విజయవాడ

మద్య నిషేధం విధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, పిబ్రవరి 20: టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించకపోగా రాష్ట్రంలో ఏరులైపారిస్తుందని నగర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ విమర్శించారు. మద్యాన్ని తక్షణం నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లెనిన్ సెంటర్‌లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని, మహిళలు మానసిక వేదనతో కుమిలిపోతున్నారని, గత ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం మభ్యపెట్టే హామీలను గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేశారని ఆరోపించారు. ఆదాయం కోసం ప్రజల శ్రేయస్సును ప్రక్కన పెట్టి మద్యం అమ్మకాలను పెంచేశారని, ఏ సందులో, ఏ వీధిలో చూసిన మద్యం దుకాణాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి నగర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఒర్సు భారతి అధ్యక్షత వహించగా డీ సీతారామయ్య, దుర్గాసి, రవణమ్మ, మూలి ఇందిరా, అండిమాని, నాగమణి, ఖైరున్నీసాభేగం, ఆర్ సుజాతా, ఠాగూర్, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతాభివందనాలు
*ఏపీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి
లబ్బీపేట, ఫిబ్రవరి 20: అమరావతి విభాగాధిపతి కార్యాలయాలలో, సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో ఇంటి స్థలం మంజూరు చేసినందుకు, మధ్యంతర భృతి 20శాతం కల్పించినందుకు సచివాలయంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్యోగులకు స్వంత ఇంటి కల నెరవేర్చినందుకు, 20శాతం మధ్యంతర భృతి ఏప్రిల్ 2019 నుంచి అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వటం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 20: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. మరికొద్ది రోజులలో కృష్ణా, గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరగునున్న ఎన్నిలక నిర్వహణపై నగర పరిధిలోని సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పక్షాల నేతలతో బుధవారం వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ నివాస్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 8046 మంది ఓటర్లుగా నమోదైనారని, వీరికి పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించి నూరు శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేయాలన్నారు. అలాగే ఓటింగ్ ప్రక్రియలో జరిగే వీవీపీఏటి గురించి విస్తృత ప్రచారం చేస్తామన్నారు. అలాగే ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ 1050 ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు గురించి పరిశీలన చేసుకోవచ్చునని, ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు ఇప్పుడు కూడా ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలో గల పోలీస్ శాఖ వారితో సమావేశం నిర్వహించిన కమిషనర్ సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల గురించి, ఎన్నికల నియమావళి గురించి వివరించారు.