విశాఖపట్నం

ది బర్డ్స్ (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సార్! మన సెల్ టవర్ల నుండి సిగ్నల్స్ కట్ అయ్యాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు’’ అన్నాడు ఆటా సెల్యులర్ నెట్‌వర్క్ సంస్థ ఎగ్జిక్యూటివ్ రవికాంత్.
‘‘సిగ్నల్స్ కట్ అయ్యాయా? ఏ టవర్ల నుండి’’ ఆత్రుతగా అడిగాడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పాండే.
‘‘నగరంలో అన్ని టవర్ల నుండి సిగ్నల్స్ కట్ అయ్యాయి సార్’’ అన్నాడు రవికాంత్.
‘‘ ఏమిటీ ఒకేసారి అన్ని టవర్ల నుండి సిగ్నల్స్ లేకపోవడమేమిటి? ఇదెలా జరిగింది?’’ ఆశ్చర్యంగా అడిగాడు పాండే.
‘‘అదే అర్ధం కావడంలేదు సార్’’ అన్నాడు రవికాంత్.
‘‘సార్ సార్’’ క్యాబిన్ నుండి పరుగులాంటి నడకతో వచ్చాడు మరో ఎగ్జిక్యూటివ్ సుందర్.
‘‘మళ్లీ ఏమయింది?’’ చికాగ్గా అడిగాడు పాండే.
‘‘సార్ మనవే కాదు మిగతా నెట్‌వర్కుల టవర్ల నుండి కూడా సిగ్నల్స్ కట్ అయ్యాయంట’’ అన్నాడు సుందర్.
‘‘ ఓ మైగాడ్! అన్ని కంపెనీల సెల్‌టవర్ల నుండి ఒకేసారి సిగ్నల్స్ కట్ అవడం ఏమిటి? అంతా మిరాకిల్‌గా ఉందే’’ ఎగ్జిక్యూటివ్‌తో అన్నాడు పాండే.
క్యాబిన్‌లో ల్యాండ్‌లైన్ ఫోన్ మోగుతోంది. పాండే పరుగు పరుగున వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేశాడు.
‘‘విశాఖపట్నంలో అసలేం జరుగుతోంది?’’ ముంబయ్ నుండి ఆటా సంస్థ సి ఎండి భరధ్వాజ్ కోపంగా అడిగాడు.
‘‘ ఏం జరిగిందో ఇప్పటి వరకు తెలియదు సార్’’ భయపడుతూనే చెప్పాడు పాండే.
‘‘టెక్నికల్ సపోర్ట్ టీముకి తెలియజేశారా?’’
‘‘చేసాను సార్... టెక్నికల్ చీఫ్ హైదరాబాద్‌లో బయలుదేరారు’’
‘‘ ఓకే మేకిట్ ఫాస్ట్... నెట్‌వర్క్ వెంటనే రెస్యూమ్ అవ్వాలి’’
‘‘అలాగే సార్’’ అంటూ ఫోన్ పెట్టేసాడు పాండే.
‘‘ముంబయ్ హెడ్ ఆఫీసు నుండి సి ఎండి వాయించేసాడు’’ ఎగ్జిక్యూటివ్‌లతో చెప్పాడు పాండే.
‘‘ ఎయిర్‌పోర్టుకి వెహికల్ పంపించారా?’’ ఎగ్జిక్యూటివ్ రవికాంత్‌ని అడిగాడు పాండే.
‘‘పంపించాను సార్’’ అన్నాడు రవికాంత్.
విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు పాండే. ప్రతి అయిదారు నిముషాలకి ఒకసారి చేతికున్న రిస్ట్‌వాచ్ వైపు చూసుకుంటున్నాడు. కాలుకాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు.
‘‘హైదరాబాద్ నుండి ఫ్లయిట్ వచ్చిందో లేదో ఎయిర్‌పోర్టుకి ఫోన్ చేసి కనుక్కోవయ్యా’’ విసుగ్గా అన్నాడు పాండే.
‘‘ ఇప్పుడే కనుక్కున్నాను సార్. మరో పావుగంటలో ల్యాండ్ అవుతుందని చెప్పారు’’ అన్నాడు రవికాంత్.
ఈ మద్యలో ల్యాండ్‌ఫోన్ విరామం లేకుండా మోగుతూనే ఉంది. సిగ్నల్స్ లేవని వినియోగదారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అరగంట తర్వాత...
‘‘టెక్నికల్ చీఫ్ అచ్యుతానంద్ వచ్చారు సార్’’ గబగబ చెప్పాడు రవికాంత్.
‘‘నా క్యాబిన్‌లోకి రమ్మను’’ అన్నాడు పాండే.
