించారన్నారు. అందువలనే ఉద్యోగంలో చేరారన్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత వీరు వేరే రాష్ట్రంలో పనిచేసి పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిని వారు ఊహించలేదన్నారు. అప్పటి నుండి తమ ప్రభుత్వానికి అంతర్ రాష్ట్ర బదిలీ చేయమని అభ్యర్ధిస్తూనే ఉన్నారన్నారు. అయినా ఫలితంలేదని, అటు తెలంగాణా ప్రభుత్వం వీరిని సానుభూతితో బదిలీ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అంగీకరించడం లేదని, వీరిలో అత్యధిక మంది బీసీలు, మహిళలు, సుమారు మూడు వందల మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారుగా పేర్కొన్నారు. గత ఐదేళ్ళుగా వీరు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మన రాష్ట్రంలోని 20కి పైగా బీసీ కులాలను అక్కడ ఈ కులాలు లేకపోవడంతో తెలంగాణా ప్రభుత్వం ఓసీలుగా మార్చి వేసిందన్నారు. దీంతో వీరు, వీరి పిల్లలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ కూడా పొందలేకపోతున్నారనా ను. వీరికి అంతర్ రాష్ట్ర బదిలీలు వర్తించవనేది తమ ప్రభుత్వ వాదనగా ఉన్నట్టు తెలిసిందన్నారు. వీరు కోరేది రాష్ట్ర విభజన వలన ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించమని అన్నారు. వీరి మాదిరి తెలంగాణాకు చెందిన సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే ఈ బదిలీలు చేయడం పెద్ద సమస్యకాదన్నారు. వీరిలో అత్యధికులు బీసీలు, మహిళలు, యువకులు అన్న అంశాలను కూడా గమనంలో ఉంచుకుని తమ చొరవ తీసుకుని, బాధ్యత గల పౌర సమాజాన్ని నిర్మించే ఈ ఉపాధ్యాయులను ఒకేసారి అంత రాష్ట్ర బదిలీల ద్వారా వారివారి సొంత జిల్లాలు వెళ్ళే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సింహాచలేశుని సేవలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
సింహాచలం, ఫిబ్రవరి 15: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ శుక్రవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు ఈయనకి స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని అలింగనం చేసుకున్న ఫ్లెమింగ్ మనసులోని కోర్కెలను స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో ఈయన పేరున అర్చకులు సంప్రదాయ పూజలు చేసి ఆశీర్వదించారు. అధికారులు ఈయనకి ప్రసాదాలు అందించారు.

శాస్త్రోక్తంగా గౌరీ పరమేశ్వరుల కల్యాణం
సింహాచలం, ఫిబ్రవరి 15: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేలవాయ క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటున్న త్రిపురాంతస్వామి వారి దేవాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి గౌరీ పరమేశ్వరుల వార్షిక కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గౌరీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సింహగిరి మాడ వీధుల్లో ఊరేగించి అనంతరం ఆలయంలో కల్యాణం నిర్వహించారు. అర్చకుడు రమణమూర్తి నేతృత్వంలో వైదిక పరివారం ఆగమోక్తంగా కల్యాణం తంతులు జరిపించారు. దేవస్థానం అధికారులు, ఉద్యోగులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఉగ్రదాడిపై ఖండన
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్‌లో సీ ఆర్‌ఫీ ఎఫ్ జవాన్లుపై జైషే మహ్మద్ ఉగ్రవాద ముఠా జరిపిన దాడి అత్యంత హేయమైన,పిరికి పంద చర్యని పలు ప్రజాసంఘాలు, జర్నలిస్ట్ యూనియన్లు, అధికార, వామపక్ష పార్టీలు నిరసనలు చేపట్టి ఖండించారు. శుక్రవారం ఉదయం జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉగ్రదాడిలో మరణించిన 47 మంది సీ ఆర్‌ఫీ ఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వౌన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశంలో ప్రతీ పౌరుడు సైనికుడిలా పనిచేస్తూ దేశ రక్షణకు పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూజే ఎఫ్ నగర అధ్యక్షుడు నారాయణ, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
* ఆంధ్ర విశ్వ విద్యాలయంలో...
