విజయవాడ

ముగ్గురికి పునర్జన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, సెప్టెంబర్ 22: ప్రాణాలుండీ చలనం లేని కుమారుడి దీనస్థితికి చలించిపోతూ ఇతరులకు అవయవ దానం ద్వారా తమ కుమారుడు నిత్య జ్ఞాపకంగా నిలిచిపోతాడని ఉదయశ్రీ అన్నారు. శనివారం ఆమె తమ కుమారుడి అవయవాలను కానూరు కొత్త ఆటోనగర్ రోడ్డులోని కామినేని హాస్పిటల్‌లో దానం చేశారు. గన్నవరంలో జరిగిన ప్రమాదంలో నాగరాజు రవీంద్రవర్మ(27) బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రాణం ఉండీ చలనం లేని స్థితిలో రోజులు గడుపుతున్నాడు. దీంతో రవీంద్రవర్మ తల్లిదండ్రులు గర్భశోకాన్ని దిగమింగి కుమారుడి నరకయాతన చూడలేక, బతికుండగానే ఆరోగ్యంగా ఉన్న అతని అవయవాలను కామినేని ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో దానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామానికి చెందిన రవీంద్ర వర్మ ప్రసాదంపాడులోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసేవాడు. గత సోమవారం గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడటంతో కామినేని ఆసుపత్రిలో చేర్చారు. 27 ఏళ్లు పెంచి పెద్దచేసి, చేతికి అందివచ్చిన కొడుకు నిర్జీవంగా పడి ఉండటం చూసిన తల్లి మనసు తల్లడిల్లిపోవటం చూపరులను కలచివేసింది. శారీరకంగా తమ కుమారుడు దూరమైనా శాశ్వతంగా మరొకరి శరీరంలో బతికే ఉంటాడని ఆమె శోకతప్త హృదయంతో చెప్పింది. ఈసందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అవయవ దానంపై విస్తృత ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో అవయవాలను నిల్వ చేసే ల్యాబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ల్యాబ్ వల్ల అవయవాలు దానం చేసే వారికి త్వరితగతిన పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా అవయవాలు దానం చేసేవారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చెన్నైలోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు రవీంద్ర వర్మ గుండెను, తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌కు లివర్‌ను, గుంటూరులోని శంకర హాస్పిటల్‌కు కళ్లు పంపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎంటీ శ్రీనివాస్, డాక్టర్ వీ నవీన్ కుమార్, డాక్టర్ వినతి పాల్గొన్నారు.

ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రచారం
* అవినీతిపై విచారణ జరిగితే ఏ-1గా ఉమా
* వైకాపా మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్
విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 22: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల్లో ప్రచార అర్భాటమే తప్ప పనులు ముందుకు సాగడం లేదని మైలవరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. నగరంలోని బందరురోడ్డులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కాంట్రాక్టర్లతో ఉన్న బంధం కారణంగా ప్రాజెక్టుల్లో అవినీతి పారుతుందన్నారు. ఇటీవల కాగ్ విడుదల చేసిన రిపోర్టుతో పాటు అన్ని అధారాలతో త్వరలోనే సీబీఐని కలసి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలవరంతో పాటు పట్టిసీమ, ఇతర ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కంట్రోలర్ అండ్ అడిట్ జనరల్ నివేదికలో స్పష్టంగా చెప్పినప్పటికీ మంత్రి దేవినేని ఉమా ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇరిగేషన్‌శాఖలో కోట్ల రూపాయల నిధుల అవినీతి జరిగిందని కాగ్ నివేదికల ఆధారంగా తనకు అనుకూల పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినా మంత్రి వివరణ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వైఎస్‌ను, జగన్‌ను పదే పదే విమర్శించే మంత్రి ఉమా నాలుగేళ్ల కాలంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పే ధైర్యముందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో పార్టీ కార్యకర్తలను విహార యాత్రలకు తరలిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టులో పలు దఫాలుగా ప్రారంభోత్సవాలు చేస్తున్న మీకు ప్రాజెక్టు పూర్తిచేసే చిత్తశుద్ధి ఉందా ప్రశ్నించారు. అర్హత, అనుభవం లేకపోయినా వారం రోజుల్లో రిటైర్డ్ అయ్యే తెలంగాణాకు చెందిన ఇంజనీరును, అక్కడి మంత్రి హరిష్‌రావుతో మాట్లాడుకుని ఇక్కడకు తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టు అప్పగించడం దారుణమన్నారు. దోపిడీ చేసేందుకే అతన్ని కీలక స్థానంలో మంత్రి ఉమా కూర్చోబెట్టినట్లు తెలిపారు. 2011 నుండి ఇసుక కాంట్రాక్టులు చేసినప్పటి నుండి వీరిద్దరికి అనుబంధం ఉందని, ఆ అధికారిని అడ్డం పెట్టుకుని మంత్రి పోలవరం ప్రాజెక్టులో అవినీతి పారిస్తున్నట్లు ఆరోపించారు. ఇటు సీఎం, అటు మంత్రి కలసి పోలవరంలో కమీషన్లు దండుకుంటున్నట్లు చెప్పిన ఆయన 20శాతం అధికంగా కోట్ చేసి కమీషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే దేవినేని ఉమా ఏ1 ముద్దాయిగా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వివరించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు మంత్రి దేవినేని ఉమాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.