అచ్యుతానంద్ క్యాబిన్‌లోకి వచ్చాడు.
‘‘ ఎస్ మిస్టర్ అచ్యుతానంద్... ఒకేసారి అన్ని సెల్‌టవర్ల నుండి సిగ్నల్స్ ఆగిపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా?’’ ఆత్రుతగా అడిగాడు పాండే.
‘‘సెల్యులర్ నెట్‌వర్క్ చరిత్రలోనే ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడూ ఎక్కడా రాలేదు మిస్టర్ పాండే’’ అన్నాడు అచ్యుతానంద్.
‘‘అవుననుకోండి. కానీ ఇప్పుడొచ్చింది కదా! ఈ గడ్డు సమస్య నుండి బయటపడేందుకు తక్షణ పరిష్కారం ఏదైనా ఉందా?’’
‘‘ ఇప్పటికప్పుడంటే ఏమీ లేదు. కానీ ముందుగా టవర్ల దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అప్పటి వరకు ఏం జరిగిందో, ఏం చెయ్యాలో నేను చెప్పలేను’’
‘‘ ఓకే వెంటనే బయలుదేరండి. టెక్నికల్ స్ట్ఫాను, కావలసిన పరికరాలను తీసుకుని వెళ్లండి’’
‘‘ ఓకే మిస్టర్ పాండే’’ అంటూ అచ్యుతానంద్ బయలుదేరాడు.
ముందుగా సిటీ సెంటర్‌లో మెయిన్ ట్రాన్స్‌మీటర్ టవర్ దగ్గరకు వెళ్లారు. టవర్ కింద ప్యానల్ సర్క్యూట్ పరిశీలించారు.
అంతా సవ్యంగానే ఉందే మరేంటి ప్రాబ్లం’ అనుకున్నాడు అచ్యుతానంద్. టెక్నికల్ సూపర్‌వైజర్‌తో కలసి టవర్ పైకి ఎక్కడా. టవర్ టాప్ ప్లాట్‌ఫాం మీద నిల్చుని పరిశీలించాడు. ట్రాన్స్‌మీటర్, బూస్టర్ పరికరాలు దెబ్బతిన్నాయి. ‘అందుకే సిగ్నల్స్ కట్ అయ్యాయి’ అనుకున్నాడు.
‘‘ ఎవరో టవర్ ఎక్కి వీటిని పాడు చేసినట్లున్నారు’’ పక్కనే ఉన్న సూపర్‌వైజర్‌తో అన్నాడు అచ్యుతానంద్.
‘‘సార్! ప్లాట్‌ఫారం మీద చూసారా? ఎన్ని పక్షులు చనిపోయి ఉన్నాయో’’ అన్నాడు సూపర్‌వైజర్.
‘‘నిజమే! రకరకాల పక్షులు చనిపోయి ఉన్నాయి’’ ఆశ్చర్యంగా అన్నాడు అచ్యుతానంద్.
టవర్ దిగి మరో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో టవర్ దగ్గరకి వెళ్లారు.
కింద్ ప్యానెల్ బోర్డు సర్క్యూట్ పరిశీలించకుండా నేరుగా టవర్ పైకి ఎక్కారు. ‘ ఇక్కడ కూడా ట్రాన్స్‌మీటర్ పరికరాలు దెబ్బతిన్నాయో’ అనుకున్నాడు. ప్లాట్‌ఫారం మీద రకరకాల పక్షులు చనిపోయి ఉన్నాయి. టవర్ పక్కన డాబా ఇళ్లు ఉన్నాయి. టవర్ దిగి వచ్చి ఒక ఇంటి దగ్గరకు వెళ్లి కాలింగ్‌బెల్ కొట్టాడు అచ్యుతానంద్.
ఇంటి యజమాని బయటకు వచ్చాడు.
‘‘రాత్రి టవర్ పైకి ఎవరైనా ఎక్కినట్లు అలికిడి ఏమైనా అయిందా?’’ అడిగాడు అచ్యుతానంద్.
‘‘తెలియదు కానీ తెల్లావారి జామున చాలా పక్షులు టవర్ చుట్టూ తిరుగుతూ హడావుడి చేసినట్లు అనిపించింది’’ అన్నాడు ఇంటి యజమాని.
‘‘అలాగా?’’
‘‘చెప్పడం మరిచిపోయాను. మా డాబా మీద పక్షులు చచ్చిపడి ఉన్నాయి సార్’’
‘‘్థ్యంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్’’ అంటూ బయటికి వచ్చాడు.
‘టవర్ల మీద పక్షులు చచ్చిపడి ఉండడానికి గల కారణం ఏమై ఉంటుందా?’ ఆలోచనలో పడ్డాడు అచ్యుతానంద్.