శ్రీనగర్‌లో జవాన్లుపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఏయూలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వర్శిటీ గాంధీ విగ్రహం ఎదురుగా మృతి చెందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆత్మార్పణ చేసిన సైనికుల కుటుంబాలకు దేశ ప్రజలు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని, దేశంలో ఉగ్రవాదులు చొరబడకుండా ప్రతీ వ్యక్తి తనవంతు సహాయాన్ని అందించాలని సూచించారు. దేశ రక్షణ, సమగ్రత పరిరక్షించడం మనందరి బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని ఆకాక్షించారు. వందేమాతరం, భారత్‌మతాకీ జై అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ప్రసాదరావు, రిజస్ట్రార్ నిరంజన్, అకడమిక్ డీన్ ఎంవీ ఆర్ రాజు, ప్రిన్సిపాల్స్ వినోదరావు, ఆచార్య రత్నం, విద్యార్థులు పాల్గొన్నారు.
* గీతంలో...
భారత్ జవాన్లుపై ఉగ్రదాడిని పౌరసమాజం అంతా ఏకమై ఖండించాలని, అమర వీరుల కుటుంబాలకు అండగా నిలవాలని గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీ్భరత్ అన్నారు. దేశ రక్షణ కోసం వెళుతున్న సీ ఆర్‌ఫీ ఎఫ్ జవాన్లుపై ఉగ్రవాదులు దాడి చేసి ప్రాణాలు బలిగొన్న సంఘటనలపై శుక్రవారం గీతం ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు నిర్వహించిన శాంతి ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల ప్రజల సమస్యలను సరియిన విధంగా అర్ధం చేసుకొని చేయూతను అందించలేని పరిస్థితులు కారణంగా వారి నుంచి ఉగ్రవాదులుగా మారుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గీతం ఎన్‌సీసీ, రోటారాక్ట్‌క్లబ్, జాతీయ సేవా పథకం వలంటీర్లు, యుద్దం వద్దు-శాంతి ముద్దు, ఉగ్రవాదం మానసిక రోగం అంటూ బ్యానర్లును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గీతం ఇన్‌చార్జి వీసీ ఆచార్య శివరామకృష్ణ, రిజిస్ట్రార్ బాలజీ, ఎన్‌సీసీ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు, విద్యార్ధులు పాల్గొన్నారు.
* జాన జాగరణ సమితి ఆధ్వర్యంలో...
ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రదారి జైషే మహ్మద్ ఉగ్రవాద ముఠా నాయకుడు మసూద్ అజర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి,్ఫటోను ధ్వంసం చేశారు.జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ సీఆర్‌ఫీఎఫ్ జవాన్లుపై జరిగిన ఉగ్రవాద అత్యంత హేయమైన చర్యన్నారు. 44 మంది జవాన్లును పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదులపై దీటైన ప్రతికార చర్యను కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నారన్నారు.
* సీ ఆర్‌ఫీ ఎఫ్...
దేశ రక్షణ కోసం అసువులు బాసిన అమర జవాన్లకు బక్కన్నపాలెంలో ఉన్న సీ ఆర్‌ఫీ ఎఫ్ 234 సిబ్బంది నివాళ్లుర్పించారు. ఈ కార్యక్రమంలో మరణం చెందిన జవాన్లు కోసం వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీ ఆర్‌ఫీ ఎఫ్ సెకండ్ ఇన్ కమాండెంట్ నరేష్‌కుమార్ యాదవ్, ఆపరేషన్ కమాండెంట్ కాసం ఖాన్, డిప్యూటీ కమాండెంట్ ఆర్‌పీ శర్మ తదితరులు పాల్గొన్నారు.
* వైసీపీ ఆధ్వర్యంలో...
