మెయన్ ఫీచర్

విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం

  • - హెబ్బార్ నాగేశ్వరరావు
  • 23/02/2012

మానవ అధికారాల ఉల్లంఘన వ్యవహారంలో దశాబ్దులపాటు ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ అభిప్రాయాన్ని లెక్కపెట్టని చైనా ప్రభుత్వం ఇప్పుడు ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ను ధిక్కరిస్తోంది! స్వదేశంలోని సైద్ధాంతిక శత్రువులను నిర్ధాక్షిణ్యంగా హత్యచేసిన చైనా ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి అభిశంసించలేకపోవడం కొనసాగుతున్న అంతర్జాతీయ వైపరీత్యం. చైనా ఇప్పుడు ప్రపంచ వాణిజ్యసంస్థ- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబుల్‌యూటిఓ- నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య బీభత్సకాండ కొనసాగించడానికే కృతనిశ్చయంతో ఉంది. ఈ వాణిజ్య దురాక్రమణకు ప్రధానంగా గురి అవుతున్నదేశం మన దేశం! ముడి పదార్థాల ఎగుమతుల విషయంలో చైనా ప్రభుత్వం అన్యాయమైన సంకుచిత విధానాన్ని అనుసరిస్తోందని ‘డబుల్‌యూటిఓ’ వివాద పరిష్కారాల మండలి వారు గత నెల 31న తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు అన్యాయమని చైనా రెండువారాల తరువాత ప్రకటించింది. వాణిజ్య సంస్థ తీర్పుతో నిమిత్తం లేకుండా ముడి పదార్థాల ఎగుమతుల విషయంలో ఆంక్షలు కొనసాగించనున్నట్టు చైనా ప్రభుత్వం ధ్వనింపచేసింది. విచిత్రమైన విషయం ఒకటుంది. ఈ ఆంక్షల కారణంగా ఎక్కువ నష్టపోతున్న మన దేశం వాణిజ్య సంస్థకు ఫిర్యాదుచేయలేదు. అమెరికా, ఐరోపా సమాఖ్యవారు మాత్రమే చైనాకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేశారు. ఆ తరువాత ఉభయ వర్గాలకు సంబంధం లేని మూడవ పక్షంగా భారత్ మరికొన్ని వర్ధమాన దేశాలు చేరాయి. మానవాధికారాలను ఉల్లంఘిస్తున్న చైనాను అభిశంసించడానికి గతంలో అమెరికా తదితర దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రతిపాదించినప్పుడు మన దేశం చైనాకు అనుకూలంగా వోటు వేయడం చరిత్ర. చైనాతో సైనికంగా తలపడలేమన్నది మన ప్రభుత్వ విధానం. కానీ దౌత్యపరంగా కానీ అంతర్జాతీయ న్యాయ వేదికలపై కానీ చైనాను ఎదిరించడానికి మన ప్రభుత్వం ఎందుకు తటపటాయిస్తోంది?
బ్రహ్మపుత్ర నదీ జలాల వివాదం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! జమ్మూకాశ్మీర్‌లో కృష్ణగంగ జలాశయం నిర్మించాలని భావిస్తున్న మన ప్రభుత్వ యత్నాలకు పాకిస్తాన్ గండికొడుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో వివాదాన్ని దాఖలు చేసింది. ఈ వివాదం ప్రాతిపదికగా కృష్ణగంగ ఆనకట్ట నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మన ప్రభుత్వానికి అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను జారీచేసింది. కానీ ఇదే రీతిలో బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో చైనా తలపెట్టిన ఆనకట్టల నిర్మాణాన్ని ఆపుచేయించడానికి మన ప్రభుత్వం పూనుకోవడం లేదు. మనకు రావలసిన జలాలను తాము నిరోధించబోమని చైనా హామీ ఇచ్చిందట! తాము చైనా హామీని విశ్వసిస్తున్నట్టు మన ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ చెప్పి ఉన్నారు. పాకిస్తాన్ మాత్రం ‘కృష్ణగంగ’ వ్యవహారంలో మన మాటలను విశ్వసించడం లేదు!