‘సెల్ టవర్లు డ్యామేజ్ కావడానికి, పక్షులకు సంబంధం ఏమిటో ఎంత బుర్ర బద్దలు కొంటున్నా అర్ధం కావడంలేదు. ఇదే విషయాన్ని పాండేకి ఫోన్ చేసి వివరంగా చెప్పాడు.
అన్ని సెల్యులర్ సంస్థల సెల్‌టవర్లు డ్యామేజ్ కావడంతో నగరమంతా సెల్‌ఫోన్లు మూగబోయాయి.
పాండే తన క్యాబిన్‌లో టివి ఆన్ చేసాడు. న్యూస్ ఛానెల్ అది.
‘‘విశాఖపట్నంలో సెల్‌టవర్లు డ్యామేజ్ కావడంతో సెలఫోన్లు మూగబోయాయి’’ న్యూస్‌రీడర్ చెబుతోంది.
‘మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి లైవ్‌లో అందిస్తారు’ అని చెప్పగానే ప్రతినిధి మాట్లాడుతున్నాడు.
‘‘ప్రియాంకా! విశాఖలో సమాచార వ్యవస్థ అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజు ఉదయం నుండి సెల్‌ఫోన్ రింగ్ మోగకపోవడంతో సెల్ వినియోగదారులందరికీ పిచ్చెక్కినట్లుందంటున్నారు. ఇలాగే మరికొన్ని గంటలు ఉంటే పిచ్చెక్కడం ఖాయమని, ముఖ్యంగా యువత ఒకటే ఆవేదన చెందుతున్నారు.
‘‘సరే! సుందర్ అసలు ఏమయిందో చెప్పండి’’ న్యూస్‌రీడర్ అడిగింది.
‘‘ప్రియాంకా... ఇక్కడో విషయం చెప్పదలచుకున్నాను. కేబుల్ టివి నెట్‌వర్క్ సంస్థలు ఒకదానికొకటి పోటీ పడి తరచూ ఆయా ప్రాంతాల్లో కేబుల్స్ కట్ చేసుకుంటూ తగువులాడుకుని పోలీసు స్టేషన్‌లలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మనకు తెలిసిందే’’
‘‘సుందర్ మీరు ఏం చెప్పదలచుకున్నారో సూటిగా చెప్పండి’’
‘‘ఎస్ ప్రియాంకా... సెల్యులర్ నెట్‌వర్క్ సంస్థలు కూడా పోటీ పడుతూ ఒకరి సెల్ టవర్లను మరొకరు ధ్వంసం చేసుకున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఒకేసారి అన్ని సంస్థల సెల్‌టవర్లు డ్యామేజ్ అయ్యాయంటే అదే కారణం అని వినియోగదారులు ముక్తకంఠంతో అంటున్నారు’’
పాండేకి చికాకు పుట్టింది.
‘‘నానె్సన్స్ న్యూస్’’ అంటూ టివి ఆఫ్ చేసాడు.
విశాఖలో అన్ని సెల్ నెట్‌వర్క్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆయా సంస్థల టెక్నికల్ చీఫ్ ఇంజనీర్లు హోటల్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం అయ్యారు.
‘‘సెల్‌టవర్లు డ్యామేజ్ అయ్యాయి. నగరంలో టోటల్‌గా సెల్యులర్ సిగ్నల్ వ్యవస్థ పాడయింది. ప్రాథమిక సమాచారం ఏమిటంటే సెల్‌టవర్లు పాడవ్వడానికి పక్షులే కారణం అని. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇంజనీర్లు చెప్పిందే ఇది. ఈ కష్టసమయం నుండి మనం ఎంత త్వరగా బయటపడగలమో మనం చర్చించుకోవాలి’’ అని కూర్చున్నాడు పాండే.
చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, టెక్నికల్ ఇంజనీర్లు ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
‘‘చివరగా స్పెషల్ గెస్టుగా వచ్చిన అఖిల భారత పక్షి పరిశోధన సంస్థ శాస్తవ్రేత్త డాక్టర్ ఆచార్యులు మాట్లాడుతారు’’ అన్నాడు పాండే.
