విశాఖపట్నం

‘పంచ గ్రామాల’కు రెండు పరిష్కార మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: పంచ గ్రామాల సమస్యకు పరిష్కార మార్గాలపై బుధవారం అమరావతిలో కీలక సమావేశం జరిగింది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న పంచ గ్రామాల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పరిశీలించారు. సింహాచల శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధూప, దీప, నైవేద్యాల కోసం 15 శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు 27 గ్రామాలను ఇచ్చారు. ఆ తరువాత పూసపాటి వంశీకులు కూడా ఈ భూములను ఇందుకోసమే వినియోగిస్తూ వచ్చారు. 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ అమల్లోకి రావడంతో 27 గ్రామాల్లో ఉన్న రైతులకు జిరాయితీ హక్కు వచ్చింది. 1953లో అడవివరం, వేపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం గ్రామాలను ఈనాం గ్రామాల కిందకు తీసుకువస్తూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయం అక్కడున్న రైతులకు ఏమాత్రం తెలియనీయలేదు. మానం ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఐదు గ్రామాలు జిరాయితీ కిందకు రాలేదన్నది తెలిసింది. కానీ పంచగ్రామాల ప్రజలకు ఈ విషయం అప్పట్లో అర్థం కాలేదు. సుమారు 1750 ఎకరాల భూమి ఈనాం పరిధిలోకి వెళ్లిపోయింది. ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ కింద ఒకసారి గ్రామాలను జిరాయితీగా ప్రకటించిన తరువాత రాజ్యంగంలోని తొమ్మిదవ అధికరణం కింద మరెవర్వరూ ఈ భూమిని వేరే విధంగా బదలాయించడానికి అధికారం లేదన్నది ఇప్పుడు ఈ పంచ గ్రామాల ప్రజల వాదన. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. 1968లో, 1977లో, 1996లో సింహాచల దేవస్థానానికి సుమారు తొమ్మిది వేల ఎకరాలకు ప్రభుత్వం పట్టా ఇచ్చినప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. దేవస్థానానికి పట్టా ఇచ్చినప్పుడు సంబంధిత దస్త్రాలపై అప్పటి ఎమ్మార్వో లిఖతపూర్వకంగా ఇచ్చిన నివేదికలో, పట్టా ఇచ్చే ముందు 1904 నుంచి ఈ భూమిని అనుభవిస్తున్న రైతుల్ని విచారించ వలసి ఉందంటూ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా దేవస్థానానికి పాట్టా ఇచ్చేసింది. పట్టా ఇచ్చినప్పుడు కూడా రైతులకు తమ భూములు జిరాయితీ కిందకు రాలేదన్న విషయం తెలియదు. 1998 నుంచి రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయిన తరువాత ఈ పంచ గ్రామాల ప్రజలకు అసలు విషయం తెలిసింది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం భూములను రెగ్యులరైజ్ చేసుకోమని 578 జీఓ జారీ చేసింది. కానీ ఈ పంచ గ్రామాల ప్రజలు దీనిపై స్పందించలేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు బుధవారం సమావేశం జరిగింది.
27 గ్రామాలను జిరాయితీగా ప్రకటించిన తరువాత ట్రిబ్యునల్ జోక్యం కుదరదంటూ లీగల్ పాయింట్‌ను సమావేశం ముందుంచారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ ద్వారా కోర్టు ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు సరికావని నిరూపించాలని సమావేశం అభిప్రాయపడింది. ఒకవేళ ట్రిబ్యునల్ ఆదేశాలు సరైనవేనని తేలితే, పంచ గ్రామాల పరిధిలో ఉన్న 1750 ఎకరాల భూమిపై రైతులకు పూర్తిగా హక్కు కల్పిస్తూ, ఇందుకు తత్సమాన భూమిని దేవస్థానానికి ఇవ్వాలని కూడా సమావేశం అభిప్రాయపడింది.
దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ నివేదిక పరిశీలించిన తరువాత ఈ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, గణబాబు, పీలా గోవింద్, పార్టీ నాయకులు పాశర్ల ప్రసాద్, సీసీఎల్‌ఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.