ఉక్కు, అల్యూమినియం, రసాయనాల ఉత్పత్తికి అవసరమైన పారిశ్రామిక ముడిపదార్థాలను అవసరమైన దేశాలకు ఎగుమతి చేయకుండా చైనా ప్రభుత్వం ‘డబుల్‌యూటిఓ’ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నది అమెరికా ఐరోపా చేసిన ఫిర్యాదు. ఎగుమతులపై విపరీతంగా సుంకాలను విధించడం ద్వారాను, ముడి పదార్థాలను సేకరించడం తగ్గించడం ద్వారా చైనా ప్రభుత్వం వివిధ దేశాలలో వాటి కృత్రిమ కొరతను సృష్టిస్తోందట! పచ్చ భాస్వరం, తగరం, సీసం, మాంగనీస్, బొగ్గు బాక్సైటు వంటి ఖనిజాలను తగినంతగా చైనా తవ్వడం లేదని ఎగుమతులు చేయడం లేదని అమెరికా వాదం. ఫలితంగా తమ దేశాలలో తయారయ్యే పారిశ్రామిక వస్తువుల ఉత్పాదక వ్యయం పెరిగిపోతోందని, అవే వస్తువులను చైనా చౌకగా తయారుచేస్తోందని అమెరికా ప్రభుత్వం వాదించింది. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో చైనా వస్తువులతో అమెరికా, ఐరోపా తదితర దేశాల వస్తువులు పోటీపడలేక పోతున్నాయి. సమాన అవకాశాలు ప్రసాదించే ప్రపంచీకరణ స్ఫూర్తికి ఇది విరుద్ధం. కానీ తమ దేశంలో అడవులను ప్రకృతిని పర్యావరణాన్ని పచ్చదనాన్ని పరిరక్షించుకోవడానికి ఇలా తవ్వకాలను, ఎగుమతులను నియంత్రించవలసి వస్తోందని చైనా వాదించింది. చైనా వాదాన్ని ‘వాణిజ్య సంస్థ’ వివాద పరిష్కార మండలి- డిస్‌ప్యూట్స్ సెటిల్‌మెంట్ పానల్- వారు గత జూలైలో తోసిపుచ్చారట! ఇప్పుడు ‘సమీక్షా మండలి’కూడ తిరస్కరించిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ను విమర్శిస్తోంది. అన్ని దేశాలు కూడా అవసరమైనప్పుడు సంకుచిత వాణిజ్య విధానాలకు పాల్పడుతూనే ఉన్నాయని చైనా అంటోంది. అంటే తాము కూడా పాల్పడుతున్నట్టు చైనా ప్రభుత్వంవారు అంగీకరించినట్టయింది. మన దేశాన్ని చైనా ప్రత్యేకంగా విమర్శించింది కూడ. ‘‘్భరతదేశం కూడ ఇనుప ఖనిజం, బొగ్గు ఎగుమతులను నియంత్రిస్తోంది’’అని చైనా మన దేశాన్ని పేరుపెట్టి తప్పు పట్టింది. మన ప్రభుత్వం చైనాపై ఫిర్యాదు చేయలేదు. పైగా ముడి వస్తువులను చైనాకు నిర్నిబంధంగా చైనాకు ఎగుమతి చేస్తోంది. చైనా నుండి తయారైన గృహోపకరణాలు, యంత్ర పరికరాలు మన దేశానికి తరలి వస్తున్నాయి. ఫలితంగా వాణిజ్యంలో మనకు భారీగా లోటు ఏర్పడిపోయింది! అపురూప భూగర్భ ఔషధ రజాల- రేర్ అర్త్ ఎలిమెంట్స్- విషయంలో కూడ చైనా ఎగుమతులను నియంత్రించడం ద్వారా అంతర్జాతీయ విపణిపై పట్టుసాధిస్తోంది! చైనీయ వైద్యంకోసం ఔషధాల తయారీకోసం అవసరమవుతున్న పులిగోళ్లు, చర్మాకోసం మన దేశంలోని పులులు వధకు గురిఅవుతున్నాయి. చైనా ప్రభుత్వం తన దేశంలోని పులులను మాత్రం పరిరక్షించి వాటి సంఖ్యను పెంచుతోంది. మన దేశంనుండి పులిగోళ్లు చర్మాల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోంది. ఏడేళ్ల క్రితం మనకూ టిబెట్‌కూ సరిహద్దుగా ఉన్న సిక్కింలోని నాథులా కనుమగుండా చిల్లర వర్తకం మొదలైన తరువాత మన దేశంలో ఈ శార్దూల విధ్వంస క్రీడ మరింత పుంజుకొంది. పులి శరీర భాగాల దొంగ రవాణాను నిరోధించమని మన ప్రభుత్వం అనేకసార్లు చైనాకు మొరపెట్టుకున్నప్పటికీ అక్రమ కలాపాలు మాత్రం ఆగలేదు.
