అర్చన ధర్మసందేహాలు

* బ్రాహ్మణులలో కొన్ని ప్రాంతాలవారు మాంసాహారులుగా కనిపిస్తున్నారు. ఆంధ్రాది ప్రాంతాలవారు మాత్రం శాఖాహారులుగా కనిపిస్తున్నారు. ఈ భేదం ఎందుకు వచ్చింది?
- యశ్వంతరావు శేషగిరిశర్మ, ధవళేశ్వరం
అనేక శతాబ్దులుగా సాగిన శత్రు పరంపరల మాయా యుద్ధాలను తట్టుకోవడంకోసం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అనేక వర్ణాలవారు, అనేక శాఖలవారు శస్త్ర జీవనానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సంకట దుర్భర దినాలలో అనేక ఆచార పరిణామాలను కూడా అప్పటి సమాజం అంగీకరించింది. ఆ ప్రక్రియలో కొన్ని ప్రాంతాల బ్రాహ్మణులు బ్రాహ్మణత్వాన్ని గుర్తుపెట్టుకొని కూడా మాంసాహారులుగా నిలిచిపోవలసి వచ్చింది. దక్షిణ భారతాన ఉన్నవారికి ఆ శత్రుదాడుల పోటు కొంచెం తక్కువ గనుక, ఆ ప్రాంతాలలో సనాతన సదాచారాలు ఒకింత మెరుగుగా జీవించాయి. ఈమధ్య యుగ చారిత్రక పరిణామాలు రాకముందు భారతదేశంలో ఆసేతు హిమాచలంగల బ్రాహ్మణుల ధర్మాలన్నీ ప్రధానంగా ఉత్తరాది మహర్షుల బోధలనుంచీ సంక్రమించినవే కనుక, దేశమంతా అవి ఒకే రీతిగా ఉండేవి.
* నిద్రపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోతుంది?
-శెట్టి వాసుదేవరావు, శ్రీకాకుళం
ఎక్కడికైనా పోయేదైతే అది ఆత్మకాదు. నిజమైన ఆత్మ సర్వవ్యాప్తి. శరీరానికి తననుతాను బంధించుకొని వున్న ఆత్మ పేరు జీవాత్మ. అది ప్రాణం వున్నంతవరకూ శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటుంది.
* దేవీభాగవతంలో బ్రహ్మవిష్ణు శివులకంటే, పెద్ద అయినది స్ర్తిమూర్తి, ఆమె ప్రక్కన ఒక శివుడు ఉన్నాడు- అని రాశారు. దాని అర్థమేమిటి?
- సి.హెచ్.వాసుదేవరావు, శ్రీకాకుళం
బ్రహ్మ విష్ణుశివులు సృష్టి స్థితి లయ కర్తలు, అంటే వీరిలో వరుసగా సృష్టిశక్తి, స్థితిశక్తి, లయశక్తి వున్నాయి. ఇలాంటి శక్తులన్నీ కలిసిన దివ్యశక్తే అమ్మవారుగా దేవీ భాగవతం వర్ణించింది. ఆ దివ్యశక్తే తనను సమష్టి మహాశక్తిగా వ్యక్తం చేసుకున్నప్పుడు ఆమె సమస్త లోకాలకూ తల్లిగా అవతరిస్తుంది. అలాంటి తల్లి పక్కన బ్రహ్మవిష్ణుశివుల వంటి తండ్రులందరి సమష్టి మూర్తి అయిన ఒక తండ్రి ఉండాలి గదా! ఆయన పేరే మహాశంభువు. ఆయన రూపం లయకర్త అయిన శివుడి రూపంలాగా వుంటుందని మహర్షులు నిర్ణయించారు. అందువల్ల అమ్మవారి ప్రక్కన శివుడు ఉన్నట్లుగా పురాణాలలో వారు మనకు బోధించారు.
* విష్ణు ఆలయాలలో నవగ్రహాలు ఎందుకు ఉండవు?
- బుద్ధామురళి, మల్కాజిగిరి
ప్రతిష్ఠ చేసేవారి అసౌకర్యంవల్ల గానీ, అశ్రద్ధ వల్లగానీ వుండవు. మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారు నిర్మించిన శ్రీ వేంకటేశ్వరాలయంలో నవగ్రహాలు గూడా ఉన్నాయి.
* దశావతారాలలోని బుద్ధుడు, బౌద్ధమత వ్యాప్తిచేసిన బుద్ధుడు వేరు వ్యక్తులని మీరన్నారు. మరి ఆ రూపాలలో భేదం కనిపించదేమి?
- కె.నరసింహమూర్తి, పాశర్లపూడి
ఆ రోజుల్లో ఫొటోగ్రఫీ వున్న దాఖలాలేమీ లేవు. మనకు దొరుకుతున్న శిల్పాలు, ఫొటోలు వగైరాలన్నీ మధ్య యుగ శిల్పుల ఊహా బలాన్నిబట్టి వచ్చినవే. ఈ శిల్పాదులన్నీ శుద్ధోదనాదేవీ పుత్రుడైన బుద్ధుడ్ణి ఉద్దేశించి ఉద్భవించినవే. ఇక దశావతార బుద్ధుడి రూపాన్ని ఎవరు ఊహించగలరు? అందువల్ల, కళాకారులు ఇద్దరు బుద్ధుల బొమ్మల్నీ ఒకే రకంగా చిత్రిస్తున్నారు. ఈ బొమ్మల్నిబట్టి, అసలు వ్యక్తుల రూపాల గురించి నిర్ణయించటం అసాధ్యం.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోఢ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.
Add new comment