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాది ఆత్మాహూతి దాడిలో వీరమరణం పొందిన సీ ఆర్‌ఫీ ఎఫ్ జవాన్లుకు కన్నీటి నివాళ్లుర్పించారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం పార్కు హోటల్ జంక్షన్‌లో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి గాంధీ మార్గం ఎంచుకోవాలి తప్ప ఉగ్రవాదం కాదన్నారు. ప్రాణాలు కోల్పోయిన అమరజావన్లు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌టీఎల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలి
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: నగరంలోని ఆరవ జోన్ పరిధిలోని ఎన్‌ఎస్‌టీఎల్ పనులను వెంటనే ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన 66వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రానగర్ ఎర్రచెరువును అభివృద్ధి చేయాలని, ఇప్పటికే రూ.25లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం ఎల్లపువానిపాలెంలో పర్యటించి ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తున్నందున వాటిని చదును చేసి తోలగించాలని పేర్కోన్నారు. జోన్‌లోని అన్ని చెరువులను వాటి చూట్టూ కరకట్టలను ఏర్పాటు చేయాలని, చెరువులను రక్షించుకొవడంతో పాటు భూగర్భజలాల స్థిరీకరణకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎస్ ఎస్‌టీ ఎల్ రోడ్ నుంచి సింహచలానికి వెళ్లే రొడ్డు వరకూ అభివృద్ధి చేయాలని కోరారు. స్థానికుల అపోహలను తొలగిస్తూ 60 అడుగుల రహదారిని రోడ్ డవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నామని, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కోన్నారు. ఈ పర్యటనలో ఎస్ ఈ మరియన్న, ఇన్‌చార్జి జోనల్ కమిషనర్ లక్ష్మీతులసి, ఈ ఈ శ్యాంసన్‌రాజు, ఏసీపీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నగరంలో నేహ సంగీత సందడి
* హిందీ గీతాలతో ఆకట్టుకున్న సంగీత విభావరి
* జవాన్లు కోసం పాటపాడిన ప్రఖ్యాత సింగర్
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ప్రముఖ సింగింగ్ సూపర్‌స్టార్ నేహకక్కర్ పాటలతో విశాఖ నగరం పులకించింది. గత నాలుగు ఏళ్లుగా దేశాంలో వినోదాంలో ముంచెత్తిన సూపర్‌హిట్స్ నైట్స్ కార్యక్రమం శుక్రవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ నేహ గతంలో ఎన్నూడూ వినని పాటలతో విశాఖ వాసులను రజింపచేసింది. ఇంపిరీయల్ బ్లూ సూపర్‌హిట్స్ నైట్స్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన అందచందలతో అందరినీ ఆకట్టుకుంది. సూపర్‌హిట్ గీతం మిలేహో తుమ్ గీతంతో ప్రారంభించిన నేహకక్కర్, ఆంఖేమారో ఓ లడ్కా ఆంఖ్ మారే..,దిల్‌బార్,నిఖ్లే కరెంట్, లిఫ్ట్ తేరి బంద్ హై వంటి గీతాలతో అభిమానులను ఆనందోత్సాహాలతో సంతోషసాగారానికి తీసుకువెళ్లింది. ముందుగా నేహ మీడియాతో మాట్లాడుతూ విశాఖ వేరీ బ్యూట్ ఫీల్ సిటీ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. నేటి తరం సింగర్లుంతా వారి స్వశక్తితో కళా రంగలోకి వస్తున్న వారేనని, వారిని మరింతగా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా దేశ జవాన్లు కోసం ఓ పాట పాడారు. డిజె డ్యాన్స్‌లతో నగరంలోని పలువురు యువత, మహిళలు, నృత్యాలతో సందడి చేశారు.

ప్రజలను మోసం చేయడంలో బాబు నెంబర్ వన్
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ప్రజలకు అంతంతమాత్రంగానే పథకాలు అందిస్తూ మోసం చేయడంలో సీ ఎం చంద్రబాబు బ్రాడ్ అంబాసిడర్‌ని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఆరిలోవ పరిధిలో శుక్రవారం రావాలి జగన్- కావాలి జగన్ పేరిట నవరత్నాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలంటే వైసీపీకి ఒక్క అవకాశం కల్పించాలన్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలోని, రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయని ఇలాంటి ఎమ్మెల్యేకు బుద్ది చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కమిటీ వాసు, కె.సత్యనారాయణ, బోణి శివరామకృష్ణ, సుబ్బారెడ్డి, అర్జున్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ఏయూ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో గురువారం చైతన్య టెక్నో స్కూల్స్ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరిగింది. ఇందులో ఎంఎస్‌సీ ఇన్‌ఆర్గానిక్ అండ్ అనాలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎఫ్‌డిడబ్ల్యూ, ఎంఎస్సీ ఫీజికల్, న్యూక్లియర్ అండ్ కెమికల్ ఓషనోగ్రఫీ, ఎంఎస్‌సీ జూయాలజీ, ఎంఎస్సీ ఫీషరీ సైన్స్, ఎంఎస్‌సీ బాటనీ, ఎస్‌ఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ మైక్రోబయోలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ విభాగాలకు నిర్వహించిన కార్యక్రమంలో 140 మంది విద్యార్థులు హాజరుకాగా, ఇందులో 90 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విదంగా ఎంపికైన విద్యార్థులు తమ అపాయింట్‌మెంట్ ఉత్తర్వులను ఏయూ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీ.వినోదరావు చేతులమీదుగా అందుకున్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూళ్ళకు చెందిన బృందం ప్రతినిధులు జోనల్ అకడమిక్ కో-ఆర్డినేటర్ ఎల్.రాజేష్, అసిస్టెంట్ జోనల్ అకడమిక్ కో-ఆర్డినేటర్ ఏ.బాలరాజు, జోనల్ డీన్ పీ.సురేశ్, జోనల్ డీన్ అండ్ పదిమంది ఫ్యాకల్టీ సభ్యులు పీ.నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు. రిక్రూట్‌మెంట్ కార్యక్మ్రానికి కో-ఆర్డినేటర్‌గా ఏయూ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ కె.బసవయ్య వ్యవహరించగా, ఏయూ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రన్సిపాల్ ప్రొఫెసర్ టీ.వినోదరావు పర్యవేక్షణలో దీనిని నిర్వహించారు. అలాగే ఏయూ ప్రొఫెసర్లు కె.నిరంజన్, రిజిస్ట్రార్ కె.నిరంజన్ అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జీ.నాగేశ్వరరావు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

ఏవీఎన్ కాలేజీ నుంచి 14 మందికి ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా పలు సంస్థలు గురువారం నగరంలోని మిస్టర్స్ ఏవీఎన్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ఏవిఎన్ కాలేజీలో 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, ఏవీఎన్ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఏవీఎన్ కాలజే క్యాంపస్‌లో వీటిని నిర్వహించారు. ఇ్దంలో ఫార్ట్చ్యూన్ గ్రూప్, పీ అండ్ జీ, ఝాన్‌సన్స్ లిఫ్ట్స్, టోరెంట్ టెక్నాలజీస్, వెబ్‌ప్రొస్, క్యూ1 ఆసుపత్రులు ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. మొత్తం 283 మంది ఇందులో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా వీరిలో 41మంది ఎంపికయ్యారు. ఈ విదంగా ఎంపికైన వారిలో ఏవీఎన్ కాలేజీ విద్యార్థులు 14 మంది వరకు ఉన్నారు. ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌గా కెప్టెన్ డాక్టర్ ఎన్ రామకృష్ణ వ్యవహరిస్తూ రాతపరీక్షను నిర్వహించారు. అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి ఇంటర్వ్యూ చేశారు. ఏడాదికి రూ.2.15 లక్షల ప్యాకేజీని నిర్ణయించారు. కరస్పాండెంట్ ఏఏ అదీప్ భానోజీరాయ్, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.విజయప్రకాష్, పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ రమణారావు, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసరావు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని ఎంపికైన అభ్యర్థులను అభినందించారు.