‘‘జెంటిల్మన్... సెల్‌టవర్లు డ్యామేజ్ అయి సెల్యులర్ కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలగడం దురదృష్టకరం. అయితే సెల్‌టవర్లు వచ్చిన తరువాత ప్రతి జీవి అనేక రుగ్మతలకు లోనవుతూనే ఉన్నాయి. వీటి మూలంగానే అనేక పక్షి జాతులు కనుమరుగయ్యాయి. కిచకిచమంటూ మన ఇళ్లలో వడ్లు, బియ్యం గింజలు ఏరుకుని తింటూ ఇంటిల్లిపాదిని ఎంతగానో అలరించిన పిచ్చుకలు నేడు నామరూపాలు లేకుండా పోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం సెల్‌టవర్ల నుండి వచ్చే రేడియేషన్ ప్రభావం అని మీ అందరికీ తెలిసిందే. నగరంలో ఈ రోజు జరిగిన సెల్‌టవర్ల డ్యామేజ్‌కి పక్షులే కారణం అని మీ అందరూ నిర్ధారణకు వచ్చారు’’ ఒకసారి చుట్టూ చూసాడు ఆచార్యులు. అందరూ ఆసక్తిగా వింటున్నారని గ్రహించాడు. తిరిగి ప్రారంభించాడు.
‘‘యూ ఆర్ రైట్... పక్షులు ప్రతీకారం తీర్చుకున్నాయి. వటి మనుగడకు సెల్‌టవర్ల వల్ల ముప్పు ఉందని గ్రహించినట్లున్నాయి. అందుకే సెల్‌టవర్లపై మూకుమ్మడిగా దాడి చేసాయి అనుకుందాం. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి. అసలు పక్షులు పగ పడతాయా?’’ అడిగాడు ఆచార్యులు.
హాలులో అందరూ గుసగుసలాడుకున్నారు కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు.
తిరిగి ఆచార్యులే మాట్లాడాడు.
‘‘పక్షులు పగబట్టడం, ఇలాంటి విధ్వంసకర చర్యలు పాల్పడినట్లు చరిత్రలో లేదు. పాములు పగబడతాయంటారు. దానికీ రుజువులు లేవు. మరి పక్షులు సెల్‌టవర్లను డ్యామేజ్ చేసినట్లు ఎలా నిర్ధారణకు వచ్చారు’’ ప్రశ్నించాడు ఆచార్యులు.
ఎవరూ సమాధానం చెప్పలేదు.
‘‘మీ అందరికీ ఒక విషయం తెలుసా? మన దేశంలో వందల రకాల పక్షి జాతులున్నాయి అని మా పరిశోధనలో గుర్తించాము. 346 రకాల పక్షులు పంటలను ఆశ్రయించే పురుగులను తింటూ రైతులకు మేలు చేస్తాయి. అంటే ఆ పక్షులు రైతులకు మిత్రులన్నమాట. 63 రకాల పక్షులు మాత్రం పంటలను నష్టపరుస్తాయి. ఇక సాధారణంగా మన చుట్టు కనబడే పక్షుల్లో తెల్లకొంగలు, మంగలిపిట్ట, గోరింక, పాలపిట్ట, చిన్న పిసిరికిట, మాలకాకి, కిరీటం పిట్ట, పసిరిక వంటి పక్షులు కూడా రైతుమిత్ర పక్షులు. ఇక మిగిలిన పక్షి జాతులు కూడా అంత అపాయకరమైనవి కాదు. అలాంటప్పుడు సెల్‌టవర్ల వంటి వాటిని ధ్వంసం చేసే పక్షులు ఎక్కడున్నాయి చెప్పండి’’ ప్రశ్నించాడు ఆచార్యులు.
‘‘ఒక విషయం మాత్రం మన అందరం ఆలోచన చెయ్యాలిక్కడ. మనం టెక్నాలజీ అభివృద్ధి పేరుతో జీవుల మనుగడకు ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే మాత్రం మీ అందరూ నిర్ధారణకు వచ్చినట్లు భూమీ మీద ఇతర జీవులు సైతం మనిషి మీద ఎదురు తిరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. ఈరోజు సెల్యులర్ వ్యవస్థపై జరిగిన ఎలా ఎలా జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే ఒక రకంగా మానవుడికి హెచ్చరిక లాంటిదే అని నేను చెప్పగలను’’ అని ముగించాడు ఆచార్యులు.
సమావేశంలో కూర్చున్న వారందరూ ఆలోచనలో పడ్డారు.రీ

