విశాఖ

కార్మికులలో రాజకీయ చైతన్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 20: కార్మికులు పోరాటాలతో పాటు రాజకీయంగా చైతన్యవంతం కావాలని సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయ భవనంలో సి.ఐ.టి.యు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ ప్రధమ వర్థంతి సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల సాధన కోసం ఉద్యమిస్తున్న కార్మికులు రానున్న కాలంలో రాజకీయ రంగంలో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహించిన మహా గొప్ప నేతను తామంతా కోల్పోవడం కార్మికుల లోకానికి తీరని లోటని ఆయన చెప్పారు. దివంగత కార్మిక నేత రమేష్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం మనందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నానాటికీ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దీనిని అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ప్రతి కార్మికునికి కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేసారు. కార్మికులకు అన్యాయం జరిగితే సి.ఐ.టి.యు. చూస్తూ ఊరుకోదని, వారి పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరం జనవరి 8,9 తేదీలలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికుల సమ్మె చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం తగిన ప్రచార ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కూలదూసి, అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలకు అధికారంలోకి తీసుకువస్తామని కోటేశ్వరరావు అన్నారు. అంతకుముందు దివంగత కార్మిక నేత రమేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు కిల్లో సురేంద్ర, సి.ఐ.టి.యు. ప్రతినిధి వి.ఉమామహేశ్వరరావు, పర్యాటక కార్మిక సంక్షేమ సంఘం నాయకుడు పి.గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇక్కట్లు
అరకులోయ, నవంబర్ 20: అరకులోయలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో మంగళవారం వినియోగదారులు ఇక్కట్ల పాలయ్యారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారులు, లాడ్జింగ్‌లు, రిసార్ట్స్‌లు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. యండపల్లివలసలోని 33 కె.వి. ఉప కేంద్రం నుంచి పాడేరులో నూతనంగా నిర్మిస్తున్న ఉప కేంద్రానికి సంబంధించిన కొత్త విద్యుత్ లైన్ పనులు చేపట్టడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్టు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ కోడి వెంకటేశ్వరరావు తెలిపారు.

అధిక విద్యుత్ బిల్లులతో ఇక్కట్లు
పాడేరు, నవంబర్ 20: మండలంలోని వనుగుపల్లి పంచాయతీ బంగారుమెట్ట, బిరిమిశాల గ్రామాల గిరిజనులకు అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారని ఆదివాసీ మహాసభ అధ్యక్షుడు కొర్రా అప్పారావు చెప్పారు. ఈ గ్రామాల గిరిజనులకు పదకొండు నుంచి పదిహేను వేల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు జారీ చేస్తుండడంతో గిరిజనులు వీటిని చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో గిరిజనుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్‌లను తొలగిస్తున్నారని, దీంతో ఈ గ్రామాలు చీకటిలో ఉండాల్సి వస్తోందని ఆయన చెప్పారు. వ్యవసాయ, కూలీ పనులను చేసుకుని జీవించే గిరిజనులకు అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు జారీ చేయడం తగదని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించని వారిపై అధికారులు కేసులు కూడా నమోదు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయమై అధికారులు దృష్టి సారించి గిరిజనులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ బిల్లులు జారీ చేయాలని ఆయన కోరారు.

పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి
మాడుగుల, నవంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఎ.పి.జన్మభూమి సమన్వయకర్త పైలా ప్రసాదరావు అన్నారు. మండలంలోని వీరనారాయణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గౌర మినరల్స్ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్లు, మంచినీటి ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వౌళిక వసతుల సమస్య అధికంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత పరిస్థితులతో చూస్తే ప్రస్తుతం మెరుగుపడిందని ఆయన చెప్పారు. గ్రామాలలో ఆలయాల నిర్మాణం, వినోద కార్యక్రమాలకు సహకరించినట్టుగానే ప్రభుత్వ పాఠశాలల్లో వౌళిక వసతుల కల్పనకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. మాడుగుల నియోజకవర్గంలో ఇంతవరకు 50 పాఠశాలలకు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌర మినరల్స్ ప్రతినిధి ఎ.బి.ఎల్. తాయారు, గనుల భూగర్భశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.వి.ఎస్.చౌదరి, పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.