గీతం న్యాయ కళాశాల అవగాహన శిబిరం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: స్థానిక ఎండాడలో జిల్లాప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో గీతం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ అంశాలపై ప్రత్యేక అవగాహన శిబిరాన్ని గురువారం నిర్వహించారు. గీతం న్యాయ కళశాల డైరెక్టర్ ప్రొఫెసర్ అనితారావు మాట్లాడుతూ ప్రాథమిక విద్య, బాలల హక్కులు, విద్యా, ఆరోగ్య హక్కులను అమె వివరించారు. రక్షిత మంచినీరు, ప్రాథమిక ఆరోగ్యం వంటివి విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చి దిద్దుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

విద్యార్ధులు పరిశోధనల వైపు మొగ్గు చూపాలి
అనకాఫల్లిటౌన్, ఫిబ్రవరి 15: ఇంజనీరింగ్ విద్యార్ధులు పరిశోధనల వైపు మొగ్గు చూపించి మేదాశక్తిని పెంపొందించుకోవాలని జాతీయ పరిశోధనా అభివృద్ది సంస్థ ఇన్‌ఛార్జి డాక్టర్ బిజయ్‌కుమార్ సాహూ సూచించారు.స్థానిక డైట్ ఇంజనీరింగ్ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన డాక్టర్ బిజయ్‌కుమార్ సాహూ, సినీ నటుడు రావురమేష్‌లు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా బిజయ్‌కుమార్ సాహూ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునాతనమైన టెక్నాలజీని అందుపుచ్చుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలన్నారు. విద్యార్ధులు ఉద్యోగాలు పొందడమే కాకుండా భవిష్యత్‌లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. గత 12ఏళ్ళునుండి డైట్ కళాశాల ద్వారా ఎంతో మందికి విద్యావంతులను చేసి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. మరో ముఖ్య అతిధి సినీ నటుడు రావురమేష్ మాట్లాడుతూ చదువుకోవాలని లక్ష్యంతో ఉన్న ప్రతీ విద్యార్ధి అనుకొన్న లక్షాన్ని చేరుకుంటాడన్నారు. విద్యాతోపాటు కళలను కూడా అస్వాదించాలని విద్యార్ధులకు సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డైట్ చైర్మన్ రత్నాకర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యతోపాటు నైపుణ్యాలను పెంపొందించాలని, ప్రతీ విద్యార్ధిలోను అభివృద్ది స్పష్టంగా కనిపించాలన్నారు.ఈ సందర్బంగా విద్యార్ధులకు స్పందన కలగాలనే ఉద్దేశంతో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన 50మంది విద్యార్ధుల తల్లిదండ్రులకు, ప్రాంగణ నియామకాలు సాధించిన 100మంది విద్యార్ధుల తల్లిదండ్రులకు వస్త్రాలు, జ్ఞాపికలు అందజేసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈసందర్బంగా విద్యార్ధినీ విద్యార్ధులు ప్రదర్శించిన వివిధ కల్చరల్ కార్యక్రమాలు పలువురను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కెఎస్ ఈశ్వరరావు, ప్రోగ్రామ్ కన్వీనర్ కె సుజాత, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

నూకాంబిక హుండీ ఆదాయం లెక్కింపు
అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 15:ఉత్తరాంధ్ర ఇలవేల్పుఅయిన శ్రీ నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం శుక్రవారం లెక్కించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు 90 రోజులకుగాను 19లక్షల 77వేల 960 రూపాయలు, అన్నదానం ఆదాయం 32వేల 730, బంగారం 98గ్రాములు,వెండి ఒక్క కిలో 570 గ్రాములు వచ్చినట్లుగా ఆలయ సహయక కమీషనర్ ఎన్ సుజాత తెలిపారు. విశాఖకు చెందిన శ్రీవారిసేవాసభ్యులు ఈ ఆదాయాన్ని లెక్కించగా ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు కొణతాల వెంకట్రావు, మళ్ళ సురేంద్ర, ఎండోమెంటు ఇనె్స్పక్టర్ శ్రీనివాసరాజులు పాల్గొన్నారు.

దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు
అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 15: దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వికలాంగుల హక్కుల జాతీయ వేధిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడ నూకఅప్పారావు ఆవేధన వ్యక్తం చేసారు. మండలంలోని బొజ్జన కొండ వద్ద శుక్రవారం జరిగిన మండల వికలాంగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం ఎంతో మేలుచేస్తున్నట్లు ప్రచారం చేస్తుందని, ఆచరణలోమాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వికలాంగులందరికీ మూడువేలు ఫించన్లు ఇస్తున్నట్లు చెప్పుకుంటుదని, అందులో10శాతం మందికే దక్కుతుందన్నారు. మిగతా 90శాతం మంది వికలాంగులకు రెట్టింపు చేసిన తర్వాత 2వేలు మాత్రమే అందుతున్నాయని, దీని వల్ల వికలాంగులకు అన్యాయం జరుగుతుందన్నారు. అందరికీ ఒకే విధంగా మూడువేలు అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.గృహాలు లేని వికలాంగులకు గృహాలు నిర్మించి ఇవ్వాలని, ఇద్దరు వికలాంగులు పెళ్ళి చేసుకుంటే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎం శంకర్ నారాయణ, బుద్ద ధనలక్ష్మి, బి దిలీప్,కె కోటీశ్వరరావు,కె వరలక్ష్మి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పాత పద్దతిలో దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి
అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 15: ప్రభుత్వం అందజేస్తున్న దృవీకరణ పత్రాలను అన్‌లైన్ కాకుండా పాతపద్దతిలోనే ఇవ్వాలని సిపిఐ నాయుకులు శుక్రవారం తహాశీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్ విశాఖ కార్యవర్గ సభ్యులు వైఎన్ భద్రం మాట్లాడుతూ కులదృవీకరణ పత్రాలు మీసేవా ద్వారాధరఖాస్తుచేస్తే సమయానికి లబ్ధిదారులకు అందడం లేదన్నారు. పలితంగా విద్యార్ధులు, వివిద ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకోవడానికి, ఆదరణ పథకం తదితర అవసరాలకు లేకపోవడంతోలబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆన్‌లైన్ పద్దతిని రద్దుచేసి స్వయంగా తహశీల్ధార్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్ధార్ పి రామకృష్ణకు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆడారి అప్పారావు, కోన లక్ష్మణ, ఎం సూరిబాబు, కెవి రమణ, కె శంకరరావు, కె సూర్యనారాయణ, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కేశవ స్వామి ఆలయంలో కల్యాణోత్సవాలు ప్రారంభం
చోడవరం, ఫిబ్రవరి 15: చరిత్ర ప్రసిద్ధి కలిగిన శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారి కల్యాణ మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారికి నిత్యపూజలు నిర్వహించి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, అగ్నిప్రతిష్టాపన, ప్రధాన హోమం, దేవీ పూజలు వేదమంత్రోచ్చారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, అంకురార్పణం కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో స్వామివారి 746వ పాంచాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. శనివారం మధ్యాహ్నం కేశవ స్వామివారి తిరువీధి ఉత్సవం మేళతాళాలతో అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసిందని, ఉత్సవ కమిటీ చైర్మన్ అలమండ బంగారయ్య, సీతారామాచార్యులు తెలియజేసారు.

ప్రతీ పంచాయతీలో డ్వాక్రా మహిళల సంఘ భవనాలు
చోడవరం, ఫిబ్రవరి 15: నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో డ్వాక్రా మహిళల సౌకర్యార్ధం సంఘ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తమ సంఘ సమావేశాలు నిర్వహించుకునేందుకు సరైన వసతులు లేక చెట్లకింద, దేవాలయ ప్రాంగణాల్లోను ఏర్పాటు చేసుకుంటున్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని సంఘ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రతీ సంఘ భవనానికి 14లక్షల రూపాయల వంతున పక్కా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఆయా భవనాలను మినీ కల్యాణ మండపాలు రీతిలో అన్ని వసతులతో నిర్మించేందుకు అనుమతులు కూడా లభించాయని ఆయన అన్నారు. అవసరమయితే తానుకూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులను సైతం కేటాయిస్తామన్నారు. అలాగే వీటితోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తొమ్మిది పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కో పంచాయతీ భవనానికి 17లక్షల రూపాయల వంతున మంజూరు జరిగిందన్నారు. 25 అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణానికి కూడా పదిలక్షల రూపాయల వంతున నిధులు మంజూరయ్యాయని ఆయన తెలియజేసారు.