- అనుపోజు అప్పారావు,
సెల్ : 9059670704.

పుస్తక సమీక్ష

అల్పాక్షరాలలో
అనల్పార్థ రచన

తెలుగు వచన కవిత్వానికి క్లుప్తతను అందించే రూప ప్రక్రియల్లో ‘నానీ’లకు ఒక ప్రత్యేక స్థానముంది. వీటి సృష్టికర్త డాక్టర్ ఎన్ గోపి. స్పష్టత, సరళత, క్లుప్తత నానీ ప్రధాన లక్షణాలు. 20-25 అక్షరాల మధ్యలో కవిత్వ భావాల కుదింపు ఉంటుంది. నాలుగు వరుసల్లో ఇమిడిపోతుంది. చివర్లో మెరిసే కొసమెరుపు విరుపు. తుళుక్కుమంటుంది. ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కవులు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో కవి వివిఎపి కిషోర్ కుమార్ ఒకరు. ఇటీవల ఆవిష్కరించిన సంపుటి ‘‘నానీ ముత్యాలు’’. వ్యక్తీకరణలో ధ్వని ప్రాధాన్యత, సూటిదనం, వ్యంగ్య-హాస్య శైలి ఆలోచనాత్మక భావ సంఘర్షణ ఇందులో చెప్పుకోదగ్గ అంశాలు. వృత్తిరీత్యా ఆంగ్ల భాషా అధ్యాపకుడు. ప్రవృత్తి రీత్యా కవి. కార్టూన్ చిత్రకారుడు. న్యూస్ రీడర్. ఇన్ని అర్హతలు కలిగిన కవికి వర్తమాన సమాజాన్ని అనుభవంతో కాచి ఒడబొయ్యడం కొత్తకాదు. ఇలాంటి సంఘర్షణల్లోంచి మనసు నలిగి, గాయాలతో రాటుదేలినప్పుడు, అసంకల్పితంగా ఆలోచనాత్మకంగా పుట్టుకొచ్చినవే ఈ నానీలు. వీటిలో పరిపక్వతను, పరిశీలనాత్మక దృష్టిని ఇప్పుడు ఒక్కసారి తడిమి చూద్దాం!
‘‘అంతర్జాలం
మంచికన్న
చెడువైపు నడిపే
ఓ మాయాజాలం’’ అని అంటారు ఒకచోట. వర్తమాన వ్యవస్థని అతలాకుతలం చేస్తూ యువతరాన్ని పెడదోవ పట్టిస్తున్న తీరుతెన్నుల్ని, లీలామాత్రంగా కళ్లకి కట్టించే ప్రయత్నం చేస్తారు. అశ్లీల వెబ్‌సైట్లు లైంగిక, హింసాత్మక పెడ ధోరణులతో ఏ రకంగా నవతరాన్ని తప్పుడు మార్గం పట్టిస్తున్నాయో చాటిచెప్పే నానీ ఇది. అందరి మెదళ్ళకు పదునుపెట్టే తీరు ఇందులో చెప్పుకోదగ్గ ప్రధానాంశం. అంతర్లీనమైన ఆవేదన, బాధ, బాధ్యత రూపంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కిషోర్‌కుమార్ పరిశీలనాత్మక దృష్టికి ఇది అద్దంపడుతుంది.
‘‘లక్ష్మీ, సరస్వతి
అక్కా చెల్లెళ్లే!
ఒకరిని ఇచ్చి
ఇంకొకరిని తేవొచ్చు!’’ అంటూ చెబుతారు మరోచోట కవి కిషోర్ కుమార్. కార్పొరేట్ కల్చర్‌కి దర్పణం పట్టే ఈ నానీలో వ్యంగ్యపూరితమైన ధ్వని సృజనాత్మకతతో ఉట్టిపడుతుంది. విద్య అంటే వ్యాపారమయమే అన్న స్పృహ అక్షరీకరించబడింది.