అంతర్జాతీయ కలాపాలలో దౌత్యపరంగాను వ్యూహాత్మకంగాను అమెరికాను ఎదిరించే శక్తిగా ఎదిగిన చైనా ఇప్పుడు ఐక్యరాజ్యసమితి వ్యవహారాలను శాసించే స్థాయికి చేరింది. సిరియాను నియంత్రించడానికి ‘సమితి’చేస్తున్న ప్రయత్నాలకు చైనా గండికొడుతుండడం సరికొత్త పరిణామం. ‘అమెరికా-రష్యా’ ఆధిపత్య సమరం ‘అమెరికా చైనా’ ప్రాబల్యస్పర్థగా రూపాంతరం చెందడం అంతర్జాతీయంగా చైనావారి దుందుడుకు ప్రవృత్తికి లభించిన పరిగణనకు చిహ్నం. ‘ప్రపంచీకరణ’ సృష్టించిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో చైనా అత్యధిక ప్రభావవంతమైన ఆర్థికశక్తిగా ఆర్భాటం చేస్తోంది. 2009లో అనేక అమెరికా ఆర్థిక సంస్థలకు నిధులను సమకూర్చడం ద్వారా చైనా ఆ సంస్థలు దివాలా తీయకుండా అడ్డుకోగలిగిందట! ఇప్పుడు బ్రిటన్‌ను ఐరోపా దేశాలను ఆర్థిక సంక్షోభంనుండి గట్టెక్కించడానికి చైనా నడుం బిగించినట్టు ప్రచారవౌతోంది. అమెరికా ఆఫ్రికా ఖండాలలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికా ‘మాట’ కంటె చైనా భయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. స్వదేశ ప్రజలను సామూహికంగా హత్యచేస్తున్న సిరియా ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు బషీర్ అల్‌అసాద్‌ను నిర్లజ్జగా చైనా ప్రభుత్వం సమర్ధించడానికి కారణం ‘‘నేనున్నాను’’అని అమెరికాను బెదిరించడం! సిరియాలోని నరహంతక రాజకీయ వ్యవస్థను అరబ్ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నప్పటికీ చైనా మాత్రం సమర్ధించడం ప్రపంచ దేశాలను విస్మయపరుస్తున్న పరిణామం! కానీ ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని లెక్కచేయని స్థితికి చైనా ప్రభుత్వ దురహంకారం ఎదిగిపోయింది. టిబెట్ ప్రజల అధినేత దలైలామాను కలుసుకొన్నందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాయ్ సర్కోజీని చైనా నీచంగా నిందించింది. కానీ ఏడాది తరువాత సర్కోజీ ఆ సంగతిని మరచిపోయి చైనా అధ్యక్షుడిని, హూజింటావోను, ఆలింగనం చేసుకున్నాడు. దలైలామాను ఢిల్లీకి రప్పించినందుకు నిరసనగా చైనా ఏక పక్షంగా నవంబర్‌లో జరుగవలసిన ‘సరిహద్దు’ చర్యలను వాయిదావేసింది! మన ప్రభుత్వం అవమానాన్ని దిగమింగి గత నెలలో ‘నవ్వు ముఖం’తో సరిహద్దు చర్చలను జరిపించింది. ‘తాను ఏమిచేసినా తనను ఎవరూ ఏమీ చేయలేరన్న’ వైఖరి చైనా ప్రభుత్వం ప్రతి దినం ప్రదర్శిస్తోంది. సరిహద్దు చర్చల ప్రహసనం నిరవధికంగా కొనసాగుతోంది. కానీ లడక్ ఉత్తర ప్రాంతం- అక్సాయిచిన్- తమదేనని, భారత్‌కు అప్పగించే ప్రసక్తిలేదని ఈనెల 15వ తేదీన చైనా స్పష్టంచేసింది. ఇంక చర్చలెందుకు? మన ఉత్తర కాశ్మీర్- గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం- పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, తన అధీనంలోకి తెచ్చుకొనడానికి చైనా ఇప్పుడు యత్నిస్తోంది.
వియత్నాం సముద్ర జలాలలో మనలను నిరోధిస్తూ చైనా... బర్మా దీవులలో తిష్ఠవేసి అండమాన్ వైపు చూస్తునే చైనా... శ్రీలంకలో చైనా, మాల్ దీవులలో హఠాత్తుగా రాయబార కార్యాలయం తెరచిన చైనా, పర్షియా సింధుశాఖలో గస్తీ తిరుగుతూ చైనా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో సైనికులను నెలకొల్పిన చైనా... ఆక్రమిత ప్రాంతాన్ని వదలనంటున్న చైనా!! మన ప్రభుత్వం మాత్రం వౌనంగా...

Comments

CHOODU PINNAMMA PAADU PILLODU

Yes really we need show door to old leadres.. we want leaders like rana prathap, nethaji, bhagath singh...

We want BJP government

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading