విజయవాడ

బాధితులకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 18: ఆధునీకరించిన ‘సెంట్రల్ కంప్లైంట్ సెల్’ ఫిర్యాదులకు పెద్దపీటని, సమస్యల పరిష్కారం కోసం వచ్చే బాధితులకు భరోసా ఇవ్వడమే ముఖ్య ఉద్దేశ్యమని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ అన్నారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆధునీకరించిన ‘సెంట్రల్ కంప్లైంట్ సెల్’ను ఆమె మంగళవారం ప్రారంభించారు. అదేవిధంగా పోలీసు కమిషనర్ ఛాంబర్ భవనానికి కూడా రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ త్రిబుల్ సి భవనాన్ని అధునాతన వౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న హంగులతో పునర్నిర్మించారు. పోలీసు కమిషనర్ కార్యాలయం గేటు ప్రవేశంలోనే ఏర్పాటు చేసిన ఈ విభాగంలో పోలీసు కార్యాలయాన్ని ఆశ్రయించే బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి పరిష్కరిస్తారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతమున్న పోలీసు కమిషనర్ కార్యాలయం పురాతనమైందని, ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్యాలయంగా పేర్కొంటూ తాను పని చేసిన సమయంలో ఉన్న పరిస్ధితులను వివరించారు. కాగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విభాగాలు, భవనాల నిర్మాణానికి అధికారులు రూపొందించిన ప్రణాళిక కార్యరూపం దాల్చి నేడు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం, పోలీసుశాఖ పరంగా కావాల్సిన సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. వివిధ కారణాలతో పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించే బాధితుల సమస్యలను సెంట్రల్ కంప్లైంట్ సెల్ ద్వారా పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కె నాగుల్‌మీరా మాట్లాడుతూ కమిషనరేట్ ఆధునీకరణ, వౌళిక సదుపాయాల కల్పనకు మొత్తం ఏడు కోట్లు మేర నిధులు మంజూరు చేయగా ఇప్పటి వరకుదు కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈక్రమంలో నగరంలో నలుమూలలా సీసీ కెమేరాలు అమర్చడం ద్వారా నగరంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నగరంలోని పోలీస్టేషన్లను మోడల్ పోలీస్టేషన్లుగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలీసుకి ప్రశాంత వాతావరణంలో ఉత్తమమైన పోలీసు నివాస గృహాల నిర్మాణానికి, ఆధునీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ గతంలో పోలీసు కమిషనర్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించాలంటే కొంత అసౌకర్యంగా ఉండేదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నగరానికి రాజధాని ప్రాధాన్యత ఏర్పడినందున భవన నిర్మాణాలు విస్తరణ అనివార్యమన్నారు. భవన నిర్మాణాలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి సునీల్‌కుమార్, డీసీపీలు బి రాజకుమారి, డాక్టర్ గజరావు భూపాల్, వెంకట అప్పలనాయుడు, రవిశంకర్‌రెడ్డి, ఉదయరాణి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
* సీసీసీ వ్యవస్థ పనితీరు ఇలా..
కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించే బాధితులకు జవాబుదారీతనాన్ని పెంచడమే సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సిసిసి) ముఖ్య ఉద్దేశ్యం. ఈ వ్యవస్థ పనితీరు ఇలా ఉంటుంది. సెంట్రల్ కంప్లైంట్ సెల్‌కు వచ్చే ఫిర్యాదును స్వీకరించి బాధితుని ఫొటో, వివరాలు సూచిస్తూ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఫిర్యాది అతని సమస్యను బట్టి ఏ అధికారిని కలవాలి అనేది సూచిస్తూ ఒక రశీదు ఇస్తారు. అదేవిధంగా సదరు ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నది అనే పూర్తి వివరాలు ఇక్కడ నమోదు చేయబడతాయి. సెంట్రల్ కంప్లైంట్ సెల్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఏ అధికారికి పంపింది, ఆ ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నది అనేది ఎప్పటికప్పుడు పూర్తి సమీక్ష చేసి సమాచారం పొందుపరుస్తారు. నమోదు కాబడిన ఫిర్యాదుపై అధికారులు సత్వర చర్యలు తీసుకునేలాగా దోహదపడటమే కాకుండా ఫిర్యాదుదారునికి తన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను పూర్తి సమాచారాన్ని అందిస్తూ మరింత జవాబుదారీతనంగా పని చేయడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం.

వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఇక ప్రత్యక్ష పోరు
* బీకేఎంయు జాతీయ కార్యదర్శి జల్లి విల్సన్

విజయవాడ, డిసెంబర్ 18: వ్యవసాయ కార్మికులు, కష్టజీవులకు సాగుభూములు, ఇళ్లు, స్థలాలు, పక్కా ఇళ్లు, ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాల కోసం ఇక ప్రత్యక్ష పోరు సాగించబోతున్నామని ఇటీవల తిరుపతిలో జరిగిన భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయు) 14వ జాతీయ మహాసభల్లో జాతీయ కార్యదర్శిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 50ఏళ్లు నిండిన ప్రతి వ్యవసాయ కార్మికునికి కనీసం రూ. 5వేలు పెన్షన్ ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పనికల్పించి రోజుకూలీ కింద రూ. 500 చెల్లించాలని, కరవు, వలసల నివారణకు ప్రకటిత కరవు మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు వచ్చే ఫిబ్రవరి 26న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. జాతీయ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జల్లి విల్సన్‌తో పాటు కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, బండి వెంకటేశ్వరరావు, బీ కేశవరెడ్డి, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఆర్ వెంకట్రావు, సీ సుబ్రహ్మణ్యం, ఆలమంద ఆనందరావు, చిలుకూరి వెంకటేశ్వరరావు, కాబొతు ఈశ్వరరావు, సీ సుందర్‌లాల్, చిన్నం పెంచాలయ్య ఎంపికయ్యారు.

హోదా, విభజన హామీల అమలుకు 4న ఢిల్లీలో ధర్నా

విజయవాడ, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు కోసం, రాష్ట్రానికి చెందవలసిన కేంద్ర నిధుల కేటాయింపుల కోసం పార్లమెంట్ చివరి సమావేశాల సందర్భంగా 2019, జనవరి 4వ తేదీన సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు కోసం గత నాలుగున్నరేళ్లుగా ఉద్యమిస్తున్నా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏ మాత్రం చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఏపీకి లోటు బడ్జెట్ నిధులు కూడా సక్రమంగా ఇవ్వలేదని, విభజన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. నిధులతో నిమిత్తం లేకుండా ఇచ్చేందుకు అవకాశమున్న విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వలేదన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఊసే లేదన్నారు. విద్యా, వైద్య సంస్థలకు పునాది రాళ్లు వేసారేతప్ప నిధుల కేటాయింపులు సమగ్రంగా జరగలేదన్నారు. దాదాపు రూ. 11,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా కనీసం సగం నిధులు కేటాయించలేదన్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నారని రామకృష్ణ, మధు మండిపడ్డారు.

8, 9న పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమ్మె

విజయవాడ, డిసెంబర్ 18: జీతాలు పెంపు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఎన్‌ఎంఆర్, పార్ట్‌టైం ఉద్యోగులకు టైం స్కేల్ జీతాలు, పదోన్నతలు ఇతర డిమాండ్ల సాధనకై జనవరి 8, 9 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనేందుకు మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు మంగళవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేశారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కే జవహర్‌రెడ్డికి గ్రామ పంచాయతీ ఎంప్లారుూస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీ వెంకట్రామయ్య, కే ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాల వలెవన్‌కు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావులు ఈమేన సమ్మె నోటీసులను అందజేశారు. ఈసందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమానవేతనం అందచేయాలి, విజయవాడ, విశాఖ నగరాలకు 010 పద్దు వర్తింప చేయాలని, పంచాయతీ కార్మికులకు పదివేలు కనీస వేతనంగా చెల్లించాలని, గుర్తింపు కార్డులు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్ ఉద్యోగులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
పాతబస్తీ, డిసెంబర్ 18: సీపీఎస్ ఉద్యోగులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని జనసేన పార్టీ జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ పోతిన వెంకట మహేష్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షా 86వేల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానం కింద పదవీ విరమణ చేసిన తర్వాత వారి జీవితాల్లో చీకట్లు నిండి రోడ్డుపై పడతారు కనుక పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అనేకమార్లు శాంతియుత నిరసన దీక్షలు చేస్తూ వారి బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంటే సానుకూలంగా స్పందించకుండా అక్రమంగా జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం మానుకోకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అక్టోబర్ 2 నుంచి మహాత్మా గాంధీ స్ఫూర్తితో నిరసన దీక్షలు చేపట్టిన సీపీఎస్ ఉద్యోగ సంఘ నాయకులపై ఆత్మహత్యా యత్నం, పబ్లిక్ డిస్ట్రబెన్స్ కింద అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఒక్కరోజు ముందు సమాచారం ఇచ్చి కోర్టుకు హాజరుకావాలని తెలపడం దారుణమని ఖండించారు. అనేక రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు గురించి ముఖ్యమంత్రులు పిలిచి చర్చిస్తుంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం సీపీఎస్ ఉద్యమకారులపై కేసులు పెట్టి బెదిరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. నిజంగా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు మేలు చేయాలనుకుంటే వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకపోతే జనసేన పార్టీ ద్వారా ఉద్యమిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగుల పోరాటాలకు జనసేన పార్టీ మద్దతు అన్నివేళలా ఉంటుందని మహేష్ వివరించారు.

ప్రధానిపై బాబు దుష్ప్రచారం:నాగోతు

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న పర్యటించనున్నారని, దీంతో చంద్రబాబు భ్రమలు మొత్తం తొలగిపోతాయని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు అన్నారు. బీజేపీ నగర కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ నేతలు భాజపాపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. అయితే రాష్ట్రానికి భాజపా చేసిన ఆర్థిక సహాయం, కేటాయించిన ప్రాజెక్టులు, ఇచ్చిన నిధులను వివరిస్తూ ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ద్వారా నేతలు, కార్యకర్తలు ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నారని చెప్పారు. ప్రజలు అసలు విషయాన్ని తెలుసుకుని చంద్రబాబు, టీడీపీని ఛీకొడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజైవైఎం పోరాటం చేస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారని దుయ్యబట్టారు. ఆడిటింగ్‌కు అనుకూలంగా లేని ఎయిర్‌షో, బోటింగ్ రేస్‌లు నిర్వహిస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పెథాయ్ తుఫాన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలనపై దృష్టి పెట్టకుండా జాతీయ నాయకునిగా ఎదిగేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీకి వినూత్న రీతిలో ఘన స్వాగతం పలకబోతున్నామని చెప్పారు. తుఫాన్ వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీనిపై గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా స్పందించి అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కాల రజనీకాంత్, భాజపా నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.

20నుంచి యోగ సర్ట్ఫికెట్ కోర్సు తరగతులు
పాతబస్తీ, డిసెంబర్ 18: కేబీఎన్ కళాశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 20నుంచి సర్ట్ఫికెట్ ఇన్ యోగా తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి నారాయణరావు తెలిపారు. క్రీడా విభాగం ఆధ్వర్యంలో యోగా కోర్సును రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను పొందవచ్చన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందన్నారు. ఇందులో భాగంగా నిత్యం యోగ సాధన ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఆ క్రమంలో యోగాకు సంబంధించి సాధనకు ఈ కోర్సు దోహదపడుతుందని తెలిపారు. అలాగే దీనిద్వారా ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చన్నారు. ఆరు మాసాలు కొనసాగే ఈ కోర్సుకు ప్రతి వారం రెండు రోజులు తరగతులు జరుగుతాయని, సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర వరకూ తరగతులు ఉంటాయన్నారు. నామమాత్రపు ఫీజుతో ఈ కోర్సు ఉంటుందని వివరించారు.