లక్ష్మి (్ధనం)తో సరస్వతి (విద్య)ను కొని తెచ్చుకునే ఒక విషాదాత్మక సందర్భాన్ని కవితాత్మకంగా ధ్వనింపజేస్తారు. ఇది వర్తమాన సామాజిక వ్యవస్థ రూపురేఖల్ని నిలువుటద్దంలో చూపిస్తుంది. పెట్టుబడిదారి సంస్కృతిలోని మూలసూత్ర రహస్య గుట్టును రట్టు చేస్తుంది.
‘‘ప్రపంచంలో
ధనవంతుడెవరు?
ఆసుపత్రికి
వెళ్లనివాడేగా!’’ అని అంటున్నపుడు కళ్లముందు నిత్యం మెదిలే ఒక కఠోర సత్యాన్ని అక్షరరూపంలో పరుస్తారు కవి. అనారోగ్యం పేరుతో వైద్యుల పొట్టల్ని నింపే నిత్య ధనశాల వైద్యశాల. పవిత్రమైన వైద్యవృత్తి కరెన్సీ నోట్లతో ముడిపడి వ్యాపారమయమైపోవడాన్ని కిషోర్‌కుమార్‌గారు కవిగా జీర్ణించుకోలేకపోతారు. వాస్తవికతకు యదార్థ రూపమిచ్చి ఒక సున్నిత పార్శ్వాన్ని కవితాత్మకంగా తడిమి చూపడంలో కవి అంతరంగం అర్థమవుతుంది.
‘‘సీరియల్ టైంలో
సందర్శించకు!
ప్రకటనలొస్తేనే
పలకరిస్తారు!’’ అని చెప్పడంలో యాంత్రిక జీవితంలో ఉరుకు- పరుగుల బతుకుల స్థానంలో సమయాన్ని వృధాచేసే టీవీ సీరియళ్ల తీవ్రతను నానీగా మలుస్తారు కిషోర్ కుమార్. కాలాన్నీ, జీవిత క్షణాల్ని హరించివేసే ఒక సమ్మోహన దృశ్య వీక్షణ బుల్లితెర బ్రహ్మాస్త్రాన్ని బొమ్మ కట్టించే ప్రయత్నం చేస్తారు కవి. మనుషుల మధ్య అడ్డగోడగా నిలిచే వ్యతిరేక శక్తులు టీవీ సీరియళ్లు. ఈ నేపథ్యాన్ని అక్షరీకరించే సందర్భంలో విషాద పార్శ్వాన్ని ప్రతిబింబింపజేస్తారు. ఈ స్పృహ ఆధునిక జీవితంలో సర్వసాధారణమైపోయింది. ఈ లక్షణాన్ని ప్రధాన సమస్యగా ఎత్తిచూపడంలో అందెవేసిన చెయ్యి కవి కిషోర్‌కుమార్‌ది.
ఇలా కిషోర్ కుమార్ ఏ కోణాన్ని తీసుకున్నా దానిలో ఏదో ఒక ప్రత్యేక అంశం ప్రతిఫలిస్తుంది. ఇది పలు రూపాలలో, పలు రకాలుగా ధ్వనిస్తుంది. రాజకీయం, క్రీడ, భార్య, రైతు, సాహిత్యం, పేదరికం, బాల్యం, చినుకు అడవి, ఇంద్రధనుస్సు, అనాథలు, విద్యార్థులు, సెల్‌టవర్, సెల్‌ఫోను, రూపాయి, ప్రకృతి, వృద్ధాప్యం, ప్రేమ-పెళ్లి వంటి అంశాలపై సెటైర్లతో కూడిన విసుర్లు, వ్యంగ్యోక్తులు, హెచ్చరికలు ఈ సంపుటిలో తారసపడతాయి. సహజత్వానికి దగ్గరగా, వాస్తవికంగా కళ్ళకు కడతాయి. ఇలా పలు విధాలుగా ఇతివృత్తాలను సామాజిక అంశాలుగా, వస్తువులుగా స్వీకరించి కవిత్వీకరించారు కవి. ఈ తరహా రచన అల్పాక్షరాలలో అనల్పార్థ రచనను గుర్తు చేస్తుంది. కాబట్టే పాఠకుల నోళ్లలో ఇప్పటికీ ఇవి నానుతూనే ఉన్నాయి. ఇంత మంచి నానీలను కవితాక్షరాలుగా అందించిన కిషోర్‌కుమార్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతించి అభినందించాల్సిందే!

- మానాపురం రాజా చంద్రశేఖర్, సెల్ : 9440593910.

మనోగీతికలు

నీ రూపం నిలిచే వేళ...
నిను చూసిన క్షణాన
ఎక్కడో అలజడి!
ఎదలో కోటి వీణల సవ్వడి!
నీ మాటలు మదిలో...
సవ్వడి చేస్తుంటే...
మనసులోని భావాలు
ఉవ్వెత్తున కడలి తరంగంలా...
విజృంభిస్తుంటాయి!
నను వలచిన నా చెలీ!
కనురెప్పల మాటున...
దాచుకున్న నా భావాల పరంపర...
మొహంలో ప్రతిఫలించిన వేళ...
చిర్నవ్వుతో నన్ను పలుకరించవా!
వసంత రుతువులో ప్రకృతి అందాలను...
పట్టు చీరలా చుట్టుకున్న...
లోకపు సుందరి! నా మనోహరీ!...

- మల్లారెడ్డి రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా, సెల్: 8985920620

అమ్మ
కాకిపిల్లకు అమ్మ
కుక్కపిల్లకు అమ్మ
మేకపిల్లకు అమ్మ
పులిపిల్లకూ అమ్మ
పాము పిల్లకు అమ్మ
ఏనుగు గున్నకు అమ్మ
పంది కూనకు అమ్మ
పసి పాపకు అమ్మ
అమ్మ అను మాటలో
అమృతము కలబోసి
చేసినాడో- ఏమొ!
ఆ మాయ బ్రహ్మ!!

- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి, అనకాపల్లి, సెల్: 9246666585

స్వప్నాలు
నా శ్రీకాకుళం స్వప్నాలు
నా మట్టిని వెలిగించే దీపాలు
సాయుధ చరిత్ర పుట్టిన శిఖరం నా ఊరు
సమరశంఖం పూరించిన రుధిరం నా జిల్లాపేరు
ఇవి... నా శ్రీకాకుళం స్వప్నాలు
త్యానీలాపురం విహంగాలు
పలాస జీడిపప్పులు...
నౌపడ... నోటిని తడిపే ఉప్పులు
వెనుకబాటుతనానికి... మన నేతల తప్పులు
అరసవిల్లి సూర్యక్షేత్రానికి
అఖిల భారతాన మెప్పులు
ఇవే నా శ్రీకాకుళం స్వప్నాలు
బొడ్డపాడు ఉద్యమాలు...
భావనపాడు... రమణీయ దృశ్యాలు...
పొందూరు ఖద్దరులు, రాజాం పరిశ్రమలు
ఇదిగో నా శ్రీకాకుళం స్వప్నాలు

- కోనే సతీష్‌కుమార్, శ్రీకాకుళం
సెల్: 7675924944

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- అనుపోజు అప్పారావు